11
హరికృష్ణ జాడే తెలియక పోవడంతో అనూరాధ హృదయాన మనోవ్యధ మహావృక్షం లా పెరిగి వూడలు వేయసాగింది. ఏ మూల నుంచీ ఆతని గురించి ఒక్క అక్షరం కూడా వెలికి రాకుండా పోయింది.
అనూరాధ అన్నాళ్ళూ నృత్య ప్రదర్శన లివ్వడం మానడం మూలాన కూడబెట్టిన డబ్బు ఖర్చయి పోయింది. మరో మార్గం కన్పించలేదు అన్నపూర్ణమ్మ గారికి. అనూరాధను మళ్లీ ప్రదర్శన లిమ్మని అడగలేక బాధపడుతోందామె లోలోన.
ఆ రాత్రి జయదేవుని అష్టపదుల్ని మననం చేసుకుంటూ సాభినయం పట్టి చూసుకుంటోంది అనూరాధ. ఏదో 'ప్రోగ్రాము' , వచ్చినప్పుడే ఆమె అలా చేస్తుంది. తమ అవసరాన్ని గుర్తించి ఏ ఆహ్వానానికి అంగీకరించిందో అనుకున్నదా మాతృమూర్తి.
మునుపటి లా ఆనందంతో త్రుళ్ళి పడడం లేదామే. గంబీరత అనుక్షణం ఆ అనురాగమయి వదనాన నీలి నీడల్ని పరుస్తూనే వుంది. అభినయం సరిజూసుకుంటూనే మధ్యలో తటాలున ఆగిపోతుంది. ఏదో భావం నిలువెల్లా జరజరా పాకి అలజడి కలిగించినట్లు వూగి పోతుందా క్షణం లో.
అతడు బహూకరించిన కృష్ణ విగ్రహం ఎపుడూ ఆమె కనుల ముందరే మేదులుతున్నట్లు, అపురూపంగా ఎంచుకుంటుంది.
'కృష్ణా! మీ మనస్సు వో మధుర మైన మహాకావ్యం! ఆ కావ్యాన ఈ అనూరాధ ని నాయికగా మలచుకున్న అనురాగ మూర్తులు మీరు. కానీ...భగవాన్! మీ కల చెదిరిపోయింది. మన జీవితాల నిండుగా నిరాశావేమో!' అని నిట్టూర్పులు విడుస్తోందామె అంతరంగం అపుడపుడు.
ఆ మరునాడే నాట్య ప్రదర్శనకు అంగీకరించిందామె. చంద్రం అదంతా తన ప్రోత్సాహమేనని మిత్ర బృందానికి చాటించాడు.
ప్రదర్శన జరుగుతున్నంత సేపూ అవసరం లేకున్నా అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూనే వున్నాడతడు. కావాలని అనూరాధ అతనివైపు కన్నెత్తి చూడకపోయినా ఆమె తనతో మాట్లాడినట్లు నవ్వినట్లు హావభావాల్ని వివిధ భంగిమలలో ప్రదర్శించుతున్నాడు.
నృత్యం ముగిసింది. ప్రేక్షకులందరూ లేచి వెళ్లి పోయేముందు 'మైక్' ముందు నిలబడి 'మహాశయులారా! కళాభిమానులారా! ఒక్క మనివి! అనూరాధ గారి నృత్యానికి నా మనస్సు ఎంతగానో మురిసి మైమరిచి పోయింది. అందుకే చంద్రుని కో నూలుపోగు అన్నట్లు, నా తరపున వో అయిదు వందలు మాత్రం కానుకగా యిస్తున్నాను' అంటూ అనూరాధ కు 'చెక్' అందించాడు.
అందుకున్న వెంటనే అన్నదామె మృదుమధుర స్వరంతో-------
'చంద్రం గారి కళాభిమానానికి ఎంతో కృతజ్ఞత తెలుపు కుంటున్నాను. కళను గుర్తించి సహ్రుదయతో, కానుకలిచ్చి సత్కరింపగలవారి లో నిర్మలత వుంటుందని విశ్వసించుతున్నాను. వారికి నా అభినందనాలు. ఈ చెక్కు మన నగరం లోని 'అనాధ బాలికలకు' అందజేయమని చంద్రం గారిని మనస్పూర్తిగా కోరుతున్నాను.'
చంద్రం ముఖాన కత్తి వాటుకు నెత్తురు చుక్క లేకుండా పారిపోయింది. 'కానుకను స్వీకరించినట్లే స్వీకరించి ఆ క్షణం లోనే తిరస్కరించింది మృదువుగా. ఎంత నాటకం?! 'ధర్మ సూతి మెత్తని పులి అన్నట్లు, అనూరాధ మెత్తని కత్తి' ఆ యువకుడు అవమానంతో వుడికి పోయాడు.
మర్యాద కోసం ముఖాన నవ్వు పులుముకుని అందుకు అనూరాధ నెంతగానొ అభినందించుతున్నానని తెలిపి వేదిక పై నుంచి నిష్క్రమించాడు.
శారద తనివిదీరా నవ్వుకుంది ఇతని చేష్టలకి.
'అనూ! పాపం! అతడు చాణుక్యుడ్నీ అయిపోయాననుకున్నాడు కానీ అంతా తలక్రిందు లైంది!'అన్నది నవ్వుతూ.
'పదిమంది లో నాకెంతో అత్మీయుడ్ననిపించుకోవాలని అతని తహతహ! అంతే! కళకు నిర్వచనమే తెలియదు పాపం!' జాలి దలచినది అనూరాధ.
ఆ రాత్రి యింటికి రాగానే అతడేప్పటిలా అనూరాధకు 'గుడ్ నైట్' అని చెప్పలేదు. ఉదయాన కూడా అనూరాధ అన్న మనిషిని తానంతకు ముందు చూడనట్లే ప్రవర్తించాడు.
చీకట్లు అలముకుంటుండగా మరో యిద్దరితో తన గదిలో అడుగు పెట్టాడు. గది తలుపుల్ని భాడాలున మూశాడు. కావాలనే అలా గొడవ చేస్తున్నాడని గ్రహించిందామె.
లోపలి నుంచి, సీసాలు ఖాళీ చేస్తున్న చప్పుడు. గ్లాసులు బల్ల మీద ఉంచిన శబ్దాలు విన్పించుతున్నాయి. మధ్యమధ్య చిన్నగా కూనిరాగం గాలిలో తేలివస్తోంది.
వో గంట వరకూ అదే సందడితో ఆ గదంతా మార్మోగి పోయింది. ఆ తరువాత నాటకం 'రిహార్సలు' వేస్తున్నట్టు సంభాషణ ఆరంభమైంది.

'పిచ్చివారి కిచ్చట చికిత్స చేయబడును!' అది చంద్రం గొంతు.
'అనురాగం అన్న ముసుగు వేయబడును!' వరుసగా అందుకుంటున్నారు.
'జేబులోని డబ్బంతా దొంగిలించబడును!'
'అందంగా నీతులెన్నో చెప్పబడును!'
'ఆచరణ అన్నచోట సున్నా వ్రాయబడును!'
'నిషాలో మనస్సున దాగినవన్నీ విప్పబడును!'
పాటలా దొర్లి పోతోంది సంభాషణ. అనూరాధ విన్పించుకొనట్లే వుండి పోయింది. అందుకే మళ్లీ మొదలైంది బుర్ర కధ. ఒక్కొక్కరే అందుకుంటున్నారు --
'నాట్య మయూరీ! వో వయారీ!'
'రాగమయీ! వో త్యాగామయీ! రాగమయీ! ఈ!ఈ!' అంటూ రాగం మొదలైంది. అనూరాధ లేచి వెళ్లి చిన్నగా తలుపు తట్టింది.
'అంతే! అంతా నిశ్శబ్దమయం అయిపొయింది క్షణం లోనే ----
తలుపులు తెరిచి సినీమాలో హీరోలా నిలబడ్డాడు చంద్రం నవ్వు ముఖంతో --
'ఇది పానశాల గాదు!'
'మరి ఏ శాలో!?'
"చెప్పమంటారా?'
'తప్పకుండా!'
'గాడిద శాల'
'ఆ! ఏమిటీ!!'
'ఏమీ లేదు చంద్రం గారూ! ఈ యింట్లో వో గది 'గార్ధభాలకి' కేటాయించ బడిందని విచారించు తున్నాను.'
'అనూరాధ గారూ! మీరే మంటున్నారో తెలుసా?'
'ఏం భయపడెతున్నారా?'
'ఎవరి నంటున్నారో తెలిసే అంటున్నారా? అతను కలెక్టర్ గారి అబ్బాయి, వాడు మంత్రి గారి అల్లుడు....నేను....'
'నిషాకి తమ్ముడివి!' పూర్తీ చేసిందామె.
'ఏమన్నారు?'
'పదవి వున్నచోటే డబ్బు వుంటుంది. కానీ మంచీ, మర్యాదా, శీలం, సిగ్గూ మేలుకొని వుండడం మాత్రం మహాకష్టం అంటున్నాను.''
'బావుంది! ఉపన్యాసం! చప్పట్లు కొట్టండోయ్ ! చూస్తారేమిటిరా? వాజమ్మల్లా!' వెకిలిగా నవ్వాడతడు చప్పట్లు కొడుతూ.
'ఇదిగో! చంద్రం గారూ! మనిషిగా ప్రవర్తించినంత వరకే సహనం క్షమించుతుంది. ఆ తరువాత ఘోర పరాభవం తప్ప ఎదురయ్యే దేమీ లేదని తెలుసుకోవడం మంచిది.'
'వ్రాసుకోండోయ్! దద్దమ్మల్లారా!'
'పోలీసుల్ని ఆహ్వానించమంటారా? మర్యాదగా సంకెళ్ళ తో మరో శాలకి తరలించుతారు మహారాజుల్ని!' అన్నదామె.
ఆ మాటతో అతని పైత్యం కాస్తా దిగిపోయింది పూర్తిగా. గదిలో కూర్చున్న ఈ ఇరువురూ వులిక్కి పడ్డారు.
'మళ్ళీ గానకచేరి ఆరంభం చేయాలనుకుంటే నా అడ్డేమీ లేదు. నిరభ్యంతరంగా కానివ్వండి. బహుమతులు మాత్రం రేపు కలెక్టర్ గారే అందించుతారు స్వయంగా.' వెంటనే వెళ్ళిపోయిందామె.
మళ్ళీ చిన్న శబ్దం కూడా వెలువడలేదా గదిలో నుంచి. అనూరాధ మనస్సున చంద్రం పట్ల ఏంతో అసహ్యత పేరుకు పోయింది. దీని కంతటికీ కారణం రామనాధం గారేనని గ్రహించింది.
ఉదయాన లేవగానే చంద్రం చేతులు నలుపుకుంటూ వచ్చి అనూరాధ ముందు నిలబడ్డాడు.
'క్షమించాలి! రాత్రి కొంచెం ఎక్కువ తాగాం! నిషాలో మిమ్మల్నేమన్నా అవమానించి నట్లయితే దయచేసి అపార్ధం చేసికోవద్దని కోరుతున్నాను.' అన్నాడు వినయంగా తలవంచుకుని బుద్ది మంతుడిలా.
కాఫీ వడపోస్తున్న ఆమె తల ఎత్తి చూసిందతని వైపు.
'తప్పు చేసి క్షమాపణ కోసం పరుగు లేత్తడం అలవాటు చేసుకున్న మనుషుల్ని ఎవ్వరూ నమ్మరు. తప్పు ఎవుడు చేసినా తప్పే అవుతుంది గాని ఒప్పు అవదు. పశ్చాత్తాపం మనస్సులో వుండాలి. నాలుక మీద గాదు.'
సౌమ్య స్వరంతో అన్నదామె.
తాను చేసిన రభస కెంతో సిగ్గు పడిపోతున్న వాడిలా తల దించుకునే వుండిపోయాడు. చాలా సేపటి వరకు. అయిదారు నిమిషాలు గడిచిన తరువాత పశ్చాత్తాప స్వరంతో అన్నాడు --
'మా ఫ్రెండ్స్ బలవంతం చేయటం మూలాన రాత్రి తాగవలసి వచ్చిందండి! మీరానాడు అన్నప్పటి నుంచీ మానివేశానసలు ---'
అది పచ్చి అబద్దం అని ఆమెకు తెలుసు. అతడు ప్రతిరోజూ భోజనం తరువాత సీసాలో నుంచి బ్రాందీ వంపుకుంటూన్న ధ్వని ఆమె చెవులబడుతూనే వుంది. కానీ అతడా సంగతి ఆమె కంట బడలేదన్న వూహతో అందంగా అబద్దాన్ని అతికించాననుకుని మురిసి పోతున్నాడు లోలోన.
అనూరాధ కాతని వైపు చూస్తేనే మహా పాపాలు చుట్టుకుంటాయేమో నన్నంత భయం కలిగింది. అతని ప్రవర్తన కామేకే సిగ్గన్పించింది. మనుషుల్లో అంత అసత్యవాదుల్ని ఆమె ఏనాడూ చూడలేదనుకుంది.
