20
ఆ తరవాత నేను ఎంతో ప్రయత్నించాను సారధిని గురించిన భోగట్టా తెలుసుకోవాలని . వైదేహి ఏమాత్రం నాకు సహాయం చేయలేక పోయింది. ఇతర విషయాలు బాగానే మాట్లాడేది. సారధి సంగతి అడిగినప్పుడు క్షణం లో కళ్ళు చేమ్మగిల్లెవి. ఆమె హృదయం లో అంతటి కన్నీరు ఎలా ఉద్భవిస్తున్నదో నా ఊహకు అందలేదు. ఆమె అతన్ని గురించి కూడా ఎక్కువ మాట్లాడేది కాదు.
మనుష్యుల కష్టాలు మరిపింప జేసే అమృతం కన్నీరు. వైదేహి కి , సారధి కీ ఉన్న సంబంధం ఏమిటో , వైదేహీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అంతర్య మేమిటో నాకు అర్ధం కాలేదు.
"ఈ పాప ఎవరు?' అడిగాను.
"మా బాబే" అంది వైదేహి.''
ఇంకా వివరంగా ఎలా అడగాలో ఆలోచిస్తున్నాను.
"మీరు ఆలోచిస్తున్నదేమిటో నే చెప్పనా?"
"చెప్పండి."
"సారధి గారు నాకు మిగిల్చిపోయిన సంపద ఈ బిడ్డ."
కాసేపు ఇద్దరం నిశ్శబ్దం లో , ఆలోచనల్లో మునిగి పోయాం.
"ఈ బిడ్డను చూస్తూ , బ్రతికి నంత కాలం అయన కోసం ఏడవాలని మాయమై పోయారు."
"ఎక్కడికి వెళ్ళాడు?"
"ఎక్కడికో తెలిస్తే వెళ్లి రెక్కలు కట్టుకొని అయన పాదాల మీద వాలను!"
"ఎందుకు వెళ్ళిపోయాడు?"
"నన్ను వదిలించు కోవాలని."
"నిన్నెందుకు అంత ద్వేషించాడు?'
"అయన నన్ను ద్వేషించ లేదు ఎన్నడూ."
"మరి?"
"నన్ను ప్రాణంతో సమానం అనుకున్నారు."
"అలా అనుకుంటే నిన్ను విడిచి ఎందుకు వెళ్ళాడు?"
"నా ఖర్మ."
"అలా దాయటం మంచిది కాదు. నేను నీకు పరాయి వాణ్ణి కాదు. అసలు కారణం చెప్పు."
వైదేహి ఏడ్చింది. ఆ విషయం నాతొ చెప్పదలుచు కోలేదు. ఎంతగానో అడిగాను. నా ప్రశ్నకు కన్నీరు తప్ప మరేమీ సమాధానం రాలేదు.
"మనిషి అవసరానికి గడ్డి తింటాడు. కడుపు నిండి, ఆకలి తీరిన తరవాత ఆ గడ్డినే అసహ్యించు కుంటాడు' -- ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకు వచ్చింది. కాని వైదేహి ముఖంలో మాలిన్యం తాకుకూ నీడ కూడా నాకు కనిపించలేదు.
నేను వైదేహి తో మాట్లాడుతుండగానే ఒక వ్యక్తీ లోపలికి వచ్చాడు. "పాపా" అంటూ. వీధిలో అడుక్కునే మనిషిలా ఉన్నాడు. మాసిన పైజమా, మీద చినిగిన చొక్కా తొడుక్కున్నాడు. నన్ను ఎగాదిగా చూసి "ఎవరితను?' అన్నాడు.
"సారధి గారు స్నేహితుడు" అంది.
అతనేమీ మాట్లాడలేదు. ఏదో గొణిగినట్లని పించింది.
"ఓ వంద రూపాయలు కావాలి" అన్నాడు.
"నా దగ్గిర లేవు" అంది వైదేహి.
"ఆ గాజులు బంగారపువేనా?"
వైదేహి మాట్లాడకుండా చేతికున్న రెండు గాజులు ఒలిచి ఇచ్చింది. అతను "నిన్ను దయ్యంలా పట్టుకు పీదిస్తున్నాను కదూ, పాపా, ఏం చేయను? నిన్ను చంపటానికి నన్ను పుట్టించాడు భగవంతుడు" అంటూ వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన దోవకేసే శూన్యంగా చూస్తూ నిలబడి పోయింది.
"ఎవరితను?" అని నేను అడగలేదు. అది అడగదగిన ప్రశ్న కాదని పించింది. కాని వైదేహి పది క్షణాలయ్యాక తనంతట తానే "ఈ మనిషి ఎవరో తెలుసా మీకు?' అని అడిగింది.
"ఎవరు?"
"నాకు జీవితంలో మరవలేని అపకారం చేసిందీ ఇతనే, మాయని అపకారం చేసిందీ ఇతనే. నాకోసం నాశన మైన మనిషి, నన్ను నాశనం చేసిన మనిషి."
"ఎవరితను?'
"మా ఊరే. నా చిన్నతనం లో మా ఊరొచ్చి వైద్యం చేయటం ప్రారంభించాడు. మా ఇంటి ఎదురు గుండా ఒక డాబా లో ఉండేవాడు. పెళ్ళాం కాదు గానీ , ఓ ఆవిడ ఇతనికి వండి పెడుతూ ముగ్గురు పిల్లల్ని కంది. పెద్ద చదువులు చదివిన డాక్టర్లు అయిదారుగురు వచ్చి పోయారు గాని, ఈ డాక్టరు గారికి వచ్చినంత డబ్బు ఎవరికీ వచ్చేది కాదు. ఈయన వైద్యం చదువుకున్నట్టు కూడా లేదు. రాజమండ్రి లో రాజుగారి దగ్గిర కొంతకాలం కంపౌండరు గా ఉండి, వైద్యం నేర్చు కున్నాడుట. చెయ్యి మంచిదని పేరు పడింది. మా బాబాయి కి, ఈ డాక్టరు గారికి చాలా స్నేహం. నేను అప్పటికి అయిదారేళ్ళ పిల్లని. పాపం పుణ్యం , ప్రపంచ జ్ఞానం తెలియని పసితనం. నన్ను చూసి, "ఈ పిల్ల పదేళ్ళు పొతే స్టారు ఔతుంది గోపాలం" అంటుండేవాడు మా బాబాయి తో. మా బాబాయి నవ్వి ఊరుకునేవాడు. అలాటి మాటలు , అంత చిన్న వయసులో కూడా నాకు బాగా అర్ధమయ్యాయి. ఆ ఊళ్ళో అంత పసి తనంలో నన్నలా పొగిడిన మనిషి లేడు ఆకాశం భూమిని చూస్తున్నట్టు, ఎక్కడో దూరం నుంచి మాత్రమే యౌవనం నా శరీరం కేసి చూస్తున్నది. ఇంకా అదీ తన యాత్రను ప్రారంభించ లేదు. ఒకోసారి "పాపా, నీ బుగ్గలు పిండితే అమృతం కారుతుందే" అనేవాడు. ఏదో లాలన, ఏదో పరవశత్వం , అందని సౌఖ్యం పది వసంతాలు దాటుతున్న నా మనస్సు ను మండించేవి. డాక్టరు గారిని రోజూ చూడాలని పించేది. కాలం దొర్లుకు పోయింది. సృష్టి కి ముందున్న శక్తి నాలో పుట్టి , పెరిగి హృదయాన్ని కోర్కెల ముద్దగా చేసి ముందుకు తోసింది. డాక్టరు ఒళ్లో వాలిపోయాను. ఊరికి నిప్పు అంటుకుంది. భగభగ మని మండుతుంది. ఆ వెదికి తట్టుకోలేక , బయటకు తీసుకు పొమ్మని డాక్టర్ని ప్రార్ధించాను. తన ఆస్తిని అమ్మి, వ్రుత్తి ని విసర్జించి , సమస్తాన్ని త్యజించి, నన్ను తీసుకు మద్రాసు వచ్చాడు. ఆరు నెలలు స్వర్గాన్ని తెచ్చి మా ఇంట్లో పాతి పెట్టాం. డబ్బంతా అయిపొయింది. ఈ డాక్టరు మద్రాసు లో ఎవరికి అవసరం లేకపోయింది. అంతా అయిపొయింది. దీపం వెలగాటానికిచుక్క అయినా తైలం మిగల్లేదు. సినిమాల్లో జేరాలను కున్నాను. డాక్టరు గారు స్వయంగా అయిదారుగురి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. ఆయన్ని బయటే కూర్చో పెట్టి, నన్ను గదిలోకి పిలిచి యక్ష ప్రశ్నలు వేస్తూ, విసిగిస్తూ , నఖ శిఖ పర్యంతం పరీక్ష చేస్తూ, "నిన్ను ఒకళ్ళు స్టారు చేసేదేమిటి? నువ్వు పుట్టుకతో నే స్టారువి" అంటూ తలో విధంగా మాట్లాడుతూ మళ్ళీ కనిపించమని ఆహ్వానించేవారు. ఏవో చిన్న వేషాలు వేశాను. లాభం లేదనిపించింది. చివరికి డాక్టరు నాకో సలహా యిచ్చాడు. "డబ్బున్న వాణ్ణి చూసి పెళ్లి చేసుకో. తుపాకీ మందు లాంటిది డబ్బు. దానికున్న శక్తి దేనికీ లేదు. ఎవరైనా నిన్ను కళ్ళ కద్దుకుంటారు" అనేవాడు. అయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తనకోసం కంటే నా కోసం ఎక్కువ బాధపడుతున్నాడు. చివరికి భీమేశు అనే రౌడీ ఒకడు నన్ను తీసుకెళ్ళి ఓ ముసలి తాసీల్దారు కి అప్పజెప్పి పోయాడు. ఆ ముసలి నక్క నన్ను చిత్రహింస పెట్టాడు. ఆ ఇంట్లో తన ఐశ్వర్యం చూసి, కడుపు నింపుకో మంటాడు. సంపద వల్ల తీరని ఆకలికి అతను సమాధానం చెప్పలేదు. విసిగి పోయాను. నేను నవ్వితే అనుమానంతో తోక తొక్కిన త్రాచులా లేచేవాడు. మంచి చీర కట్టుకుంటే "ఎవరి కోసమే ఈ సింగారం?" అని రభస చేసేవాడు. పోనీ, ఎందుకొచ్చిన గొడవ అని తల దువ్వుకో కుండా, బట్టలు మార్చు కోకుండా , ముసుగు కప్పుకు పడుకుంటే, ఇంకా సణుగుడు ఎక్కువయ్యేది "నేను బ్రతికున్నాననేగా నీ ఏడుపంతా? నేపోయాక నా ఆస్తి అంతా కాజేయాలనేగా నీ ప్లాను?" అనేవాడు.
ఆ ఇంట్లో ఉండలేక పోయాను. బయటికి వస్తే నీడలేని పక్షి నై పోతానని భయం వేసింది. కాని, నాకు నీడ దొరికింది. సారధి గారు నాకు ఆశ్రయ మిచ్చారు. "నిన్ను ప్రేమిస్తున్నాను" అని ఎన్నడూ అయన నోటి వెంట అనలేదు. కాని నన్ను తన సమస్టంగా భావించి ప్రేమించారు. "నువ్వు నాకు కావాలి" అని ఎన్నడూ అనలేదు. కాని నా కోసమే జీవించారాయాన. మళ్ళీ బ్రతుకు మీదా, భవిష్యత్తు మీద ఆశలు చిగురించాయి. జీవితంలో నేను పోగొట్టు కున్నది ఏమీ లేదనిపించింది. ఏవో జన్మాంతర వాసనలు మా బ్రతుకుల్ని ఒక్క మూసలో కరిగించాయనిపించింది. రోజులు క్షణాలుగా పరిగెత్తాయి. మళ్ళీ డాక్టరు నా జీవితంలో ప్రవేశించాడు. నా కోసం సర్వనాశన మైన మనిషి, నన్ను చూడాలని తపిస్తున్న మనిషి, నా వాకిటి ముందు నిలబడి లోనికి రావాలని నిరీక్షిస్తే, ఎలా తలుపు తీయకుండా ఉండగలను? ఎలా రిరస్కరించ గలను? భగవంతుడు క్షమించని పాపాన్ని ఎలా నెత్తిన పెట్టుకో గలను? నాకా సాహసం లేక, శక్తి లేక, కఠినత్వం లేక అతన్ని ఆహ్వానించాను ఆదరించాను. కాని, సారధి గారు నాతొ ఒక్క మాట అని ఉంటె, ఇతను రావటం అతని కిష్టం లేదని ఒక్క చూపు చూసి ఉంటె, ఏమైనా మరోలా ప్రవర్తించే దాన్ని. ఎన్నడూ అయన ముఖంలో కలవరం చూడలేదు. నన్ను ఆదేశించే భావం చూడలేదు. లోతు తెలియని మహా సముద్ర మాతని హృదయం. కడుపులో అంత హాలాహలాన్ని దాచుకుని, అంత ప్రశాంతంగా చూడటం , నిర్మలంగా మాట్లాడటం ఏ మానవ మాత్రుడి కి సాధ్య మౌతుంది? ఒకనాడు ఆకస్మికంగా అయన మాయమౌపోయారు. ఒక్కమాట నాతొ చెప్పలేదు. అయన ఈ నిర్ణయం తీసుకున్నారని, నాకు ఇంతటి కఠిన శిక్ష విధిస్తున్నారని ముందే తెలిసి ఉంటె, అయన పాదాల ముందే తల బద్దలు కొట్టుకొని , రాలి పోయేదాన్ని . కాని అంతా అయిపోయాక తెలిసింది. ఎక్కడ వెతకను? ఏమని ఏడవను? నా ఏడుపు అయన కేలా వినిపిస్తుంది? నన్నయన ఎలా క్షమిస్తాడు? ఈ సమస్య ను మృత్యువు కాక ఇంకెవరు పరిష్కరించ గలరు?"
* * * *
