Previous Page Next Page 
మనిషి పేజి 21


                                       19
    మజ్జిగ త్రాగి, మందహాసం చేసి, మళ్ళీ మొదలు పెట్టారు రిటైర్డు తాసీల్దారు గారు.
    "కాసిని మంచినీళ్ళు తాగుతావా, నాయనా?"
    "వద్దండి."
    "నీ అంత బుద్ది మంతుడ్ని నేనెక్కడా చూడలేదనుకో. పెద్దవాళ్ళంటే ఎంత భక్తీ, ఎంత వినయం, ఎంత ఓపిక!"
    ఆ రిటైరైన తాసీల్దారు వెళ్లగక్కే ఘోష, అంత నిదానంగా విన్నవారు లేరు లోగడ. నేనైనా అంత ఓపికగా వినటానికి సారధి కారణం గానీ, నా మంచితనం కాదు.
    "సరే, అయిందా! ఆ పిల్ల వెళ్లి మీ సారధి దగ్గిర జేరిందా, మరునాడు  బ్రోకర్ని పిలుచుకొని సారధి దగ్గిరకు వెళ్లాను."
    "అయన పెళ్లి చేసుకోవాలను కుంటున్న పిల్లను మీరు ఇలా తీసుకు రావటం మర్యాద కాదు' అని గర్జించాడు బ్రోకరు.
     బ్రోకరంటే చాలా భారీ మనిషిలే. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు వేలమంది అతని చేతిలో ఉంటారు. అతని పేరు భీమేశు. అసలు పేరు ఏదో ఉండి ఉండాలి. అందరూ భీమేశు అనే పిలుస్తారు. మహా సమర్ధుడు లే. తలుచుకుంటే, ఒక గాడిద పిల్లకు రంభని తెచ్చి పెళ్లి చెయ్యగలడు. చేతి కింద వస్తాదు ల్లాంటి వాళ్ళు ఓ ఇరవై మంది శిష్యులున్నారు. ఫలానా వాణ్ణి కొట్టి రండి అంటే చాలు. ఇంట్లో వాణ్ణి బైటికి లాగి , పెళ్ళాం చూస్తుండగానే విరగబాది లేచి రాగలరు. ఈలలు వేస్తూ, అత్తవారింటికి వెళుతున్నట్టు జైలుకు వెళతారు అవసరం వస్తే. అందుకనే భీమేశు ని తీసుకు వెళ్లాను, అవసరం వస్తే , ఎందుకైనా పనికి వస్తాడని.
    భీమేశు ఎంత గర్జించినా, మీ సారధి వినిపించు కుంటేనా? జాతకాలూ, చక్రాలూ ముందేసుకుని అందులో లీనమై పోయాడు.
    మళ్ళీ అరిచాడు భీమేశు.
    "ఆ పిల్లను మీరు తీసుకు రావటం మర్యాద కాదు."
    సారధి వంచిన తల ఎత్తలేదు. ప్రశ్నిస్తున్నదేవరో చూడకుండానే "ఆ పిల్లను నేను తీసుకు రాలేదు" అన్నాడు.
    "అలా అయితే దానంతట అదే వచ్చిందంటావా?"
    "వచ్చింది."
    "నీకూ ఆ పిల్లకూ ఏ సంబంధమూ లేదంటావా?"
    "లేదు."
    "సరే. ఇంతనితో మనకెందుకు పదవయ్యా" అంటూ ప్రక్క గదిలోంచి దొడ్లో కి వెళ్ళాడు భీమేశు పిల్లని వెతకటానికి. దొడ్లో అరటి చెట్లు పిచ్చిగా ఎదిగి అదంతా ఒక మహారణ్యం లా ఉంది. పంపుకు శీల ఊడి నిరంతరాయంగా రాత్రిం బవళ్ళు నీరు ప్రవహిస్తూనే ఉంది. ఆ పంపు బాగు చేయించే శ్రద్ధ ఎవరికీ ఉన్నట్టు కనిపించలేదు. కుళాయి దగ్గిర వైదేహి కారేజి గిన్నెలు కడుగుతుంది. భీమేశు వెళ్లి "భడవ'కానా , మన సంగతి ఇంకా నీకు తెలిసినట్టు లేదే" అంటూ దాన్ని రెక్క పట్టుకొని బడబడా ఈడ్చుకు వస్తున్నాడు. అయిందా? ఇంతలో మీ సారధి, వాడి తస్సాదియ్యా, మెరుపులా వచ్చాడయ్యా! అంత మనిషా భీమేశు! చొక్కా పుచ్చుకుని గుంజి, ఎడాపెడా , ఓ డజను దెబ్బలు వేశాడనుకో! అంతటి భీమేశు బిక్కచచ్చి , జావకారి నీరసించి, కుక్క పిల్లలా తోక్కాడించుకుంటూ వెళ్ళిపోయాడు అప్పుడని పించింది , పిల్లా, ఈ కుర్రాడే నీకు తగిన జోడు . ఇద్దరూ పెందేపు గుర్రాల్లా ఉన్నారు-- రక్షించావు లే నా కొంప లోంచి బైటకు పోయి అనుకున్నాను. ఆ తరవాత మళ్లీ ఆ వైదేహి పేరు గాని, ఆ సారధి సంగతి గానీ నే తరిస్తే ఒట్టనుకో. మనకెందు కయ్యా ఈ వెధవ పీడ? ఈ వృద్దాప్యం లో రామనామ స్మరణం చేసుకుంటూ, రోజులు లెక్క పెట్టుకుంటూ కాలక్షేపం చెయ్యక."
    "ఆ తరవాత ఏం జరిగింది?'
    "ఇంక ఆ తరవాత వాళ్ళ సంగతి పట్టించుకో లేదని చెప్పాను గదయ్యా! దుష్టులకు దూరంగా ఉండమన్నారు , ఉన్నాను. అంతే!"
    సారధి ఏమన్నా ఉద్యోగం చేసేవాడా?"
    "వాడి మొహం. వాడేందుకు పని కోస్తాడయ్యా? తన్నులాటలకి , పోకిరీ   తిరుగుళ్ళ కీ తప్ప -- ఎందుకూ పనికి రాడనుకో."
    "మరి ఎలా బ్రతికే వాళ్ళు ఉద్యోగం లేకుండా?'
    "సరే, మానభిమానాలున్నాయి, చూశావూ , వాటిని పట్టుకు ప్రాకులాడినన్నాళ్ళూ , ప్రతిదీ సమస్యే. వాటిని మనవి కాదనుకొని వదిలి పెట్టావనుకో సగం ప్రపంచాన్ని జయించినట్టే. ఆ భీమేశు గాడు పది లక్షలు సంపాయించాడు బ్రోకరేజి చేసి. మా డిప్టీ కలెక్టరు సంపాయించ లేడంత డబ్బు. అన్నట్టు, మీ వాడికి జాతకాలు చూడటం తెలుసనీ ఒక భాగోతం విప్పాడు."
    "ఏం చేశాడు?"
    "పెద్ద పెద్ద వాళ్ళు కార్లు వేసుకు రావటం, మీవాడితో రాత్రి ప్రొద్దు పోయేదాకా గుడగుడ లాడటం, పోవటం జరుగుతుండేది. నాతుకోటు సెట్లు ఎంతమంది వచ్చేవాళ్ళో తెలుసా? మంత్రదండం తిప్పినట్లు, గారడీలా , నెలరోజుల్లో మీవాడి ఫైలు పెరిగిపోయిందనుకో. ఏమాట కామాటే చెప్పుకోవాలి. ఎంత డబ్బు సంపాదించినా, ఆ గది లోంచి బయటకు వచ్చేవాడు కాదు. చాలా నిదానంగా వుండేవాడు. ఇతగాడికి ఎప్పటి కైనా పిచ్చే క్కుతుందేమో అనిపించేది. వాడి సంపాదనంతా తగల బెట్టటానికి ఈ వైదేహి ఒకటి దాపురించింది కదా? ఓహో ఏం వెలిగిపోయింది? మతి పోయేదనుకో ఈ వయస్సు లోగూడా. ఫెళా ఫెళా కళ్ళు బయర్లు కమ్మేవి. ఏ కలెక్టరు కొనగలడయ్యా ఆడదానికి అయిదేసి వందలు పెట్టి, డజన్ల కొద్ది చీరెలు? మీసారధి కే చెల్లింది కానీ! అయితే నా అనుమానం ఒకటి."
    "ఏమిటది?'
    "మొదలియారు దయ్యం ఉందే, అది మీ వాణ్ణి ఆశ్రయించి ఉంటుంది."
    "అంటే?'
    "సరే. ఆ దయ్యాలు ఒకోసారి తలుచుకుంటే పరమ బికారిని కోటీశ్వరుణ్ణి చేస్తాయి. మా బావమరిది తోడల్లుడి భార్య ఒకతే ఉండేది. అంత అందమైన వీపున్న ఆడది ఇండియా లో లేదనుకో! అయిందా, ఆ అమ్మాయి నిక్షేపం లాటి మొగుణ్ణి వదిలిపెట్టి.......' అంటూ రోప్పటం మొదలు పెట్టాడు తాసిల్దారు గారు.
    "ఏమిటో , బాబూ. నీ మంచితనం చూస్తె నాకు మతి పోతుంది. ఎంతయినా చెప్పాలని పిస్తుంది. పెద్దవాణ్ణి అయిపోతున్నానా? ఆయాసం. తింటే నీరసం. తినకపోతే ఆయాసం -- " అంటూ మజ్జిగ మరో గ్లాసు తెప్పించుకు తాగాడు.
    "అయిందా , బాబూ. ఏమిటి చెబుతున్నాను? ఆ. ఆ జమిందారు గారి కన్ను ఓ పంతులమ్మ మీద పడింది. రంభ లా ఉండేది రాణీగారు. అయితే నేం వెధవ మనస్సనుకో మనుష్యులిది . భార్య అందాన్ని పరాయి మగాడు ఆరాధించినట్లు భర్త అరాదిస్తేనా? ఆ, ఇంతకీ ఆ పంతులమ్మ ఎలా ఉంటుందను కున్నావు?"
    "సారధి ఇప్పుడు ఎక్కడున్నాడండీ?' అన్నాను ఆ వాగుడు భరించలేక.
    తాసీల్దారు గారు దెబ్బ తిని, తేరుకొని, "రెండు నెల్ల నించీ ఆ ఇంటికి మళ్ళీ తాళం పడింది. ఆ సారధి కనిపించటం లేదు. ఈ వైదేహీ కనిపించటం లేదు" అన్నాడు.
    "మీ బ్రోకరు భీమేశు అడ్రసు ఏమిటి?' అని అడిగాను.
    తాసీల్దారు గారు సణుగుకుంటూ "అతనికో అడ్రసేమీటయ్యా? ఆ పరమేశ్వరుడు విశ్వ వ్యాప్తంగా ఉన్నట్టుగా, ఈ భీమేశు మద్రాసులో ఏ సినిమా స్టూడియో ముందు చూసినా కనిపిస్తాడు." అన్నాడు.
    తాసిల్దారు గారిని వదిలించుకొని , కొడంబాకం బయలుదేరాను. నాలుగైదు స్టూడియోల దగ్గిర విచారించాను. భీమేశు చివరికి రీగల్ స్టూడియో నందు కనిపించాడు. అతన్ని పలకరించటానికి కొంచెం బెరుకని పించింది. మంచిగా  కొంత కధ చెప్పి, "ఫలానా సారధి అనే కుర్రాడు ఎక్కడున్నాడు" అని అడిగాను.
    "మా గురువు గారా?' అన్నాడు భీమేశు.
    "అదేనయ్యా! ఆ మొదలియారింట్లో ఉండే కుర్రాడు."
    "ఆయనే లెండి. మా గురువు గారంటే . భలే మనిషండీ. నెలకు పదివేలు సంపాయించే వాడు. సంపాదన అందుకుంది. మాయమై పోయాడు!"
    :ఎక్కడికి వెళ్ళాడు?'
    "ఏమో! రెండు నెల్ల నుంచీ కనిపించటం లేదట!"
    "ఎవరు చెప్పారు  ?"
    "వైదేహి ని ఓ పిల్ల ఉంది లెండి. ఇద్దరూ కలిసి ఉండేవారు."
    "ఆ అమ్మాయి ఎక్కడుంటుంది?'
    "తేనేం పేటలో , మొగల్ వీధి లో ఉంది. ఇంటి నెంబరు ఆరూ బై నూట ఏభై ఏడు."
    అటో రిక్షా లో తేనేం పేట పరిగెత్తాను. చిన్న మేడ అది. మూడు నాలుగు భాగాలుగా చేసి, అద్దె కిచ్చి నట్టున్నారు. తలుపు తట్టాను. ఓ ముసలావిడ కిళ్ళీ నములుతూ పక్క తలుపు తట్టమంది.
    వైదేహి తలుపు తీసింది.
    వైదేహి పరిపూర్ణమైన స్త్రీత్వం తో తల్లిలా కనిపించింది.
    చెప్పాను నా పేరు.
    "సారధి నా స్నేహితుడు."
    నన్ను సాదరంగా ఆహ్వానించింది. చిరకాలంగా ఎరుగున్న వ్యక్తీ లా పలకరించింది.
    "సారధి మీ గురించి చాలాసార్లు చెప్పారు. మీ సంగతులన్నీ నాకు తెలుసు. మీ కుట్టి బాగా ఉన్నాడా?' అంది.
    "మా అబ్బాయి పేరా?"
    "మీ అబ్బాయి పేరే గాదు, మీ గురించి తెలియని సంగతి లేదు నాకు. మీ గురించిన ముచ్చట్లు అయన చెప్పని రోజు లేదు. కల్యాణి గారు ఎలా ఉంది!"
    నవ్వేను. "సారధి ఎక్కడున్నాడు?' అని అడిగాను. అతని గురించి వినాలనీ, అతన్ని చూడాలనీ నా మనస్సు పరుగులు వేస్తుంది.
    నా ప్రశ్నకు వైదేహి సమాధానం చెప్పలేదు. మళ్ళీ అడిగాను "సారధి ఎక్కడ?" అని.
    వైదేహి పరుగుపరుగున లోపలికి వెళ్ళిపోయింది. పది నిమిషాలు పది యుగాలుగా గడిచింది. అనుమానం, ఏదో భయం నన్నావహించాయి.
    లోపలికి వెళ్లాను. మంచం మీద బోర్ల గిల పడుకొని ఏడుస్తుంది వైదేహి.
    ఆమెను పలకరించలేక పోయాను.
    పలకరించకుండా ఉండలేక పోయాను.
    సారధి కోసం నా మనస్సు క్షోభించి పోతున్నది. దగ్గిరికి వెళ్లి, భుజం మీద చెయ్యి వేసి అనునయించాను. ధైర్యం చెప్పాను. పసిబిడ్డ ను లాలించినట్లు పలకరించాను.
    పక్కన ఉయ్యాలో బిడ్డ కారుమంది. సారధిని గురించి ఏవో కధలను మనస్సు అల్లుకుంటుంది. బిడ్డను ఎత్తుకున్నాను. గోడ మీద మసక వెలుతురులో సారధి ఫోటో నవ్వుతుంది దీనంగా. ఆ ఫోటో కి దండ వేసి పూజిస్తున్నది వైదేహి. కొంత అర్ధమయింది. కొంత అర్ధం కాలేదు. నా కళ్ళు ఎందుకో చెమ్మ గిల్లాయి.
    ఎక్కడో పుట్టి, ఎలాగో ఎక్కడో తారసిల్లి , ఒక్కటైన రెండు ప్రాణులు వాటిలో స్వర్గానికి ఎగబాకుతూన్నాయి. నా ఊపిరి నాకు బరువయింది. వైదేహి ముఖం నాకు కనిపించటం లేదు. తల నా పక్కకి తిప్పాను. నుదురు కుంపటి లా ఉంది. అవిరిలా వదులుతుంది శ్వాస.
    "వైదేహీ."
    నన్ను పసిపిల్లలా కరుచుకొని బావురు మంది.a


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS