Previous Page Next Page 
మనిషి పేజి 23


    ఇంక సారధిని చూడటం అసంభవమని విజయవాడ తిరిగి వచ్చేశాను. ఆరునెలలు గడిచి పోయాయి. సారధి జాడ రవ్వంత తెలియలేదు. ఒకనాడు నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి మా శ్రీమతి అడిగింది, "మీకు తెలుసా? అని.
    "ఏమిటది?' అన్నాను.
    "సారధి విషయం."
    "సారధి ఎక్కడున్నాడు?"
    "మీకు ఇంకా తెలియలేదా?"
    "లేదు. ఏమయింది? ఎక్కడున్నాడు ? అసలు విషయం ఏమిటి?"
    "మీరొకసారి లింగరాజు ఇంటికి వెళ్లి రండి."
    నాకు భయం వేసింది. బట్టలు మార్చుకోవాలని కూడా అనిపించలేదు. పరుగు పరుగున లింగరాజు ఇంటికి వెళ్లాను.
    "హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు సారధిని" అంది కల్యాణి.
    ఆమె ముఖంలో రవ్వంత విషాదం కనిపించలేదు. ఎవరి విషయమో చెప్పినట్లు చెప్పింది.
    "ఏమయింది సారధికి?' అసలు ఏం జరిగింది.
    "అయన ఎలక్ట్రిసిటీ స్తంభానికి గుద్దు కున్నాడుట. గుండె పగిలి పోయిందిట. బ్రతకటం కష్ట మన్నారు ఇక్కడ. కారులో ఈయన ఇంతకుముందే గుంటూరు తీసుకు వెళ్ళారు."
    నేను వెనక్కి తిరిగి బయలుదేరాను.
    "ఒక్కమాట" అంది కల్యాణి.
    ఆగాను.
    "మీకో రహస్యం చెప్పనా?"
    "ఏమిటది?"
    "సారధి ప్రాణం తీసుకోవాలనే ఆ పని చేశాడు."
    నవ్వింది కల్యాణి!
    నేను గుంటూరు వెళ్లేసరికి ఒంటి గంట అయింది. ఆకలి మండి పోతుంది. హాస్పిటల్ లోపల లింగరాజు కారు కనిపించింది.
    లింగరాజు సిగరెట్టు కాలుస్తూ నుంచున్నాడు కారు పక్కనే డ్రైవరు తో మాట్లాడుతూ. వెనక చక్రం లో గాలి తగ్గిందని చెబుతున్నాడేమో.
    "సారధి కి ఎలా ఉందిరా?' అని అడిగాను.
    "బ్రతికితే మరో జన్మే!" అన్నాడు.
    వెంటనే సారధిని చూడాలని వెళ్లాను. ఆపరేషన్ దియేటర్ లో ఉన్నాడు సారధి. గుండె బాగా చితికి పోయిందిట. పూర్తీ మైకం లో ఉన్నాడట. డాక్టర్లు నన్ను లోపలికి వెళ్ళ నియ్యలేదు. తిరిగి బైటకు వచ్చి  లింగరాజు కారులో కూర్చున్నాం.
    "ఈ ప్రమాదం ఎలా జరిగింది రా?' అడిగాను.
    "సారధి మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళాడుట. అక్కడ రేవులో కొన్నాళ్ళు పనిచేసి హెలేన్ని చూద్దామని ఇక్కడకు వచ్చాడు. మొన్న సాయంత్రం ఇద్దరం సినిమాకు గూడా వెళ్లాం. సినిమా చూడకుండా కళ్ళు మూసుకు కూర్చున్నాడు. 'హెలెన్ ఎక్కడుంది' అని మాత్రం అడిగాడు."
    "హెలెన్ ఎక్కడుండిప్పుడు?"
    "నీకు తెలియదా?"
    'అయిదారు నెలల క్రితం బెంగుళూరు లో చూశాను. ఆ తరవాత రెండు మూడు ఉత్తరాలు వ్రాసింది."
    "ఏం రాసింది?'
    "సారధి జాడ ఏమన్నా తెలిసిందా అని. ఏమీ తెలియలేదని జవాబు వ్రాశాను . అంతే. ఆ తరవాత హెలేన్ని గురించి గాని, సారధి ని గురించి గాని రవ్వంత తెలియలేదు. నాలుగు రోజుల క్రితం అవరనిల గడ్డ వెళ్లాను. ఇవాళ ఇంటికి వచ్చేసరికి ఈ దుర్వార్త విన్నాను."
    "హెలెన్ రాజు గారిని పెళ్లి చేసుకుందిట. బెంగుళూరు లో కాపరం పెట్టారు."
    నర్సు బైటికి వచ్చి మామ్మల్ని పిలిచింది.
    సారధి చనిపోయాడు!
    తన ఇరవై తొమ్మిదో యేట!
    తాను ఊహించిన విధంగా!

                                *    *    *    *
    సారధి తాలుకూ మిగిలిన ఆస్తి ఒక సూటు కేసు. లింగరాజు ఆ సూటు కేసు నాకిచ్చాడు. అవరనిగడ్డ లో ఉన్న మూడేకతాల మాగానీ చౌదరయ్య కౌలుకీ చేస్తున్నాడు. సారధి ఎన్నడూ తన పొలం గురించి ఆలోచించినట్లు లేదు. కట్టుబడి కావాలని చౌదరయ్య ని అడిగినట్లూ లేదు. ఫల సాయం చౌదరయ్య దగ్గిరే ఉంటుంది.

                               
    అంతా అయిపొయింది. సారధి జీవిత యాత్ర ముగించాడంటే నేను నమ్మలేక పోయాను. ఎంత నిజమయినా అది కేవలం అసత్యమని పించింది. సారధి సూటు కేసు తాళం వేసి ఉంది. తాళం చెవులు నా దగ్గిర లేవు. లింగరాజు దగ్గిర కూడా లేవు. ఆ సూటుకేసు తెరవాలనే ఆలోచన కూడా నాకు కలగలేదు. మా ఇంట్లో ఓ మూల ఆ పెట్టె మౌనంగా తపస్సు చేస్తుంది.
    ఒకనాడు వైదేహి దగ్గిర నించి ఉత్తరం వచ్చింది. ఒకటే ప్రశ్న , "సారధి జాడ తెలిసిందా?' అంటూ. ఆ ఉత్తరానికి జవాబు వ్రాసే కఠినత్వం నాలో లేదు. ఆ ఉత్తరం చదివి, మళ్ళీ ఒకసారి సారధి పెట్టె కేసి చూశాను. మళ్ళీ వారం రోజులకు వైదేహి దగ్గిర నించి మరో ఉత్తరం వచ్చింది.
    సారధి సూటు కేసు వైదేహి కి పంపాలను కున్నాను. అట్లకాడ తో ఆ సూటు కేసు తాళం తీసి చూశాను. రెండు పైజమాలు, లాల్చీలు, ఒక గళ్ళ సిల్కు జేబురుమాల, నల్లంచు తెల్ల లుంగీ , టర్కీ టవలు, ఒక పెన్సిలూ, కాగితాల కట్ట బర్కిలీ సిగరెట్టు ఉన్నాయి. ఒక్కొక్కటే పరీక్షగా చూస్తూ మనస్సు గతంలోకి తొంగి చూస్తున్నది. సూటుకేసు మూతకున్న సంచీ లో పెద్ద సైజు కవరు లో ఒక ఫోటో ఉంది. సారధి -- వైదేహి కలిసి దిగిన ఫోటో అది. సారధి కళ్ళు బరువుగా దీనంగా చూస్తున్నాయి. కాగితాల కట్ట విప్పాను. అది సారధి వ్రాస్తున్న నవల. కొన్ని కాగితాలు చిరిగి పోయాయి. సీరియల్ నంబరు లేదు. అవన్నీ ఒక క్రమంలో పెట్టాను. తన్ని గురించిన కధ అది. చిన్నతనం నించి తన అనుభవాలు, జ్ఞాపకాలు కూర్చి వ్రాసింది. చాలా కధ ఇంతకుముందు నేను వ్రాసిందే. భాష వేరు కావచ్చు. శైలి వేరు కావచ్చు. చెప్పే పద్దతి వేరు కావచ్చు. కాని విషయం ఒక్కటే . సారధి జీవితం. కాని నవలలో చివరి పేజీలో నాకు తెలియని సంగతులెన్నో  ఉన్నాయి. ఆ పేజీలు  ఇక్కడ పొందు పరుస్తున్నాను. సారధి జీవితంలో తుది రంగానికి సంబంధించిన కధ అది.
    అది ఇది .

                                    21
    ఇరవై ఎనిమిది సంవత్సరాలు బ్రతికిన తరువాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే , అంతా అర్ధం కాని విచిత్ర స్వప్నం లా కనిపిస్తుంది. బెజవాడ వదిలి మద్రాసు వచ్చాను. ఎందుకు వెళ్ళిపోతున్నావు? అన్న ప్రశ్నకు నేనిచ్చిన సమాధానం "కల్యాణి కోసం" అని! నాకూ ఆశ్చర్యంగానే ఉంటుంది.
    మద్రాసు రాగానే సుమబాల కు ఉత్తరం వ్రాశాను.
    "బాలా!
    నేను అనుకోకుండా బెజవాడ వదిలి మద్రాసు వచ్చాను. ఇక నుంచీ ఉత్తరాలు మద్రాసు ఎడ్రసు కే వ్రాయవలసింది. నీ సహకార ముంది గనుక ఇద్దరం కలిసి ఆకాశానికి నిచ్చెన వెయ్యాలనుంది. ఏమంటావ్? మబ్బులు కమ్మిన ఆకాశం లాగా, గడ్డ కట్టిన నడిలాగా నిలిచిపోయిన ఈ జీవన స్రవంతి నీ పరిచయంతో చైతన్య తరంగణి లా పని చేస్తున్నది. మన ఈ పది నెలల పరిచయానికి అర్ధమేమిటో , గమ్య మేమిటో నువ్వే నిర్ణయించాలి. నీతో కలిసి ఏ అనంత దిగంతాల కు నడచి పోవటాని కైనా నేను సర్వ సిద్దంగా ఉన్నాను. ఈ కధలో మరో పేజీ తిప్పవలసింది నువ్వు. ఆ అధికారం నాకు లేదు. కోరరాని కోరికతో వ్రాస్తున్నా నెమో! తగని చనువు తీసు కుంటున్నానెమో! కానీ, బాలా! ఏదో అధికారం నన్నిలా వ్రాయమని పురమాయిస్తున్నది . దీనికి వెంటనే సమాధానం వ్రాయి. వేయి కన్నులతో ఎదురు చూస్తుంటాను."
    ఈ ఉత్తరం నేను పోస్టు చేసిన రోజునే సుమబాల వ్రాసిన ఉత్తరం నా కందింది.
    'సారధి గారూ!
    మొన్న పెద్ద తిరుపతి వెళ్లి వచ్చాం. కళ్ళారా ఆ స్వామిని దర్శించాము. చాలా సరదాగా నడిచిపోయింది ప్రయాణం. ఆ స్వామి దర్శనం అయింది. మీ దర్శనం ఎప్పుడవు తుందో మరి? తిరుపతి కొండ మీద ఓ అబ్బాయి కనిపించాడు. అచ్చు మీలాగానే ఉన్నాడు. మీరనుకుని పలకరించాను. మీరు కాదు ఏం చెయ్యను? ఈ జన్మలో తమ దర్శన భాగ్యం ఉందొ లేదో?
                                                                                               ఇట్లు
                                                                                         మీ అభిమాని,
                                                                                            --సుమబాల."
    ఈ ఉత్తరం చదివిన వెంటనే జవాబు వ్రాశాను.
    "రెక్కలు కట్టుకుని మీ ముందు వ్రాలాలని ఉంది. ఏం చెయ్యను? కేవలం మనిషిని. అయినా నీ అజ్ఞ అయితే మీ ఊరు వస్తాను. మీ ఇంటికి వచ్చి నీ గది తలుపు తడతాను. ఏ సంగతీ తిరుగు టపాలో వ్రాయవలసింది.
    ఆ లేఖకు జవాబు వచ్చింది. అందులో రమ్మనీ లేదు, వద్దనీ లేదు. "వస్తావా నాకోసం? అబ్బాయి గారికి ఎంత ఆశ!" అని మాత్రం ఉంది.  మౌనం అంగీకారంగా స్వీకరించి బయలుదేరాను. ఏలూరు కు పద్నాలుగు మైళ్ళు తడికిల పూడి. అక్కడ బస్సు దిగి రెండు మైళ్ళు చిట్టడివి గుండా లోపలికి నడిచి వెళితే పెట్రాయి కనిపిస్తుంది. పెట్రాయి ఒక చిన్న కుగ్రామం. అయిదారు వందల ఇళ్ళ కంటే ఎక్కువ లేవు. సుమబాల తండ్రి నరసింగరావు గారు చిన్న జమిందారు. ఆయనకి నిమ్మకాయలు నిలబెట్టేటటు వంటి రెండు మీసాలూ , ఓ తుపాకీ ఉంది. ఆ మీసాలు మేలి బెట్టుకుంటూ, తుపాకీ తో పిట్టల్ని కొట్టుకుంటూ, ఒకోసారి అడవి పందుల్ని వేటాడుతూ, ఆ కుగ్రామాన్ని ఏకచ్చత్రాదిపత్యంతో పరిపాలిస్తున్నారు ఆ నరసింగ రావు గారు.
    పెట్రాయి లో ప్రవేశిస్తుంటే నా ఒళ్ళు జలదరించింది. అది భయం కాదు. ఏదో కంపన. ఆ గ్రామంలో ఎవరూ నాకు తెలియదు. తెలిసింది ఒక్క సుమబాల. ఆమె నైనా ప్రత్యక్షంగా ఎన్నడూ చూడలేదు. తడికిల పూడిలో నరసింగ రావు గారిని గురించి కొంత భోగట్టా సేకరించాను. అయన పై ఆ పరగణా వారికి చాలా గౌరవాభిమానాలున్నాయి. అయన పూర్వీకులు మహా వీరుల్నీ, సింహా బలులనీ, అనేక కధలు భారత కధల్లా ప్రచారం లో ఉన్నాయి. వీరి తాత పెద్ద నరసింగ రావు గారు ప;పెద్ద పులి నోట్లో ఎడమ చేయి పెట్టి, కుడి చేత్తో దాని నెత్తి పగల గొట్టి చంపి అవతల పారవేసేవారట! కర్రసాము లో పాతిక మందికి సమాధానం చెప్పేవారుట. చిన నరసింగ రావు గారు కూడా తుపాకీ కాల్చటం లో విపరీతమైన నేర్పు గలవారట. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని కూడా ఒకే దెబ్బతో కాల్చి నేల రాల్చే వారట.
    నేను పెట్రాయి వెళ్లేసరికి ఉదయం పదకొండు గంటలయింది. ఊళ్ళో రెండు చెరువులున్నాయి. ఒకదాన్ని బ్రాహ్మల చేరువనీ, రెండో దాన్ని చేపల చేరువనీ అంటారు. చేపల చెరువు గట్టు మీదనే ఉంది నరసింగరావు గారి ఇల్లు. చుట్టూ బ్రహ్మాండమైన ప్రహరీ గోడ. ఒకే ఒక గేటుంది. ఆ గేటు పక్కనే గోడ మీద నించి బైటకు పెద్ద వసారా దింపారు. ఆ వసారాలో పొడుగాటి సిమెంటు అరుగు ఉంది. ఆ అరుగు మీద ఒక ముసలాయన కూర్చొని కల్వం లో ఏదో మందు వేసి నూరుతున్నాడు. అయన సదరు నరసింగరావు గారి తండ్రి అచ్యుతరాయనింగారని తరవాత తెలిసింది. వసారా లో ఒక పడక కుర్చీలో పడుకొని, ఒక చేతిని తల కింద పెట్టుకొని, రెండో చేతితో మీసం దువ్వుతూ ఒక పక్కకు చూస్తూ రెండో పక్కకు మాట్లాడుతున్నారు. నరసింగరావు గారు. అయిదారుగురు పెద్ద మనుషులు అరుగు మీదనే అచ్యుతరాయనిం గారి చెంతనే కూర్చొని ఉన్నారు. ఇద్దరు దొరగారి ముందు చేతులు కట్టుకొని నోళ్ళు తెరుచుకుని నుంచున్నారు. నరసింగరావు గారి వెనక జాలయ్య నే నౌకరు తుపాకీ చేత్తో పుచ్చుకుని శిల విగ్రహం లా నిలబడి ఉన్నాడు. దొరగారు ఏదో మహా విషయాన్ని చెబుతున్నారు. దొరగారంటే నిరసింగ రావు గారు. అచ్యుతరాయనిం గారిని పెద్ద దొరగారంటారు.
    నరసింగరావు గారు నవ్వారు కుడి పక్కకు చూసి.
    అందరూ నవ్వారు.
    "మీరుండండి , అబ్బాయి గారూ! అపాళంగా ఓ పెద్దపులు గాండ్రు మంటూ గర్జించిందయ్యా. దొరగారికి ఒళ్ళు మండిపోయింది. "రావే పిరికి సన్నాసీ" అని తోడ చరిచారు. దొరగారి చేతుల్లో తుపాకి ఉందని జంకింది పులి. సరే, కాని అనుకోని అ తుపాకీ నివిసిరి ఆవల పారేసి , బాలయ్య తలగుడ్డ తీసి ఎడం చేతికి చుట్టుకొని, 'ఇప్పుడు రావేచవట పులీ!' అని పిలిచారు. పులి దూకింది. ఒక్కసారి చిన్న దొరగారు గుడ్డ చుట్టూ కున్న ఎడం చేతిని పులి నోట్లో పెట్టి, కుడి చేత్తో నాలుగు గుద్దులు డొక్కలో కుమ్మి, రెండు దెబ్బలు తల మీద వేశారు. టఫా ఆదెబ్బతో సఫా. అపాళానా 'మీ జోలికి రావడం బుద్ది తక్కువై ప[పోయింది , దొరగారూ' అని గావుకేక పెట్టి నేల రాలిపోయింది. అప్పుడనుకున్నాను, చిన్న దొరగారూ మీ తాతకు తగ్గ మనమడి వనిపించిటివి గదయ్యా అని. ఇదిగో, ఈ పులి చర్మం అప్పటిదే -- ఆ తెలివి తక్కువ పులిదె! అంటూ ఈ భయంకరాచార్లు గారు కూర్చున్న పులి చర్మాన్ని లాగి, దులిపి, మహా జనానికి చూపెట్టారు పెద్ద దొరగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS