Previous Page Next Page 
ఇందుమతి పేజి 21


    "మామయ్యతో చెప్పావా?"
    "లేదు. అయినా పెళ్లి సమస్య ఇంకా రాలేదు కదా?"
    "అంటే? పెళ్లి ని గురించి నీ అభిప్రాయ మేమిటి?"
    "నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, బావా. ఈ రెండు సంవత్సరాలు ఆగితే ఇంజనీరింగు, ఆమె బి.ఎ కూడా పూర్తి అవుతాయి. అప్పుడు చేసుకోవచ్చని నా ఉద్దేశం. అయితే చివరికి అడ్డంకులు వస్తాయో మోనని భయం."
    "మామయ్య సిసలైన బ్రహ్మ సమాజ వాది అనే నా నమ్మకం. ఈ సమస్య తో ముందు కొంచెం వెనకడినా అయన తప్పక ఒప్పుకుంటారనే నా ఊహ. అయితే అత్తయ్య ఒప్పుకుంటారా అన్నదే ప్రశ్న."
    "నా ఊహ కూడా అదే, బావా. ఏమిటి చెయ్యడం?"
    "ఇటువంటి సమస్యలలో కని పెంచిన తల్లి తండ్రులకు ప్రతికూలంగా నడవటం అంత మంచిది కాదనే నా ఉద్దేశం. తల్లితండ్రులు మూడులూ, లోక జ్ఞానం లేనివారూ అయితే ఆ పరిస్థితి వేరు. నీ తల్లి తండ్రులు అటువంటి వారు కాదు. సంఘాన్ని సంస్కరించాలనే వారిలో అగ్రగణ్యులు మామయ్య. అత్తయ్య అంటావా , ఇన్నాళ్ళూ అయన ఉద్దేశాలతో ఏకీభవిస్తూ ఆయనకు తోడూ నీడగా ఉంటూ వచ్చారు. నచ్చ చెబితే ఆవిడ కూడా ఒప్పుకోవచ్చు.
    "ఇక పెళ్లి, అనేది రెండు సంవత్సరాల నాటి మాట. కనక ఇప్పటి నుంచే ఈ సమస్య లేవదియ్యటం అనవసరం. ఈరెండు సంవత్సరాలలో నీ మనస్సు మారవచ్చు, ఆమె మనస్సు మారవచ్చు. లేకపోతె మీ మైత్రి ఇంకా గాడతరమూ కావచ్చు. ఆ పక్షం లో అప్పటి పరిస్థితిని బట్టి ఏదో విధంగా అప్పుడే పరిష్కరించు కోవచ్చు. ఈ లోపుగా మీరిద్దరూ కూడా హద్దులు మీరకుండా ఉండటం ముఖ్యం. స్త్రీ పురుషులలో కూడా మైత్రి అనేది శుద్ధ మైత్రి గానే ఉండవచ్చు నని నా ఉద్దేశం.
    "ఈ రెండు సంవత్సరాలలో ఏదో విధంగా మీ కుటుంబాన్నీ, రత్న స్వామి గారి కుటుంబాన్ని సమావేశ పరిచి, అత్తయ్య కు కూడా ప్రభావతి మీద సుహృద్భావం కలిగేటట్లు చెయ్య గలిగితే సమస్య సానుకూలం కాకవచ్చు."
    "నువ్వు అన్నట్టు కాలమే ఈ సమస్య ఏదో విధంగా పరిష్కరిస్తుందేమోలె" అన్నాడు రవి.

                                  21
    జ్యేష్ట మాసం లో ఇందుమతీ రాజశేఖరుల పునస్సందానానికి ముహుర్తం నిశ్చయించారు. రాజశేఖరమూర్తితో బాటు వెంకటా చలపతి గారు, సుబ్బారావు గారు, సుభద్రమ్మ గారు, రుక్మిణమ్మ గారు, ముహూర్తానికి అనంతవరం వెళ్ళారు.
    రాజశేఖర మూర్తి ఇందుమతిని చూసి సంవత్సరం అయింది. ఆమె కిప్పుడు పదహారేళ్ళు నిండాయి. ఎలా ఉన్నదో అనుకున్నాడు. నిండు యౌవనం లో ఆమె పూర్ణ చంద్రుణ్ణి పోలి ఉంటుందను కున్నాడు. చేమంతి పూబంతి లాగ ఆమె శరీరం మృదువుగా ఉంటుంది అనుకున్నాడు. ద్రాక్షల లాగా ఆమె పెదవులు చవులూరిస్తూ ఉండవచ్చు ననుకున్నాడు. రతీదేవి లాగ ఆమె తన్నిక సుఖసాగరం లో ఓలలాడిస్తుంది కాబోలు అనుకున్నాడు.
    రాత్రి పీటల మీద కూర్చునే వరకు ఆమె తనకు కనిపించనే లేదు. మెల్లిగా వచ్చి తన పక్కన కూర్చుని ఉన్న ఇందుమతి ని ఓరగా చూశాడు. ఆమెలో తాను ఆశించినంతటి మార్పు కానరాలేదు. ఒకటి రెండంగుళాలు పొదుగు ఎదిగిందేమో అనిపించింది. అధరం పై చిరునవ్వు తొణికిసలాడుతున్నది. ఆమె తనను కన్నెత్తి చూడలేదు. "ఒహ, సిగ్గుల పెళ్లి కూతురా!" అనుకున్నాడు.
    తతంగం అంతా అయిన తరవాత అలంకృత మైన గదిలోకి పోయి మల్లె పూలు పరిచిన పర్యంకం మీద పడుకున్నాడు రాజశేఖర మూర్తి. ఇందుమతి చాలాసేపటి వరకు రాలేదు. ఏమిటీ ఆలశ్యం అని విసుగుకున్నాడు. అగరు ధూపాలు, చందన గంధాలు, పుష్పపరీమళాలు మనస్సుకు మత్తెక్కి స్తున్నాయి. దశమి చంద్రుడి వెన్నెల పిలవకుండానే వచ్చిన పేరంటాలిలా తెరిచి పెట్టిన గవాక్షం ద్వారా లోనికి వచ్చి తెల్లని పక్కకు పసుపు పూసింది.
    రుక్మిణమ్మ గారు ఇందుమతి ని గదిలోకి తీసుకుని వచ్చింది. ఆమె ముఖం ఎందు వల్లనో వివర్ణ మయి ఉన్నది. ఇందుమతి కూడా ఏదో భయంతో కంపిస్తున్నట్టు ఉన్నది. రుక్మిణమ్మ గారన్నది:
    "బాబూ, రాజూ, ఇందుమతి ఆరోగ్యం సరిగా లేనట్టుంది. ఇప్పుడే చిన్న దగ్గు వచ్చి ఉమ్మి లో నెత్తురు పడ్డది. ఇంతకూ ముందెప్పుడూ ఇలా జరగలేదట. జాగ్రత్త!"
    రాజశేఖర మూర్తి హృదయం లో పిడుగు పడిన ట్లయింది. అతడికి నోట మాట రాలేదు. భయకంపిత అయిన ఇందుమతి ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. రుక్మిణమ్మ గారు బయటికి పోయి తలుపు వేసేసింది. రాజశేఖర మూర్తి భార్యను దగ్గరికి తీసుకుని గాడంగా కౌగలించు కున్నాడు. ఆమె ముఖం తన వక్షం మీద అద్దుకుని, మూర్ధం ముద్దు పెట్టుకున్నాడు.
    "ఇందూ, ఏమిటీ విఘాతం? పన్నెండు నెలలుగా మీ నాన్నగారు వ్రాస్తున్న ఉత్తరాలను బట్టి నీ ఆరోగ్యం కుదుట పడ్డదనుకున్నానే! నిన్న కాక మొన్న మీ బావగారు కూడా వ్రాశారే నీ ఆరోగ్యం బాగానే ఉందని. వైద్యుడైన ఆయనకే తెలియలేదా నీ పరిస్థితి?"
    "క్షమించండి. మీ సంతోషానికి అంతరాయం కలిగించాను, పాపిష్టి దాన్ని. ఈ జబ్బు ఇవాళే బయట పడాలా, ఇన్నాళ్ళూ లేనిది!"
    "ఇంతకూ ముందు ఎప్పుడూ ఇలా రాలేదా?"
    "లేదు. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు దగ్గు రావటం ఎవరికైనా ఉన్నదే."
    "ఇప్పుడు తలనెప్పి కూడా రావటం లేదా?"
    "ఎప్పుడైనా వస్తుంది , అందరికీ వచ్చినట్లే. ఇదివరకు లాగా తరచుగా రావటం లేదు."
    "జ్వరమేమైనా వస్తున్నదా?"
    "లేదండీ."
    "అయితే ఇది నా దౌర్భాగ్యమే అనుకోవాలి."
    "......"
    ఎప్పుడెప్పుడా అని ఆశించిన క్షణం రానే వచ్చింది కోరి పెళ్లి చేసుకుని రెండు సంవత్సరాలు గా మచ్చిక చేసుకున్న ప్రణయిని చేతికి అందిన ద్రాక్ష గుత్తి లాగ చెంతనే ఉన్నది, కాని తాను ఆమెను అనుభవించ లేడు. అనుభవించి ఆమె జీవితానికే హాని కలిగించ లేడు. అతని శరీరం నీళ్ళు కారిపోయింది.
    "ఇందూ, ఈ పరిస్థితిలో మనం దాంపత్య జీవితం ప్రారంభించటం మంచిది కాదను కుంటాను. నీ ఆరోగ్యం బాగా కుదుట పడేవరకూ ఈ బ్రహ్మచర్యం ఇలాగే సాగనీ."
    ఇందుమతి కన్నులలో నీరు వరదలై ప్రవహించింది. ఆమె కళ్ళు ఉత్తరీయం తో తుడిచి, ముఖం ముద్దు పెట్టుకొని తన బాహువులతో ఆమెను ఎత్తి పర్యంకం మీద పడుకో బెట్టాడు.
    "వద్దు, వద్దు. నన్ను వదలండి. నేను అవతలికి వెళ్ళిపోతాను, మీరు పడుకుందురు గాని."
    "నువ్వెక్కడికీ వెళ్ళనక్కర లేదు, ఇందూ. ఈనాటి నుంచీ నీ స్థానం నా పక్కనే. నీ ఆరోగ్యానికి భంగం కలగకుండా నిన్ను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నాది. అ మాత్రం నిగ్రహం నాకు ఉన్నది" అని ఆమె శిరస్సు తన పక్షం పై పెట్టుకుని పక్కనే పడుకున్నాడు రాజశేఖర మూర్తి. ఇందుమతి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎన్ని విధాల ఓదార్చినా ఆ అశ్రు వారి ఆగలేదు. ఏడ్చి ఏడ్చి పతి వక్షం మీద అలాగే సోలి నిద్రించింది.
    మల్లెలు వాడిపోయాయి. అగతవత్తులు ఆరిపోయాయి. చందన గంధం గడ్డ కట్టింది. దశమి వెన్నెల జారుకున్నది.
    రాజశేఖర మూర్తికి ఆ రాత్రి అంతా నిద్ర లేదు. రెండు సంవత్సరాలు గా అతడు నిర్మించుకున్న ప్రేమ హర్మం అంతా చిన్నాభిన్న మయి కూలిపోయింది. ఇదేమి కర్మ? ఇందుమతి ని ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఉవ్విళ్ళూరాడో ఆమె కౌగిలి లో చేరడానికి1 ఇందుమతి ఎప్పటికైనా బాగుపడుతుందా? ఏనాటి కైనా తమ దాంపత్య జీవితం సరళం అవుతుందా? ఇవే ఆలోచనలు. తనకు సుఖం లేకపోతె పోనీ. ఆమె ఆరోగ్యం బాగుపడితే అంతే చాలు. అవసరమయితే తానిక ఆమె జోలికి పోకుండా బతక గలడు.
    తెల్లవారు ఝామున కొంచెం నిద్ర పట్టింది. నిద్ర లేచి చూచేసరికి పొద్దెక్కింది. ఇందుమతి ఎప్పుడో లేచి వెళ్లి పోయినట్టు ఉంది. అంత ఆలస్యంగా లేచి నలుగురి ముఖాలు చూడడానికి సిగ్గు వేసింది. కాని తానా రాత్రి ఎలా గడిపాడో వారికేమి తెలుసు? ఆ ఇంట్లో ఎవరికి జరగరాదేడీ జరిగినట్టే లేదు. ఇందుమతి ఆరోగ్య పరిస్థితి ని గురించిన ఆందోళన ఎవరి ముఖాల లోనూ కనిపించలేదు. ఒక్క రుక్మిణమ్మ గారి ముఖం లో తప్ప. పల్లెటూరి వారి గుండె అంత గట్టివి కాబోలు!
    ఉదయం తొమ్మిది గంటల వేళ నాగభూషణం రావు వచ్చాడు.
    "ఏమండీ, రాజశేఖరం గారూ, అలిసిపోయినట్లు ఉన్నారే?"
    "లేదండీ. రాత్రి సరిగా నిద్రలేక అలా ఉన్నది."
    "అవును లెండి, నిద్ర ఎట్లా ఉంటుంది, మొదటి రాత్రాయేను!"
    రాజశేఖర మూర్తి మనస్సులో అతని మాటలకు జుగుప్స కలిగింది.
    "ఇందుమతి కి ఆరోగ్యం బాగా లేదు. రాత్రి ఉమ్మిలో నెత్తురు పడిందిట."
    "అరె, మా అత్తయ్య నాతొ చెప్పనే లేదే? ఏమే, అత్తయ్యా" అంటూ లోపలికి పరిగెత్తాడు నాగభూషణ రావు.
    పక్కనే ఉన్న వెంకటా చలపతి గారు, "అదేమిటిరా, నాయనా, నాకు తెలియనే లేదు" అన్నారు.
    "మీరేమీ భయపడకండి, నాన్నా. దివాకరరావు గారికి ఇప్పుడే ఉత్తరం వ్రాస్తాను. సరి అయిన మండు ఇప్పిస్తే అదే సర్దుకుంటుంది." అన్నాడు రాజశేఖర మూర్తి . తరవాత మామగారిని సంప్రదించి ఆరోజే దివాకరరావు గారికి వెంటనే ఒకమారు అనంతవరం వచ్చి వెళ్ళాలని ఉత్తరం వ్రాశాడు.
    ఆ రాత్రి మళ్ళీ ఇందుమతి గదిలోకి వచ్చింది. రాజశేఖర మూర్తి సంతోషంగా చేతులు చాచి ఆమెను తన పరిష్వంగం లోకి తీసుకున్నాడు. ఆమె తన వక్షం మీద బల్లి లా హత్తుకు పోయింది. ముఖం ఎత్తి చూశాడు. ఆమె దిగాలు పడినట్లు ఉన్నది.
    "ఇందూ, ఎలా ఉందీ వేళ?"
    "బాగానే ఉంది."
    "మళ్ళీ దగ్గు రాలేదు కదా?"
    "లేదు."
    "నువ్వేం దిగులు పెట్టుకోకు. దివాకరరావు గారికి ఈవాళే ఉత్తరం వ్రాశాను. అయన వచ్చి చూస్తారు. సరి అయిన మందు వెంటనే పుచ్చుకుంటే అదే పోతుంది."
    "ఎమిటంటారీ జబ్బు?"
    "ఏమో , నాకు మాత్రం ఏం తెలుసు? నేను వైద్యుణ్ణి కాను కదా పరీక్ష చేసి తగిన మందు ఇస్తే మళ్ళీ రాకుండా ఉంటుందని."
    "ఇక నా జీవితం ఇంతేనేమో?"
    "ఛీ, ఛీ; ఏమిటా మాటలు! నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. ఇందూ పొరబాటు నయినా అలాంటి మాట లనకు."
    "........"
    "అలా డాబా మీదికి వెళ్లి వద్దాం. వస్తావా? వెన్నెలగా ఉంది."
    "పదండి."
    పక్క తలుపు తీసుకుని డాబా మీదికి వెళ్ళారు భార్య భర్తలిద్దరూ. వెన్నెల మల్లె పందిరి విరియ బూచినట్లు ఉన్నది. తామర కొలను మీదుగా వీస్తున్న చల్లని గాలులు గిలిగింతలు పెడుతున్నాయి. రాజశేఖర మూర్తి కూర్చున్నాడు. అతని తోడ మీద తల పెట్టుకుని ఆకాశం వంక చూస్తూ పడుకున్నది ఇందుమతి. దూది పింజెల వంటి మబ్బు తునకలు చందమామ తో దోబూచు లాడుతున్నాయి. ఆమె మనస్సులో ఏవో అనుమానాలు ముసురుతున్నాయి. వంగి ఆమె భ్రూమధ్యం లో వెచ్చగా చుంబించాడు రాజశేఖర మూర్తి.
    "దాంపత్య సుఖం ఇవ్వలేని నా పై మీ కెందు కింత ప్రేమ?" అన్నది ఇందుమతి.
    "ఇందూ! ప్రేమకు శారీరక సంబంధమే ముఖ్యం కాదు . అంతకన్న ముఖ్యమైనవి హృదయాల కలయిక, తదనుబద్దమైన మమత. రెండు సంవత్సరాలకు ముందు నీవేవ్వరో, నేనెరగను. నేనెవ్వరో నీ వేరగవు ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటారు కొంతమంది. పెళ్ళాడి ఎందుకు ప్రేమించ కూడదో నాకు అర్ధం కాదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే అటువంటి ప్రేమ పెంపొందటానికి ఆస్కారమే లేదు. కాని , ఇష్టపడి చేసుకున్నప్పుడు మమత దానంతట అదే పెరుగుతుంది. ఈ రెండు సంవత్సరాలు గా నీమీద నాకూ, నామీద నీకూ దినదినాభివృద్ది చెందుతూ వచ్చిన ఈ మమతే దీనికి తార్కాణం. ఈ మమత కు శారీరక సంబంధంతో పనిలేదు. ప్రేమకు దాంపత్య సుఖం నిండు దనం ఇస్తుంది , నిజమే. కాని, ఏ కారణం చేతనైనా ఆ దంపత్య సుఖానికి అంతరాయం కలిగినా స్వచ్చమైన ప్రేమకు కొరత రాదు. ఈ ప్రేమ చిరకాలం ఇలాగే ఉండాలని అమృత మూర్తి చంద్రుణ్ణి ప్రార్ధిస్తున్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS