సుభద్ర మొహం వికసించింది.
"అలాగే, పార్వతీ! ఇదుగో నన్నల్లరి పెడుతుంది-- దీన్ని కూడా తీసుకుపోయి కబుర్లు చెప్పు." రాధను ముందుకు తోస్తూ అంది సుభద్ర.
"నే వస్తా!" అంటూ పార్వతి కొంగు పట్టుకుంది పాప.
ముగ్గురూ గేటు దగ్గరికి వచ్చే లోగా ఒక యువకుడు మంద గమనంతోనే లోపలికి వచ్చాడు. పార్వతి ని అక్కడ కొత్తగా చూసి తల వంచుకుని తన గది వైపు నడిచాడు. ఎర్రగా, పొడవుగా , తగినంత సారుగా కనిపిస్తూ, నిరాడంబరత్వం అతిగా ,లేకపోయినా నిర్వికారమైన నడత తో గది తాళం తీస్తున్న కొత్త వ్యక్తిని రెప్ప వాల్చకుండా రెండు నిమిషాలు చూచింది పార్వతి. తర్వాత సుభద్ర వైపు చూచింది, ప్రశ్నార్ధకంగా.
ఆ అమ్మాయి చూపును అర్ధం చేసుకుంది సుభద్ర.
దీర్ఘమైన నిశ్వాసంతో పాటుగా, "ఈ అబ్బాయి గురించి కధలాగానే చెప్పాలి, అమ్మాయీ" అంది బాధ స్పురించే స్వరంతో.
"అలాగా!" అన్నది పార్వతి నేలను చూస్తూ.
"ఎవరైనా ఉన్నారా మీకు -- అని అడిగితె చెప్పడానికి ఇష్టపడడు. ఆస్తి ఉన్నదని అంటాడు. ఎక్కడ ఉందొ ఏమో అంతూ పంతూ అంటూ తెలీదు. పాపకి చదువు చెప్తుంటాడు. ఎప్పుడూ ఏదో వ్రాస్తుంటాడమ్మా! అతను వ్రాసినవిపత్రికల్లో వస్తే ణా కిచ్చి చదవమంటాడు. అదతని సరదా."
కుతూహలంగా చూసి, "బాగుంటాయా? చదివారేమో మీరు?" అన్నది పార్వతి. అతన్ని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మరికొంత ఎక్కువైంది అ అమ్మాయిలో.
"చాలా బాగా వ్రాస్తాడమ్మా ! భావాలు బాగా గుప్పిస్తాడు. మొదట్లో అటువంటి వాటి మీద ణా దృష్టే ఉండేది కాదు గాని రాను రాను ఏది చదివినా అందులో అమూల్య భావ సహితమైన వాక్యాలే నచ్చుతున్నాయి. అర్ధం చేసుకోవడానికే అవస్థ పడతాం కదా-- వ్రాయడానికి ఇంకెంత పాటు పడాలో ఆ వ్రాసేవారు! అన్నట్టు మరో సంగతి , పార్వతీ! ఈయన ఒంటరి వాడు. రెండేళ్ళ క్రిందట ఒకేడు కాపరం చేసిన భార్య పోయిందట. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఎందుకో ఏమో అర్ధం కాదు. అందులో నాలాటి వాళ్లకు మరీ వింతగా కనిపిస్తారు ఇటువంటి వాళ్ళు.'
పార్వతి మొదటి నుంచి ఉత్సాహం చూపిస్తూనే ఉంది అతని విషయంలో. "ఎన్నాళ్ళ యిందేమిటి ఇక్కడికీ యనవచ్చి?' ప్రశ్నించింది.
"ఏడాది క్రిందట వచ్చాడు. నలుగురిలో ఉంటె తెలివైన వాడని ఇట్టే తెలుసుకోవచ్చు. బి.ఎస్. సి కాబోలు -- చదువుకున్నా హెల్తు డిపార్ట్ మెంట్ కు చెందిన ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఇదేమిటా అని నేనూ, మీ అన్నగారూ ఆశ్చర్యపోయాము. తర్వాత -- మంచి హోదా ఇచ్చే ఉద్యోగ ప్రయత్నం చెయ్యమని సలహా కూడా ఇచ్చాము. కానీ అబ్బాయిది ఉత్తమ లక్ష్యాలు సాధించాలనే ఏకాగ్ర చిత్తం అనుకుంటాను. అతను వ్రాసే రచనలను బట్టి కూడా అర్ధమవుతుంది. తన ఒక్కడి కోసం ఈ ఉద్యోగం చాలు నంటాడు. ఏ పనీ చెయ్యలేని వాడిని, మొద్దు గేదేలా కునికే వాణ్ణి నిందించవచ్చు, దేశ సౌభాగ్య రక్షణకు హెచ్చరించవచ్చు. కాని జీవనా ధారం కోసం కష్టించే మనిషి ఉద్యోగాన్ని , అదేటు వంటిదైన సరే గౌరవించలేకపోవడం బుద్ది హీనత తప్ప మరొకటి కాదని వాదిస్తాడు. అతనికి పెళ్లి విషయంలో కూడా ఇలాటి అభిప్రాయా లేమైనా ఉన్నాయేమో నని కదిపి చూశాను. కాని ఆ సంగతులు వచ్చినప్పుడు జవాబు చెప్పకుండానే దాగిపోతున్నాడు. అయినా బుద్ది మంతుడు కాబట్టి మా యింట్లో ఒక మనిషిలా కలిసిపోయాడు పార్వతీ!" సుభద్ర చెప్తుంటే వింటూ, చుట్టూ ఆవరణ లోని పూల మొక్కల సౌందర్య సౌగంధ్యాలను ఆస్వాదిస్తూ మైమరిచిన అతివగా మారింది పార్వతి.
ఎర్రగా కందిపోయిన సూర్యుణ్ణి చూచి నీలాకాశం ఫక్కున నవ్వితే పువ్వులు రాలినట్టు మబ్బు పింజెలు నలుమూలలకు చేదురుతున్నాయి. కంద గడ్డగా అయిపోయిన భాస్కరుడి తీక్షణ వదన ధోరణి మరి కొంత తీవ్రం కాకనూ పోలేదు. అయినా అతని అరుణా రుణ కిరణ జాలాలు దయా వీక్షణాలతో అభాగ్య అనాధ జీవుల పాలిట చల్లగా మారిపోతున్నవి. అప్పుడప్పుడే తెరలుగా వచ్చే చల్లని సమీర స్పర్శ దేహాన్ని ఊహ లోకాల్లోకి తీసుకు పోవడమే కాకుండా ఉన్నట్టుండి తిరగాదోస్తున్నది కూడా. స్వర్గానికి, నరకానికి బెత్తెడు దూరం మాత్రమె నని అక్కడే అర్ధమౌతుంది. చిత్రం కాదూ మరి!
బకెట్ నిండుగా నీళ్ళు తెచ్చి అరుగు క్రింద నున్న గులాబీ మొక్క మొదట్లో ఓంపుతున్న యువకుణ్ణి అవ్యక్తానుబంధస్పూర్తి తో చూచింది పార్వతి.
"రాధకృష్ణగారిని పరిచయం చేస్తాను. రా, పార్వతీ!" అంటూ గులాబి చెట్టు దగ్గిరకు లాక్కు వెళ్ళింది సుభద్ర ఆ అమ్మాయిని.
ఇరువురూ పరస్పరం తెలుసుకున్నారు.
"అయన పేరు. వి.ఎస్. రాజు కదండీ! లెక్చరర్ గా కొన్నాళ్ళు పని చేసినట్టు విన్నాను. ఎందుకు మానుకున్నారాయన?" పరిచయమయ్యాక పార్వతిని ప్రశ్నించాడు రాధాకృష్ణ.
పార్వతి నవ్వుతూ, "రాజుకు కూడా మీవంటి ఉద్రేకమే , రాధా కృష్ణ గారూ! అయితే మీ అంత మంచివారు మాత్రం కారు" అన్నది.
రాధాకృష్ణ కేవలం నవ్వి ఊరుకోలేక పోయాడు. "నేను మంచివాడినని ఎలా అనుకుంటున్నారు?" అన్నాడు దరహాసం చెదరకుండా. నవ్వినంత మాత్రానికే అతని తెల్లని మొహం ఎర్రబడుతున్నది. మాటల్లో చురుకుదనం ఎంత ఉందొ వ్యక్తీ లో వినయం అంతగా నిబిడీకృతమై ఉంది. ఒక రకపు జీరతో పలికే కంఠస్వరానికీ, అతని నిరర్గళ వాగ్దోరణీకి బందీతులవుతారు ఇతరులు. ఒక్కొక్క వ్యక్తిలో ఆకర్షణ అతి సూక్ష్మంగా ఉండి తెలియకుండానే ఎదటి వారిని వశపరుచుకుంటుందంటే అతిశయోక్తి కాదు.
అతని ప్రశ్నకు పార్వతి తడుము కోవలసి వచ్చింది అప్పటికి.
"అలా అనకండి! ఎంత అభిమానంగా ప్రేమతో ఆ గులాబీ మొక్కకు నీళ్ళు పోస్తున్నారో ఈ కళ్ళతోనే చూశానుగా!" అంది నవ్వుతూ హాస్యం ధ్వనించేటట్టుగా.
"ణా మంచితనం అంచనా వెయ్యడానికి అంటున్నారు గాని నిజంగా తెలిసికాదు. ఆ గులాబీ చెట్టు పువ్వులు పూస్తుందని దాన్ని పోషిస్తున్నాను. అక్కడ స్వార్ధవే ఉన్నప్పుడు మంచికి తావెక్కడ ఉందండీ?" అన్నాడు రాధాకృష్ణ ఆకులకు పట్టిన చీడను వదిలుస్తూ.
"మీరు పూలు పెట్టుకోరు కదా! మీ ఇంట్లో ఎవరూ లేరు. స్వార్ధ మెలా ఉందంటారు?" పార్వతి ప్రశ్న వినగానే ఆపుకుందామన్నా ఆగలేదతనికి చిరునవ్వు.
నిటారుగా నిలబడి పోయాడు.
"బలేగా మాట్లాడుతున్నారు, పార్వతి గారూ! చూసి ఆనందించడం లోనైనా సరే స్వార్ధం ఉంటుందని మీకు తెలీదా? పోనీ, నేనంత సౌందర్యారాధకుడిని కాననుకోండి. కనీసం మీవంటి వారి పొగడ్త కైనా నేను శ్రమిస్తుండాలి! అది స్వార్ధం కాదంటారా? పుట్టుకే స్వార్ధం. మరొక మనిషి పుట్టాడు అనేకంటే స్వార్ధం మరి కాస్త పెరిగింది అంటే బాగుంటుందనుకుంటాను. భగవద్విలాసం అనండీ, మరొకటనండి -- నేను అంగీకరించగలను. కాని స్వార్ధ రూపంతో పుట్టిన మనిషి త్యాగకల్పనతో రూపు దిద్దుకోగలిగితే అవధుల్లేని అతని ఆనందానుభవం వర్ణనకు అతీతంగా నిలుస్తుంది."
పార్వతి కి అతని అంతః కరణ ను వింటున్నట్టుగా ఉంది.
రాధాకృష్ణ వాదనలోకి చొచ్చుకు పోయాడంటే మరొకరు మేలుకొలుపు పాడకపోతే లాభం ఉండదు.
"మీరు రచయితలు కనక ఇలా తర్కిస్తారు ప్రతిదాన్నీ" అంది చివరకు పార్వతి.
ఆశ్చర్యపోతూ, "ఏదో వ్రాస్తాను కాని-- ణా రచనల మీద నాకంతగా విశ్వాసం లేదు. భావ విశృంఖలంగా వ్రాసినా వాటి వైశిష్టాన్ని నమ్మలేను. మీకెలా తెలుసు?' అన్నాడు రాధాకృష్ణ.
"తెలిసింది . మీ మంచితనం గురించి సుభద్ర గారు చెప్పారు."
"ఓహో! ఆమె అలానే చెప్తారు అందరికీ. మీకు గులాబీ లంటే ఇష్టం లా ఉంది -- ఒక మొక్క తీసుకెళ్ళి మీ ఇంటి ముందు వెయ్యండి ." రాధాకృష్ణ అంటు కట్టి తీసిన ఒక మొక్క పార్వతికి ఇచ్చాడు.
"నేను పట్టుకుంటా, మాస్టారూ!" అంటూ తీసుకుంది పాప.
"రాజు కోప్పడతారేమో! కోపం లో ఉంటె ఇటువంటి వాటికి వ్యతిరేకంగా వాదిస్తారు" అన్నది పార్వతి మొక్కను పాప చేతుల్లో చూస్తూ.
రాధాకృష్ణ ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడే మాటలు వింటూ లోపలి నుంచి వస్తున్న సుభద్ర నవ్వుతూ , "పేరుతోనే పిలుస్తావా మీ ఆయన్ని? మరేం ఫరవాలేదు. అన్నిటికీ సుఖ మైన మార్గం " అన్నది.
పార్వతి కి ఏమైనా అనాలని అనిపించినా సంకోచం వదల్లేదు.
* * * *
సుభద్ర ఇంటి నుంచి పాపను తోడూ తీసుకు మరీ వస్తున్న పార్వతిని అవగింజై పోయిన మొహంతో తాటికాయలంత కళ్ళు చేసుకొని వాళ్ళ వసారా లోంచి తొంగి తొంగి చూస్తున్నది పుల్లమ్మ. అది గమనించక పోలేదు పార్వతి.
స్థల నిర్ణయం చెయ్య కుండానే ముంగిట్లో గొయ్యి తవ్వ నారంభించింది పాప.
పార్వతి ఆ పిల్ల నాపుతూ. "ఉండమ్మా, రాదా! చెట్టు పాతడంతో సరేనా? ఎండ తగినంత పడుతుందో లేదో చూడద్దూ? పిచ్చి పిల్లా!ఇదుగో , ఈ పక్కను మంచి పదునైన చోటు -- ఇక్కడే ఆ పనేదో చెయ్యి!" అంది ఒక వైపు చిన్న పరిశ్రమకే స్వేద బిందువులు జాలు వారే ముద్దు మొగాన్ని చేరదీస్తూ.
పార్వతి ని వదిలించుకుని గెంతుతూ వెళ్లి అజ్ఞ పాలించింది పాప.
సానుకూలమైన స్థలం లో పాతిన మొక్కకు నీళ్ళు పోస్తూ ఆనందించిన పార్వతి కి ఆ సమయంలో పాపే ఉన్న ఒక్క చెలికత్తె.
"ఎప్పుడు పూస్తుందో పూలు?' సాలోచనగా నిలిచినా పాప కళ్ళు చూసి భుజాల వరకు ఎత్తేసింది పార్వతి ఆ పిల్లను.
కిర్రున గేటు చప్పుడు తో రాజు లోపలికి రావడం చలించనీయక పోయినా, రాజుతో పాటు పుల్లమ్మ గారు గదిలోకి అడుగుపెట్టడం ఆశ్చర్యంలో ముంచింది.
పార్వతి నిలబడిన చోటుకు రాజు కనిపిస్తున్నాడు.
ఆమె చెప్పేది వింటున్నాడు ఉదాసీనంగా. పుల్లమ్మ గారు ఎందుకైనా మంచిదని అదృశ్యం గానే ఉన్నారు. మాటలు మాత్రం నిబంధనల ను పాటించే స్థితిలో రావడం లేదు. జోరుగా సాగివస్తున్న ఆమె గొంతుక లో పార్వతి వినాలనే ఉద్దేశం ప్రబలంగా ఉన్నది.
"అబ్బాయి! నేనెటువంటి దాన్నో నీకు గాని, మీ ఆవిడకు గాని తెలియదు. ఎవరికైనా మంచి జరుగుతుందంటే ణా ప్రాణాలు కూడా వాళ్ళ దగ్గర విడిచి వస్తాను నేను. అంత నిస్వార్ధ బుద్ది నాది! ఇంక ఎవళ్ళయినా నశించి పోతున్నారా? ణా జీవం గిజగిజ కొట్టుకుపోతుంధనుకో , బాబూ! వాళ్ళ బాధలన్నీ నావే అన్నట్టు గింజులాదిపోతాను -- అల్లాంటి ణా మాట తీసిపెట్టి ఇవాళ మీ ఆవిడ, నేను 'వద్దు చెడిపోతా' వన్న వాళ్ళింటి గడప తొక్కింది. చిన్న పిల్ల. నేనేమీ నొచ్చుకోను గానీ నువ్వే మందలించి దారికి తీసుకురా! వాళ్ళెం పగవాళ్ళా నీకు? ఆవిడ బుద్దులు నాకు నచ్చవు. ఆడదంటే ఎలా పడుండాలో ఆవిడకు తెలియదు. గొప్ప అహంకారమయ్యా! అడ్డమైన వాళ్ళనూ చేరుస్తుంది. అందుకనే మన పార్వతి లాంటి లేత పిల్లలు చెడి పోతారనే ఆరాటంతో పని గట్టుకు వచ్చాను. ఇంక వస్తాను -- పులుసు ముక్కలు పొయ్యి మీద వేసోచ్చాను, నాయనా!"
పుల్లమ్మ గారి మాటలు వింటున్న పార్వతి కైతే నవ్వు వచ్చింది. కాని, రాజు తన వైపు చూస్తాడనే నమ్మకంతో నవ్వు పెదాల మీద కైనా రాకుండా కాపాడుకుంది.
అయినప్పటికి గురి తప్పకుండా వచ్చిన రాజు ద్రుగ్బాణాలు పార్వతి వినీల నయనాలను తాకనే తాకాయి. విదిలింపుగా అడుగులేస్తూ, సహేళ నగా చూస్తూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు నిమిషం లో.
హంసలా నడుస్తూ వెళ్తున్న పుల్లమ్మ గారిని చూస్తూ నిలబడ్డది పార్వతి -- పోట్లాడాలని పించని పెద్దతనం కనిపిస్తున్న పుల్లమ్మగారిని.
పాప తన చెయ్యి పట్టుకులాగే వరకు ప్రస్తుతం లోకి రాలేదు ఆ అమ్మాయి.
"ఎవరు?' అంది పాప. ఆ అమ్మాయి కళ్ళు గది గుమ్మం లోకి చూస్తున్నాయి.
పార్వతి పరాధీనగా ఉందేమో -- "రాజు!" అనే సమాధానం అర్ధశూన్యంగా బయట పడింది.
"రాజా?" పాప పలుకులోని పసితనం పార్వతిని లోకంలోకి తెచ్చింది.
"నువ్వు సరిగ్గా నాలాగ పలకలేవు? ఏదీ -- ఇలా అను; రాజు!"
"ఊ?"
"రాజు."
"రాజు."
"ఆ.........అలా ."
"నేను వెళ్తా రాజు దగ్గరికి, అక్కా?"
"వెళ్ళు." నవ్వుతూ చూచింది పార్వతి.
ఒక్క నిమిషం ఆగకుండా రామచిలుక లా రివ్వుమంది పాప.
