19
రాజు మనః స్థితి , ప్రవర్తన మరొక రకంగా మారిపోతున్నాయి. ఇప్పుడతను చాలావరకు మౌనం వహిస్తున్నాడు. గృహ కార్యకలాపాలు అతని కిష్టం లేదు. ఇంట్లో ఎవరున్నారో లేదో తెలుసుకోనవసరం లేనంత మౌనం అతన్ని ఆవరించింది.
బయట స్నేహితులెవరైనా గట్టిగా మాట్లాడిస్తే నవ్వుతాడు; మాట్లాడతాడు. ఇంట్లో అతని గంబీరత మితి మీరింది. ఎంతో కోపం వస్తే తప్ప పెదవి కదపటం మానేశాడు.
పార్వతితో తనకేం పని? అదే పనిగా నోరెత్తకూడదు-- అని నిశ్చయించు కున్నాడు . తనకేం? మగవాడు! తానేమైనా చేసుకుంటాడు. అంతా తన చేతుల్లో ఉన్నది. ఒక ఆడదానితో అస్తమానం పోట్లాడుతూ గడప వలసిన కర్మ ఏమిటి తనకు?
ఈ మనస్సంకల్పాలు అతన్ని నిర్లక్ష్యం గాను, గంబీరం గానూ ఉండేలా కట్టుదిట్టం చేశాయి. అదీగాక అందరూ అనుభవించే సౌఖ్యం అందకుండా పోతున్నదని, తన జీవితం దుర్భరం అయిపోతుందని అతని మనసులో ఆవేదన రోజు రోజుకు రగులు కుంటుంది. తల్లి జ్ఞాపకం వస్తే పార్వతి ని ఒంటరిగా వదిలి చెప్పకుండా ప్రయాణమై చూసి వస్తాడు.
అది అనేక పర్యాయాలు గమనించింది పార్వతి. 'నేనే అలా మా యింటికి పొతే ఏం చేస్తాడో?' అనుకుంది. కాని ఎదురు అడగలేదు. నిజానికి పార్వతి లోనే నిగ్రహ శక్తి ఏర్పడుతున్నది. స్త్రీ పరిస్థితుల కనుగుణంగా నడవటానికి ప్రయత్నిస్తుంది మూడు వంతులు.
కాఫీ, టిఫిన్ పట్టుకుని పైకి వచ్చిన పార్వతి ని చికాకుగా చూశాడు రాజు. ఏదో ప్రశ్న ఉంది ఆ చూపులో.
పార్వతి గ్రహించి, 'జగ్గు మానేశాడు" అన్నది వినయ విదేయతలకు చోటివ్వకుండా.
"గోపాలుడున్నాడుగా?"
"సరే! రేపటి నుంచి వాడి చేతే పంపిస్తాను."
"ఊ."
చెప్పవలసింది చెప్పి కూడా కదల్లేదు పార్వతి ఇంకా. రాజు ఇంగ్లీష్ కాంపోజిషన్ పుస్తకాలు చూస్తూ గమనించనట్టు అటు చూడలేదు.
"నా కోక యాభై రూపాయలు కావాలి. ఇయ్యి-- తర్వాత ఇచ్చేస్తాను." చివరికి పార్వతి అడిగింది అతన్ని సూటిగా చూడకుండా.
"ఎందుకు?"
"సరస్వతి ని చూడాలని ఉంది. వెళ్తాను."
"సంపాదిస్తున్నది ఉండగా నన్నెందుకు, అడగడం?"
"ఎక్కడ ఉంది? నువ్విచ్చేది , నేను తెచ్చేది ఇంటి ఖర్చులకే అయిపోతుంటే నా డబ్బని ఎక్కడుంటుంది?"
"ఈసారి నీ డబ్బు నా యింటి కోసం ఖర్చు చెయ్యకు."
"అలాగే! ముందు నాకు ఏభై ఇయ్యి."
"నా దగ్గర చిల్లిగవ్వ లేదు, వెళ్ళచ్చు ఇక!"
"అబద్దం ! ఉన్నది. నీ దగ్గర. నేనేం మింగేయ్యను. ముప్పయ్ అయినా ఇయ్యి, రాజూ! జీతాలందగానే తిరిగి ఇచ్చేస్తాను." ప్రాదేయం గానే అడిగినట్టు అడిగింది.
"లేదని చెప్తే నీక్కాదూ? దొంగలా అందరి జేబులూ తనిఖీ చెయ్యటం వచ్చుగా? ఇక విసిగించకుండా దయచెయ్యి."
పార్వతి మరొక మాట అనకుండా కిందికి నడిచింది.
రాజుకు అనిర్వచానీయంగా హృదయం స్పందించింది. ఆమె తనను తిట్టినప్పుడు, తనందుకు ప్రతిఫలంగా కొట్టినప్పుడు తన తప్పు లేదనే తృప్తి కలిగేది. అలా జరగకపోగా తనదే దోషం అని మనసు ఎత్తి పొడుస్తుంటే బాధగా ఉంది.
అతని దగ్గర డబ్బు ఆశించిన వారు ఏ కొద్ది మందో ఉంటారు. ఎవరినీ ఇంతవరకు నిరాశపరచలేదు. అల్లాంటి వాడు కనకనే బాధపడ్డాడు. పార్వతి అంటే ఎంత ఇష్టం లేకపోయినా, ఇంచుమించు శత్రువైనా అప్పటి కతని ప్రవర్తన అతనికే అసహ్యమని పించింది.
పనేమీ లేక జరిగిన పరాభవాన్ని పునః స్మరించు కుంటూ నించుంది పార్వతి.
అ వాతావరణం విరక్తి కలిగిస్తున్నా , తన తత్వానికి ఆ పరిసరాలు సరిపడక పోయినా ఆమె చేయగలిగింది లేదు. అత్తయ్య దగ్గరికి వెళ్తే ఆవిడ ఇక్కడికే తోలుతుంది. సరస్వతి తో కలిసి తమ గ్రామం లోనే హాయిగా కొన్నాళ్ళు ఉందామంటే -- రాజు విషయమై ప్రోద్భలంతో పంపించేస్తుంది ఆ పిల్ల. ఇలా ఎటు వెళ్ళడానికీ దారి లేని , వీలు కాని అడవి అయింది తన జీవితం.
సున్నితంగా అత్తయ్య పోషణ లో , జాగ్రత్త లలో గారాబంగా పెరిగిన పార్వతి కి వదులుకోలేని ఇంటి బాధ్యతలు కాదనుకున్నా చుట్టుకొని చిరాకు కలిగిస్తున్నాయి. రాజుతో ఏమైనా అంటే ఆ మాటలే తిప్పి కొడతాడు.
దూరమౌతున్న ఆశా స్వప్నాలు కరిగిపోకుండా బలవంతంగా తలుచుకుంటూ, మధుర జీవితం ఇంకా అసంభవం అనిపిస్తున్నా దాన్నే ఊహించుకోప్రయత్నిస్తూ స్తంభాని కానుకుని శూన్యం లోకి చూస్తున్నది.
గంధపు రంగు జర్జేట్ చీరపై తీక్షణమైన సూర్య కిరణాలు పడి అంచులను మెరుగు పెడుతున్నాయి. ఆ ఎండ సుఖకరం గానే ఉంది ఆ అమ్మాయికి. నుదుటి మీద స్వేద బిందువులు జారాయి. కంటి కాటుక కొసలు తడికి కరిగాయి. లిప్ స్టిక్ రూపు లేకుండా చెదిరింది. జుత్తు సంగతి చెప్పనే అక్కర్లేదు. కాగా నిడుపాటి ఆ రెండు జడలు కాస్త బిగింపు గానే ఉన్నాయి.
హటాత్తుగా పార్వతి కళ్ళు వీధి చివర అందమైన గేటుతో ఆకర్షణ గా ఉన్న ఇంటిని చూశాయి. తెల్లని గోడలు -- రంగు రంగుల కర్టెన్ లు-- ముందర పూల చెట్లు-- వాటికి పువ్వులు. అరుగు మీద ఆరేళ్ళ అమ్మాయి ఆదుకుంటుంది.
పుల్లమ్మ గారి హెచ్చరిక చటుక్కున గుర్తు వచ్చింది. 'ఏమిటో ఆ రహస్యం?' అనుకుంది అస్పష్టంగా.
కాశీ మజిలీ కధల్లో రాజకుమారుడి తత్వం. ఏడవ గదిలోకి మాత్రం వెళ్ళద్దు అంటే అటు వైపే లాగుతుంది మనసు. 'పుల్లమ్మ గారి మాటల కేం లే! నిజానికి పుల్లమ్మ గారి మాటల బట్టి చూస్తె -------ఆవిడెవరో అరమరికల్లేని సరదా మనిషి అయ్యుండాలి. వెళ్తాను.' పార్వతి ఉన్నది ఉన్నట్లుగానే జోళ్ళు తొడుక్కుని బయల్దేరింది . ఎండ మండుతున్నా కౌతుకం ఎంత దూరమున్నా నడిపించటానికి సిద్దంగా ఉంది. గేటు తీసి అరుగేక్కింది పార్వతి, చప్పుడు చెయ్యకుండా. అంతవరకూ ఆడుకుంటున్న పాపాయి అక్కడ లేదు. పార్వతి గుమ్మం దగ్గర నిలిచి పోయింది, తనకు కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తూ.

ముందు గదిలో తివాసీ మీద ఒక స్త్రీ కూర్చుని అతి దీక్షగా ఏదో గ్రంధం చదువుతున్నది. నిశ్శబ్దం తాండవిస్తున్నది ఆ గదిలో. ఆమె వయసులో చిన్న దేమీ కాదు. ముప్పై అయిదు, నలభై పరిసరాలు చూసే ఉంటుంది.
ఆమె ఏకాగ్రత, పఠానాశక్తి చూస్తె పార్వతికి ఆశ్చర్యం వేసింది. ఇటువంటి స్త్రీ వాస్తవానికి పుల్లమ్మ గారి వంటి వారిని ఆకర్షించాలి. ఎందుచేత అలా జరగలేదో? ఈమెలో లోపాలేమిటి? దుష్ట గుణాలేమిటి?
అలికిడి అయిందేమో-- పార్వతిని చూచి ఆమె నిలబడింది.
"ఎవరి కోసమండి?' అన్నదామె పార్వతి ని పరిశీలిస్తూ.
పార్వతి కేం చెప్పాలో తోచలేదు. మూలను త్రికోణాకారపు బల్ల మీద అందంగా నవ్వే కృష్ణ విగ్రహాన్ని చూస్తూ నిలబడింది తనొక ప్రతిమలా. పైన గోడ మీద బోసి నవ్వుల బాపూజీ ఫోటో.
"ఇలా కూర్చోండి!" చిరునవ్వుతో ఆహ్వానించింది ఆమె నిరాడంబరంగా తివాచీ చూపిస్తూ.
కూర్చున్నది పార్వతి. అప్పటికీ ఏమని మాట్లాడాలో తెలియలేదు.
"అలిసిపోయినట్లు కనిపిస్తున్నారు. టీ తెస్తానుండండి!" అన్నదామె లేస్తూ.
"అబ్బే, వద్దండీ!" అంది పార్వతి ఆ ప్రయత్నంగా గబుక్కున.
"ఉహు -- అలా కాదు. " నవ్వుతూ లోపలి వెళ్ళింది ఆవిడ.
నాలుగు వైపులా కుతూహలంతో చూచింది పార్వతి. మంచి అమరికలోనే ఉంది ఇల్లు. మూడవ ద్వారంలో నుంచి చిన్న అమ్మాయి మెల్లగా బయటికి వచ్చి పార్వతిని చూచి నిలబడిపోయింది.
ఆ చిన్నపిల్ల తన వంక పరీక్షగా చూస్తుంటే పార్వతికే సిగ్గు వేసింది.
"ఇలా రా!" అని పిలిచింది.
"మీరెవరూ?' అన్నదా అమ్మాయి కళ్ళు పెద్దవి చేస్తూ.
"నేనే!" కొంటెగా నవ్వింది పార్వతి.
"అంటే?" అలవోకగా తల తిప్పింది అమ్మాయి.
"అంటే -- చెప్తాను . దగ్గర గాదా!" సంకోచిస్తూ దగ్గరికి వచ్చిన పాపను ఒళ్లో పెట్టుకొని బుగ్గలు నొక్కింది. పాపని అచ్చు సరస్వతి చూపులే. అమాయకమైన మొహంలో అప్పుడప్పుడు కొంటె తనం.
"నేనెవరో చెప్పనా? నేను మీ అక్కని.......మరి నీ పేరో?' అంది పార్వతి ముద్దు పెట్టుకుంటూ.
అప్పుడు సిగ్గొచ్చింది అమ్మాయికి. వేలు కొరుక్కుంటూ , "ణా పేరేమో -- రాధ---" అంది. అన్న వెంటనే ఏం తోచిందో ----పార్వతి ఒడిలో నుంచి లేచి కూర్చుని మొహం చూస్తూ, "మరేమో .......అక్కా.....ఎంచక్కా నీకు పాటలు వచ్చా?' అని అడిగింది ఆత్రుతగా.
"అబ్బే! నాకెక్కడ వచ్చు? నీకు వచ్చా? ఏదీ, ఒక పాట పాడమ్మా, రాధా!"
"పాడితే నవ్వకేం?"
"ఎందుకు నవ్వడం?"
"అమ్మ నవ్వుతుంది."
"అమ్మ నవ్వితే అక్క నవ్వుతుందేమిటి? భయం లేదు. పాడు."
పాప పార్వతి వైపు సిగ్గు చిరునవ్వుతో చూస్తూ పాట మొదలు పెట్టింది.
"కృష్ణయ్య చేతిలో వేణువును నేనే
రాధమ్మ సిగలోని పువ్వునూ నేనే......."
ఇంతలో వాళ్ళమ్మ టీ తీసుకువస్తూ , "ఏమంటుందండీ ఇది? రాజకీయాలు మాట్లాడుతోందా?' అన్నది నవ్వి.
పార్వతి కూడా నవ్వి టీ తీసుకుంది. పాటపాడి బుద్దిగా కూర్చున్న రాధను దగ్గరికి తీసుకుంటూ, "ఎవరు నేర్పారమ్మా ఈ పాట?" అంది పార్వతి.
"మాష్టారు" అంది పాప.
"దీని మాష్టారు మా యింట్లోనే అద్దె కుంటున్నారు. అయన ప్రాణాలు తోడేస్తుంది ఈవిడ గారు." ఆమె చెప్పింది.
"అలాగా! పెంకి పిల్లా!" పాప ముంగురులు సవరించి, "ఇక వెళ్తానండీ!" అని లేచింది పార్వతి.
"అప్పుడేనా?" అన్నదా ఇంటామే.
"ఈ వేళ పరిచయ మయ్యాముగా! వస్తూ పోతూ ఉండచ్చు. మా యిల్లు మీకు తెలుసా?"
"ఆ మేడ యిల్లే కదూ? మీ పేరు చెప్పారు కారు......" ఆవిడ నవ్వుతూ అంది.
నాలుక కొరుక్కుని, "పార్వతి ణా పేరు. మీ పేరు కూడా........." అన్నది పార్వతి.
"సుభద్ర లెండి" అన్నదామె.
"నేను మీకన్నా చిన్నదాన్ని. నన్ను పార్వతీ అని పిలవండి."
