నాకేం తెలీదు . ఉద్యోగ ప్రయత్నంలో నాకు సాయం చేస్తానంటే వచ్చి కూర్చున్నా. రాత్రికి మాట్లాడతానన్నారు."
ఆవిడ బాధపడుతూ "మాటలే కాదమ్మా. చేతలు కూడా చేస్తారు, వాళ్ళ మాటలు నమ్మి పాడయి పోకమ్మా , ఇద్దరూ పెళ్లాల్నీ వదిలేసి అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతున్నారు."
"అట్లాగా అంత ప్రమాదమే సంభవిస్తే ఈ రాత్రి మీ ఇంట్లో పడుకుంటాను, కాస్త చోటిస్తారా."
"తప్పకుండా ఆవిడ వెళ్ళిపోయింది.
సాయంత్రం ఆరు గంటలకు ఇద్దరూ వచ్చారు. స్నానాలు చేసి ఇద్దరూ తాపీగా కూర్చున్నారు.
"ఆ. ఇక చెప్పు. నువ్వు రాయబారిగా వచ్చావా రాధా?'
"కాదు, నిన్ను చూసి పోదామని వచ్చాను. నా ప్రశ్నలకు నీ అభిప్రాయాలు చెప్తావా బావా'
"ఓ యస్. ఆడపిల్ల అడిగితె చెప్పక పొతే బావుంటుందా, అందులోనూ మేనత్త కూతురివి."
"పెళ్ళెందుకు చేసుకున్నావు బావా"
"గృహస్తుడ్నీ కావాలి కనుక."
"పెళ్ళికి ప్రాధాన్యం అదొక్కటేనా"
"కాదు భార్యతో కాపురం చేసి బిడ్డల్ని కని వంశాన్ని నిలబెట్టుకోవాలి. నేనూ భార్యతో కాపురం చేశాను. నాకు ఇద్దరు కొడుకులు."
"నాలుగేళ్ళు కాపురం చేసి ఇద్దరు బిడ్డలు పుట్టగానే వంశం నిలబడిందని తృప్తి పడి ఇక ఆ భార్య పిల్లల్నీ వదిలెయ్యటం కూడా గృహస్తుడి లక్షణమా.'
"కొన్ని పరిస్థితుల్లో ధర్మాన్ని వదిలి పెట్టాలి. సౌఖ్యాల్ని చవి చూడాలి."
"అక్కయ్యా పిల్లల్ని ఎందుకు వదిలి పెట్టావు బావా."
"పరిస్థితుల ప్రభావం . ప్రాభల్యం."
"ఆ పరిస్థితులు అక్కయ్య కల్పించిందా లేక నువ్వు కల్పించిన పరిస్థితుల్ని అక్కయ్య హరించలేదా?"
"రెండూ జరిగాయి "క్షణం అలోచించి --
"ఆ ఉత్తరం నువ్వు రాస్తే సుభా సంతకం పెట్టింది కదూ" అన్నాడు మళ్ళీ.
"అవును బావా."
"భర్తకు ఉత్తరం రాయటం కూడా నామోషి గా ఎంచి ఎవరో రాసిన ఉత్తరం క్రింద సంతకం పెట్టె భార్య మనస్సులో ఆ భర్తకు ఏ మాత్రం విలువ ఉందొ ఆలోచించు బావా."
"ఈ సందర్భం లో అక్కయ్య దెం తప్పులేదు. నేనే ఉత్తరం రాసిస్తాన్నాను. సరే కాని బావా నన్ను నువ్వు బలాత్కారిస్తావనుకో. ఆనందరావు గారూ మీరు చూస్తూ ఊరుకుంటారా." బావ నుద్దేశించి అన్నది రాధ.
"లేదు . లెంపలు వాయించి చేవడాలు ఎక్కదీస్తాను."
"అదేమీటండీ నా మీద అంత సానుభూతి మీకెందుకు."
"ఇలాంటి పరిస్థితిలో మీరెవరు, నేనెవరో అనే ప్రశ్నే లేదు. నిజాయితీ పరురాలైన ఒక స్త్రీని ఒకడు బలత్కారిస్తున్నాడంటే ఎంతటి స్త్రీ లోలుడయినా ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. ఇందులో మంచీ, మానవత్వం ప్రధానం గాని మరొక ప్రశ్న ఉదయించటానికీ సావకాశం లేదు."
"ఆనందరావు గారూ , సునంద. అంటే మీ భార్య ప్రవర్తన మీద మీ ఉద్దేశ్యం."
"సునంద అమాయకురాలేకాని ఆమె మీద ఇప్పటికీ నాకే అనుమానమూ లేదు, అంతటి నీచమైన ఉద్దేశాలు సునంద కు లేవు.'
"అలాంటి అమాయకురాలయిన సునందను బావ బలాత్కరించబోయాడు. సునంద అరిచింది. సుభాషిణి బావ లెంపలు వాయించి బుద్ది చెప్పింది. ఇది భార్య భర్తను కొట్టడం కాదు. ఇందాక మీరన్నట్లుగా మంచీ, మానవత్వం కల అక్కయ్య, కాముకుడైన తన భర్తకు బుద్ది చెప్పింది. ఆరుమాసాలకు పైగా మీరిద్దరూ కలిసి ఉంటున్నారు. ఒకరి తత్త్వం మరొకరికి తెల్సు. ఇది తప్పంటారా ఆనందరావు గారూ." అన్నది రాధ.
వారికి ముచ్చెమటలు పోసి ముఖం వివర్ణ మైపోయింది. కోపం తాండవించింది.
"రాధా, నోర్ముయ్, గెటవుట్: యూ బ్లడీ స్కౌండ్రల్" అని రాధను కొట్టబోయారు.
నిశ్చేష్టుడైన ఆనందరావు వారి చెయ్యి పుచ్చుకుని:
"వెళ్ళవలసింది నువ్వు కాని, రాధ కాదు. నా భార్యను బలార్కరించబోయి చెంప దెబ్బలు తిని మళ్ళీ నా యింటి లోనే మకాం పెట్టెవన్న మాట. భేష్ చాలా బావుంది."
ఆనందరావు పళ్ళు కొరికాడు. తల వంచి వీధిలోకి వెళ్ళిపోయారు వారు.
ఆ రాత్రి పక్క వారింట్లో ఉండి ఉదయమే వచ్చేడ్డామనే ఉద్దేశంతోనే ఉన్నది రాధ.
"ఆనందరావు గారూ"
"ఊ" అయన మనస్సులో ఏవో ఆలోచనలు రోద చేస్తున్నాయి.
'సునంద ఫస్టు ఫారం చదువుతోంది."
"అట్లాగా."
"అవును , నేనూ, సుభాషిణీ ఆమెకు చదువు చెప్తున్నాం. సునంద మనస్తత్వం లో బాగా మార్పు వచ్చింది. ఎప్పుడూ మిమ్మల్ని గురించే ఆలోచన."
ఒక్కసారి దిగ్గున లేచి "ఈ కబుర్లన్నీ నాకు అనవసరం. ఇక నువ్వు వెళ్ళొచ్చు నమ్మా" అన్నాడు బావ.
'అట్లాగేనండీ."
పక్క వాళ్ళింటి కి వచ్చేసింది రాధ. ఆ రాత్రి వాళ్ళింట్లో ఉండి ఉదయానే బయల్దేరి వచ్చేసింది. ఆ రాత్రి వారు ఇంటికి రాలేదు.
ఈ విషయాలన్నీ ఎంతో సంతోషంతో రాధ చెప్తుంటే నా మనస్సు మరో వైపు ఆలోచనలకు మళ్ళింది.
"రాధా . ఈ రహస్యాన్ని నేను వెల్లడి చేసి వారిని అల్లరి పెడుతున్నాననే కోపంతో వారి మనస్సులో నీమీద మరింత కార్పణ్యం ఏర్పడుతుందేమో."
"లేదు నీమీద కోపమా . నిరాదరణా యధాప్రకారం గానే ఉంది. ఇప్పుడు ఆ తోడల్లుళ్ళ మధ్య కలతలు కలిగే వాతావరణమే ఏర్పడింది" అన్నది రాధ.
ఈ విధంగా మరో మూడు నెల్లు గడిచాయి. వారు అక్కడ ఉంటం లేదు. మరో చోట గది తీసుకుని ఉంటున్నారు.
రోజులు దొర్లి పోతున్నాయ్యి. ఒక రోజున పిడుగు లాంటి వార్త వచ్చింది. లంచం పుచ్చుకున్నారనే నేరం కింద వార్ని సస్పెండ్ చేశారు. కోర్టులో నేరవిచారణ కు ముందు సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు.
రెండు రోజులు నేను భోజనం చెయ్యలేదు. పిల్లలిద్దర్నీ చెరొక పక్కనా పడుకో బెట్టుకుని రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ పడుకునేదాన్ని. వారంరోజులు ఆఫీసుకు వెళ్ళ;లేదు. రామారావు , నా పరిస్థితి తెల్సిన మరి నలుగురయిడుగురు ఆఫీసులో వాళ్ళూ వచ్చి నన్ను ఊరడించి వెళ్ళారు.
ఈ పరిస్థితి లో నైనా వారు వస్తారనే వెయ్యి కళ్ళతో ఎదురు చూశాను. వారు రాలేదు. ఉత్తరమూ రాయలేదు.
నేను కాకినాడ వెళ్ళి వస్తానని రాధతో అన్నాను.
"భార్యాభర్తల్ని దూరం చెయ్యాలని నా అభిమతం కాదు సుభాషిణి. ఈ పరిస్థితిలో నువ్వు వెళ్ళటం మంచిది కాదు. బావకు పతనా వస్థ ప్రారంభమైంది. నీ మంచితనాన్ని గుర్తించే సమయం చేరువలోనే ఉన్నది. ఇప్పుడు నువ్వు వెళితే నిన్ను బావ గౌరవించడు. అతని దృష్టిలో నువ్వు నష్టజాతకురాలివి గానే చిత్రించబడతావు కాని కష్ట సుఖాల్లో భాగం పంచుకునే భార్యగా కనబడవు. బావ ఇక్కడికి వస్తాడో రాడో వేచి చూడ్డమే మంచిది" అన్నది రాధ.
ఆలోచిస్తే నాకూ అదే మంచిదని పించింది.
ఈ పరిస్థితిలో నేను సగం చచ్చి ఆఫీసుకు వెళ్ళి వస్తున్నాను. ఎవరన్నా ఈ ప్రస్తావన తెస్తారేమోనని ఆందోళన. చిన్నతనంగా, అవమానకరంగా ఉండే సంఘటనలు జీవితంలో జరిగినప్పుడు ఆ వివరాలన్నీ తెల్సినా మళ్ళీ ఆ విషయాలనే అసలు వాళ్ళని కూడా అడిగి వివరాలన్నీ రాబట్టుకుని వారి ఉచిత సలహాలను కూడా రంగరించి నూరి పోస్తారు. ఈ అనుభవాలన్నీ ఒకదాని వెంట ఒకటి నా జీవితంలో సందర్భపడుతూ ఉంటె గుండె రాయి చేసుకుని ఆ పిల్లల్ని చూసుకుంటూ రోజులు గడుపుతున్నాను.
మరొక మూడు మాసాలు గడిచినా వారు రాలేదు. ఉత్తరం రాయలేదు. కోర్టులో కేసు జరుగుతున్నది.
ఇదిట్లా ఉండగా అక్కయ్య , బావల విడాకుల పిటిషన్ కోర్టులో కొట్టి వేశారు. అక్కయ్య మనోవర్తి దావా పిటిషన్ కూడా కొట్టి వేశారు.
ఆరోజున అందరం ఎంతో సంతోషించాం. ప్లీడరు గారి నడిగితే అక్కయ్య ను బావ దగ్గరకు పంపే ప్రయత్నాలు చెయ్యమన్నారు. ఈ పరిస్థితిలో కాకినాడ వెళ్ళి బావతో సంప్రదించటానికి కూడా మనస్కరించలేదు.
ఒకసారి డబ్బివ్వటానికి అన్నయ్య వస్తే అన్నయ్యతో ఈ ప్రస్తావన తెచ్చాను.
"నా పరిస్థితి ముందే చెప్పాను సుభా. నేను కలుగ జేసుకుంటే కూడె కాపురాలు కూడా చెడి పోతయ్యి. మర్యాదస్తులెవరూ నా సాయం కోరరు. ఆ వ్యవహారాలేవో నువ్వే చూడు. బావతో సంఘర్షణ కు సిద్దపడాలంటే అప్పుడా సందర్భాన్ని నేను వినియోగించుకుంటాను" అని వెళ్ళిపోయాడు.
రాధ అక్కయ్య చేత బావకు ఒక ఉత్తరం రాయించింది. వారం రోజులు పోయాక బావ ఆ ఉత్తరానికి సమాధానం రాశాడు. దాని సారాంశం -- కోర్టు వారికి చెవులే కాని కళ్ళు లేవన్నది పాత సామెత. ఇప్పుడు మనస్సు కూడా లేనట్లు రుజువైంది -- అని.
ఆ ఉత్తరాన్ని ఎంతో పదిలంగా తన పెట్టెలో దాచుకుంది అక్కయ్య. పెళ్ళయాక భర్త రాసిన ఉత్తరం అదొక్కటే.
