"అది నిజమేనెమోలెండి. ఇంటావిడ ఊర్కే అడుగుతుందండి."
"యేమని?"
"మీకు నాకు యెలాంటి చుట్టరికమని?"
"చెప్పలేక పోయావు?"
"యేమని చెప్పాలో తెలియజేయండి"
"ఇంత తెలివైన దాననని గర్వపదతావు ఆ మాత్రం చెప్పలేవూ?"
"చెప్పాను లెండి. ఇతడో మొద్దబ్బాయి అతని రక్షణ కోసము నన్ను పెద్దలు నియమించారని."
"పాపం వారు నమ్మారు కదూ?"
"ఏమో...." అతని భుజము మీద తల వాల్చింది. "ఆనంద్ నాకెవ్వరూ లేరు నువ్వు తప్ప. కొన్నిసార్లు ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చి నన్ను బాధిస్తుంటాయి. నన్ను అన్యాయము చెయ్యవు కదూ?"
"ఉన్నట్టుండి ఆ సందేహము యెందుకు వచ్చింది" ఆమెను తన వైపు తిప్పుకొని అడిగాడు.
"మీరు ఉన్నవారు. మీకోసము ప్రేమ తప్ప నా దగ్గరేముంది? నా సర్వస్వమూ మీ కర్పించాను."
"నాకోసము ప్రేముందన్నమాట , అదుంటే చాలులే."
"మీ అమ్మావాళ్ళు అంగీకరించకాపోతే?"
"ఇప్పటి నుండి ఆ ఆలోచన లెందుకు? అప్పటికి చూడ్డాములే."
"మీ పరీక్షలు దగ్గరి కోస్తున్నాయంటే నా కేదో భయంగా ఉంది."
"నాకు లేకపోయినా నీకుంది. సంతోషించ తగ్గ విషయమే" నవ్వేశాడు. కాస్త సమయం దొరికినా తమ భవిష్యత్తును తీయగా ఊహించుకుంటూ- కాలము గడిపేశారు. తల్లిదండ్రులు స్టేషను నుండే వెళ్లిపోవడముతో తేలికగా నిట్టూర్చాడు ఆనంద్. అతని చదువు ఈ యేడు బాగా జరిగిందని తృప్తి చెందాడు.
ఆరోజు ఆఖరు పరీక్ష రాసి వచ్చాడు. అతనికి కొండంత బరువు దిగినట్టు వుంది. త్వరగా ఇంటికి వచ్చాడు.
"రేఖా! నేను రెండు రోజులు హాయిగా నిదుర పోవాలి లేపవద్దు." వస్తూనే మంచం పై వ్రాలి పోయాడు.
"నిద్రమాత్ర తీసుకుంటారేమిటి?"
"యెందుకూ?"
"ఏకదాటిగా రెండు రోజులు నిదురేలా వస్తుందండీ?"
"చూడు" అని పడుకున్నాడే గానీ గంట కాక ముందే మేల్కొన్నాడు. ఉక్కగా వుందని విసురుతూ కూర్చుంది రేఖ.
"అప్పటి నుండి విసురుతూనే వున్నావా?"
"మరి నాకేం పని వుంది?"
"ఒక్క సిగరెట్టు."
'ఛ ఇప్పుడెందుకు? లేవండి బీచ్ కెళ్దాము." అతను లేచి తయారయ్యాడు. అతను బహూకరించిన సిల్కు చీర కట్టుకుంది. ఇరువురూ బీచ్ కెళ్ళారు. జనసంచారము లేని చోట కూర్చున్నారు.
"అలలను చూస్తుంటే ఎమనిపిస్తుందండీ?'
"నాకేం అనిపించడం లా?"
"నాకయితే యెన్నో భావాలు వాటికి పోటీ పడి అణగారి పోతున్నాయి." అతనామే వడిలో తలపెట్టి పడుకున్నాడు.
"ఇదేం పిచ్చి వేషము?"
"నయము నేను రెండు రోజులు పడుకోవాలను కుంటే లేపావు."
"నేను లేపానా? బావుంది. నిందారోపణ ' అతని జుట్టులోనికి వేళ్ళు పోనిచ్చింది.
"ఒక పాట పాడు రేఖా."
"నువ్వు వెళ్ళి పోతావంటే నా గొంతులో ఏదో అడ్డుకున్నట్టు అవుతుంది. పాటలా వస్తుంది?'
"యెన్ని రోజులు వెళ్తానేమిటి?"
"నాకెలా తెలుస్తుంది? నేను వస్తానండి. శాస్త్రి గారింట్లో ఉంటాను."
వాళ్ళ నాన్నకు కర్నూలుకు ట్రాన్స్ ఫర్ అయింది. నీకేం చింతవద్దు. నేను వచ్చేవరకు అదే యింట్లో ఉండు. ఇంటి వారికీ నేను అన్ని విషయాలు చెప్తాను. వీలును బట్టి నేను వచ్చేస్తాను." ఆమె తల వంచి పెదవులందుకున్నాడు. మృదువుగా అతని నుండి విదిపించుకుంది.
* * * *
'అలాగే తొందరగా వచ్చేయండి.
"ఒక పాట పాడవా రేఖా?"
"ఉహూ...."
'అలాగైతే నాతొ మాట్లాడవద్దు." అతను కళ్ళు మూసుకున్నాడు. వంగి అతని కళ్ళు సున్నితంగా చుంబించింది.
'నన్ను అంటారు. కోపానికేం తక్కువ లేదు" నెమ్మదిగా పాడింది ప్రపంచముతో సంబంధము లేదన్నట్టు తామే ప్రపంచమంతా నిండినట్టు అనుభూతి పొందారు. ఆనందమంటే ఏమిటో తెలుసుకున్నామన్నట్టు గర్వంగా తిరిగారు యువతీ యువకులు. తను ఏకైక పితరుడు తన కోర్కె కాదనరని ఆనంద్ ధీమా. ఆనంద్ పై పరిపూర్ణమైన విశ్వాసము రేఖకు.
అతని సామానులన్నీ టాక్సీ లో పెట్టింది . అతను కూడా తన భావాలను బలవంతంగా అమలులోకి తెచ్చుకున్నట్టు అతని వాలకమే చెబుతుంది. సిగరెట్టూ వెలిగించి పర్సు తీసి ఆమె ముందు పెట్టాడు.
"టాక్సీలకు వాటికి కొంత చిల్లర వుంచి మిగతావి తీసుకో."
"మీరే ఇవ్వండి." అతను ఇచ్చింది జాగ్రత్త చేసింది.
"స్టేషన్ నుండి ఇంటికి వక్కర్తిని రాలేవు ఉండిపో."
"మరేం ఫరవాలేదు....మీకు ఎన్నో విషయాలు చెప్పాలను కున్నాను. చెప్పలేక పోతున్నాను. తరువాత చెప్తాను. త్వరగా వస్తారు కదూ?' నవ్వుతూ ఆమె కన్నీరు వత్తి వస్తానని ప్రమాణము చేశాడు. అతను ఎంత ఓదార్చిన సెంట్రల్ స్టేషన్ లో నిలబడి కన్నీటితో వీడ్కోలిచ్చిన ప్రియురాలు కనిపించేవరకు చూచాడు.
"వాడొక్క రోజు విశ్రాంతి తీసుకోకూడదా. ఏం?"
"విశ్రాంతి తీసుకోక నీ కొడుకు అక్కడ చేసే పనులేమున్నాయే. రావడమేగా" ....తల్లితండ్రుల మాటలు విని బద్దకంగా లేచాడు.
"ఆనంద్ మన మోచోటికి వెళ్ళాలి. త్వరగా తయారవ్వు.' తండ్రి మాటలకు వివరణ అడిగే ధైర్యము రాలేదు. లేచి తయారయ్యాడు. తల్లి చిరునవ్వుతో అందించిన కాఫీ త్రాగుతుండగా, చిలిపి నవ్వుతో లీలగా రేఖ ముఖము ప్రత్యక్ష మయి మాయమయింది.
"ఏమిట్రా నీలో నువ్వే నవ్వుకుంటావు?'
"ఏం లేదమ్మా. నిన్నటికి ఈరోజు కెంత తేడా అని ఆలోచిస్తున్నాను."
"పిచ్చి తండ్రి." అని వెళ్ళిపోయింది. తండ్రి కుమారులు కలిసి ప్లీడరు గారింటికి వెళ్ళారు. వెంకట రత్నము యెదురు వచ్చాడు.
"ఎప్పుడు వచ్చావయ్యా? మీ నాన్న ఈ రోజు నిశ్చింతగా ఊపిరి పీల్చినట్టున్నారు. నా కుమారుడిని వంటరిగా వదిలాను . ఏ అరవ చిన్నదో ఎగరేసుకుపోగలదని ఒకటే విచారించారు."
"చాలు లేవయ్యా దండకము. 'స్నేహితుని జబ్బ చరిచాడు. అందరూ కూర్చున్నారు.
"పాసయ్యే నమ్మకముందా?"
"అదేం మాటండి? సంవత్సరమంతా కష్టపడి చదివిందేందుకు?' అభిమానంగా చూచాడు ఆనంద్.
"అంత నమ్మకము ఉంటె చాలు. ఇక్కడ నీకోసము ఓ పోస్టు ఖాళీగా ఉంది. జూలై లో రిక్రూట్ చేస్తారు. పాసవుతాననే నమ్మక ముంటే నీ పేరు చేరుస్తాము. పాసయితే ఉద్యోగమూ వచ్చిందే అనుకో." అన్నారు.
"చాలా బాగా వ్రాశానండి.
"అలా గుండాలి నాలుగు సంవత్సరాలలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ అవుతావోయ్." అరగంట అలాగే మాటలు సాగేయి.
"వెళ్దామా" వేంకటరత్నము లేచాడు.
"పదండి." అతని కార్లో ముగ్గురూ కలిసి మరో పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళారు. అతనింటి నిండా జనమున్నారు.
"రండి, రండి. మావాడు ఈరోజు చూచి వెళ్లి పోతానంటున్నాడు." అతని మాటలు ఆనంద్ కర్ధం కాలేదు, పెద్దవారు మాత్రమూ నవ్వారు.
"ఆఖరు సంవత్సరము. వాడి స్నేహితుల బలవంతము పై మద్రాసు లో ఉండి పోయాడు. రాత్రి వచ్చాడు. ఇప్పుడు బయలుదేరాదీశాను." అంటుండగానే మరో ఇద్దరు వయసు మళ్ళిన పురుషులు , ఓ స్త్రీ వచ్చారు. అందోరో కూర్చుని ఉండగానే ఓ అందమైన అమ్మాయి అందరికి ఆరంజి క్రష్ తెచ్చి యిచ్చింది.
"వీరు కాంతారావని ప్లీడరు. వారి అమ్మాయి అరుణ. బి.ఎ మొదటి సంవత్సరము చదువు తోంది." వేంకటరత్నము పరిచయము చేశాడు. ఆనంద్ కెందుకో ఆ పరిచయము అసందర్భముగా తోచింది.
ఆ అమ్మాయి అందరికి నమస్కరించింది. ప్రతి నమస్కారము చేయటము తన విధిగా భావించి చేతులు జోడించాడు. ఆ అమ్మాయి ఓరగా తననే గమనించట,ము చూచి కాలరు సవరించుకున్నాడు. ఆ అమ్మాయి తల్లి కాబోలు అవే పోలికలతో ఉన్న వయసు మళ్ళినామె , ఆనంద్ శల్య పరీక్ష చేస్తుంది. అక్కడ వుండాలని పించడం లేదు, తండ్రి అప్పుడే లేచే సూచనలెం కనిపించడం లేదు. వారు రాజకీయాలు మొదలుకొని సినిమాల వరకు ఒక్క విషయాన్ని వదలి పెట్టక చర్చిస్తున్నారు.
'అమ్మగారు రాలేదేం నాయనా?' స్త్రీ ప్రశ్నకు తికమక పడ్డాడు.
"పని ఉందండీ." అనేశాడు. పన్నెండు గంటలకు తిరిగి వచ్చారు. తను క్షేమంగా చేరినట్టు రేఖ కో వుత్తరం వ్రాసి, హాయిగా నిదుర బోయాడు. నిదుర లేచి హాల్లోకి వచ్చేసరికి తల్లి దండ్రులు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.
"కావాలంటే అడుగు." రంగారావు గారు భార్య వంక చూచాడు.
"ఏమిటమ్మా?'
"ఇందాక వెంకటరత్నము గారి స్నేహితుల యింట్లో చూచిన అమ్మాయిని గూర్చి మీ నాన్న తెగ పొగడుతున్నారురా, అందమైందే గాని అంత అందమైందేం కాదు."
"బావుందమ్మా!" నవ్వాడు -- "అందానికి నిద్వచనమేముంది. మనసును, మనిషిని బట్టి ఉంటుంది గాని" అన్నాడు.
"పోనీ నీకు అందంగా కనిపించలేదా చెప్పు" తండ్రి అడిగాడు.
