'ఎందుకండీ అలా గంటారు?' అని నీరసంగా అడిగేడు కాంతారావు.
'మీరు ఎంత పిచ్చివాళ్ళు కాకపోతే వాడి మాటలు నూటికి నూరు పాళ్ళు నిజమని నమ్మేరండి! వాడంత పని కోసం పడి చస్తున్నవాడైతే ఈ కాళహస్తి మొత్తం మీద పని కావలసిన కుటుంబాలే లేవంటారా? అంత దూరం హైదరాబాద్ రావలసిన ఖర్మ వాడికేం పట్టింది? ఒకవేళ ఉన్నా సరాసరి హైదరాబాద్ పోతాడు కాని, యాత్రలో తిరుగుతున్న మనుషులను పట్టుకుని పనిప్పించమని అడుగుతాడా? ఐనా ఇవ్వాళ వీడి అదృష్టం పండింది. పది రూపాయలు పది నిమిషాల్లో ఏ మాత్రం చెమటోడ్చకుండా సంపాదించేడు.' అన్నాడాయన.
'అయ్యో , ఆ పిల్లాడు తనకి అమ్మా నాన్నా ఎవ్వరూ లేరని కూడా అనేసరికి నాకు జాలేసిందండి" అంది కళ్యాణి.
'కూటి కోసం, కోటి విద్యలన్నారమ్మా అందుకే! డబ్బు మనిషి చేత ఎలాటి గడ్డి నయినా తినిపిస్తుంది. డబ్బు అవసరం వస్తే యిలాటి జిత్తుల మారి వెధవలు బ్రతికున్న వాళ్ళని చంపెయ్య గలరు. చచ్చిన వాళ్ళను బ్రతికించగలరు కూడా, పాపం. మీరింకా చిన్నవాళ్ళు. అనుభవం తక్కువ. అనుభవం ఉన్నవాణ్ణి నేను చెప్తున్నాను వినండి. జీవితంలో ఎప్పుడైనా సరే యిలా పేదవాణ్ణి, ఆ వాణ్ణి ఈ వాణ్ణి అనే వాళ్ళను చస్తే నమ్మకండి. వాళ్ళు మీ కంటే, నాకంటే సుష్టుగా మూడు పూటలా కడుపు నిండా తింటారు. పైగా యిలా మీలాటి అమాయకులను బోల్తా కొట్టించి డబ్బు గుంజుకుని సిగరెట్ల కు, సినిమాలకు ఖర్చు పెట్టుకుంటారు. ఈ భారతదేశంలో పేదరికం అన్నది పేరు మీదనే నండీ ఉంది. తిండి లేక చచ్చేవాళ్ళూ ఎవ్వరూ లేరు మన దేశంలో.
అందునా కాళ్ళూ చేతులూ రెండు ఉండి కష్టపడి సంపాదించగల కండ బలం గల మనిషెన్నడూ అర్ధాకలితో ఉండవలసిన అవసరం లేదు. కార్మిక శక్తికి, కర్షక శక్తికీ యీనాడు అన్ని విధాల జయం లభిస్తోంది. ఇకపోతే మనదేశంలో ఏవడైనా అర్ధాకలితో ఉన్నాడూ అంటే వాడు మధ్యతరగతి సంసారేనని నా గట్టి నమ్మకం. ఇటు కష్టపడి సంపాదించిన డిగ్రీలిచ్చే జీతాలు చాలక, అటు కండ బలం లేక చాలీ చాలనీ తిండితో ,తీరి తీరని అవసరలాతో అన్ని విధాల నలిగిపోతున్నది మధ్యతరగతి కుటుంబీకుడేనండీ! ఈ లేబర్ క్లాస్ వాళ్ళు, డిగ్రీ లున్న, జీతాల మీద బ్రతికే మధ్యతరగతి కుటుంబీకుల కన్నా వెయ్యి రెట్లు బలంగా, ఆనందంగా ఉన్నారు. వీళ్ళకు జీవనోపాధిని ఎలా సంపాదించుకోవాలో మనకన్న బాగా తెలుసు. అవసరమయితే వంచనతోనో, దొంగతనం చేసో లేదా ఖూనీ చేసైనా వీళ్ళు కడుపులు నింపుకుంటారు కాని; వీళ్ళు మాత్రం చస్తే పస్తులు పడుండరండీ! చస్తే పస్తులుండరు.' అన్నాడు ఉద్రేకంగా అయన.
అయన మాటలో ఎంత నిజముందో ఆలోచించే తీరిక, వోపిల లేవు ఆ దంపతులకు.
గుడిలోని గైడ్ దగ్గర మోసపోయేనెమో నని అనుమాన పడ్డాడు. ఇప్పుడు తను ఖచ్చితంగా మోసపోయేడు. ఎంత అవమానం! తన తెలివితేటలు, లోకజ్ఞానం అన్నీ ఏమైనాయ్? అదీ కాంతారావు బాధ!
'ఐతే ఆ కుర్రవాడు మనింటికి రాడన్న మాట. ఇంటికి వెళ్ళేక యింక రోజల్ల్లా వంటింట్లో కూరలతో , పచ్చళ్ళ తోనూ, ఆ తరువాత పిల్లలతోనూ రోజల్లా కుస్తీ పడుతుందాలిసిందే తను. తన కలలు కనే తీరిక వాటిని కాగితం మీద పెట్టె వోపిక యింకా ఎలా వస్తాయి? ఈ జన్మ కింక యింతే! రచయిత్రి అయ్యే భాగ్యం తనకు లేదు. ఖర్మ!' అంటూ తన కలలన్నీ చెదిరి పోగా, వాస్తవిక జీవితంలోకి వచ్చిన కళ్యాణి వాపోవసాగింది.
వాళ్ళిద్దరూ ఆ షాక్ నుండి తేరుకునే సరికి కంచి బస్సు వచ్చి స్టాండు లో రెడీగా నిల్చుంది. అంతా ఆదరా, బాదరా బస్సు ఎక్కేరు. ఆ ఎక్కిన వాళ్ళందరూ ముందుగా టికెట్లు కొనుక్కున్న వారే! తమ కోసం బస్సులో సీటు రెడీగా ఉంటుందని తెలిసి కూడా మూడవ తరగతి రైలు పెట్టెలోకి, రిజర్వు చెయ్యని సీట్ల కోసం ఎగబడే ప్రయానికుల్లా అందరూ, ఒకరినొకరు తోసుకుంటూ ఒకరి మీద ఒకరు పెట్టెలతోనూ, సంచులతో ను నొక్కుకుంటూ వెళ్ళి బస్సులో కూర్చున్నారు. 'ఫస్టు క్లాస్ లో ప్రయాణం చేసేప్పుడు కూడా భారతీయుల మనస్తత్వం ధర్డ్ క్లాస్ ప్రయాణికుడి ధోరణి లోనే ఉంటుంది.' అనుకున్నాడు భార్య పిల్లలతో సీటు వెతుక్కుని సుఖంగా కూర్చున్న తరువాత కాంతారావు. అతని షర్ట్ అంతా ఆ జన సందోహం మధ్యపడి నలిగి పోయింది. వంటి నిండా చెమట కారుతోంది.
జనం అంతా ఎక్కి బస్సులో కూర్చున్న తరువాత వాళ్ళ టిక్కెట్లన్నీ చెక్ చేసి అప్పుడు కండక్టర్ డ్రైవర్ తో సహా వెళ్ళి హోటలు లో ఫలహారం, కాఫీ సేవించి బీడీ కాల్చుకుంటూ వచ్చేడు.
మొత్తానికి బస్సు బయలుదేరేసరికి యిరవై నిమిషాలకు పైగానే అయింది. అప్పటివరకూ పిల్లలను ఆపటం కష్టమైపోయింది కళ్యాణి, కాంతారావు లకు. వాళ్ళు అడిగిన అడ్డమైన చెత్తా కొనిచ్చినా, వాళ్ళు మాత్రం అల్లరి మానలేదు సరికదా, ఇంకా గారాలు చెయ్యసాగారు. కళ్యాణి లోలోపలే పళ్ళు నూరుకుంది. వాళ్ళ నేమీ చెయ్యలేక. కాంతారావు నీరసంగా తల చేతులో పట్టుకుని 'మీ ఖర్మ! మీ యిష్టం వచ్చినట్టు అల్లరి చేసుకోండి.' అన్న ఫోజులో కూర్చున్నాడు.
ఎలాగైతే నేం బస్సు కదిలింది. కాసేపటికీ పిల్లల అల్లరి కూడా సద్దు మణిగింది. చల్లగాలికి ప్రయాణీకులందరూ నిద్రమత్తు ఆవహించింది. ప్రతి ఒక్కరూ ఏ ఒకటి, రెండు గంటలో కాస్త కునుకు తీసేరు. నాలుగు గంటలకు ఏదో ఒక ఊళ్ళో బస్సు ఆగితే చాలామంది హోటల్లో కి వెళ్ళి ఫలహారాలు చేసేరు ప్రయాణీకులు.
కంచికి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది. బస్సులోనే కంచి కి వెళ్తున్న ఒక తోటి ప్రయాణికుణ్ణి అక్కడ మంచి హోతలేదో కనుక్కుని పేరు గుర్తు పెట్టుకున్నాడు కాంతారావు.
9
కంచి లో బస్సు దిగగానే కూలీ లందరూ ప్రయాణీకులను చుట్టూ ముట్టేరు అందులో అంతా అరవమే మాట్లాడు తున్నారు. ఏ ఒకరిద్దరో తెలుగు వాళ్ళలా కనిపిస్తున్న యాత్రికుల దగ్గరకు వెళ్ళి స్వచ్చమైన తెలుగులో మాట్లాడుతుంటే కళ్యాణి వాళ్ళ వంక ఆశ్చర్యంగా నోరు తెరచుకుని చూస్తూ నిల్చుంది. ఆమె యింకా ఆ ఆశ్చర్యం నుండి తేరుకోక ముందే వో యిరవై సంవత్సరాల యువకుడు కాంతారావు దగ్గరకు వచ్చి "రండయ్య గారూ! రండి. రిక్షా ఎక్కుతారా? ఏ హోటలు కి తీసుకుపోవాలి?' అనడిగాడు స్వచ్చమైన తెలుగు ఉచ్చారణ తో. 'మనం యాత్రికుల మన్న విషయం మన మోహాల మీద వ్రాసి నట్లే మాట్లాడుతున్నాడు వీడు. పైగా మనం తెలుగు వాళ్ళ మని కూడా వీడు యిట్టే గ్రహించేడు. వృత్తి రీత్యా కలిగిన జీవితానుభవం వీళ్ళకు మనుషులను చదివే శక్తిని సునాయాసంగా యిస్తుంది కాబోలు. సైకాలజీ లో డాక్టరేట్ సంపాదించిన వ్యక్తుల విజ్ఞానం ఎందుకు పనికి వస్తుంది వీళ్ళ ముందు?' అనుకున్నాడు కాంతారావు.
రిక్షా ఎక్కి కూర్చుని హోటలు పేరు చెప్పేడు కాంతారావు.
రిక్షా కదలగానే రిక్షా తొక్కుతున్న అతను హుషారుగా రకరకాల కబుర్లు చెప్పసాగేడు.
బస్సు ప్రయాణంలో అలసిపోయి ఉండటం వల్ల కాంతారావు, కళ్యాణి కూడా ఆసక్తి గా విన్నారు అతని మాటలు. కంచి లో చూడవలసిన ప్రదేశాలను, ఆయా దేవాలయాల్లోని ప్రత్యేకతలను ఎంతో చమత్కారంగా వర్ణించి చెప్పేడతను.
మధ్యలో ఉన్నట్టుండి 'అన్నట్టు మీరు చెప్పిన హోటలు పేరేమిటండీ?' అనడిగేడు .
కాంతారావు చెప్పేడు కొంచెం ఆశ్చర్యపోయి.
'ఎందుకండీ ఆ హోటలు? చాలా ఖరీదైనది. మీరు పిల్లలు గలవాళ్ళు. 'లక్ష్మీ హోటలు' అని ఉందండి. అది 'మన' తెలుగు వాళ్ళదే! చక్కని తెలుగు భోజనం సరసమైన ధరకు దొరుకుతుంది. మెత్తని పరుపుల మీద మూడు రూపాయలకే హాయిగా పడుకోవచ్చు.' అన్నాడు.
దాంతో కాంతారావు మనసులో ఉన్న కాస్త అనుమానం దృవపడి పోయింది. ప్రతి రిక్షా వాడికి ఏదో ఒక హోటలు యజమానితో లాలోచీలుంటాయని, కనుక కమిషన్ కోసం ఆ రిక్షా వాళ్ళు యాత్రికులకు మాటలలో మంత్రం వేసి ఆ హోటలు కే తీసుకు పోతారని , కనుక రిక్షా వాళ్ళ మాటలు నమ్మి ఏ చెత్త హోటలు కో పోవద్దని, తానూ చెప్పిన హోటలు చాలా మంచిదని, కాస్త ఖరీదెక్కువయినా వేడినీళ్ళ తో సహా అన్నీ సౌకర్యాలూ లభిస్తాయనీ బస్సులో కంచి ప్రయాణికుడు చెప్పిన వాక్యాలు గుర్తుకు వచ్చి కాంతారావు 'ఈ సన్నాసి నాకే టోకరా వేద్దామనుకున్నాడు. నేను మోసపోతా ననుకున్నాడు కాబోలు, పాపం! ' అని స్వగతం లో అనుకుని పైకి మాత్రం కొంచెం కరుకుగా 'నేను చెప్పిన హోటలు కే తీసుకుపోవోయ్!' సుబ్బలక్ష్మీ హోటలూ వద్దు, డబ్బలక్ష్మీ హోటలు వద్దు మాకు' అన్నాడు.
దాంతో రిక్షావాడు టాపిక్ మార్చేసి మరో విషయాన్ని గురించి ఏం జరగనట్టే ఎంతో సహజంగా మాట్లాడ సాగెడు.
'ఊ కొడుతూ అతని మాటలు వింటున్న కాంతారావు కి మళ్ళీ రెండు అనుమానాలు కలిగినాయ్. ఒకటేమంటే బస్సు స్టాండుకు హోటలు దగ్గరే ఉందని తెలియటం వల్ల , హడావుడి లో రిక్షా కి డబ్బు లెంత యివ్వాలో మాట్లాడనే లేదు. మహా అయితే అర్ధ రూపాయి కన్న ఎక్కువ అడుగుతాడా , ఏమన్నానా అని సరిపెట్టు కున్నాడు. రెండో విషయం -- బస్సులో కలసి నతను హోటలు కి ఐదు నిమిషాల్లో పోవచ్చు రిక్షాలో నైతేనని చెప్పేడు, ఇప్పటికి రిక్షాలో కూర్చుని పది నిముషాలు దాటుతోంది. అంటే తిప్పవలసిన సండులన్నీ తిప్పి ఎక్కువదూరం తొక్కి నందుకు ఎక్కువ డబ్బు వసూలు చెయ్యాలని కాబోలు వీడి ప్లాను! అనుకున్నాడు. మళ్ళీ వెంటనే 'రూపాయి తీసుకున్నా పోయిందేమీ లేదు కాని అసలే మనకీ ఊరు కొత్త. వాడీ సందులు గొందులన్నీ త్రిప్పి ఏ చీకటి సండులోకో తీసుకుపోయి రవుడీ ఫ్రెండ్స్ చేత తమని చిత్తుగా తన్నించి, కల్యాణి నగలను, తమ బాగ్ లోని డబ్బు అన్నీ తీసుకుని మాయమై పొతే తమ గతేం కాను?' అన్న ఆలోచన వచ్చి, భయంతో ముచ్చెమటలు పోసి నరాలు బిగుసుకు పోకముందే రిక్షా వచ్చి హోటలు ముందు ఆగింది.
'హమ్మయ్య!' అంటూ గాలిపీల్చుకున్నాడు కాంతారావు.
హోటలు యజమాని దగ్గర ఎడ్వాన్సు చెల్లించి రూము మాట్లాడుకున్నాక రిక్షా వాడు సామానంతా తెచ్చి రూములో పెట్టేడు. కాంతారావు తమ కుటుంబాన్ని సురక్షితంగా హోటలుకు చేర్చెడన్న సంతోషంతో రూపాయిన్నర యిద్దామని బాగ్ తెరుస్తుండగానే రిక్షా అతను రెండు చేతుల తోనూ దణ్ణం పెట్టి 'ఉంచండి బాబూ! ఉంచండి. రేపు ఉదయం ఎటు పడీ మిమ్మల్ని గుళ్ళో కి తీసుకు పోవటానికి రిక్షా కావాలి కదా. నేనే వస్తాను. మీకు ఊరంతా చూపిస్తాను. ఆ తరువాత మీ దయ ఉన్నంత యివ్వండి , రేపు ఏడు గంటల కల్లా రెడీగా ఉండండి బాబూ!" అని వెళ్ళిపోయేడు.
కాంతారావు బిత్తరపోయి నిల్చున్నాడు. 'టు బిలీవ్ ఆర్ నాట్ టు బిలీవ్?' అన్న డైలాగు లో పడిపోయి.
తరువాత మాములుగా అందరూ వేడి నీళ్ళ స్నానంతో వంటి మురికిని వదిలించు కుని, వేడి భోజనం తో (హోటలు వాళ్ళు పొద్దుటి పదార్ధాలనే రాత్రి పూట వేడి చేసి పెడతారన్న దృడమైన నమ్మకాన్ని సదలించుకోవటానికి నానా అవస్థా పడింది కళ్యాణి ఆ సమయంలో) కడుపులోని ఆకలిని చల్లర్చుకుని మంచాల మీద వాలేరు. వాలిన కొద్ది నిమిషాల్లోనే పిల్లలిద్దరూ గాడ నిద్రలోకి మునిగిపోయేరు.
.jpg)
కాంతారావు వెల్లకిలా పడుకుని ఒకే చేతsిని తల క్రింద పెట్టుకుని, మరో చేత్తో కళ్ళు మూసుకుని కళ్యాణి తన దగ్గరకు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూన్నాడు. అలా పడుకున్న కాంతారావు కి కాళ్ళ మీద ఏదో మెత్తని స్పర్శ, తగిలే సరికి ఉలికిపడి ముఖం మీది చెయ్యి తీసేసి చూసేడు.
