"కాని ఇదంతా అతని తండ్రికి తెలియదా?"
"ఆయనకు శ్రీనివాస్ ను గురించి ప్రతి విషయం తెలుసుట! ఆయనొక అవతారపురుషుడు. ఆదర్శభావాలతో, అందరికి అందని సంపూర్ణత చేకూర్చుకున్న మనిషి. అందుకే ఈనాటివరకు తెలియవలిసిన అవసరంగాని, తండ్రిలేని లోపల గాని తెలియకుండా పెరిగిన అదృష్టవంతుడు శ్రీనివాస్."
"కాని కృష్ణమూర్తీ, నీ హృదయాందోళన నే నర్దం చేసుకోలేననుకోకు కాని అతని కిష్టంలేని పనులు చేయించడంవల్ల మంచే జరుగుతుందంటావా? అతనిలాంటి అభిమానధనుడు నీ పరపతితో వచ్చే సీటు తీసుకోడానికి ఇష్టపడతాడంటావా?"
"ఆ అనుమానం నాకూ ఉంది. కాని అతనికి ఆ విషయం తెలియవలసిన అవసరం ఉందనుకోను."
"ఏమో, ఈ జరిగేదంతా చూస్తూంటే అయోమయంగా ఉంది. అనూరాధ, శ్రీనివాస్ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పెళ్ళికి, వైద్యారంభానికి సంబంధం లేకుండా ఉండాలనే నా కోరిక."
"వారిద్దరికీ ఈ అభిప్రాయం ఉందేమో అనుకున్నాను. నిశ్చయించుకున్నారన్నమాట!"
"ఈ సందర్భంలో చెప్పాలంటే నాకేం తోచడం లేదు. నువ్వు చేస్తున్న పని నీకు పూర్తిగా మంచిదని తోస్తేగాని...మీ ఇద్దరి మధ్య దూరం మాత్రం ఉండవలసిన రీతిలో ఉంచేందుకు ప్రయత్నించు. మనస్సులో చెలరేగే భావోవద్వేగాలు బయటకు చూపెట్టడంవల్ల అనర్ధమే జరుగుతుంది."
"అది ఎలాగూ ఆచరిస్తాను. ఈ విషయం మరెవరికీ తెలియపరచవద్దని కోరుతున్నాను. ముఖ్యంగా అనూరాధా శ్రీనివాస్ లకు ఎటువంటి సందర్భంలోనూ తెలియచెయ్యడానికి వీలులేదు. శ్రీనివాస్ నా కొడుకు అని అనుకోవడంలో కలిగే తృప్తి నాకు చాలు! ఇప్పుడు స్నేహితుడుగా లభించే గౌరవంతప్ప, ఎటువంటి అభిమానం, వాత్సల్యం నే నాశించను."
"నీతో చిరకాలంగా ఉన్న స్నేహం ఈనాడు బంధుత్వంగా మారుతూందంటే నా ఆనందం చెప్పలేను, కృష్ణమూర్తీ."
"అది నలుగురి ఎదట చెప్పుకోగలిగేంత అదృష్టవంతుణ్ణికాను శేఖరం. ఆఖరికి ఆ వివాహం కళ్ళారా చూచేందుకుకూడా వీలులేదు ఏదో ఒక సాకు చెప్పి తప్పుకోవడం తప్ప!"
ఆశ్చర్యంగా ఆయనవైపు చూచారు శేఖరంగారు.
25
పరీక్షల హడావిడి తగ్గింది. విశాఖపట్నం కాస్త ఖాళీ అయింది. ఎండాకాలపు సెలవులకు చాలామంది ఇళ్ళకు పోయారు. పరీక్షలు అయ్యాయనుకుంటే అదొక పెద్ద సంతృప్తి!
అనుకున్న విధంగా అనూరాధ పెళ్ళి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి శ్రీనివాస్ వివాహానికి సుముఖుడైనాడని విని ఎంతో సంతోషించింది అతని తల్లి సావిత్రి. శ్రీలక్ష్మి కోరికపై పెళ్ళి అన్నవరంలో చేయడానికి నిశ్చయించారు శ్రీనివాస్ పెళ్ళికి అనవసరమయిన హడావిడి చెయ్యవద్దని కోరాడు. అది శ్రీలక్ష్మికి అంతగా రుచించకపోయినా అల్లుడి కోరిక కాదనలేకపోయింది.
అవడానికి శ్రీలక్ష్మి, రాజశేఖరం గార్ల ఏకైక పుత్రిక అయినప్పటికీ ముఖ్యమయిన బంధువులతో, ఆప్తమిత్రులతో అన్నవరం చేరారు.
అది ఆంధ్రుల పుణ్యక్షేత్రాలలో ఒకటి. బెజవాడ కనకదుర్గ, తిరుపతి వెంకటేశ్వరుడు, కొండలపై వెలిసి గుడులు కట్టించుకుంటే, కొండపై వెలిసి మేడలో నివాసమేర్పరుచుకున్న దేవుడీయన! అనంత సృష్టి స్థితి లయకారుకులయిన త్రిమూర్తులు ఒకేచోట, ఒకేరూపంతో రెండు గర్భగుడులలో ఉన్న ప్రత్యేకత ఈ ప్రదేశానిదే! మూలలో బ్రహ్మ రూపుడు, మధ్యలో మహేశ్వరుడు, అంతంలో విష్ణురూపుడు అయిన ఈయనను చూడాలంటే, ఆలయంలో అడుగు పెట్టగానే, దైవదర్శనార్ధం మేడపైకి వెళ్ళాలి. నలుగురు దేవతలు నలుమూలలా వేంచేసి ఉండగా, లక్ష్మీసమేతుడైన శ్రీ సత్యనారాయణమూర్తిని సందర్శించి కిందికి దిగాలి. కింద గర్భగుడికి, పై గుడికి మధ్య అడ్డు లేకుండా ఉన్న ధ్వజానికి కింద బ్రహ్మరూపంతో, మధ్య లింగరూపంతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
కొండమీద దేవాలయం, పాలరాతి కట్టడంతో, పలురకాల వృక్ష చ్చాయ లతో, పక్కనే ప్రవహిస్తున్న పంపా నదీ తీరాన, అత్యంత రమణీయంగా, కన్నుల పండువుగా కనుపిస్తుంది. బయట ప్రతాపాన్ని చూపుతున్న సూర్యభగవానుని కిరణాల ప్రభావం చల్లబడిపోయింది ఆ కొండమీద. కింద వేడిలో, పైకి మెట్లెక్కి వచ్చినవారి అలసటనుసైతం మరిపింప చేశాయి, వివిధ వృక్షాల మీదినుండి వీస్తున్న చల్లనిగాలులు. నిత్యం దైవపూజకై పెంచుకున్న పూల మొక్కల రకరకాల సువాసనలు గాలిలో కలిసి నలువైపుల వ్యాపిస్తున్నాయి.
ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో అనూరాధా శ్రీనివాసుల కల్యాణానికి అన్ని హంగులు ఏర్పాటయ్యాయి. నిర్దేశించబడిన పుణ్యకాలంలో, పురోహితుల పవిత్ర మంత్రాలలో, ఆహుతులైన కొద్దిమంది ఆశీర్వాదాలలో అనూరాధ వివాహం సలక్షణంగా జరిగింది. వివాహం, దైవదర్శనం పూర్తి కాగానే పందిమందిలో కలిసిన అనూరాధలో ప్రత్యేకమయిన అందం, ఆకర్షణ కనిపించాయి. పచ్చని బట్టలలో, కొత్తగా అలంకరించిన పసుపుతాడు బంగారు నగలమధ్య కలిసి ప్రత్యేకమయిన అందాన్ని చేకూర్చింది. చిన్ననాటినుండి కలిసి మెలిసి తిరిగిన లలితకే 'అనూరాధ ఇంత అందమయినదా?' అనిపించిందా క్షణంలో. పెద్దలందరికి నమస్కరిస్తున్న రాధను చూస్తూ ఉంటే అప్రయత్నంగా కన్నుల్లో నీళ్ళు తిరిగాయి శ్రీలక్ష్మికి. ఆనాటి వరకు తమ స్వంతబిడ్డ. ఈనాడు మరొకరికి ధారపోశారు! ఆ భావనే చాలు కనిపెంచిన తల్లికి, దుఃఖభాష్పాలు, ఆనందతరంగాలు పొంగిపొరలటానికి.
నవీన పద్ధతులలో, క్లుప్తంగా జరిగిన వివాహంతో ప్రేమమయ హృదయాలు ఏకమయ్యాయి. ఆరాత్రి బంధువులకు, స్నేహితులకు విందు జరిగింది.
ఆ రోజంతా కృష్ణమూర్తిగారు ఏదో పనిపెట్టుకుని ఊళ్ళో ఉండకుండా ఏర్పాటు చేసుకున్నారు. అది శ్రీనివాస్, అనూరాధలకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా శ్రీనివాస్ ఆయన రాకపోవడానికి కారణం వెతకకుండా ఉండలేకపోయాడు. స్వంతకూతురులా చూచుకునే అనూరాధ వివాహానికి హాజరుకాకుండా ఉండేటంత అత్యవసరపు పనేమిటనిపించింది. ఇంటికి చేరేటప్పటికి ఆయన దగ్గిర నుండి వధూవరులకు విలువయిన బహుమతులు వచ్చి ఉన్నాయి. ఆనాడు కృష్ణమూర్తిగారు తనువు ఒకచోట, మనస్సు ఒకచోట ఉండడంతో మథనపడ్డారు మొదటిసారిగా.
అక్కడ రెండురోజులుండి, గుంటూరులో కొద్దిరోజులు గడిపి, హనీమూన్ కి వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు కొత్తదంపతులు.
ఆరాత్రి కొద్దిమంది బంధువుల మధ్య పరాచికాలతో. నవ్వులతో కార్యక్రమం ముగిసింది.
"అయ్యా, బావగారు, మీరా మొహమాటస్థులు. నాకా మర్యాద చెయ్యడం చేతకాదు. మా చెల్లెలా ఇంకా చిన్నపిల్ల. అందుకని మీ పనులు మీరు చూసుకుంటూ మా చెల్లెలిని జాగ్రత్తగా చూడండి" అన్నాడు కృష్ణమోహన్ నవ్వుతూ.
"ఏమిటండీ, ఈ రోజంటే అల్లుడిహోదాలో వచ్చాను. ఇవాళ కొత్తగా చెబుతున్నారు! ఇంతకుముందు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాను? అదీకాక అపురూపమయిన వస్తువులను ఎలా చూడాలో తెలుసులెండి" అన్నాడు అనూరాధ వంక చూసి నవ్వుతూ.
పాలవెన్నెల పందిట్లో, మల్లెపూల పరిమళంలో, అగరవత్తుల సువాసనలో మనస్సును మత్తెక్కించే మధురమయిన ఊహలతో గదిలోకి అడుగుపెట్టాడు శ్రీనివాస్. గది అంత పలచని వెలుగుతో నిండి ఉంది. కిటికీ చువ్వలు ఆనుకుని, బయటికి దృష్టి సారించింది అనూరాధ. మల్లెలను తలదన్నే తెల్లని చీర, మెడలో ముత్యాలదండ, నుదుట కల్యాణం బొట్టు, దిష్టి తగిలేటట్లున్న అందానికి, అడ్డుగా బుగ్గన చుక్క.....అనూరాధను చూచి, మెల్లిగా ఆమె వెనకగా వెళ్ళి. ఆమె వెనకభాగం నుండి చువ్వలు పట్టుకున్న ఆమె చేతిపై చెయ్యి వేశాడు. దగ్గిరగా కలిగిన స్పర్శతో కొద్దిగా ఉలిక్కిపడి శ్రీనివాస్ వైపు తిరిగింది అనూరాధ. తన చేతికి, కిటికీకి మధ్య బంధితఅయిన రాధవంక చూస్తూ తనచేత్తో ఆమె చుబుకాన్ని ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె పెదవులపై తన పెదవులుంచి హృదయానికి హత్తుకున్నాడు బలంగా.
* * *

26
ఫలితాలు వచ్చాయి. అనూరాధ, లలిత ఇద్దరూ పాసయ్యారు. ఆరోజున ప్రత్యేకంగా లలితదగ్గిరికి వెళ్ళి రెండు పుస్తకాలు ప్రజంట్ చేసి కంగ్రాచ్యులేషన్స్ తెలిసి వచ్చాడు శ్రీనివాస్.
