Previous Page Next Page 
తామరకొలను పేజి 22


    రమేశ్ భయపడుతూ ఆమె చెయ్యి పట్టుకుని:
    "నాకు భయమేస్తోంది" అన్నాడు.
    "మీకు ధైర్యం కలగాలనే నేను వెడుతున్నాను. త్వరగానే వచ్చేస్తాను. వెళ్ళనా?"
    రత్న అతడి చేతిలోని తన చేతిని నెమ్మదిగా విడిపించుకుంది.
    పెళ్ళి బోజనం - అదీ ముగించుకుని రత్న వచ్చేసరికి సాయంత్రం ఐదయింది. సంతోష సమారంభంలో పాల్గొని వచ్చినందువల్ల గాబోలు రత్న మొహంలో ఆనందచ్చాయలు వెల్లివిరుస్తున్నాయి. ఏదో పాటను మెల్లిగా గొణుక్కుంటూ మెట్లెక్కింది.
    తలుపు దగ్గర నళిని ముళ్ళమీదున్నట్టు నిలబడి ఉంది. రత్నను చూడగానే తలుపుకు తాళంవేసి, రత్న చెయ్యి పట్టుకుని కిందకు దిగుతూ:
    "రత్నా! ముందు పద. దోవలో అంతా చెబుతాను. కంగారు పడకు" అంది.
    రత్న-కళ్ళు పెద్దవయ్యాయి:
    "ఏం జరిగింది?"
    "ఆశకు "డిప్తీరియా' అయిందట. ఉదయం నువ్వు పెళ్ళికి వెళ్ళగానే, ఆశా చాలా బాధ పడిందట....."
    ఆత్రంగా వింటోంది రత్న.
    "ఏయ్ ట్యాక్సీ...." అని ట్యాక్సీని పిలిచింది నళిని. టాక్సీ రాగానే రత్నను లోపలికి తోసి, తనూ కూర్చుని.
    "జె. జె. హాస్పిటల్" అంది.
    రత్న మాట్లాడే శక్తిని కోల్పోయి స్తబ్దంగా కూర్చుండిపోయింది.
    "రమేశ్ కు అనుమానం వచ్చి ఆశను పరీక్షించి డిప్తీరియా అని నిర్దారించి ఒక ఇంజక్షన్ ఇచ్చి హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేశారట. హాస్పిటల్ నుండే నాకు ఫోన్ చేశారు: 'రత్న పెళ్ళి నుండి రాగానే అక్కడికి తీసుకుని రమ్మని. అప్పటి నుండి ఇక్కడ నిలబడి నీకోసం చూస్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళావో కూడా నాకు తెలీదాయె. తెలుసుంటే అక్కడికైనా వచ్చేదాన్ని."
    "ఆశ కెలా ఉందట" రత్న అడిగింది.
    "ఇపుడే అయిదు నిముషాల క్రితం ఫోన్ చేసి కనుక్కున్నాను. వెంటనే ఆపరేషను చేశారట. ఇంకా తెలివి రాలేదు కాని, మామూలుగానే వూపిరి పీలుస్తోందని చెప్పారు రమేశ్. ఏం కంగారు పడకు."
    టాక్సీ హాస్పిటల్ ముందు ఆగింది. రత్న నళినిని అనుసరించింది. నర్సులనడిగి ఆశా ఉన్న వార్డు కనుక్కున్నారు.
    నళిని, రత్న చప్పుడు చేయకుండా మెల్లిగా నడిచి వెళ్ళారు లోపలికి.
    ఆశ మంచం దగ్గర తలవంచుకుని కూర్చున్నారు రమేశ్. అడుగుల చప్పుడు విని లేచి రత్న దగ్గరకు వచ్చి మృదువుగా:
    "మీ ఆశను మీకు అప్పచెబుతున్నాను" అనేసి అవతలకు వెళ్ళిపోయాడు.
    రత్న కుర్చీమీద కూర్చుని ఆశ చిన్నచేతిని తన చేతిలోకి తీసుకుంది. నళిని రత్న వెనుక నిలబడింది.     
    సాయంత్రం రౌండ్ కు వచ్చిన డాక్టర్ని నళిని:
    "ఏ భయంలేదా డాక్టర్" అని అడిగింది.
    "లేదు, ఈ అమ్మాయిని తెచ్చి అడ్మిట్ చేసిన అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. ఇంట్లో చేయాలి సిన చికిత్స తనే చేసి తీసుకొచ్చాడు, గనుకనే బ్రతికింది పాప. తగిన సమయంలో చికిత్స దొరకటం మీ అదృష్టం."
    "అయితే ఇంకేం భయం లేదన్నమాట" అంది నళిని మళ్ళీ.
    "భయమేమీలేదు. తప్పకుండా నయమవుతుంది. కాని, ఇంకా నాలుగురోజులు ఇకడే ఉండాలి" అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్.
    రత్న లేచి నిల్చుని "నళినీ! నువ్విక్కడే ఉండు. నేను రమేశ్ ఇక్కడే ఎక్కడైనా ఉన్నారేమో చూసి వస్తాను" అంది.
    నళిని మంచం దగ్గర కూర్చుంది.
    కాస్సేపట్లో రత్న వెనక్కి వచ్చింది.
    "రమేశ్ ఏరి?" అని అడిగింది నళిని.
    "ఎక్కడా కనిపించలేదు. ఉదయం భోంచేశారో లేదో కూడా తెలీదు."
    నళిని మాట్లాడలేదు.
    కాస్సేపు ఊరుకుని నళిని "నే నిక వెడతాను, రాత్రికి నువ్విక్కడే ఉంటావా?' అని అడిగింది.
    "ఊఁ."
    "అయితే నీకు పక్క అదీ తెచ్చిస్తాను. ఇహ వెళ్ళనా" అని రత్నతో చెప్పి వెళ్ళిపోయింది నళిని.
    మృత్యు-కుహరంలోనుండి బయటపడిన ఆశా కళా విహీనమయిన మొహాన్ని చూస్తూ రమేశుడిని గురించి ఆలోచిస్తూ కూర్చుంది రత్న.
    రాత్రి తొమ్మిదింటికి నళిని దుప్పటీ అదీ తీసుకుని మళ్ళీ వచ్చింది.
    "రమేశ్ ఇంట్లో ఉన్నారా?" ఆత్రుతతో అడిగింది రత్న.
    "లేరు. ఇక్కడికి రాలేదా?"
    "లేదు."
    "ఇపుడొస్తారేమో. నీకు అన్నం తెచ్చాను. భోంచేద్దువుగాని లే."
    "వద్దు నళినీ, పెళ్ళిభోజనం ఇంకా అరగలేదు నాకు."
    "కొంచెం తిను...." నళిని బలవంతం చేసింది.
    "వద్దు క్యారియర్ ఇక్కడే ఉండనీ, కావాలంటే తింటాను."
    నళిని క్యారియర్ బల్లమీదపెట్టి ఉదయం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది.
    రాత్రి పది దాటాక వార్డులోకి అడుగుపెట్టాడు రమేష్. రత్న తదేకంగా ఆశనే చూస్తూ కూర్చుంది.
    రమేశ్ మాట్లాడకుండా వెళ్ళి ఆశ-చెయ్యి పట్టుకుని వాడి చూశాడు. ఆశ మెల్లిగా, హాయిగా ఊపిరి పీలుస్తూ ఉండటాన్ని గమనించి అతడి హృదయం తేలికపడింది.
    రత్న అతడినే పరీక్షగా చూస్తూ ఉంది:
    "రమేశ్!"        
    "ఏమిటి?"
    "ఆశకు తప్పకుండా నయమవుతుందని చెప్పారు డాక్టర్."
    రమేశ్ మాట్లాడలేదు.
    "ఇకనైనా భోంచెయ్యండి."
    "నేను భోంచేయలేదని మీ కెవరు చెప్పారు?"
    "మీ మొహమే చెప్తోంది."
    "నాకు ఆకలిగా లేదు."
    "ఉదయంనుండి కాఫీ, టిఫిన్, భోజనం ఏమీ తీసుకోలేదు; అయినా ఆకలిగా లేదా?"
    "లేదు."
    "నాకోసం కొంచెం తినండి."
    "వద్దు."
    "నేనే తినిపిస్తాను" అంటూ నళిని తెచ్చిన క్యారియర్ మూత తీసి కలిపిన అన్నాన్ని స్పూనుతో అతడి చేత తినిపించసాగింది.
    రమేశ్ తృప్తిగా తిన్నాడు. అతడి భోజనం అయ్యాక రత్న:
    "మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి. నేను ఇక్కడ ఉంటాను" అంది.
    "ఉహుఁ నేనూ ఇక్కడే ఉంటాను."
    "పక్క అదీ ఏమీ లేదు. మీ రెలా పడుకుంటారు?"
    "మీరేం చేస్తారు?"
    "నళిని నాకు దుప్పటి తెచ్చింది."
    "సరే; మీరు పడుకోండి."
    "మరి మీరో?"
    "నేను కుర్చీమీద కూర్చుని, మిమ్మల్నీ, మీ కూతుర్నీ చూస్తూ రాత్రి గడిపేస్తాను."
    "ఉదయంనుండి తిరిగి, అలిసిపోయారు. ఇపుడైనా కాస్త విశ్రాంతి తీసుకోండి."
    "మిమ్మల్ని చూస్తూ కూర్చోవటం కన్నా నాకు వేరే విశ్రాంతి అక్కర్లేదు."
    "అలా చూడదగినంత అందగత్తెను కాను నేను."
    "ఫరవాలేదు; ఈ రోజు నన్ను బలవంతపెట్టకండి" అన్నాడు రమేశ్.
    రత్న పడుకుంది. రమేశ్ ఆ తల్లీ కూతుళ్ళను చూస్తూ ఆ రాత్రంతా గడిపాడు.
    ఏ జన్మజన్మాల అనుబంధమో ఇది! తను ఎన్నడూ చూసి ఎరుగని స్త్రీ రత్న. ఏదో కారణం వల్ల తను కొన్ని రోజులు వాళ్ళింట్లో ఉండాల్సి వచ్చింది. కాని, అంతలోనే స్నేహపు వేరు తన హృదయంలోకి అంత లోతుగా దిగిపోగలదని ఎన్నడూ ఊహించనైనా ఊహించలేదు.
    అంతా తెలిసి కూడా రత్న-స్నేహబంధాన్నుండి తప్పించుకోలేకపోయాడు రమేశ్. తమ స్నేహం వల్ల ఏ విధమైన ఉపయోగమూ లేదని ఇరువురికీ తెలుసు. ఆ స్నేహాన్ని పెంచుకోవటంవల్ల ఇద్దరికీ సుఖం లేదన్న విషయం తెలిసీ కూడా ఆ అనుబంధాన్ని తెంచుకోలేకపోయారు.
    రత్ననుండి దూరంగా వెళ్ళాలన్న ఆలోచనే రమేశుడి హృదయాన్ని భయభ్రాంతం చేస్తోంది. ఆ విరహం భరించరానిదిగా అనిపించిందతనికి.
    ఆ ఆలోచన రాగానే బెదరిపోయేవాడు రమేశ్. రత్నను చూడకుండా, ఆమెతో మాట్లాడకుండా తను ఉండగలడా?        
    ప్రేమ తామర-పుష్పపు వేరులా బలమైనది. ఆ వేళ్ళ-సమూహపు చేతికి చిక్కిన మనిషి, ఆ వలనుండి తప్పించుకుపోదామని ప్రయత్నించిన కొలదీ, ఆ వేరు అతడిని బంధించి బురద లోకి లాగేసినట్టు, రమేశ్ అనురాగపు స్వచ్చమైన సరోవరంలోకి అడుగుపెట్టి, దాని రుద్రాలింగనానికి లోనై వివశుడైపోయాడు.
    మర్నాడు నళిని వచ్చేసరికి రమేశ్ కుర్చీలోనే నిద్రిస్తున్నాడు. రత్న నిద్రలేచి ఆశదగ్గర కూర్చుని ఉంది. ఆశ కళ్ళు తెరచి నళినివైపు చూసింది. నళిని అందం, అలంకారం చూసి ఆశ కళ్ళు పెద్దవయ్యాయి. మాట్లాడకుండా నళిని వైపు చూసి నవ్వింది.
    రెండురోజుల తరువాత బరోడా నుండి తిరిగి వచ్చిన శేషగిరికి కూతురి అనారోగ్యం సంగతి తెలిసి గాబరాగా హాస్పిటల్ కు పరిగెత్తుకొచ్చాడు.
    ఆశకు జబ్బు నయమవుతూండటం చూసి అతడి మనసు తేలికపడింది. ఆశను ఇంటికి తీసుకుని వెళ్ళేదాకా ఆశ-పక్కనుండి కదల్లేదు శేషగిరి.
    వారం రోజుల తర్వాత ఆశ ఇంటికి వచ్చింది. రత్న కూతుర్ని మళ్ళీ పొందినట్లుగా సంబరపడింది. ఆ సంబరంలోని సంతోషాన్ని మనఃపూర్వకంగా అనుభవించాడు రమేశ్.
    ఆశ ఇంటికి వచ్చిన మర్నాడు రమేశ్ మళ్ళీ తన ప్రయాణం విషయం ఎత్తాడు.
    "ఇహనైనా నాకు ఊరికి వెళ్ళటానికి అనుమతి నివ్వండి" అన్నాడు ఆ దంపతుల మొహం చూసి.
    రత్న శేషగిరినే మాట్లాడనిచ్చి తాను తప్పుకుంది.
    "అలాగే, ఇంకో సంవత్సరం చదువు పూర్తి చేసేయ్. తరువాత ఇక్కడికే వచ్చేద్ధువుగాని. ఇద్దరం కలిసి ప్రాక్టీసు చేద్దాం. నేనూ కృష్ణ మూర్తికి ఉత్తరం రాస్తాను. అయినా ముందు నీ చదువు పూర్తికానీ. ఇప్పటినుడి ఆ విషయమెందుకులే-" అన్నాడు శేషగిరి.
    "చదువు పూర్తి చేస్తాను. అది మట్టుకు నిర్ణయించుకొన్నాను" అంటూ రత్నవైపు చూశాడు రమేశ్.
    ఆమె తలెత్తి రమేశుడివైపు చూసింది. శేషగిరి అక్కడ లేకపోతే, ఆ మాట అన్నందుకు ఏం బహుమతి ఇచ్చేదో రత్నకు మాత్రమే తెలుసు.
    ఒక్కక్షణం ఆమె కళ్ళలో మెరుపు మెరిసింది. హృదయంలోని సంతోషమంతా ఆమె మొహం లోనే ప్రతిబింబించింది.
    ఆమెకు తను ఆ మాట అని ఎంత ఆనందాన్ని కలుగజేశాడో రమేశ్ కొలవలేకపోయాడు.
    "కాని, ఇక్కడ ప్రాక్టీసు చెయ్యను-" రమేశ్ అన్నాడు.
    రత్న మౌనంగా నిట్టూర్చింది.
    "ఎందుకయ్యా! బొంబాయంటే అపుడే విసుగు పుట్టిందా?"
    "అలా కాదు. నేను ప్రైవేటు ప్రాక్టీసు పెడితే దగ్గు, జ్వరం ఇలాంటి జబ్బులకే మందివ్వాగలను. సర్జన్ కావాలని నాకు చాలా రోజులుగా ఓ కోర్కె ఉంది. సర్జన్ అయి, కొత్త ప్రయోగాలు చేసి, కొత్త మందులను కనిపెట్టాలని ఉంది..."    
    శేషగిరి సంతోషంతో పొంగిపోయాడు. గర్వంతో రత్నవైపు తిరిగి.
    "చూశావా రత్నా! మా కృష్ణమూర్తి తమ్ముడు ఎలా తయారవుతున్నాడో?" అన్నాడు.
    మాటలకు అందని సంతోషాన్ని హృదయంలో నింపుకున్న రత్న మౌనం దాల్చింది.
    మర్నాడు రాత్రే రమేశుడి ప్రయాణం నిశ్చయమయింది. ముందే టికెట్ రిజర్వ్ చేయించుకున్నాడు.
    తల్లి-సమయాన్నంతా తన నుండి ల్క్కున్న రమేశుడి మీద మొదట్లో ఆశకు స్నేహ భావం కలగలేదు. కాని క్రమేణా పరిచయమూ, స్నేహమూ పెంపొందాయి వారిద్దరిమధ్యా.
    ఆఖరి సాయంత్రం రత్నతో కలిసి జుహు-బీచికి వెళ్ళాలని కోరుకున్నాడు రమేశ్.
    సంధ్య స్వర్ణకాంతి నీల సముద్రపు కెరటాల మీద ఆడుకుంటున్నాయి. ఆ కిరణాల ఆటలను చూసి సముద్రుడు నవ్వుతున్నాడేమో అన్నట్టు, కెరటాలు తెల్లటి నురుగును నింపుకుని నవ్వుల్ని పువ్వుల్ని విరజిమ్మి మళ్ళీ వెనక్కీ వెళ్ళిపోతున్నాయి.
    "రత్నా! మీతో గడిపే ఆఖరి సాయంత్రం ఇది" అన్నాడు రమేశ్.
    "మీరలా మాట్లాడకండి రమేశ్! నాకు ఏడుపు వస్తోంది."
    "మీ మనసు చాలా గట్టిదనుకున్నాను. ఆఖరి రోజున ఇలా బెంబేలు పడిపోతారేం?"
    రత్న నిస్సహాయంగా :
    "మనం ఎవరితోనూ స్నేహ బాంధవ్యాలు పెంచుకోరాదు రమేశ్! మీనుండి దూరంగా ఉండాలని ఎంతో ప్రయత్నించాను. వీలుపడలేదు. ఈ స్నేహమూ వద్దూ! ఈ విరహమూ వద్దు. ఏదీలేకుండా ఉంటేనే మనసుకు హాయిగా ఉంటుందేమో అనిపిస్తోంది" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS