Previous Page Next Page 
తామరకొలను పేజి 21


    "నువ్వూ రావయ్యా. వెళ్ళొద్దాం" అన్నాడు శేషగిరి.
    "నేను వైద్యుడిని కాను."
    "ఇపుడు కాకపోతే ఏం, ఎపుడయినా డాక్టరయ్యే వాడినేగా? చాలా చోట్లనుండి డాక్టర్లు వస్తారు. ఆలోచించి చూడు."
    "లేదు; నేను రాలేను. మీరు వెళ్ళిరండి. నేను మా ఊరికి వ
ెడతాను" అన్నాడు రమేష్.
    రత్న తలెత్తి రమేశుడివైపు చూసింది.
    "అపుడేనా?" అన్నాడు శేషగిరి.
    "నేను ఇక్కడికి వచ్చి తక్కువరోజులయిందాయేం? రెండున్నర నెలలు కావస్తోంది. మీరు అన్నం పెడుతున్నారు; నాన్న డబ్బుపంపిస్తున్నారని ఎన్నిరోజులు ఉండి పొమ్మంటారు?"
    "అయితే నాదో సలహా నేను బరోడానుండి రాగానే, నువ్వు వెళ్ళిపోదువుగని, ఏమంటావ్?"
    రమేశుడి భయమూ అదే- శేషగిరి లేనపుడు తనేమైనా అనుచితమైన పని చేస్తే?- ఆ భయం తోనే తన ప్రయాణం సంగతి ముందుగానే చెప్పాడు.
    కాని, ఇపుడు శేషగిరి-మాటలకు ఏం చెప్పాలో తెలియలేదతనికి. అతడింకా ఆలోచిస్తూండగానే రత్న శాంతమైన ధ్వనితో:
    "అలాగే లెండి. మీ రొచ్చాకనే రమేశ్ వెడతారు" అంది.
    రమేశ్ ప్రశ్నార్ధకంగా రత్నవైపు చూశాడు. కాని, రత్న మొహం అటువైపు ఉంది.
    మర్నాడంతా శేషగిరి ప్రయాణపు హడావిడి. ప్రతీ పనిలోను క్రమం తప్పరాదు. అంతా నీటుగా ఉండాలనే మనస్తత్వం అతడిది. బరోడాలో ఉండేది నాలుగు రోజులే అయినా, బట్టలు మాత్రం కొంచెం ఎక్కువగానే సర్దుకున్నాడు.
    శేషగిరి స్నేహితులతో కలిసి రాత్రి రైలులో ప్రయాణం చేశాడు. వెళ్ళేముందు ఆశ, తండ్రి దగ్గరకొచ్చి:
    "నాన్నా, గొంతులో నొప్పిగా ఉంది" అంది. శేషగిరి వెంటనే చేతిలోని సంచి కిందపెట్టి టార్చ్ తెచ్చి పరీక్షించి టచ్ చేశాడు.
    "ఆశకు గొంతు నొప్పిగా ఉందట" అంటూ రత్నవైపు ఆరాటంతో చూశాడు.
    "ఫరవాలేదు. తనకు అపుడపుడూ అలాగే అవుతూంటుంది. మీరెందుకు కంగారు పడతారు? నేనున్నాను; రమేశ్ ఉన్నారు. చూసుకుంటాం" అని ధైర్యం చెప్పింది.
    రమేశ్, శేషగిరితో వి.టి.కి వెళ్ళి వీడ్కోలిచ్చి వచ్చాడు.
    డాక్టర్ శేషగిరి ట్రైను కదిలేముందు!
    "ఆశకు పెరుగు వెయ్యవద్దని రత్నతో చెప్పు" అన్నాడు.

    రమేశ్ ఇంటికి వచ్చేసరికి రత్న ఆశను పడుకోబెడుతోంది. ఆశ గొంతునొప్పిగా ఉందని మూలుగుతోంది.
    రమేశుడికి కొంచెం కంగారుగానే ఉంది.
    తను ఆఖరి సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్ధి అని శేషగిరికి, రత్నకు తనంటే నమ్మకం.
    కాని, రమేశుడికి తనపై తనకే నమ్మకంలేదు.
    రమేశ్ రత్నతో:
    "శేషగిరి వెళ్ళకుండా ఉంటేనే బావుండేది" అన్నాడు. అతడి కంఠంలోని ఆరాటాన్ని గుర్తించి రత్న!
    "మీరెందుకలా భయపడతారు? డాక్టరయ్యే మీరే అలా భయపడితే, రోగుల గతేం కావాలి? ఆశకు అపుడపుడు ఇలాగే అవుతూంటుంది. ఫరవాలేదు" అంది శాంతంగా.
    రత్న శాంతస్వరం రమేశుడి కలవరాన్ని కొంచెం తగ్గించింది.
    రమేశ్ తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. కాని, ఆశను గురించిన ఆలోచనతో అతడికి నిద్రపట్టలా తల్లితోబాటు కూతుర్ని కూడా తనెంతగా ప్రేమిస్తున్నాడో ఇపుడే తెలిసివచ్చిందతనికి. రత్నకు చెందిన ప్రతీ వస్తువుపైనా ప్రీతి విశ్వాసాలు పెంచుకున్నాడు తను. రత్న తన కూతుర్ని తను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇపుడే తెలుసుకుంటున్నాడు.
    ఈ ఆలోచనలతో అతడికి రాత్రంతా సరిగా నిద్రపట్టలేదు.
    ఆశకు ఎలా ఉందోనని రెండుమూడుసార్లు లేచివచ్చి చూసి వెళ్ళాడు మళ్ళీ.

 

                                     11

                            

    తల్లీ కూతుళ్ళిద్దరూ హాయిగా నిద్రపోతూండటం గమనించి తను హాయిగా నిద్రపోయాడు.
    ఉదయం రమేశ్ లేచేసరికే, రత్న లేచి ఇంటిపనులు చేసుకుంటోంది. రమేశ్ లేవగానే ఆశ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. ఆశ కళ్ళు మూసుకుని పడుకుంది. రమేశ్ చెయ్యి సహజంగానే నుదుటిమీదకు వెళ్ళింది. వెంటనే గాబరాగా రత్న దగ్గరకు వెళ్ళి:
    "ఆశకు జ్వరం వచ్చింది" అన్నాడు.
    "అలాగా?"
    "ఊఁ ఎవర్నైనా డాక్టర్ని తీసుకొస్తాను." రత్న కొంచెం నవ్వి, హేళనగా:
    "డాక్టరా? ఎందుకూ? ఈ మాత్రం గొంతు నొప్పి, జ్వరాలకు మీరు మందివ్వలేరా?" అంది.
    "వద్దు రత్నా! నన్ను పరీక్షించకండి. నేనో పనికిమాలిన వాడిని."
    రత్న అలక్ష్యంతో అటు తిరిగి "సరే; అయితే ఆశకు ఇంకో డాక్టర్ అవసరమూ లేదు" అంది.
    "రత్నా....... ప్లీజ్......"
    "మీరు చికిత్స్ చేసేటట్టయితే చెయ్యండి. లేదంటే దాని కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది."
    "నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను" అన్నాడు రమేశ్ మొండిగా.
    "మీకంత ధైర్యం ఉంటే తీసుకురండి చూద్దాం" అంది రత్న ఇంకా మొండిగా.
    "రత్నా! నన్ను ధర్మసంకటంలో పడేయకండి" రమేశ్ బ్రతిమాలుకున్నాడు.
    "ఇపుడు ధర్మసంకటంలో పడింది మీరు కాదు నేను. నా ఆశకు మీరే చికిత్స చెయ్యాలని నాకోరిక. మీమీద నాకున్నంత నమ్మకం, ఇంకే డాక్టర్ మీదా లేదు."
    "రత్న......" అంటూ ఆమె భుజాన్ని పట్టుకున్నాడు రమేశ్.
    "అమ్మా...." అంటూ కళ్ళు తెరిచింది ఆశా నేరం చేసినవాడిలా దూరంగా జరిగాడు రమేశ్.
    రత్న రమేశుడిని మందుల బీరువాముందునిలబెట్టి ప్రశ్నార్ధకంగా అతడివైపు చూసింది.
    రమేశ్ దీనంగా ఆమెవైపు చూస్తూ :
    "నన్నిలా బంధించకండి" అన్నాడు.
    రత్న బదులు చెప్పలేదు.
    రమేశుడి కళ్ళు యాంత్రికంగా బాటిల్స్ మీది పేర్లు చదవసాగాయి. అతడి చేతులు కొయ్యచేతుల్లా, నిర్జీవంగా అయి, ఏదో అదృశ్యశక్త్హి ప్రేరేపణతో ముందుకు వెళ్ళి ఓ మందుసీసా అందుకుని ఇంకో మందున్న దానితో కలిపాయి.
    రెండు మందులూ బాగా కలిసి ఔన్సు గ్లాసులో పోసుకుని ఆశ దగ్గరకొచ్చాడు రమేశ్.
    "నోరు తెరు ఆశా! మందు తాగుదువుగాని" అన్నాడు.
    జ్వర తీవ్రతతో కళ్ళు మూసుకున్న ఆశా కళ్ళు తెరిచింది.
    ఆశ కళ్ళలో ఆశ్చర్యం కనిపిస్తోంది:
    "మామయ్యా! నువ్వూ డాక్టరేనా?"
    ఏం బదులు చెప్పాలో తెలియలేదు రమేశుడికి. అతడి అవస్థ గమనించి రత్న.
    "అవునమ్మా, డాక్టరవుతారు" అంది.
    "అయితే మామయ్యా! తొందరగా ఓ ఇంజక్షన్ ఇచ్చి గొంతునొప్పి నయం చేసెయ్. రేపే నేను బడికి వెళ్ళొచ్చు."
    ఆశ మాటతో రమేశుడి హృదయం కెలికినట్టయింది. అతడు రత్నవైపు తిరిగాడు. తృప్తి, సంతోష విజయాలతో ఆమె మొహం వెలిగిపోతోంది.
    ఓటమితో రమేశుడి కళ్ళు చెమర్చాయి. అక్కడ కూర్చోలేక లేచి వెళ్ళిపోయాడు.
    రత్న ఆశకు మందు తాగించి పడుకోబెట్టి రమేశుడి దగ్గరకొచ్చింది.
    రమేశ్ తలవంచుకుని కూర్చున్నాడు. రత్న అతడి దగ్గర నిల్చుని ఆప్యాయంతో అతడివైపు చూసింది. ఆమె మృదువైన చేతివేళ్ళు అతడి ఉంగరాల జుత్తుతో ఆడుకున్నాయి.
    "రమేశ్......."
    "ఏమిటి?"
    "నా వైపు చూసి చెప్పండి మీ కెందుకింత వ్యథ?"
    "ఈ జన్మలో ఇహ ఎవ్వరికీ మందివ్వకూడదనుకున్నాను. ఎపుడైతే వదినను బ్రతికించుకో లేకపోయానో, అపుడే డాక్టర్ వృత్తికి నీళ్ళు వదులుకున్నాను. కాని, ఈ రోజు మీ తల్లి-కూతుళ్ళు కలిసి నా నిశ్చయాన్ని సడలింపజేశారు. నా జీవితంలో ఇదొక ఓటమి."
    "ఓటమి! తప్పుగా తెలుసుకున్నారు మీరు. ఇదే మీ గెలుపు రమేశ్! ఏదో గుడ్డి నమ్మకంతో మీ జీవితాన్నే పాడు చేసుకుంటున్నారు. జలుబు చేసిందని ముక్కు తెగ్గొట్టుకున్నట్టుంది మీస్థితి. చావు బ్రతుకులు ఎవరి అధీనం? పుట్టిన వాళ్ళంతా ఎపుడో ఒకరోజు చావాల్సిందే గదా?"
    "కాని, వదిన ఎంత చిన్నవయసులో చనిపోయింది? ఆమె జబ్బుకు ఎన్నిరకాల చికిత్సలు చేశాం. ఏదీ నయం చెయ్యలేకపోయింది. మరి ఈ చికిత్స లంతా ఎందుకు? నేను నయం చేస్తాను; నేను బ్రతికిస్తాను అనే మాట అబద్ధం. అందుకే నాలో నమ్మకంలేదు."
    "మానవ శక్తిని మించింది మరొకటుంది. దాన్నే 'దేవుడు', శక్తి, 'విధి' అని ఏ పేరుతో నైనా పిలువవచ్చు. మన ప్రయత్నం మనం చేస్తే ఆత్మతృప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఆయుస్సుతీలి, శాంత చనిపోయింది. ముళ్ళు గుచ్చుకుంటా యని గులాబి-చెట్టునుండి దూరంగా వెళ్ళిపోతారా ఎవరైనా?"
    "నేను వెళ్ళిపోతాను. జీవితంనుండే దూరంగా వెళ్ళిపోతాను."
    "దీన్నే పిరికితనం అంటారు. రమేశ్! మీరీ రోజునుండి కొత్త జీవితం ప్రారంభించాలి. మీ వూరికి వెళ్ళి చదువు పూర్తిచేసి డాక్టర్ గా స్థిరపడింది. మనిషిగా జీవితాన్ని ఎదురించండి. పిరికిపందలా పారిపోకండి."
    రమేశ్ బదులు చెప్పకుండా జోలపాట వింటున్న పసిపాపలా కూర్చున్నాడు.
    "ఆశ-తండ్రి వచ్చేదాకా ఆశను చూసుకునే బాధ్యత మీది" అంటూ తన మాట ముగించింది రత్న.
    రమేశ్ ఆ పూటల్లా ఆశ దగ్గర్నుండి కదలలేదు. పక్కమీద పడుకుని బాధపెడుతున్న ఆ పిల్లకు ఎన్నో రకాల కథలను చెప్పి నవ్వించాడు. ఒక్క నిముషంకూడా విసుగు చెందకుండా కూర్చున్నాడు. కాని, అతడి కళ్ళు ఎక్కువగా మాట్లాడకుండా, తన పనులు చేసుకుంటున్న రత్నను వెంటాడుతున్నాయి.
    రత్న తన పనులన్నీ ముగించుకుని వచ్చి:
    "నేను ఆశ దగ్గరుంటాను. మీ రలా తిరిగి రండి" అంది.
    "ఉహుఁ. నే నెక్కడికీ వెళ్ళను" అన్నాడు రమేశ్. ఆశ అది విని "అమ్మా, మామయ్య చాలా మంచివారమ్మా" అంది.
    ఇంకాస్సేపటిలో రత్న స్నేహితురాళ్ళ గుంపొకటి లోపలికి ప్రవేశించటంతో, రమేశ్ అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళాడు.
    మాతుంగా-మార్కెట్, గాంధీ-మార్కెట్ చుట్టుకుని రమేశ్ వచ్చేసరికి రత్న స్నేహితురాళ్ళెవరూ లేరు.
    రమేశ్ ఆశ దగ్గర కూర్చుని "ఎలా ఉందమ్మా" అనడిగాడు.    
    "నొప్పి ఎక్కువగా ఉంది మామయ్యా. నీరు మింగటానిక్కూడా కావటంలేదు."
    "తెల్లవారే సరికి అన్నీ సరిపోతాయ్" అంటూ ధైర్యం చెప్పాడు రమేశ్.
    కూతురికి గ్లాసులో పాలు తెచ్చిన రత్న: "రేపు నా స్నేహితురాలి చెల్లెలి పెళ్ళి- నన్ను తప్పకుండా రమ్మంది" అంది.
    "ఇంట్లో అమ్మాయికి వంట్లో బాగా లేనపుడు మీరెలా వెడతారు?" అన్నాడు రమేశ్.
    "మీరుండగా నాకేం భయం? ఆశను మీకు అప్పజెప్పి నిన్ను నిశ్చింతగా వెళ్ళగలను" అంది రత్న చిలిపిగా.
    "వద్దు రత్నా! నేను అయోగ్యుడిని. నా కప్పజెప్పకండి."
    రత్న చిరునవ్వు నవ్వి అతడి మాట లనునయంగా తిరస్కరించింది.
    మరుసటి రోజు ఎనిమిది గంటలకల్లా పెళ్ళికి వెళ్ళటానికి సిద్దమయింది రత్న. ఆమె వెళ్ళకుండా ఆపలేకపోయాడు రమేశ్. నిస్సహాయుడై కూర్చుండి పోయాడు.
    రత్న పట్టుచీర కట్టుకుని కూతురి దగ్గరకొచ్చి:
    "వెళ్ళి రానా ఆశా" అంది.
    "వెళ్ళమ్మా. మామయ్యా ఉంటారుగా-" అంది ఆశా.
    రత్న రమేశుడితో:
    "వెడుతున్నాను. ఫ్లాస్కులో వేడిపాలున్నాయ్. ఆశకు కావాలంటే ఇవ్వండి. సాయంత్రం నాలుగింటికి వచ్చేస్తాను" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS