Previous Page
తామరకొలను పేజి 23


    "మీరు ఏమేమో మాట్లాడకండి. తరువాత నేను బొంబాయి వదలి వెళ్ళనే వెళ్ళను. డాక్టర్ నన్ను ఇక్కడికే రమ్మని ఆహ్వానించినపుడు వచ్చేద్దామా అనుకున్నాను. కాని, మనిద్దరం ఒకచోట ఉండటం ఇద్దరి శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదని నిర్దారించాను."
    "అదే మంచిది. మీరు చదువు పూర్తిచేసి డాక్టరవాలని నిశ్చయించుకున్నారని తెలిసి నేనెంత సంతోషపడ్డానో తెలుసా?"
    "ఎంత?"
    "ఇక్కడకాదు. ఇంట్లో చూపుతాను......" అంటూ చుట్టూ చూసింది రత్న.
    "తరువాత మాట తప్పకూడదు!"
    "లేదు! అకస్మాత్తుగా మీ రలా అనగానే నా కెంత ఆశ్చర్యం, సంతోషం కలిగిందనీ!"
    "ఆశకు సీరియస్ గా ఉన్నపుడు నా కనిపించింది. నేను చదువు పూర్తి చేయకపోవడం శుద్ధ తప్పు అని. తన జబ్బేమిటి అని ముందుగానే నేను "డయాగ్నోస్" చెయ్యగలిగాను. దానితో నామీద' నాకు నమ్మకం కలిగింది"
    "ఆశ రెండురోజులు జబ్బుపడినా బాధలేదు. కాని ఆ కారణంగా మీ నిశ్చయాన్ని మీరు మార్చుకున్నారు. రమేశ్! నాకు వాగ్ధానం చేస్తారా?"
    "ఏమని?"
    "డాక్టరై ప్రజాసేవ చేస్తానని, మరి....."
    "ఊఁ. చెప్పండి."
    "మీరు డాక్టరయ్యాక తప్పకుండా పెళ్ళి చేసుకోవాలి. దయచేసి నా కోర్కెను మన్నించండి. ఈ రెండు విషయలకు మీరు వాగ్ధానం చేస్తే నేను నిశ్చింతగా ఉండగలుగుతాను."
    "మొదటిదానికి వాగ్ధానం చెయ్యగలను. రెండవదానికి విషయమే కాస్త ఆలోచించాలి."
    "ఇందులో ఆలోచించడానికేముంది? ఆలోచించాల్సినంత గహనమైన విషయం కాదే! పెళ్ళికి ముందు ప్రథీ అబ్బాయి, అమ్మాయి కాబోయే సహచరుల గురించి ఎన్నో కలలు కంటారు. మనసు చంచలంగా, నిలకడ లేకుండా ఎగిరే సీతాకోక చిలుకలా ఉంటుందపుడు. పెళ్ళయ్యాక మనసు ఒక స్థిమితాన్ని పొందుతుంది. వెనకటి సంగతులన్నీ కుర్ర చేష్టలుగా అనిపిస్తాయి....."
    రమేశ్ మధ్యలోనే ఆపి!
    "నేను దేనికయినా చాలా ప్రాధాన్యత నిస్తానో, దాన్నే అంత తేలిగ్గా తీసిపారేస్తారేం? ఆఖరి రోజు- దయచేసి నా మనసు నొప్పించకండి."
    "మీ మనస్సును నొప్పించాలని నేనీ మాట లనడంలేదు రమేశ్. అనురాగానికీ మీరిచ్చే విలువను సహించలేకుండా ఉన్నాను నేను. మట్టికి బంగారానికిచ్చినంత విలువ ఇస్తున్నారా? నిజం చెప్పాలంటే ప్రేమలో నమ్మకం లేదు నాకు."
    "రత్నా! ఏమంటున్నారు మీరు?"
    "ఉన్నమాటే అంటున్నాను. ప్రేమకు నిలకడలేదు.. చిరకాలం నిలిచేదీ కాదు. పువ్వునుండి పువ్వుకు ఎగిరే భ్రమరానికీ, ప్రేమకూ పెద్ద తేడా ఏమీలేదు. క్షణికంగా మనసును భ్రాంతి కొలిపే హృది దౌర్భల్యనైకే ప్రేమ అంటారు.
    అంతే!"
    "మీరు ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళిపోతాను" అంటూ లేచి నిల్చున్నాడు రమేశ్.
    రత్న అతడిని ఆపి!
    "ఇహ ఇలా మాట్లాడనులెండి. కాని, నాకు మాటివ్వండి- పెళ్ళి చేసుకుంటానని" అంటూ చెయ్యి చాపింది.
    రమేశ్ మళ్ళీ ఇసుకలో కూర్చున్నాడు.
    "ఎందుకు నన్నిలా బాధిస్తారు?"
    "నేను మాత్రం తక్కువ బాధ పడుతున్నానా? నా మనసుకు కాస్త శాంతి నివ్వలేరా?"
    "సరే; అలాగే చేసుకుంటాను. కాని, ఎపుడో చెప్పలేను. నా మనస్సు కుదుటపడ్డాక చేసుకుంటాను. సరేనా? మీకు శాంతి కలిగిందా?"
    అపారమైన తృప్తితో రత్న "ఊఁ" అంది.
    ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ వస్తున్న అలలవైపు చూస్తూ రమేశ్:
    "మీ అడ్రస్ చెపుతారా?" అన్నాడు.
    రత్న అదిరిపడి "ఎందుకూ?" అంది."
    "మీకు ఊరికి వెళ్ళాక ఓ ఉత్తరం రాస్తాను.
    రత్న జోరుగా తల అడ్డంగా తిప్పుతూ "వీల్లేదు రమేశ్! మీరు ఉత్తరాలేమీ రాయకండి. మనం పత్ర వ్యవహారం పెట్టుకుంటే ఇక్కడితో తెంచుకుందామనుకుంటున్న బంధం మళ్ళీ పెరగడానికి అవకాశ మివ్వటమే అవుతుంది."
    "లేదు. అలా పెరగటానికి అవకాశమివ్వను. ఇక్కడనుండి వెళ్ళాక ఒక్క ఉత్తరం మటుకు వ్రాయటానికి అనుమతివ్వండి" అంటూ బ్రతిమాలు కున్నాడు రమేశ్.
    రత్న ఖచ్చితంగా "వీల్లేదు. మీరొక ఉత్తరం రాస్తే, మర్యాదకైనా నేను జవాబు రాయాల్సి వస్తుంది. అందుకే మిమ్మల్ని రాయవద్ధంటున్నా" అంది.
    "ఇన్ని రోజులు మీ ఆతిథ్యాన్ని పొంది, కృతజ్ఞతతో మీకో ఉత్తరం రాసే అవకాశం కూడా నాకుండ నక్కర్లేదంటారా?"
    రత్న నవ్వుతూ అతడివైపు చూసి "మీరు చెప్పాల్సిన ధ్యాంక్సంతా ఇపుడే చెప్పేయండి" అంది.
    "ఉహూ నేను ఉత్తరమే రాస్తాను."
    "అయితే ఓ పని చెయ్యండి. మీకంతగా రాయాలనే ఉంటే డాక్టర్ కు రాయండి. నా అభ్యంతరం ఏమీ లేదు."
    రమేశ్ కోపంతో అన్నాడు "మిమ్మల్ని బాగా కొట్టాలనిపిస్తోంది నాకు. నేను అనుకున్నంత మంచివారు కాదు మీరు."
    "అలాగే అనుకోండి. మరీ సంతోషం. నేను మంచిదాన్నని ఏనాడూ చెప్పుకోలేదే!"
    "రత్నా!"
    "అలా పిలవకండి. నా మనసు బలహీనమై మీరడిగినదానికంత ఒప్పేసుకుంటాను. మీ మంచి కోసమే నేనింత క్రూరంగా వర్తిస్తున్నాను."
    ఇహ ఆమెను బలవంతపెట్టి లాభం లేదని ఊరుకున్నాడు రమేశ్.
    చీకటి పడుతూండగా ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఇంటికి రాగానే రమేశ్ తన వస్తువులు సర్దుకోసాగాడు. రత్న అక్కడే ఓ కుర్చీలో కూర్చుని, గడ్డానికి చెయ్యి ఆన్చి అతడినే చూస్తూ కూర్చుంది.
    రమేశ్ గుడ్డలు పెట్టెలో సర్దుతూ రెండు మూడుసార్లు రత్నవైపు చూశాడు. కాని, ఆమె అతడి చూపును గమనించలేదు. చాలా పరధ్యానంగా కూర్చుంది రత్న.
    రమేశ్ గుడ్డలు సర్దటం మానేసి రత్నవైపు సూటిగా చూశాడు. కాని, రత్న గమనించలేదు.
    రమేశ్ తన పని మానేసి రత్న దగ్గరగా వచ్చి నిల్చున్నాడు.
    రత్న తన ఆలోచనల్లో పడి, అతడు తన దగ్గరకు రావటాన్ని కూడా గమనించలేడు. రమేశ్ తన రెండు చేతులతోనూ ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకుని-
    "మీ ఆలోచనలలో నాకూ సగం వాటా ఉంది" అన్నాడు.
    రత్న మౌనంగా అతడివైపు చూసింది. ఆమె కళ్ళలో నిండిన నీరు బుగ్గల మీదుగా జారిపోయింది. రమేశ్ వ్యాకులంతో-
    "ఛ! ఏడుస్తున్నారా? తప్పుకదూ ఇంత వరకూ నాకు ధైర్యం చెప్పి ఇపుడు మీరే కన్నీరు కారుస్తున్నారా? అదీ నాలాంటి దొంగకోసం!" అన్నాడు.
    "దొంగా! మీరేం దొంగతనం చేశారు."
    "ఈ ఇంట్లోనుండి రెండు అమూల్యమైన వస్తువులను ఇంటి యజమాని అనుమతి లేకుండా తీసుకుపోతున్నాను. అవేమిటో తెలుసా?"
    రత్న తల అడ్డంగా ఊపింది.
    "మొదటిది మీ హృదయం. రెండవది, ఆఖరిదీ ఇది..." అంటూ వంగి, రత్న బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు. రత్న అతడి నుదురు, కళ్ళు, తల, నోరు-అన్నీ మృదువుగా చేత్తో తడిమి చూసింది.
    "గుడ్డివాళ్ళు చేత్తో మొహాన్ని తడిమి చూసినట్టు చూస్తున్నారేం రత్నా?"
    "మీ మొహాన్నెక్కడ మరిచిపోతానో అని భయం నాకు. అందుకే సరిగ్గా చూసి గుర్తు పెట్టుకుంటున్నాను. రమేశ్!...."
    "ఏమిటి?"
    "మీరు బొంబాయికి ఎందుకొచ్చారు?"
    "నేనూ అదే ఆలోచిస్తున్నాను. నేను రాకపోతేనే మీరు హాయిగా ఉండేవారు."
    "రేపటి నుండి మీరుండరు. ఇల్లంతా శూన్యంగా ఉంటుంది."
    "మీరు ఎంతో దైర్యం కలవారు అనుకున్నా; మీ ధైర్యమంతా మాటల్లోనే."
    రత్న మాట్లాడకుండా లేచి నిల్చుంది.
    "భోంచేద్దురుగాని రండి. రాత్రి రైల్లో నిద్రచెడకండి. పడుకుని నిద్రపోవటానికీ ప్రయత్నించండి. క్షేమంగా ఊరు చేరినందుకు డాక్టర్ కు ఉత్తరం రాయండి."
    "మీరు మళ్ళీ ఎపుడొస్తారు అటువైపుకు?"
    "మీ పెళ్ళికి లేదా మీ కూతురి పెళ్ళికి తప్పకుండా వస్తాను" అంది రత్న.
    రమేశుడికి వీడ్కోలివ్వటానికి అందరూ కార్లో స్టేషనుకు వెళ్ళారు.
    మామయ్య వెళ్ళిపోతున్నాడంటే ఆశక్కూడా బెంగగానే ఉంది. శేషగిరి కృష్ణమూర్తికి చెప్పమని ఏమేమో చెపుతున్నాడు. రత్న మాత్రం మౌనంగా కూర్చుంది.
    రైలు కదిలింది. రమేశ్ రత్నవైపు చూశాడు. ఆ కళ్ళలో రత్నకేం కనిపించిందో? వెంటనే తనను లోపలికి లాక్కుంటాడెమో నని పించి రెండడుగులు వెనక్కి వేసింది.
    రత్న తన కర్చీఫ్ ఊపింది. రమేశ్ ప్రతిమలా నిల్చున్నాడు.
    రైలు కనుమరుగవగానే అందరూ వెళ్ళి కార్లో కూర్చున్నారు. శేషగిరి రమేశుడిని ఒకటే పొగుడుతున్నాడు...
    "చాలా మంచి కుర్రాడు. మనతో బాగా కలిసిపోయాడు. కృష్ణమూర్తికి తగిన తమ్ముడు. అతడు ఇక్కడే ప్రాక్టీస్ చెయ్యాలని నా కెంతో ఆశగా ఉంది. కాని, ఎందుకో అతడికి నచ్చలా మరి..అంటూ రత్నవైపు చూశాడు శేషగిరి.
    రత్న కిటికీలోనుండి బయటకు చూస్తోంది.
    ఆశ కారులోనే నిద్రపోయింది. శేషగిరి కూతుర్ని ఎత్తుకుని పక్కమీద పడుకోబెట్టాడు. కూతురికి దుప్పటి కప్పి రత్నవైపు చూశాడు.
    రత్న పరధ్యానంగా గుడ్డలు మార్చుకుంది. శేషగిరి మంచంమీద కూర్చుని భార్యకోసం నిరీక్షిస్తున్నాడు. రత్న మెల్లిగా మందుల బీరువా దగ్గరకు వెళ్ళి తనకు కావలసిన మందు కోసం వెదకసాగింది.
    "పడుకోవా రత్నా?"
    శేషగిరి మౌనాన్ని భంగపరిచి అడిగాడు.
    "మీరు పడుకోండి."
    "నువ్వు?"
    "నాకు చాలా తలనొప్పిగా ఉంది. నిద్ర మాత్ర తీసుకొని పడుకుంటాను."    
    "తలనొప్పికి తలనొప్పి-మాత్ర తీసుకోవాలి గాని, నిద్రమాత్రెందుకు?"
    "లేకపోతే నిద్ర రాదు నాకు. దయచేసి మాత్ర ఇవ్వండి."
    రత్న పరిహాసం చేస్తోందనుకుని శేషగిరి వెనుకనుండి వచ్చి ఆమె భుజాన్ని పట్టుకున్నాడు.
    "వదలండి. ఈ రోజు నన్ను వదిలేయండి. ఈ ఒక్కరోజు. ఇంతవరకూ ఏనాడూ మీమాటకు అడ్డుచెప్పి ఎరగను. ఈ రోజు నా మాట కాదనకండి."
    హిమ సదృశమైన రత్న పలుకులు విని తెల్లబోయి వెనక్కి తగ్గాడు శేషగిరి.
    పెళ్ళయిన రోజునుండి, ఇంతవరకూ ఏనాడూ రత్న, భర్త అభీష్టాన్ని వ్యతిరేకించి ఎరుగదు.
    ఈరోజు ఎందుకిలా ప్రవర్తిస్తుందో శేషగిరికి అర్ధం కాలేదు,
    రత్న నెమ్మదిగా మాత్ర మింగి, నీళ్ళు తాగింది.
    ఆ క్షణంలో శేషగిరికి రత్న పరిష్కరించలేని సమస్యగా కనిపించింది.


                                      ---సమాప్తం----


 Previous Page

WRITERS
PUBLICATIONS