మూర్ మార్కెట్ వదిలి, కార్పొరేషన్ స్టేడియం దాటి, పీపుల్స్ పార్కు చేరారు. పార్కులో జంతుశాల కూడా ఉంది.
అందమైన పూలు, పచ్చని చెట్లు చూడగానే పద్మ మనసు పరవశించింది. చిన్నపిల్లలా పూవుల మధ్య పరిగెట్టాలనిపించింది. తను, భర్త చేయి, చేయి పట్టుకు ఒక్కసారి పార్కు అంతా చుట్టి రావాలని పించింది. అన్ని కోర్కెలూ మాధవరావు మౌనంలో అణిగిపోయాయి.
మాధవరావు ఒక పెద్ద చెట్టుకింద మంచి జాగా చూసుకు కూర్చున్నాడు. అతనికి ఎదురుగా కూర్చుంది పద్మ. చుట్టూ ఉన్న పొదలు వారిని బయటి ప్రపంచం నించి వేరు చేస్తున్నాయి.
'ఎలా మొదలుపెట్టాలా?' అనుకుంటూ భయంతో తల వంచుకుని కూర్చుంది పద్మ. పుస్తకాలలో పేజీలు తిప్పుతూంది చేతితో. మాధవరావు దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. ఎదురెదురుగా కూర్చున్న ఆ అందమైన జంట భార్యాభర్తలుగా, స్నేహితులుగా లేరు. విరోధుల్లా ఎడమొఖం పెడమొఖం అయి కూర్చున్నారు.
చివరికి మాధవరావు విసుగ్గా అన్నాడు: "ఏమిటి మాట్లాడాలి?"
ఆ మాటా, మాట్లాడే తీరూ చూడగానే ఒక్కసారి అసహ్యంవేసింది పద్మకి. దానితోపాటు మొండిదైర్యం వచ్చింది.
"ఎన్నాళ్ళీ కాపరం?" అంది.
"అంటే?" కనుబొమలు ముడుస్తూ అన్నాడు మాధవరావు.
"మనం అపరిచితులుగా, విరోధులలాగా గడపడం ఎన్నాళ్ళు?"
"మనమేమీ విరోధులం కాము." మాధవరావు అన్నాడు.
"విరోధులం కాకపోతే, మీరు నాతో ఎప్పుడూ మాట్లాడరు ఎందుకని?"
"అవసరం ఉండదు కనక."
"భార్యతో మీకు ఏ అవసరం లేదా?"
"లేదు."
"మరి పెళ్ళెందుకు చేసుకున్నారు?"
"అమ్మకోసం."
"అమ్మ చేసుకోమన్నారా? మరి అమ్మ పెళ్ళాంతో కాపరం చెయ్యవద్దనలేదే!"
"మరెందుకు అంటీముట్టనట్టు ఉంటారు నాతో?"
"ఎలా ఉండమంటావు?"
పద్మకి ఎలా వివరించాలో తెలియలేదు. కోపం వచ్చింది.
"ఎలా ఉండమంటానా? అందరు భర్తలూ వారి భార్యలతో ఎలా ఉంటారో అలాగే ఉండమంటాను. సరదాగా మాట్లాడమంటాను. భార్యతో కలిసి జీవించ మంటాను. కలిసి తిరగమంటాను. కష్టసుఖాలు భార్యతో పంచుకోమంటాను. సంతోషం, దుఃఖం భార్యతో కలిసి అనుభవించమంటాను." ఉద్రేకంగా మాట్లాడింది పద్మ.
"కాని నిన్ను బయటికి తీసుకువెళితే, మాట్లాడుతూ ఉంటే అమ్మ బాధపడుతుంది!"
"మాట్లాడకపోతే నేను బాధపడతాను. భార్య ముఖ్యం కాదా మీకు? అమ్మే ముఖ్యమా?"
"అవును, అమ్మే ముఖ్యం. అమ్మ సుఖమే ముఖ్యం నాకు."
పద్మ హతాశురాలైపోయింది.
"నేనుకూడా మనిషినని ఎందుకు గుర్తించరు మీరు? నాకూ కోరికలు ఉంటాయి. నాకూ సరదాలు ఉంటాయి. మీ అమ్మ సుఖంకోసం నా సుఖం, సంతోషం ఎందుకు బలిచేసుకోవాలి?" పద్మ తల మోకాళ్ళ మీద పెట్టుకుని ఏడ్చింది.
మాధవరావు దూరంగా అలాగే మౌనంగా కూర్చున్నాడు. అతను భార్యదగ్గిర చేరి ఊరడించలేదు; ఆప్యాయంగా ఆపలేదు. ఏడ్చి తన బలహీనత బయటపెట్టు కున్నందుకు పద్మే బాధపడింది. కళ్ళు తుడుచుకుంది.
"మా అమ్మ జీవితం తెలిస్తే నువ్విలా మాట్లాడవు' అన్నాడు మాధవరావు.
పద్మ ఏం మాట్లాడలేదు. అతని ముఖం చూస్తూ ఊరుకుంది.
"మా అమ్మ చాలా దురదృష్ట వంతురాలు. ఆవిణ్ణి చూసి జాలిపడాలి.
అమ్మ పురిటి గుడ్డుగా ఉండగానే మా అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ చనిపోయి ఏడాది తిరగక ముందే మా తాతగారు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. కొత్తభార్య చాలా గయ్యాళి. ఆవిడికీ ఏడాదిలోనే ఒక ఆడపిల్ల పుట్టింది, అంటే మా పిన్ని.
మా అమ్మ ఎంతో అందగత్తెట. మా పిన్ని బాగుండేది కాదుట. దీనితో మా కొత్త అమ్మమ్మకి అమ్మ అంటే ఈర్ష్యట. ఎప్పుడూ సమంగా చూసేది కాదుట. కొత్తభార్య మోజులో ఉన్న తాతగారు కూడా అమ్మని పట్టించుకునేవారు కారుట. చిన్నతనంలోనే అమ్మకి తల్లిదండ్రుల ప్రేమ కరువైంది. 'నేను ఎవ్వరికీ అక్కరలేదు. దేవుడు నన్నెందుకు పుట్టించాడు?'- అని ఏడ్చేదిట, ఒంటరిగా కూర్చుని అమ్మ.
కొంచెం పెద్ధది అయ్యాక సవితి తల్లిదండ్రుల ప్రేమకోసం వాళ్ళు చెప్పిన మాటల్లా విని చాలా బుద్దిగా ఉండేదిట. సవితితల్లి చెప్పిన పని అల్లా చేసేదిట. కాని చివరికి అమ్మకి చాకిరీయే మిగిలింది. అనురాగం కరువైంది. ఏ కొత్త వస్తువు తెచ్చినా, ఏ మంచి బట్టలు తెచ్చినా పిన్నికి ముందుగా ఇచ్చి, మిగిలినవి అమ్మకి ఇచ్చేవారుట. తాతగారు కోర్టునించి వస్తున్నప్పుడు అమ్మ, పిన్ని రోజూ రోడ్డుమీదికి పరిగెత్తుకు వెళ్ళి కలుసుకునేవారుట. తాతగారు అమ్మ భుజం మీద ఒక్కసారి చరిచి ఊరుకునేవారుట. పిన్నిని మాత్రం రెండు బుగ్గల మీద ముద్దుపెట్టుకుని, ఎత్తుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళేవారుట. అమ్మ 'నాన్న నన్ను ముద్దుపెట్టుకుని, ఎత్తుకు తీసుకువెళ్ళరేం?' అనుకుని బాధపడేదిట.
అమ్మకి పధ్నాలుగు ఏళ్లప్పుడు పెళ్ళి చేశారుట. పెళ్ళిలోకూడా పక్షపాతం. పిన్నికి బోల్డు కట్నం ఇచ్చి బాగా చదువుకున్న అబ్బాయిని చేశారుట. అమ్మకి మామూలు సంబంధాలు చేశారు. మా నాన్న అంత చదువుకోలేదు.
అమ్మ పెళ్ళి అవగానే కాపరానికి వచ్చిందిట. అమ్మకి అత్తగారు, ఒక ఆడబడుచు ఉండేవారుట. ఇద్దరు చిన్నపిల్లయిన అమ్మని ఎన్నో బాధలు పెట్టే వారుట. రోజూ మోటబావిలోనించి నీళ్ళు తోడడం, ఇంటెడు చాకిరి, వంటపని - అన్నీ అమ్మేనుట. నాన్నగారు ఎప్పుడూ పొలంపనులమీద తిరిగేవారుట. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మతో ఎక్కువ మాట్లాడే వారు కాదుట. ఆయనకి తల్లి వాక్కు వేదవాక్కు. ఆవిడ ఎలా చెబితే అలా చేసేవారుట. అమ్మతో ఆయన కాపరం చేసింది నాలుగు నెలలేనట. ఒక రోజు పొలంలో పాము కరిచి హఠాత్తుగా మరణించారు మా నాన్నగారు. అమ్మకి అప్పటికి మూడోనెల కడుపు.
కొడకు మరణించగానే కోడలిని ఇంట్లోంచి పొమ్మన్నారుట అత్తగారు. అమ్మ ఎక్కడికి వెళుతుంది? అటు సవితితల్లి ఆరడి, ఇటు అత్తగారి విదిలింపు. భర్త మరణంతో కుములుతున్న అమ్మ 'నేను ఎవరికీ అక్కరలేదు. నన్నెందుకు చంపెయ్యవు భగవంతుడా!' అని ఏడ్చేదిట.
అత్తగారు పెట్టేకష్టాలకీ, సూటీపోటీ మాటలకీ తట్టుకోలేక పుట్టిల్లు పట్టింది అమ్మ. 'దిష్టి ముఖం, మూడు నెలలకే మొగుణ్ణి పొట్టన పెట్టుకుంది' అని తిట్టేదిట సవితితల్లి.
అమ్మకి నేను పుట్టగానే కొంత ధైర్యం వచ్చిందిట. 'నేను బ్రతకాలి. నేను లేకపోతే నా బాబుని ఎవరు చూస్తారు?' అనుకునేదిట. రోజంతా పసిపిల్లవాడి తోనే గడిపేదిట. పిల్లవాడిని ఎవ్వరూ ముట్టుకోకూడదుట. అమ్మని ఏడిపించాలని అప్పుడప్పుడు సవితి తల్లి పిల్లాడిని దాచేసిదిట. అలా చేసినప్పుడల్లా అమ్మ పిచ్చెత్తినట్టు ఏడుస్తూ, జుత్తు పీక్కుంటూ ఇల్లంతా పరిగెత్తేదిట!
అమ్మ కష్టాలుపడుతూ పుట్టింట్లోనే అయిదు ఏళ్ళు ఉంది. ఇంతలో మా తాతగారు మా నాన్నగారి ఆస్తికోసం దావా వేశారు. అమ్మకి మా నాన్నగారి ఆస్తి అయిదు ఎకరాలు వచ్చింది. పొలంమీద రైతు లని నియమించి, శిస్తు అమ్మకి వచ్చేటట్టు ఏర్పాటు చేశారు తాతగారు. ఆస్తిరాగానే అమ్మ తన కొడుకుతో వేరే ఉంటానని చెప్పిందిట.
తాతగారే మద్రాసులో ఇల్లు చూసి, అమ్మని ఇక్కడికి తీసుకువచ్చారు. అప్పటికి అమ్మ వయస్సు ఇరవై సంవత్సరాలు. నేను అయిదేళ్ళవాడిని. మేం ఇద్దరం మద్రాసులో ఆ ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఉండే వాళ్ళం. అమ్మకి నేను, నాకు అమ్మ. మా ఇద్దరికీ ఇంక ఎవరూ సాయం లేరు.
ఒంటరిగా, చిన్న కొడుకుని పెట్టుకుని బ్రతికే అమ్మ ఎన్ని బాధలు పడిందో! అమ్మ ఆశలన్నీ నామీదే. ఆవిడ ప్రేమంతా నామీదే. కొడుకే ఆవిడికి సర్వస్వం. నా ప్రేమంతా ఆవిడికే కావాలి. ఇంకెవరినేనా నేను ఇష్టపడుతున్నానంటే ఆవిడ సహించలేదు. నేను ఒక అరగంట ఆలస్యంగా ఇల్లు చేరితే ఆవిడ ప్రాణం విల విల్లాడుతుంది."
మాధవరావు ఆగాడు. అతని ముఖం కోపంతో కందగడ్డలా ఎర్రపడింది. పద్మకి భర్తని చూస్తే భయం వేసింది. ఏదైనా చెప్పి అతనిని ఊరడించాలని ఉన్నా, ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది.
కాసేపు ఉన్నాక మాధవరావే మాట్లాడాడు.
"మా అమ్మని కష్టాలు పెట్టిన ప్రతివాళ్ళని తలుచుకుంటే, చూస్తే నాకు వాళ్ళని తన్ని, చంపాలని ఉంటుంది. బంగారం లాంటి అమ్మ జీవితాన్ని నాశనం చేశారు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎరగదు అమ్మ. అమ్మకి అవన్నీ ఎండమావులు. ఏం తప్పుచేసిందని అమ్మ వంచించబడాలి? అమ్మని క్రూరంగా హింసించిన మానవులంటే అసహ్యం నాకు. అందరి దగ్గిరనించి దూరంగా అమ్మని తీసుకువెళ్ళిపోవాలని ఉంటుంది. అమ్మకోసం, అమ్మ సుఖంకోసం ఏమైనా చేస్తాను నేను. నా జీవితమంతా ఆవిడికే అంకితం చేస్తాను. ఆవిడ ఇక కంటనీరు పెట్టకూడదు; ప్రేమకోసం తపించకూడదు."
మాధవరావు కళ్ళలో తిరిగిన నీళ్ళు చూసి చలించింది పద్మ అతని తలని తన గుండెలకు హత్తుకుని ఊరడించాలనిపించింది.
హఠాత్తుగా లేచాడు మాధవరావు.
"ఇంక వెళ్ళిపోదాం, పద" అన్నాడు.
పద్మ తెల్లబోయింది. "కాసేపు కూర్చుందాం" అంది లేవకుండానే.
"ఉహు, నే నిక్కడ కూర్చోను, అమ్మకి తెలిస్తే బాధపడుతుంది" అన్నాడు.
"అమ్మకి ఎలా తెలుస్తుంది?" ఆశ్చర్యపోతూ అడిగింది పద్మ.
"అమ్మకి తెలిస్తే బాధపడుతుంది." అతని జవాబు మూర్ఖంగా వినిపించింది.
"ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం? మధ్యాహ్నం ఒంటి గంట అయింది. ఇంటికి ఎలా వెళ్ళను?" అంది పద్మ.
"నువ్వు కాలేజీకి వెళ్ళిపో నేను మధ్యాహ్నం సెలవు కాన్సిల్ చేసుకుని ఆఫీసులో పనిచేస్తాను." మాధవరావు వెనక్కి తిరిగి నడక సాగించాడు. పద్మకి లేవక తప్పిందికాదు.
సెంట్రల్ స్టేషన్ దగ్గిర ఇద్దరూ రెండు బస్సులు ఎక్కి రెండు గమ్యాలవైపు ప్రయాణం సాగించారు.
కాలేజీలో ఒక్క పాఠం వినలేదు పద్మ. ఆలోచనలన్నీ అత్తగారి వేపు. భర్త వేపు పరిగెత్తాయి. అత్తగారు చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డట్టు ఈ రోజే తెలిసింది. ఇప్పటికేనా భర్త హృదయం విప్పి అన్నీ తనతో చెప్పి నందుకు సంతోషంగానే ఉంది. అత్తగారిని చూస్తే జాలి వేసింది.
కానీ పద్మకి ఎన్నో ఊహలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అత్తగారు కొడుకుని ప్రేమించినట్టే కోడలినికూడా ఎందుకు ప్రేమించకూడదు? తను అత్తగారిని నెత్తిమీద పెట్టుకుని పూజిస్తుందే! తనని అత్తగారు ఎందుకు అసహ్యించుకుంటుంది? అత్తగారికి కరువైన సుఖం, సంతోషం కోడలికి కూడా అందకూడదా? ఇదెక్కడి సిద్దాంతం!
అంతా అయోమయంగా ఉంది. భర్తతో మాట్లాడి తన సమస్యలు తీర్చుకుని, కాపరం చక్కబరుచుకోవాలని అనుకుంది. కాని ఇప్పుడేమైంది? చీకటిమయమైన బయలులోనించి పరిగెత్తి, అంధకారబంధురమైన అడివి మధ్య చిక్కుకుపోయింది.
24
భానుమతికి పెళ్ళి అయ్యాక ఇంట్లో జరిగిన పెద్ద మార్పులేమీ లేవు. ముందుగదికి వెనకగదికి మధ్య తలుపులు తెరుచుకున్నాయి. ఇంటిలోకి, బయటికి రాక పోకలు ముందు ద్వారంగుండానే జరుగుతున్నాయి. రాత్రి మాత్రం ముందుగది నూతన దంపతులకి ప్రత్యేకించారు. రామారావుగారు అల్లుడి హోదాలో వంటింట్లో శాంతమ్మ చేతి భోజనం తింటున్నారు. "మాస్టారూ!" అని గౌరవంగా పిలిచే పిల్లలంతా "బావగారూ!" అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. చారుమతి సంపాదనకి రామారావుగారి సంపాదనకూడా కలవడంవల్ల కుటుంబం ఆర్ధిక దుస్థితి నించి కొంచెం కోలుకుంది. 'ఆయాసపడుతూ పరుగులెత్తడం మాని కాస్సేపు నిలబడి నీళ్ళు త్రాగవచ్చును' అనుకుంది చారుమతి. ఇంట్లో అందరినీ బాధించే విషయం ఒక్కటే-శంకరాన్ని గురించిన బెంగ. శంకరం దగ్గిరనించి ఒక్క ఉత్తరమూలేదు. ఇంటినించి పారిపోయి ఏడాదిపైన అయింది. అందరికంటే బాధపడేది ముసలమ్మ. ఆవిడ శంకరాన్ని తలుచుకుని బాధపడని రోజు లేదు.
జనవరి వచ్చింది. సంక్రాంతి వెళ్ళి మూడు రోజు లైంది. ఇంకా చలి 'ఉన్నాను' అంటూంది.
ప్రొద్దున్నే ముఖం కడగటానికి ముసలమ్మ దగ్గిరికి వేడినీళ్ళు తీసుకువెళ్ళిన భానుమతి ఆవిణ్ణి చూసి భయపడింది. మనిషి మైకం కమ్మినట్టు కళ్ళు మూసుకుని పడిఉంది. పిలిస్తే పలకలేదు.
"అమ్మా, మామ్మ ఇలా ఉందేమిటమ్మా! పిలిస్తే పలకటం లేదు" అంటూ భానుమతి తల్లిని కేకవేసింది.
వంటపని చూసుకుంటున్న శాంతమ్మ హడావిడిగా వచ్చి, "అత్తా, అత్తా" అంటూ తట్టి లేపింది. ముసలమ్మ లో చలనం లేదు. "అల్లుడిగారిని పిలుచుకురామ్మా!" అంది భగవతివైపు తిరిగి.
రామారావుగారు వచ్చి చూశారు. ముసలమ్మ చనిపోయిందేమోనని భయంవేసింది ఆయనకి. వెంటనే డాక్టరు కోసం వెళ్ళారు.
డాక్టరు వచ్చి ముసలమ్మని చూసి పెదవి విరిచి అన్నారు:
