"మీరు చాలా షాక్ తిన్నారు. అసలు మీ ముఖమే చాలా మారిపోయింది. మాకే వింటే యెంతో బాధకల్గించింది. ఇంక మీకు చెప్పాలా. పాపం......అర్ధాయుష్కుడు. అతను బాగుంటే మీరు అతన్ని చాలా పైకి తీసుకువచ్చేవారు. అలా జరుగుతుందని అందరూ అనుకున్నారు కూడా. మీ మాలని అతనికిచ్చి పెళ్ళి చేస్తారు అనికూడా అన్నారు కదూ. పోనీయండి మరిచి పోవటానికి ప్రయత్నించండి. అయ్యో టిఫిన్ తీసుకోండి....." అంటూన్నదేగాని వాకిలి వైపు ఆతృతగా చూస్తూనే వుంది.
"నాకు ఆకలి లేదు. టీ ఒక్కటీ చాలు అంటూ కప్పు చేతిలోకి తీసుకుని" నాకో వందరూపాయలు కావాలి. నెమ్మదిగా తీరుస్తాను అడగలేక తప్పనిసరికి యెలాగో అడిగేశాడు.
"అంత ఆలోచిస్తారేం ఇంత చిన్న విషయానికి. వంద కాదు వెయ్యి కావాలన్నా ఇస్తాను. ఇంత చిన్న విషయం కోసం మీరు రావాలా కబురు పంపినా ఇచ్చేదాన్ని కదూ!" క్షణం ఆగి మళ్ళీ అంది. డ్రైవర్ కి ఇచ్చి పంపిన పాంట్లూ, షర్టులూ యెందుకు పంపించేశారు. చాలా ఇబ్బందిలో వున్నారని పంపాను."
"క్షమించండి, మీ సహృదయతకి ధన్య వాదాలు"
"ఇలా అంటూనే అన్నీ తిరస్కరిస్తూ వున్నారు. ప్లీజ్ తీసుకోండి" ఎలాంటి భావమూ వ్యక్తం కాకుండానే అన్నది వైదేహి. కాని వాసుకి మాత్రం యేదో తెలియని బాధ మనస్సుని కోస్తోంది. తన అసమర్ధతని గడుసుగా యెత్తి చూపిస్తున్నట్లు అనిపించింది.
"అనాయాసంగా వచ్చేడబ్బుతో అవసరాలని తీర్చుకోవాలనే కోర్కె నాకు లేదు. ఒకవేళ అంతగా అవసరం వస్తే మొట్టమొదటగా మీదగ్గరికే యాచనకి వస్తాను."
వాసు ఆవేశాన్ని ఆపుకుంటూనే అన్నాడు. వైదేహి నొచ్చుకుంటూ అంది.
"అపార్ధం చేసుకుంటున్నారు" ఆతృతగానే వాకిలివైపు చూస్తూ అంది.
ఛీ.... ఈరోజు ఇక్కడికి రాకుండా వుంటేనే బాగుండేది! ఎవరు వస్తారనీ అంతగా భయపడుతోంది వైదేహి. యెవరు వస్తే మాత్రం భయపడవలసిన అవుసరం యేంవుంది. సర్వ స్వతంత్రురాలైన వైదేహికీ భయమా యేమిటో? అసహనంగానే కూర్చున్నా మహా చికాగ్గా వుంది. అందుకే లేచి నిలబడ్డాడు.
"అయ్యో... అసలు వచ్చిన పనేమర్చివెళ్ళిపోతానంటే యెలా.... ఇప్పుడే వస్తాను. కూర్చోండి" మరో గదిలోకి వెళ్ళింది.
వాసుకి ముళ్ళమీద కూర్చున్నట్లుంది. రెండు చేతులవేళ్ళూ విరిచాడు, సోఫా కవరు మీద ఎంబ్రాయిడరీని పరీక్షించాడు. కిటికీ కర్టెన్ మీది పువ్వులకేసి తదేకంగా చూశాడు. ఇంతలో చప్పున గుర్తువచ్చింది. జ్వరంతో నేను ఈ పక్కగదిలోనే గదూ ఆ రోజులు గడిపింది. ఎంత విచిత్రం. ఒక్కపావుగంట కూడా కూర్చోలేకుండా వున్నాడు. అప్పుడు ఎలా గడపగలిగాడు?
పరిస్థితులు మానవుడిని కీలుబొమ్మలు చేస్తాయి. వాసు ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. వెనకద్వారం లోనించి బూట్లశబ్దం టకటక అంటూ.
"రాణీ ఇల్లంతా వెతికినా కన్పించకుండా ఎక్కడ దాగున్నావే బామ్మా. నాముద్దుల గుమ్మా పోయింది.....వుద్యోగం.......వూడి........పోయింది. పోతేపో..... యిందిలే. అని వచ్చేశానే. అసలు నువ్వు అలా చెయ్యమని చెప్తూనే వున్నావుగా. వెధవ వుద్యోగం వుంటే యెంత పోతే యెంత అవునంటావా. అసలు నువ్వు కనపడకుండానే ప్రశ్నవేస్తే జవా బెవరిస్తారు. ఏదీ గొంతు యెండిపోతోంది. కొత్త సరకు తెప్పించానన్నావుగా తీసుకురా. ఇద్దరం కట్ట కట్టుకుని తాగేద్దాం. బ్రతికితే ఇద్దరం బ్రతకాలి. చస్తే ఇద్దరం చద్దాం. అని నేనన్నానా...కాదు నువ్వన్నావు. "ఖిలోనా" యెక్కడున్నావూ అంతఃపురంలోనా? యేడు ద్వారాలు దాటి వచ్చానే నీ దర్శనం కోసం. రావే ఒక్కసారి. ఇవ్వవే నాకు" అంటూ తూలుతూ నిషాలో మాట తడబడుతుంటే ఆ వ్యక్తి లోపలికి వచ్చి వాసు పక్కన కూలబడ్డాడు.
వాసు అతన్ని చూస్తూనే చివ్వున లేచి నిల్చున్నాడు. ఆశ్చర్యం, కోపం దుఃఖం పెల్లుబుకుతుంటే "అన్నయ్యా" పెద్దగా అరిచాడు.
"యెవడ్రా...ఆ గాడిద అన్నయ్యట. ఎవరు యెవరికి అన్నయ్య. అసలు ఇం....తకీ, నువ్వెవరూ...ఓ....వాసుదేవరావుగారా. మీ శ్రీమతి యెక్కడా.... లేదూ..... ఇంకొకడితో లేచి పోయిందా! పోతే పోయిందిలే, విచారపడకు. అసలు ఇక్కడి కెందుకొచ్చావూ. నాకు మల్లే బాగుపడదామని బుద్ది పుట్టిందా?.... ఒరేయ్ ఈ ఇంట్లో అడుగెట్టిన వాడెవడూ బాగుపడడ్రా. కాదు వైదేహి....బాగు....పడనీయదు.... నీకు తెలియకపోతే నే చెప్పాగా ఫో..."
చేతిలోని కోటుని విసిరి వాసు ముఖాన పారేసి యెర్రటి కళ్ళతో వాసునే చూస్తున్నాడు రాఘవ రావు.
ఇదంతా నిజంగానే జరుగుతున్నదా? అన్నయ్య ఇక్కడికా రోజూ వచ్చేది, "ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య" అని అడిగితే వదిన కుళ్ళి కుళ్ళి ఏడ్చి జవాబివ్వనిది ఇందుకా? అన్నయ్య పతనానికి వైదేహి కారణమా...........? ఏమిటీ విచిత్రం. ఇది నిజమే? అవును నిజం. కాదు నిజం కాకూడదు. తాగుడుకూడా ఎలా అలవాటయిందీ?
వాసు మెదడులో యెన్నో వురుములూ మెరుపులూతో తుఫానులాంటి భీభత్సం చెలరేగింది.
"ఇదిగో వాసు బాబూ."
అయిదు వందల రూపాయల కాగితాలతో వైదేహి వచ్చి రాఘవరావుని చూస్తూనే కంపించిపోయింది.
వైదేహిని చూస్తూనే రాఘవరావు.
"డార్లింగ్.... ఆఫీసు పీడా విరగడ చేసుకువచ్చేశాను. ఇంక నేనూ నువ్వు ఈనా అమృత భాండం.... ఇంతవరకూ స్వర్గానికి బెత్తెడు యెడంగా బ్రతుకుతున్నాం. ఆ దూరం దాటటానికి ఒకే ఒక్క "జంప్" చేసేశాను. ఇలా ఒక్కసారి రా" అంటూ వైదేహిని పట్టుకుని గిరగిరా తిప్పేస్తూంటే పాట లంకించుకున్నాడు.
వైదేహి జారిపోయే పమిట గట్టిగా పట్టుకుంటూ విడిపించుకోవటానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తూంటే వాసు కళ్ళు అగ్ని వర్షించేటట్లు న్నాయి.
"వదలను. వదలను వదలనులే" అంటూ పమిట బలంగా లాగేసి గట్టిగా ముద్దుపెట్టేసు కున్నాడు.
ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకున్నా అదే కన్పిస్తోంది వాసుకి.
"ఛీ....ఛీ....ఇంత నీచురాలివా నువ్వు. రాక్షసీ.... నువ్వేనా మా సంసారానికి నిప్పు పెట్టింది. నిన్ను.... నిన్ను...." కోపంతో వైదేహిమీదకి లేస్తున్న వాసుని అడ్డుకున్నాడు రాఘవరావు.
"వెళ్ళమంటే ఇక్కడే వున్నావా! అసలు వీడిని ఇక్కడికి యెందుకు రానిచ్చావ్..." అంటూ చాచి చెంప పగిలేలా కొట్టాడు వైదేహిని.
వైదేహి స్థితి పూర్తిగా అర్ధమయిపోయింది వాసుకి.
"నామీద ప్రేమ కుమ్మరిస్తూ నా సోదరుడిని ఈ స్థితికి తెచ్చేసి పన్నాగం కాస్త కూడా అర్ధం చేసుకోలేకబోయానే. అన్నయ్యని అడ్డంపెట్టుకుని వదిన్ని హింసించి నన్ను లొంగదీసు కోవాలనే నీ కోర్కె.....వూ..... తెలిసింది....నీ నిజరూపం బయటపడింది. నువ్వు కులస్త్రీవి, ఏ "వారకాంక్షా" నీలాగా ప్రవర్తించదు. దేవుడి లాంటి అన్నయ్యని ఈ స్థితికి తెస్తావా...? చూస్తాను. ఇంక చూస్తాను నీ అంతు... నీ అబ ఈ రోజుతో కట్టిస్తాను. అసలు నీలాంటి వాళ్ళు బ్రతక్కూడదు. చావు"
అంటూ అక్కడే వున్న గాజు ఫ్లవర్ వాజ్ విసిరి కొట్టి.
"అన్నయ్యా రాపోదాం? ఇంటికి రా రావూ. ఎలారావో చూస్తాను. అంటూ అన్నగారిని బలవంతంగా పట్టుకుని లాక్కువెడుతూంటే రాఘవ రావు గింజుకుంటున్నాడు. నౌకరు అడ్డం వచ్చాడు. వాసు తన్నిన తన్నుతో వెనక్కిపడ్డాడు వాడు.
"దారినపోయే టాక్సీలో తోసి తలుపు మూసేశాడు. రాఘవరావు గింజుకుంటూనే వున్నాడు. టాక్సీ కదిలి వెళ్ళిపోయింది.
వైదేహి కిటికీలోంచి అంతా చూస్తూనేవుంది. ఆమెకి కోపంగాని. యేడుపు గాని రావటంలేదు. ఎందుకు యేడవాలి? అనుకుంది.
ఇలా జరుగుతుంది అని తేల్చేసింది అయితే అన్నగారిని వదలమని వాసు తనకాళ్ళని పట్టుకుంటాడనీ అప్పుడు తిరస్కారపూర్వకంగా వో పైశాచికమైన నవ్వునవ్వి తన గుండెల్లో దాగి వున్న మంట కి ప్రతీకారం తీర్చు కోవాలని కలలుగన్నది. అసలు వాసుకి అన్న గారిని బలవంతంగా తీసుకువెళ్ళ గలిగినంత శక్తి వున్నదని తనకి తెలియదు.
అందుకే ఈ యెత్తులో తను ఓడిపోయింది. తిరిగి మరో అడుగు వెయ్యలేనంత చిత్తుగా వోడిపోయింది. ఎంతబాధ కల్గించుకోకూడదు అనుకున్నా వైదేహి కళ్ళనించి నీళ్ళు జల జలా రాలాయి.
రెండింటికీ చెడిన రేవడిని. ముఖం కప్పుకుని యేడుస్తూంది వైదేహి.
ఆ స్త్రీని యెవరు ఓదారుస్తారు?
* * *
"వదినా... వదినా అన్నయ్యని తీసుకువచ్చాను. అన్నయ్య వచ్చేశాడు వదినా" అంటూ సంతోషంగా వదినగారి చెయ్యి పట్టుకుని కుదిపి చెప్పాడు.
శ్రీలక్ష్మికి కాస్త జ్వరం తగ్గినా చాలా బలహీనంగా వుండి కళ్ళుమూసుకు పడుతుంది. మరిది గొంతు విని కళ్ళుతెరిచింది. రాఘవరావు విషా దిగిపోయి భార్య ముఖం చూడలేక తల దించుకుని నిల్చున్నాడు. పిల్లలిద్దరూ భయంగా చూస్తూ నిల్చున్నారేగాని తండ్రి దగ్గరకి వెళ్ళలేదు.
శ్రీలక్ష్మి భర్తవైపు చూసింది.
వాసు అన్నయ్యా, వదినలవైపు చూస్తున్నాడు ఆదుర్దాగా.
శ్రీలక్ష్మి తనని యెన్నో ప్రశ్నలు వేస్తుందని అనుకున్నాడు.
కాని అలాంటిదేదీ జరగలేదు. అలాంటి ఆశే కన్పించలేదు.
"వదినా.... మాట్లాడు. వదినా" అంటూ చిన్న పిల్లవాడిలాగా కిందకూర్చుని మంచం మీద ముఖంపెట్టి తనని పల్కరిస్తున్న మరిదిని చూస్తూంటే శ్రీలక్ష్మికి దుఃఖం కట్టలు తెంచుకుంది. కనుకొలుకుల్లోని నీటి బిందువులు క్రిందికి జారినాయి.
"వాసుబాబూ.......ఆయన్ని యెందుకు తీసుకు వచ్చావ్? వాసూ ఆయన్ని వెళ్ళిపొమ్మను. ఇక్కడనించి వెళ్ళిపొమ్మను."
"వదినా.... ఏమిటి.... నీకేమన్నా మతి పోయిందా?" వాసు ఆదుర్ధాగా అడిగాడు.
"మతి చలించటానికి జ్వర తీవ్రత లేదు వాసుబాబూ. నేను.... సావిత్రీ, దమయంతీ, సీతాదేవీ కాను..... సతీ సుమతిని అసలేకాను. ఇరవైయవ శతాబ్దం ఆఖరిలో బ్రతుకుతున్న మామూలు స్త్రీని. అందుకే భార్య అక్కరలేని పురుషుడి కాళ్ళు పట్టుకోలేను. నేను నా పిల్లలని బ్రతికించుకోగలను. ఆయన్ని వెళ్ళిపొమ్మను. ఆవేశంగా అంటూ నిర్లిప్తంగా నవ్వింది శ్రీలక్ష్మి.
"వదినా..... నా మాట విను. ఒక్కసారి."
"వినను..... ఈ విషయంలో యెవ్వరి మాటా వినను" దృఢంగా అంది. వాసు బిత్తరపోయాడు.
"అది కాదు. వదినా నేను చెప్పేది...."
"నువ్వు చెప్పబోయేదినాకు తెలుసులేవయ్యా. డిగ్రీలు లేని నువ్వు యేం చేస్తావ్. ఎలా బ్రతుకుతావ్. అనేగా నీవు అడగబోయే ప్రశ్న. వాసుబాబూ..... కేవలం బ్రతుకు తెరువుకోసం సంపాదించుకోవాలంటే గౌరవప్రదమైన దారులు యెన్నో. నీతిగా నిజాయితీలు గంజి తాగైనా తృప్తిగా బ్రతకవచ్చు.
ఇంక ఏం మాట్లాడతాడు. ఏం మాట్లాడ గలడు.
"వాసూ ఈ ప్రపంచంలో డబ్బుకి చాలా ప్రాధాన్యమే వుంది. కాదనను. కాని డబ్బుతో కొనుక్కోలేనివి కూడా వున్నాయని ఒప్పుకుంటావా?"
గొంతు తడారిపోయింది శ్రీలక్ష్మికి. మంచి నీళ్ళు తాగింది.
రాఘవరావు ఆ గదిలోనించి ఎప్పుడు వెళ్ళిపోయాడో యెవ్వరూ చూడలేదు. వాసు వళ్ళో తల పెట్టుకుని వీణ నిద్రపోయింది. వీణ తల నిమురుతూ ఆలోచిస్తూ వుండిపోయాడు వాసు. వదిన చెప్పింది నిజం వదిన సుమతి కాదు. శ్రీలక్ష్మి నైతిక విలువలనించి దిగజారకుండా యెవరికి వారు జీవితాన్ని క్రమపంథాలో నడిపించుకోవాలి. ఇది ఒకర్ని ఒకరు హెచ్చరించవలసి రావటం యెంత దురదృష్టం.
ఈ గాయపడిన మనస్సుని కాలమే మార్చగలగాలి. అప్పుడు గాని అన్నయ్యా వదినా యేకం కాలేరు. తప్పకుండా యేకం అవుతారు. ఎన్ని మార్పులు వస్తున్నా స్త్రీలో ఇంకా క్షమాగుణం సన్నగిల్లలేదు' అందుకే ఈ సమాజపు పునాదులు నిల్చివున్నాయి.
* * *
