8
ఈ వాదానికి ఏం బదులు చెప్పాలో అర్ధం కాలేదు మీరకి. ఒక విధంగా శాము చెప్పిందీ నిజమే అనిపించింది. తను పుస్తకాలు చదివి ఏ పరీక్షలకు వెళ్ళాలి? చదవకపోతే మునిగిపోయిందేమిటి? అన్ని వృధా అనిపించింది. ఒక్క క్షణం ఆమె మొహంలో వోటమి తొంగిచూసింది.
శాము అక్కరతో ఆమె మొహంలోని మార్పు లనే గమనిస్తున్నాడు.
"మీకు డబ్బు దండుగ అనిపిస్తే తెప్పించక్కర్లా" అని గబుక్కున వెనుదిరిగి వెళ్ళిపోబోయింది మీర. కాని ముందే జాగ్రత్త పడిన శాము చటుక్కున ఆమె చెయ్యి పట్టుకొని తన దగ్గరకు లాక్కున్నాడు.
"నా దగ్గరనుండి ఎవరూ కోపంగా వెళ్ళిపోవడానికి వీలులేదు"
"నాకేం కోపంలేదు."
"అద్దం తెచ్చి పెట్టమంటావా?"
"ఉహూ. అక్కర్లేదు, వదలండి నన్ను లేక పోతే అరుస్తాను. "మీర విడిపించుకోవాలని పెనుగులాడింది కాని శాము వదల్లేదు.
"నాతో రాజీ పడితేగాని వదలను"
మీరా కాస్సేపు ఊరుకుని "సరే నాకేం కోపం లేదు. రాజీ పడ్డాను" అంది.
"మరి రాజీ పత్రానికి ముద్ర వేయొద్దూ?"
"ధూ వదలండి. నాకేం తెలీదు."
"నే చెప్తాగా" అంటూ శాము మీరను దగ్గరగా లాక్కుని పెదవులమీద గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు.
అతడు వదలగానే ఇంకా కోపం తగ్గని మీర తన అర చేతితో పెదవులను గట్టిగా తుడుచుకొని లోపలికి పారిపోయింది. అది చూసి శాము చిరునవ్వు నవ్వాడు.
* * *
నిండు పున్నమి. వెన్నెల వెదజల్లుతూ విహరిస్తున్నాడు, చందమామ. అలాటి సమయంలో మీర నిండుగా ముసుగు కప్పుకొని గదిలో పడుకుంది. శము ఆరు బయట సంపంగి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఇంత అందాన్ని ఆరాధించక తన కళ్ళు వ్యర్ధం చేసుకొంటున్న మీరని లేపుదామని గదిలోకి వచ్చాడు.
"మీరా వెన్నెల ఎంత బావుందో చూద్ధ్గువు గానిరా."
మీర కదలలేదు. నిద్ర పోతున్నట్టు నటిస్తోంది. శాము ఆమె కప్పుకున్న దుప్పటి లాగి పారేశాడు.
"నాకంతా తెలుసుగాని, రాణీగారూ లేచి రండి!" అన్నాడు.
"నేను రాను"
"వెన్నెల ఎంత బావుందో వర్ణించలేను"
"వద్దు మీరేం వర్ణించక్కర్లా."
"నీకు కళ్ళుండి వ్యర్ధం"
"అలాగే మీ కళ్ళు సార్ధక పరచుకోండి. చాలు."
"ఒక్కన్నే చూస్తే, ఒక కన్నే సార్ధక మవుతుంది. రెండో కంటి మాటేమిటి? నువ్వు నా అర్దాంగివి కదూ?"
"నేను రాను గాక రాను ఎన్నిసార్లు చెప్పాలి?"
"నువ్వు రానంటే అమాంతం నిన్ను మోసు కెళ్ళి కూర్చో బెట్టాల్సొస్తుంది" అని బెదిరించాడు శాము. అన్నంత పని చేస్తాడేమోనని భయపడి, లేచి కూర్చుంది మీర.
"ఈ ఇంట్లో కాస్సేపు హాయిగా నిద్రపోదామన్నా వీల్లేదుకదా" అని గొణుక్కుంది.
శాము గెల్చిన వాడిలా మొహంపెట్టి, మీరాతో బయటికి వచ్చాడు. సంపెంగ చెట్టు క్రిందున్న రాతి బెంచి చివరిలో కూర్చుంది మీర.
"అంత దూరంగా కూర్చుంటే ఏం బావుంటుంది?"
"చంద్రుడిని చూడ్డానికి దగ్గరగా నే కూర్చో వాలన్న నియమ మేమీ లేదుగా?"
"కాని దగ్గరగా కూర్చోకపోతే చంద్రుడి అందం తగ్గిపోతుంది" అంటూ దగ్గరగా వచ్చి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడు శాము.
మీర అతనిని నిరోధించే స్థితిలోలేదు. ప్రతి రోజూ ప్రతి నిముషమూ అతడు చెప్పినట్లు వినక తప్పేదికాదు. అతడు మిథిమీరి ప్రేమించటమే బాధాకరంగా ఉందామెకు.
"ఇప్పుడు చంద్రుని అందం ఇనుమడించింది"
మీర చంద్రునివేపే చూస్తూంది. ఆకసంలో ఆడుకుంటున్న చంద్రముడు ప్రపంచంమీద మత్తు మందు చల్లుతున్నాడు. ఎలాటి అరసికులనైనా కవులుగా మార్చే శక్తి గల వెన్నెల పరవశింప చేస్తూంది. అపుడే విచ్చుకుంటున్న సంపంగుల సువాసన గాలిలో తేలి వస్తూంది.
"మీరా నీకు ఇంకా కోపం పోలేదూ?"
మీర మౌనంగా కూర్చుంది. శాము మెల్లిగా తను దాచుకున్న మీర కోరిన అయిదు పుస్తకాలనూ తీసి ఆమె వడిలో పడేశాడు. మీరా వాటిని చూడగానే 'నా కక్కర్లేదు' అంటూ దూరంగా నెట్టింది.
"మీరా, డబ్బు కర్చయిపోతుందేమోనని పుస్తకాలు కొనటానికి వెనుకాడుతున్నానని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? నిన్ను సంతోషపరచలేని డబ్బు నా కెందుకు? నా సర్వస్వమూ నీవే. నేను నీ వాడిని. నీ కోసమే శ్రమ పడాలి నేను. నా మీద కోపగించకు"
శాము కంఠంలోని దైన్యతకు కరిగిపోయింది, మీర. దూరంగా నెట్టిన పుస్తకాలను తీసి వళ్ళో పెట్టుకుంది. శాము పుస్తకాల వేపు చూస్తూ
"వాటి కన్న తక్కువయ్యాను నేను" అన్నాడు.
మీర చిరునవ్వు నవ్వింది. వెన్నెల నవ్వినట్టని పించింది శాముకు.
"మీర పుస్తక బాండాగారం దిన దినాభివృద్ది చెందుతూ వచ్చింది. ఒకటి తరువాత ఒకటిగా నలుగు బీరువాలనిండా పుస్తకాలు ప్రవేశించాయి. సుప్రసిద్ధ రచయితల పుస్తకాలన్నీ ఆమె బీరువాల్లో చోటు చేసుకున్నాయి. పుస్తక సేకరణతో బాటు కుట్టుపనీ ప్రారంభించింది. ఇంట్లో కిటికీలకు, తలుపులకు అందంగా కుట్టబడిన తెర లతో అలంకరించింది. ఇంగ్లీషు వార పత్రికలను తెప్పించుకొని అందులోని మహిళా విభాగాలను చదివి, ఇంటిని అందంగా తీర్చిదిద్దింది. ఇంట్లోకి ప్రవేశించగానే కుడివేపునున్న గదిని, డ్రాయింగ్ రూముగా మార్చింది మీర. అందమయిన సోఫా సెట్టు తెప్పించి, అమర్చింది. గది మధ్యలో టీపాయిమీద, ఫ్లవర్ వాజ్ లోని పూలు కళకళ లాడుతున్నాయి. చుట్టూ నలుగు కుర్చీలు, కుర్చీ లను, సోఫాలను అందంగా కుట్టిన కవర్లు అలంకరించాయి.
మీర చేతిలో కొత్త అందాలు తొడుక్కుంది ఇల్లు.
రోజూ కాంపౌండంతా తిరిగి కొత్త పూలు అమర్చేది ఫ్లవర్ వాజ్ లో.
'పోస్ట్' అన్న కేక విని, ఆత్రుతతో బయటికి వచ్చింది, మీర పెదనాన్న రాసిన ఉత్తరం అది. తన పేరనే ఉండటంవల్ల చించి చదివింది. ఏక కాలం లోనే సంతోష దుఃఖాలు ఆవరించాయి, ఆమెను. ఇంటర్ మీడియట్ లో ప్రథమశ్రేణిలో పాసయి నట్టు తెలియపరచి, అభినందనాలతో ముగించారు. తను పాసైనట్టు తెలిసి, సంతోషం కలిగినా, వెంటనే దుఃఖము పొంగి, చిన్న అలను వెనుకనే వచ్చిన పెద్ద అల మింగివేసినట్టు ఆమె సంతోషాన్ని మింగివేసింది. మనసు చిన్నబోయింది. సర్దుతున్న పూలు, అక్కడే పడవేసి, సోఫాలో వెనక్కి వాలిపోయింది.
