"మీనాక్షి! ఏవిటి నీ మాటలు ? కొంపలంటుకు పోయేటంతటి తప్పు యిక్కడేవ్వరూ చెయ్యలేదే?' అన్నాడు అప్రసన్నంగా మీనాక్షి ముఖంలోకి చూస్తూ.
"అవును. పిల్లి పాలు త్రాగుతూ ఎవరూ చూడ్డం లేడనుకుంటుందట! కంటి చాటున జరిగే విషయాలంటే సరే కొట్టి పారేయగలవు గానీ.... కంటి ఎదుటే జరుగుతున్న విషయాన్ని ఎలా కాదంటున్నావో - అదే నాకాశ్చర్యంగా వుంది!" అంది కొంచెం కోపంతోనూ, ఆశ్చర్యం తోనూ.
"ఇంతకూ నువ్వారోపించే నేరమేమిటి? విశాలకు నేను అన్యాయం చేస్తున్నాననా?"
"విశాలకెనా? సుధీరమాటేమిటి?"
"సుధీర కు నేనేం అన్యాయం చెయ్యడం లేదు. విశాల క్కూడా.
"ఆమాట అనను నీకే చెల్లుతుంది."
"లేదు, మీనాక్షి! నేను సుదీరను చేసుకోవడం లేదు." ఆవేశంగా అరిచాడు.
మీనాక్షి చిత్తరువులా కాసేపు ఉండి పోయింది.
"ఎందుకనీ?' అంది కాసేపటికి తేరుకుని.
"సుధీరకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదు."
మీనాక్షి అనుమానంగా చూసింది.
"అవును. నా మాట నమ్ము."
'ఈ విషయం అత్తయ్యకు తెలుసా?"
"ఉహు.. తెలీదు. చెప్పాలనే అనుకుంటున్నాను." తల వంచుకుని నెమ్మదిగా అన్నాడు.
మీనాక్షి మరేం మాట్లాడక మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది.
కాసేపటికి ఆలోచనల నుండి తేరుకున్న భానుమూర్తి మీనాక్షి అక్కడ లేకపోవడం చూసికేక వేసి పిల్చాడు.
"ఎందుకూ?"
"విశాల ఈ యింటి కోడలుగా రావడం నికిష్టమే కదూ?" అన్నాడు.
"నా యిష్టంతో పనేమిటి? నీకిష్టమయితే నేను వద్దన్నా మానుకుంటావా?" అంది తేలిగ్గా నవ్వుతూ.
"నువ్వు వద్దని చెప్పవు."
"ఏం? ఎందుకు చెప్పకూడదు?"
"విశాల నీ స్నేహితురాలు. స్నేహితురాలే వదినైతే యిష్టపడని వాళ్ళుంటారా? అందులోనూ మ్రోడు బారిన నీ జీవనలత చిగిరించేందుకు ఎక్కువగా కృషి చేసింది విశాలే! నువ్వూ నేనూ గూడా ఈ విషయంలో విశాల కెంతో ఋణపడి ఉన్నాము."
"నిజమే! ఆ విషయం నేనెలా కాదనగలను? కానీ విశాల మన మనకున్నట్లు రాఘవయ్య మాస్టరు గారమ్మాయి కాదు."
"తెలుసు."
"తెలుసా? అయితే సరి. నా మటుకు నాకు విశాల వదినగా రావడం ఎంతో యిష్టం. అన్నయ్యా, తక్కిన విషయాలన్నీ నువ్వే ఆలోచించుకోవాలి."
భానుమూర్తి ముఖం సంతోషంతో ప్రపుల్ల మైంది. హాయిగా శ్వాస పీల్చి - "చూడు, మీనాక్షీ! ప్రతి మనిషీనీ భగవంతుడే సృష్టిస్తున్నాడు. అందర్లోనూ ఒకే రకమైన రక్తం ప్రవహిస్తున్నది. ఒకరోజు పని సౌలభ్యం కోసమే కులాలు కులాలు ఏర్పరచారు. అవి కాల క్రమాన పెరిగి పడగోట్టనే శక్యం కానంతటి గట్టిగా తయారయ్యాయి. తనకూ యితర్లకూ మధ్య తనే కట్టుకున్న గోడ కులం. వాటిని పడకొట్టి మానవ కళ్యాణానికి తోడ్పడ్డం మనందరి బాధ్యత." అన్నాడు.
"ఏవో బాబూ! అంత పెద్దగా ఆలోచించడం నాచేత కాదు. నువ్వు పుస్తకాల్లో మాట్లాడినట్లు మాట్లాడతావు. జీవితంలో అదెలా సంభవం?' అంది అమాయకంగా.
"జీవితానికి, సాహిత్యానికి సంబంధం తప్పకుండా వుంటుంది. అలా లేని రోజు అలాంటి రచనలు ఎక్కువ రోజులు నిలవ్వు. మానవుణ్ణి ఆదర్శ మార్గంలో నడిపించ ప్రయత్నించే రచనలు చదువుతూనే ఉంటాము. చదివి జీవితంలో ఇదెలా సాధ్యం అనేదాని కన్నా జీవితాన్ని ఆ బాటల్లో నడిపించడంలోనే వుంది మన గొప్పతనం. ఆరోజే జాతి ప్రగతి మార్గం లో నడుస్తుంది." "కావచ్చు.' సాలోచనగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీనాక్షి.
భానుమూర్తి కళ్ళు మూసుకొని తియ్యని ఊహల్లో తేలిపోసాగాడు.

13
సుధీరకు అసలు ఈమధ్య బొత్తుగా తీరికే ఉండడం లేదు. మహిళా సమాజం లో అన్నీ పనులూ ఆమె మీదనే పడ్డాయి. మామూలు కార్యక్రమాలతో పాటు దేశరక్షణ నిధికి డబ్బు వసూలు చెయ్యవలసిన బాధ్యత గూడా ఆమె మీదనే వేశారు. ఓ చోట నిల్చుని తీరిగ్గా ఊపిరి పీల్చుకునే పాటి సమయం గూడా లేదు. సుధీర, కేరాఫ్ మహిళా సమాజం' అని ఎగతాళిగా భానుమూర్తి అన్నట్లు సుధీరతో ఏదన్నా పనుంటే ఇప్పుడు నేరుగా మహిళా సమాజానికే వెళ్ళాలి! మహిళా మండలి సభ్యుల క్కూడా ఈమధ్య చేతినిండా పని తగిలింది. లలితమ్మ కూతురి వ్యాపకాల్లో అంతగా కలిగించుకొదు. సుధీర తత్వం ఆమెకు బాగా తెలుసు. అందులోనూ ప్రస్తుతం సుదీర చేస్తున్న పనులేమిటో లలితమ్మ కు తెలుసు. అందుకనే సుధీరను ఏమీ అనేది కాదు. రక్షణ నిధి వసూలు కోసం ఆ ఊళ్ళో నే ఉన్న సంగీత విద్యంసురాలి చేత పాట కచ్చేరి ఒకటి ఏర్పాటు చేశారు. దాదాపు సగం టిక్కెట్లు అమ్మే బాధ్యత సుధీరకే అంటగట్టింది ప్రెసిడెంటు విలాసినీదేవి.
ఇంట్లోనే అమ్మకం ప్రారంభించింది సుధీర. ఒక టిక్కెట్టు లలితమ్మ చేతిలో పెట్టుతూ ఐదొందలు ఇవ్వమంది. లలితమ్మ కు ఆశ్చర్యంతో నోటమాటే రాలేదు.
"టిక్కెట్టు ఐదొందలా? ఇదెక్కడి చోద్యం!' అంది బుగ్గలు ఒత్తుకుని.
"అందులో చోద్యమేముంది? వెయ్యిన్నీ నూట పదహార్లు ఇచ్చావంటే ఇంకా సంతోషం!" అంది సుధీర కిలాకిలా నవ్వి.
"నేను పాటకచ్చేరీ కొస్తానా , పాడా? అనవసరంగా ఎందుకు?"
'అనవసరం , అవసరం అన్న ప్రశ్న లేదు. నిన్ను పాట కచ్చేరీ కి రమ్మని ఎవరన్నారు? టిక్కెట్టు తీసుకుని ఐదొందలు ఇవ్వు. అంతే నాక్కావలసింది " అంది సుధీర.
"ఐదొందలెందుకే? నూట పదహార్లు తీసుకో."
'ఇదేం కూరగాయల బెరమనుకున్నావేమిటి? ఐదొందలు ఇచ్చి తీరాల్సిందే! ముష్టి ఐదొందలు ఇచ్చేందుకెందుకమ్మా అలా భయపడతావూ?"
"అయితే సుందరమూ యుద్ధంలోకి పోయాడంటావా?' అంది కొంచెం ఆందోళన గానే లలితమ్మ.
"ఏమో మరి.... నాకెలా తెలుస్తుంది?" అంది సుధీర.
"తెలీకుండా ఎలా వుంటుంది? రోజూ పేపరు చదువుతూనే ఉన్నావుగా?' అంది లలితమ్మ అమాయకంగా.
"బాగుంది! పేపర్లో అవన్నీ ఎందుకుంటాయి?" పది రోజుల క్రితం తను ఫ్రంటుకు వెళ్తున్నట్లు సుందరం వ్రాసిన ఉత్తరం లలితమ్మ కంట్లో పడనీయకుండా దాచింది సుధీర.
"సుందరం దగ్గర్నుండీ ఉత్తరామోచ్చీ కూడా చాలా రోజులయింది కదూ?"
"ఊ..."
"ఎక్కడున్నాడో , ఏవిటో....ఇంకో ఉత్తరం రాయరాదూ?' అంది విచారంగా.
"అలాగే! ముందు డబ్బివ్వు. నాకింకా బోలెడంత పనుంది. బావా వాళ్ళింటి కెళ్ళాలి. ఇంట్లో ఉంటాడో , కాంపు కెళ్ళాడో ...." అంది స్వగతంలా వాచీ చూస్తూ.
లలితమ్మ ఇనప్పెట్టె తెరిచి ఐదొందలుకూతురు చేతిలో పెట్టింది.
కారు వీధిలోనే ఆపి, మీనాక్షి ని కేకేసింది సుధీర . మీనాక్షి వరండాలోకి వచ్చి లోపలికి రమ్మని పిల్చింది.
"బావ ఉన్నాడా?' అంది సుధీర కార్లో నుండి దిగకుండానే.
"ఉన్నాడు. రా!"
సుధీర లోపలికి వచ్చే సరికి భానుమూర్తి ఈజీ చైర్లో కూర్చుని పేపరు చూస్తున్నాడు.
"ఈరోజు కాంపు కెళ్ళలేదన్న మాట?' అంది సుధీర కుర్చీలో కూర్చుంటూ.
"లేదు. ఏవిటి? ఏదో పని మీద వచ్చినట్లున్నావే?" అన్నాడు సుధీర వేపు ఎగాదిగా చూసి.
"అవును" అంది పర్సులో నుండి టిక్కెట్ల పుస్తకం తీస్తూ.
"ఎవిటవి?' కుతూహలంగా అడిగింది మీనాక్షి.
"టిక్కెట్లు. రక్షణ నిధికి గాను గానకచ్చేరి ఒకటి ఏర్పాటు చేశాము."
"అయితే?"
"అయితే గియితే ఏం లేదు. మీ ఇద్దరూ తప్పక రావాలి." రెండు టిక్కెట్లు చింపి భానుమూర్తి ముందు పెట్టుతూ అంది సుధీర .
"ఎంతేమిటి?"
"ఇరవై."
"అయితే నువ్వెంత ఇస్తున్నావు సుధీ?" అన్నాడు భానుమూర్తి నవ్వుతూ పేపరు పక్కన పెట్టి.
"చెప్పుకో చూద్దాం?"
"వేల మీద ఉండచ్చు."
"అంతెం లేదు. ఐదొందలే."
'అత్తయ్యో?"
"ఇద్దరం కలిపే."
"ఓస్! అంతేనా?' అంది మీనాక్షి.
సుధీర ముఖం కొద్దిగా పాలిపోయింది.
"వెళ్ళాలి. నాకు చాలా పనుంది. ఇరవై రూపాయలు ఇచ్చేయ్ బావా!' అంటూ తొందర చేసింది.
భానుమూర్తి ఇరవై రూపాయలు తెచ్చి ఇచ్చాడు.
"విశాల స్కూలు కెళ్ళిందేమో - ఇంకో టిక్కెట్టిస్తాను. విశాల కిస్తావా?"
"ఇవ్వమంటే ఇస్తాను" అన్నాడు భానుమూర్తి .
"ఇదో!"
"డబ్బో?"
"నేను తర్వాత తీసుకుంటాలే" అంటూ సుధీర వెళ్ళబోయింది.
వంటింట్లో నుండి మీనాక్షి కేకేసింది.
"ఎందుకూ?"
గోడవారగా వేసి ఉన్న పీట చూపిస్తూ - "కూర్చో , కాఫీ త్రాగి వేల్దువు గాని" అంది మీనాక్షి కుంపటి మీద కాఫీకి నీళ్ళు పెట్టుతూ.
"పనుంది. వెళ్ళాలి మీనాక్షీ!' అంది సుధీర గుమ్మం దగ్గరే నిల్చుని.
"అంతోటి పనులేమున్నాయమ్మా! అయిదు నిమిషాలు ఆలస్యమైతే అక్కడ మునిగిపోయే రాచకార్యాలెం లేవులే!" అంది మీనాక్షి కళ్ళు త్రిప్పి తమాషాగా నవ్వుతూ.
"ఉన్నాయో లేవో నీకేం తెలుసు?" అంది సుధీర ఇక తప్పదన్నట్లు పీట మీద కూర్చుంటూ.
మీనాక్షి నవ్వుతూ, ఓరగా సుదీర ముఖం లోకి చూసి "నాకు తెలీకపోవడమేమిటి? మా బాగా తెలుసు!" అంది.
