Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 21


    "నా హౌస్ కీపర్ గా పెట్టుకున్నాను. సుజాత అని, చాలా మంచి అమ్మాయిలే. ఓసారి నీకు ఉత్తరంలో రాశాను అనుకుంటూనే నిజంగా సుజాత వచ్చిందగ్గిరనించి నాకెంత హాయిగా వుందనుకున్నావు. అన్నీ స్వంత యింటిలాచూసుకుంటుందనుకో."
    "అహా, పోనీలే నీకు సగం గొడవ తగ్గింది" కల్యాణి వెంట వెడుతూ అన్నాడతను.
    మేడమీద గదిలోకి వెళ్ళగానే కల్యాణి చప్పున రెండు చేతులూ అతని మెడచుట్టూ వేసి, గుండెలమీద మొహం ఆనించుకుని కౌగలించుకుంది. "అబ్బ! ఎన్నాళ్ళయింది ఆనంద్, ఈ సారి ఆర్నెల్లపోయింది గదూ!" అంటూ తఃన్మయత్వంతో కళ్ళు మూసుకుంది.
    "కల్యాణీ!" అంటూ ఆమెను దగ్గిరకి హత్తుకుని "నిన్ను చూసి కొన్ని యుగాలయిపోయినట్టుంది కల్యాణీ యీ సారి" అంటూ ఆవేశంగా ముద్దుపెట్టుకున్నాడు.
    ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి చుట్టూ ప్రపంచాన్ని మరిచి కొన్ని క్షణాలు తన్మయావస్థలోవుండిపోయారు ఇద్దరూ నెమ్మదిగా కల్యాణి అతని కౌగిలినుంచి వదిలించుకుని "ఉండు, కాఫీ తీసుకుని సుజాత వస్తుంది" అంటూ కొంగుతో మొహం తుడుచుకుంది. ఆనంద్ నవ్వి కల్యాణిని వదిలి అక్కడున్న వాలుకుర్చీలో కాళ్ళు చాచుకుని పడుకున్నాడు, కల్యాణి అద్దంలో చూసుకుంటూ చెదరిన బొట్టు, ముంగురులు సరిచేసుకుంది. అద్దంలోని కల్యాణి ప్రతిబింబాన్ని ఆప్యాయత, అనురాగం నిండిన కళ్ళతో తదేకంగా చూడసాగాడు ఆనంద్.
    "ఏమిటలా చూస్తున్నావు, తినేసేట్టు" కల్యాణి చిరుకోపం నటించింది.
    "ఏం లేదు, ఎన్నిసార్లు చూసినా, ప్రతీసారీ నీలో యేదో క్రొత్తదనం కనిపిస్తూంటుంది.....రోజు రోజుకి నీ అందం యెక్కువవుతూంది కల్యాణీ..... నీవిలావుంటే మతి పోతూంది" అంటూ కుర్చీలోంచి లేవబోయాడు. కల్యాణి చిలిపిగా అతన్ని వెనక్కి నెట్టి, "చాల్లే! తొందర, పిచ్చివేషాలు మాను.....అదిగో సుజాత."
    సుజాత కాఫీ పట్టుకుని గదిలోకి వచ్చింది. ఆమె చేతిలోంచి కప్పు అందుకుని ఆనంద్ కి ఒకటి యిచ్చి తానొకటి తీసుకుంది. "సుజాతా, ఇవాళ వంట బ్రహ్మాండంగా వుండాలి తెలుసా! ఆనంద్ కి బెండకాయకూర యిష్టం, అది వండు. బెండకాయ లున్నాయా?......కొబ్బరికాయ పచ్చడి చేయి, ఆనంద్ కి యిష్టం" చెప్పుకుపోతూంది కల్యాణి.
    "అరె, ఎందుకు మళ్ళీ ఆ అమ్మాయిని యిప్పుడు యిబ్బంది పెడతావు, వంటయిపోయింది గాబోలు" ఆనంద్ అభ్యంతరం చెప్పబోయాడు.
    "ఫరవాలేదు, సుజాత యేం అనుకోదు. ఆ మాత్రం నా కోసం కష్టపడగలదు. మరేం చెయ్యను? ఎప్పుడు వచ్చినా మబ్బులేని వర్షంలా, ఓ మెరుపులా కబురు లేకుండా వస్తావు, నీవున్న రెండుపూటలూ నీ కిష్టమయినవి పెట్టకపోతే నాకేం తృప్తిగా ఉండదు.....సుజా! ప్లీజ్ యేం అనుకోవు గదూ...." అంది కల్యాణి.
    సుజాత "ఫరవాలేదు-దానికేం వుంది, రోజూ చెయ్యనుగా" అంది చిన్నగా నవ్వి. ఖాళీ కప్పులు తీసుకుని సుజాత గదిలోంచి వెళ్ళిపోయింది. వచ్చిన అతను యెవరో తనకి పరిచయం చేస్తుందని ఆశించిన సుజాతకి కాస్త నిరాశ కల్గింది. అతనెవరో, కల్యాణికీ అతనికి సంబంధం ఏమిటో సుజాతకి తెలియలేదు. బాగా చనువు, పరిచయం వున్నట్టు స్పష్టపడుతూంది. ఏ చుట్టరికమో వుండి వుంటుంది. ఈ రోజు కల్యాణిలో సంతోషం, ఉత్సాహం చూస్తుంటే సుజాతకి ఆశ్చర్యంతో పాటు ఆనందమూ కల్గింది. మనసారా మాట్లాడేందుకు మనిషి, ఆలోచనలు ఆనందం పాలు పంచుకునేందుకు తనకి నచ్చిన మనిషి లేకపోతే జీవితంలో యెంత వంటరితనం ఫీలవుతారో కల్యాణిని చూస్తే తెలుస్తుంది అనుకుంది సుజాత.
    క్రిందకి వస్తూంటే సరస్వతమ్మ పిలిచింది సుజాతని-"ఎవరు వచ్చారు? కల్యాణి అప్పుడే వచ్చేసిందేమిటి?" అని అడిగింది.
    "అవును. డాక్టరుగారే వచ్చేశారు. ఆవిడతో యెవరో ఆయన వచ్చారు!"
    "ఎవరు? ఎలా వున్నాడు?" ఆరా తీసింది సరస్వతమ్మ.
    "ఏమో తెలియదు. పొడుగ్గా, తెల్లగా యూనిఫారంలో వున్నారు. ఆనంద్ అంటున్నారు ఆవిడ.
    "ఆనందా? వచ్చాడా?" ఆవిడ మొహంలో రంగులు మారాయి.
    "ఎవరాయన? బంధువులా?" సుజాతే అడిగింది ఆవిడేం చెప్పకపోవడం చూసి.
    "ఊ......దానికి బావ అవుతాడు.....మా అన్నయ్య కొడుకులే....." అంది ఆవిడ.
    "అలాగా....ఆవిడ యీరోజు ఎంత సరదాగా వున్నారో.....చిన్నప్పటినుంచి బాగా చనువు అనుకుంటాను యిద్దరికీ" ఉత్సాహంగా అంది సుజాత.
    "ఊ.....చనువే! ఆ చనువే...." ఆవిడ తనలో తనే గొణుక్కుంది. "దానికింక వళ్ళుపై తెలియదు వాడొస్తే. మళ్ళీ యేం గొడవలొస్తాయో కొంపమీదకి" ఆవిడ తనలో తాను అనుకొనే మాటలు సుజాత చెవిని కొన్ని పడ్డాయి. ఆశ్చర్యంగా చూసింది! ఏం అడగలేక, మానలేక, చాలా పని వుండడంచేత అక్కడినుంచి వంటయింట్లోకి వెళ్ళిపోయింది. సరస్వతమ్మ గొణుక్కుంటూ పడుకొంది.
    
                                            13
    
    "నా కల్యాణీ!" తన వడిలో పడుకున్న కల్యాణి ముంగురులు సవరిస్తూ ఆకర్షణగా, అభిమానంగా పిల్చాడు ఆనంద్. కళ్ళుమూసుకొని రెండు చేతులతో ఆనంద్ ని చుట్టేసి తన్మయత్వంలో మునిగిన కల్యాణికి ఆ పిలుపు వినిపించలేదు. "కల్యాణీ!" మళ్ళీ పిల్చాడు ఆనంద్. వంగి ఆమె పెదాలని సున్నితంగా పెదాలతో అద్దుతూ 'ఊ ఏమిటి బావా!' కళ్ళు తెరవకుండానే అన్నది కల్యాణి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS