రాఘవ వారించలేదు. చాలామంది దగ్గర తన ప్రతాపాల్ని మార్చగలిగే రాఘవ శివని ఎదిరించలేడు. అంతగా శివని యిష్టపడటం అతడి బలహీనత.
"ఇప్పుడెం చేద్దామనుకుంటున్నావ్?" అడిగాడు రాఘవ.
"మరో డైరెక్టరు దగ్గర ప్రయత్నిస్తాను. ఒకవేళ నువ్వన్నట్టు సుదర్శనరావు మూలంగా నాకు ఇక్కడ అవకాశం దొరక్కపోతే ఊరెళ్ళిపోతాను."
"వెళ్ళి....." అందోళనగా చూశాడు రాఘవ. నవ్వేశాడు తన "డ్రామాలు డైరెక్ట్ చేసుకుంటూ నేనూ డైరెక్టరునే అన్న దుగ్దని అలా తీర్చుకుంటాను సరేనా."
"నువ్వు వెళ్ళొద్దు శివా!" రాఘవ నిజంగానే కంగారుపడిపోయాడు. "వెళితే.....ఈ ఇండస్ట్రీ ఓ మంచి డైరెక్టర్ని కోల్పోతుంది. ఇది మనస్తుతి కాదురా. నా మీద, నీ శక్తిమీద నాకున్న నమ్మకం అది. చూడూ....నువ్వెంతకాలం వుండాలనుకుంటే అంతకాలం నీకే ఇబ్బందీ రాకుండా నేను చూసుకుంటాను సరేనా."
స్టాన్స్ లివిస్కీ థియరీ బుక్ ని పక్కన పెడుతూ పైకి లేచాడు తన మనసదోలా అయిపోయింది.
మనసులో వున్న బాధని షేర్ చేసుకోవటానికి తల్లి తర్వాత దేవుడు ఇచ్చే మరో ఆత్మీయుడు స్నేహితుడే అయితే నిజంగా రాఘవ అంత సహృదయుడే.
"అదికాదు రాఘవా...." అసహనంగా అన్నాడు శివ బయటి చీకటిలోకి చూస్తూ. "మరో డైరెక్టరు దగ్గరయినా నేను రాజీపడలేనేమో అనిపిస్తుంది. పోనీ నన్ను నేను కరెక్ట్ చేసుకుందామా అంటే నా తప్పేమిటే ఖచ్చితంగా నాకయినా తెలిస్తేగా....అప్పటికీ కాంప్రమైజ్ కావాలని ప్రయత్నిస్తూనే వుంటాను కానీ కొన్ని సమయాల్లో రియాక్టయిపోతుంటాను....సినిమా రూపొందించేది శాసించాల్సింది డైరెక్టరు అయినప్పుడు ఆడైరెక్టరే ఒక నటి కోసం తలవంచుతుంటే ఎలా భరించగలం.....డైరెక్టరూ అంటే డాన్స్ లన్నీ డాన్స్ మాస్టర్ కి, ఫైట్స్ ని ఫైట్స్ మాస్టర్ కి, దృశ్యాలని కెమెరామెన్ కి అప్పచెప్పి బఠానీలు తినుకుంటూ కూర్చునేవాడు కాదుగా. అందర్నీ కో ఆర్డినేట్ చేయాలి. కథగా జీర్ణించుకున్నది సెల్యూ లాయిడ్ పై సవ్యంగా వచ్చేదాకా శ్రమించాలి. తపస్సులా చివరిదాకా పోరాడాలి. అసలు యిండస్ట్రీ అంటే డబ్బుతో చేసే వ్యాపారం ఒక్కటే కాదుగా. కళాప్రక్రియ కూడా. అది కాదూ అనుకున్నవాడు ఏ మిరపకాయల వ్యాపారమో చేసుకుంటూ బ్రతకాలిగాని యీ యిండస్ట్రీకి ఎందుకు రావాలి......ఈ రోజు ఏడాదికి తీస్తున్న నూటఏభై సినిమాలలో కేవలం పది శాతం మాత్రమే హిట్టవుతున్నాయీ అంటే ఎన్ని కోట్ల రూపాయల డబ్బుని యీ యిండస్ట్రీ నష్టపోతూంది. ఎంతమంది కొనుగోలుదార్లు నాశనమైపోతున్నారు. ఇండస్ట్రీని నమ్ముకున్న వేలమంది ఉపాధిని కోల్పోతున్నారు....
"అవేమిరా...." ఆవేశంగా అరిచాడు రాఘవ. ":అదే సరిగ్గా యీ తెలివితక్కువ అనాలిసిస్సే నిన్నిలా నాశనం చేస్తూంది. అసలు కుర్రకుంకని.....నీ అవకాశం గురించి నువ్వు చూసుకోవాలిగాని ఓ సంస్కర్తగా యీ బాధంతా నీకెందుకు....
అక్కడికి ఈ సమస్య మా సినిమారంగానికే పరిమితం కాలేదుగా? మన చుట్టూ వున్న సంఘంలోనూ యిలాంటి కుళ్ళు పేరుకుపోయిందిగా. మేదావులంతా నీలాగే రియాక్టయి సంఘాన్ని ప్రక్షాళనం చేయాలనుకుంటున్నారా?"
"నేనో మేధావినని ఇలా ఆలోచించడంలేదు రాఘవా! ఇండస్ట్రీ సొమ్ము తినే మనిషిగా మాట్లాడుతున్నాను. తెలిసి తెలిసీ కళ్ళముందు జరుగుతున్న అనర్ధాలకి తట్టుకోలేక యిలా బాధపడుతున్నాను."
"నువ్విక జన్మలో బాగుపడవు."
"అలా అందరితో కలిసిపోవడమే బాగుపడటమని నువ్వంటే బాగుపడటాన్ని నేను కోరను."
వారి చర్చ ఇంకా కొనసాగేదే కాని కాలింగ్ బెల్ మోగడంతో యిద్దరూ తేరుకున్నారు.
డోర్ తీసింది రాఘవే.
ఎదురుగా అలివేలుతోబాటు సుకృతి కనిపించేసరికి విస్మయంగా చూశాడు శివ. అలివేలు అతడికి ముందే పరిచయం కావడంతో "రజని అలివేలుగారూ...." అంటూ సాదరంగా ఆహ్వానించాడు శివ. నిజానికి అలివేలు స్థాయి ఆర్టిస్టుని అంత గౌరవించాల్సిన పనిలేదు. అయినా ఎదుటి వ్యక్తిని గుర్తించడం అతడికి అలవాటు.
లోపలికి రాగానే అంది అలివేలు- "వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదాన్ని కాదు శివబాబూ. సుకృతి పట్టుబట్టేసరికి రాక తప్పనిసరయింది.
"చెప్పండి" అన్నాడు శివ ఎదురుగా తలవంచుకు కూర్చున్న సుకృతిని చూస్తూ.
"మీరు కృతజ్ఞతలు తెలియచెప్పటాన్ని యిష్టపడరని నిన్ననే నాకు అర్ధమైంది శివా. నిజం మాత్రం ఒక్కటే...."
"మీ మూలంగానే నేను అక్కడ స్థానాన్ని కోల్పోయాను" ఆసక్తిగా అన్నాడు శివ. "అనేగా మీరు చెప్పేది....నో ప్రాబ్లెమ్....దాన్ని నేను సీరియస్ గా తీసుకోలేదు."
