Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 21


    "దెబ్బకీ, చావుదెబ్బకీ తేడా ఏమిటో తెలియచెబుతాను. అందుకు అవసరమైతే నా జీవితాన్ని మూల్యంగా చెల్లిస్తాను. యస్.....ఇట్స్ మై ఛాలెంజ్."
    అప్పుడు రాలాయి ఆమె కళ్ళనుంచి నీళ్ళు వేడిగా ఆకాశగంగంత స్వచ్చంగా.
    
                                                        *    *    *    *
    
    "ఎందుకమ్మా?" దుఃఖోద్విగ్నంగా చుట్టేసింది అలివేలు. "వాళ్ళతో పోరాడటానికి నీదెంత ప్రాణమే! అసలు అలాంటి వాడితో పేచీ ఎందుకు పెట్టుకున్నావు?" కమిలిపోయిన సుకృతి చెంప చూస్తూ వెక్కిపడిపోయింది అలివేలు.
    "ఈ గాయాలు చాలవు ఆంటీ! నేనింకా గాయపడాలి. నేను అనుకున్న స్థాయికి ఎదగాలీ అంటే ఇలాంటి అనుభవాలు నాకింకా ఎదురు కావాలి."
    "పసిపిల్లవమ్మా."
    "లేదాంటీ! నేను ఎదిగిపోతున్నాను. ఇంకా ఎదుగుతాను. బజారు ఆడడానికి పుట్టిన దాన్నిగా..... అవసరమైతే నన్ను నేను నడిబజార్లో వేలం వేసుకుంటాను. మలినమైన ఈ శరీరాన్ని ముక్కలుగా కోసి నన్ను కోరుకునే స్థాయిని చేరుకుంటాను."
    అలివేలు విస్మయంగా చూసింది. నిన్న మొన్నటిదాకా ప్రపంచం గురించి అంత అవగాహనలేని ఓ పసికందు ప్రపంచంలోని కల్మషాన్ని, విషాన్ని మింగి గొంతులో దాచుకుంటానంటూంది. భస్మమైన బ్రతుకు నుంచి ప్రపంచాన్ని భస్మీపటలం చేసే శక్తికోసం ఈ క్షణంనుంచే తపస్సు ప్రారంభిస్తానంటూ సవాల్ చేసింది.
    ఇప్పుడేం కాబోతూంది. తను అడుగుపెట్టిన కీకారణ్యంలో బలిసిన మృగాల మధ్య ఎంతకాలం ఈ కుందేలు పిల్ల నెట్టుకు రాగలదని.
    "ఆంటీ!" నిశ్చలంగా అంది సుకృతి. "నా గురించి నువ్వు కలత చెందకు. నిన్నటిదాకా అందరి ఆడపిల్లల్లా నాకూ కలలుండేవి. కానీ ఇప్పుడు అవి పగిలిపోయాయి. నేను కోరని ఈ మలుపుకి కారణం దేవుడో లేక ఏ జన్మలో నే చేసిన పాపమో నాకు తెలీదు. కానీ చావాలనిపించే ఈ క్షణాలు సైతం వయసు అనుభవమూ నాకు లేదని నాకు తెలుసు. అయినా ఇలాగే బ్రతకాలనుకుంటున్నాను. అందుకే మనసు చెప్పే ఈ మరణ వాంగ్మూలాన్ని నీ మనసుకి తీసుకోకుండా నా మనిషిగా రవ్వంత  ధైర్యాన్నిమ్మంటున్నాను. నేను పుట్టింది ఏ తల్లికైనా తల్లిలా నాకు తోడు నిలబడమంటున్నాను. ఆంటీ! ఈ క్షణంలో నిన్ను కోరేది ఒక్కటే. నా గురించి ఇకముందు నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకు. కలవరపడకు. అదే నా ఆఖరి విన్నపం."
    
                                                            *    *    *    *
    
    "నా మాట విని మందుకొట్టు మనశ్శాంతిగా వుంటుంది."
    ఫ్లాట్ లో ఓ మూల లిక్కర్ తీసుకుంటున్న రాఘవ సీరియస్ గా అన్నాడు శివని చూస్తూ. శివకన్నా అయిదేళ్ళు పెద్దవాడైన రాఘవ కూడా మరో డైరెక్టరు దగ్గర అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేస్తున్నా దేన్నీ మనసుకి తీసుకోడు. ఒకప్పుడు అలాంటి స్పందన వున్నా  యిండస్ట్రీ వాతావరణంలో ఇమడటం కోసం చాలారోజులక్రితమే మనసుని సమాధి చేసేసు కున్నాడు. స్వతహాగా వున్నవాడైన రాఘవకి శివ తప్ప యిండస్ట్రీలో స్నేహితుల్లేరు. శివకీ అంతే.....అవకాశవాదులైన ఏ వ్యక్తినీ రూమ్మేటుగా వుంచుకోటానికి ఇష్టపడని రాఘవ శివ పరిచయమయ్యాక అతడి మేధస్సు తోబాటు నిజాయితీకి ఆనందించాడు. రెండేళ్ళక్రితమే వెంటపడి మరీ అతడ్ని రూమ్మేటుగా మార్చుకున్నాడు.
    "నిన్నేరా" రెట్టించాడు రాఘవ.
    చదువుతున్న పుస్తకంలో నుంచి తల పైకెత్తకుండా అన్నాడు శివ. "నాకు అలవాటు లేదని నీకెలా తెలుసు."
    కోపంతో మరో పెగ్గు లాగేశాడు రాఘవ. "అసలు అలవాట్లన్నవి మనిషి గాలి పీల్చడంలా ఒంట్లో రక్తం ప్రసరించకుండా పుట్టుకతో వచ్చేవి కాదురా. అవసరార్ధం చేసుకున్నావుగా. బాస్ కి తాళం కొడుతూనైనా బ్రతకాలి. లేదూ ఓ నిర్మాతకి గేలంవేసి అర్జెంటుగా డైరెక్టరైనా అయిపోవాలి గాని, ఇలా నిజాయితీ పేరిట నెత్తిమీదికి తెచ్చుకోకురా అంటే రెచ్చి పోయావ్. ఏమైంది బయటికి నెట్టేశారు."
    "ఇండస్ట్రీ అంటే సుదర్శనరావు ఒక్కడే కాదు రాఘవా" మృదువుగా నవ్వాడు శివ.
    "ఎలా నవ్వగలుగుతున్నావురా?"
    "నవ్వక తల బద్దలుకొట్టుకుని చావాలా......తనకి నేను నచ్చలేదు..... వెళ్ళిపొమ్మన్నాడు అంతేగా....."
    "కానీ సుదర్శనరావుతో పెట్టుకోవడమూ అంటే సామాన్యం కాదురా. నీకెలా చెప్పాలి?" మరో పెగ్గు తాగబోతుంటే ఆవేశంగా ముందు కొచ్చాడు శివ.
    "రెండు పెగ్గులు అయిపోయాయి. రోజుకి రెండు పెగ్గులు మాత్రమే తాగాలి అన్నది శివ విధించిన షరతు.
    "కానీ ఈ రోజు నా మనసు బాగోలేదు."
    "అలా అడ్వాంటేజీ తీసుకోకు. సమస్య నాది. పరిష్కారమూ నేనే ఆలోచించాలి."
    "అంతే తప్ప నేను రియాక్ట్ కానవసరం లేదంటావ్."
    "రియాక్ట్ అవడమూ అంటే నా పక్కన కూర్చుని ధైర్యం చెప్పడంలాంటిది చేయాలి. అంతేగాని నన్ను మందు కొట్టమనడం లేదూ నువ్వెక్కువ మందు తాగేయమనడం కాదు" సీరియస్ గా బాటిల్ తీసి రేక్ లో పెట్టేశాడు శివ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS