"ఎప్పుడు చెప్పావురా?"
"చాలా రోజులైంది. బజారులో షాపింగ్ ముగించుకుని వస్తూంటే చీడీలు దిగుతున్నప్పుడు చెప్పాను. నవ్వి వెళ్ళింది. అప్పుడే యాక్సిడెంటు కాబోయింది."
"అప్పటి నుంచి మళ్ళీ కలవలేదా?"
"ఊహూఁ."
"ఓరి త్రాష్టుడా మరీ యింత తెలివి తక్కువ వాడివేమిట్రా సన్నాసీ" తిట్లకి లంకించుకున్నాడు వెంకట్రామయ్య.
"ఛ ఈ యింట్లో వుండటం కూడా బుద్దితక్కువే." సర్రున బయటికి దూసుకెళ్ళాడు మోహన్.
నిట్టూరుస్తూ కూర్చుండి పోయాడు వెంకట్రామయ్య.
14
ప్రియమైన అమ్మకు,
స్వాతి నమస్కారాలు.
మేం యిచ్చట క్షేమంగా వున్నాము. ఇక్కడ మేము కృష్ణవేణమ్మ గారినే పుణ్యాత్మురాలింట్లో వుంటున్నాము నీవూ నాన్నా చేసికొన్న పుణ్యం మూలంగా ఆ ధర్మాత్మురాలింట్లో మాకు చోటు దొరికిందని భావిస్తున్నాను.
"అమ్మా! ఆవిడ ఎంతమంచిదంటే చెప్పటానికి నాకు నోరు రావటంలేదు. చాలా మంచియిల్లు వుండటానికి యిచ్చింది. అది వాళ్ళ అవుట్ హవుస్ అట! నాకు జబ్బుకి వాళ్ళ ఫేమిలీ డాక్టరును ఏర్పాటు చేసింది. నాకు జబ్బు తొంభై పాళ్ళు తగ్గిపోయింది. చదువు పోకూడదని స్కూల్లో చేరాను. మాకు ఖర్చులకి కూడా ఎక్కువే యిస్తున్నది.
అన్నయ్యకి ఉద్యోగం దొరికింది జీతం నాలుగొందలదాకా వస్తుంది. నన్ను స్కూల్లో దింపేసి ఆఫీసు కెడతాడు అన్నయ్య. నేను యింటికి వచ్చేసరికి అన్నయ్య కూడా వస్తాడు కొంచెం అటూ, యిటూగా నేను బాగా చదువుకుంటున్నాను.
ఇక్కడ అమ్మమ్మగారిల్లు ఎంత పెద్దదని! మనవీధంత ఉంది అనిపిస్తుంది. ఆయిల్లు కూడా చాలా అందంగా ఉంది. ఆ నీలి మేడలో ఓ అందమైన అమ్మాయి ఉంది! అమ్మా! పేరెంత బావుందనుకున్నావు. నువ్వు స్వప్నను చూస్తే నీకు అలాటి కోడలు కావాలని కోరుకుంటావు.
మాకు తెలుగు మాష్టారు పాఠంలో చెప్పినట్టుగా వెన్నెల్లో బండారం మెదిపి చేసినట్టుగా ఉంటుంది స్వప్న. ముక్కు, కళ్ళు, పెదాలు, మెడ, గడ్డం అంతా మోడల్ కున్నట్టుగా ఉంటాయి. షోకేస్ లో చీరకట్టిపెట్టే బొమ్మలా ఉంటుంది స్వప్న.
అమ్మా! నువ్వు యిక్కడి కెప్పుడొస్తావు. నేను మళ్ళీ సమ్మర్ కి కానీ రాలేదు. దసరాల్లో, సంక్రాంతి సెలవుల్లో పాఠాలు బాగా చదివితే కాని బాగా మార్కులు రావు అన్నయ్య అక్కడికి త్వరలో వస్తాడు అమ్మా! అన్నయ్య వెంట అయినా నువ్వు యిక్కడికి రారాదూ! నిన్ను ఓసారి చూడాలని ఉంది.
ఈ టౌన్ ఎంత బావుంటుందని! మనూరితో పోల్చితే ఆమురికి, ఆరోడ్లు, ఆ ఇళ్ళు యీ శుభ్రతకి, ఈ వీధులకి యీ భవనాలకీ ఏమీ ఆనవు. అప్సరలా ఉంటుంది యీ పట్టణం. నువ్వొస్తే యిక్కడికి దగ్గర్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళిరావచ్చు! నదిలో స్నానం చేయొచ్చు.
ఒక్కసారి వచ్చిపోవూ!
ముద్దులతో నీ కూతురు
స్వాతి.
కూతురు రాసిన ఉత్తరం చదువుకుని నిట్టూర్చి మడిచి పక్కన పెట్టింది సుందరమ్మ.
ఆమెకి ఒక్కసారిగా కళ్ళముందు ఆయిల్లు ఆ ఐశ్వర్యం కనిపించాయి. "లక్షలు తింటూ పైసాలు విదిల్చినందుకేపిల్లలు తృప్తి పడుతున్నారు!" అనుకుంది.
15
"రవిగారూ! మీకు చాలా థాంక్స్! మీమేలు ఈ జన్మలో మరిచిపోలేను. సమయానికి మీరు దేవుళ్ళాగా వచ్చి రక్షించాడు! ఆరోజు యాక్సిడెంటు నుంచి కాపాడి ప్రాణాన్ని రక్షిస్తే యీరోజు ఆ దుండగుల బారినుండి పరువుని కాపాడారు. మీరు రావటం కొంత ఆలస్యమైతే ఆ దుర్మార్గుడు నన్నెత్తుకుని వెళ్ళేవాడేమో!" అంది స్వప్న.
"నో మెన్షన్! అది భారతీయునిగా నా ధర్మం! వ్యక్తిత్వం ఉన్న ఏ మగాడయినా ఓ యువతి ప్రాణమానాలకి భంగం వాటిల్లుతూ ఉంటే చూస్తూ వూర్కోలేడు. వెన్నెముకలేని వాడయితేనే మనకెందుకనుకుంటాడు. అయినా స్వప్నగారూ! ఆ వ్యక్తి ఎవరు?" అడిగాడు రవి.
ఇద్దరూ ఆ ఇంటికి కొద్దిదూరంలో నడిచి వస్తున్నారు. ఈరోజు ఎన్నడూ లేనిది అమ్మమ్మగారు కార్లో వెళ్ళేరు ఎక్కడికో-మణికూడా వెళ్ళేడు. ఇక మిగిలిన కారు వాడాలంటే స్వప్న తనే డ్రైవ్ చేసుకోవాలి. పక్కవీధికి వెళ్ళివచ్చేందుకు కారెందుకని గీత ఇంటికి నడిచే వెళ్ళింది స్వప్న. అమ్మమ్మగారితో పిక్నిక్ విషయం యింకా ప్రస్తావించలేదామె. ఆ విషయం చెపుదామనే వెళ్ళింది స్వప్న.
తిరిగి వస్తూ ఉంటే యిల్లుదాటగానే మోహన్ వెంటబడ్డాడు ప్రేమపాఠాలు వల్లిస్తూ. అతడికి తోడుగా మరో యిద్దరు, వాళ్ళకి స్కూటర్లు.....ముందు సున్నితంగా తిరస్కరించింది స్వప్న. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వెంటబడ్డాడు మోహన్. చివాట్లు పెట్టింది. ఛీత్కరించుకుంది.
అయినా వెంటబడ్డాడు. ప్రేమించకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. నవ్వింది స్వప్న. ఇలా చచ్చినవారి సంఖ్య సున్నా అంది. దాంతో అతను ప్రేమించకపోతే బలాత్కారంగా ఎత్తుకెళ్ళి రాక్షసవివాహం చేసుకుంటానని హఠాత్తుగా చేయి పట్టుకున్నాడు.
