"నాన్నా...ఇదేం పని?" తల మీద బాదుకుంటూ అంది సమీర.
త్రిలోకం చుట్టూ చూశాడు.
"నాన్నా....నన్ను....నాన్నలా పిలిచారా?.....అదేంటమ్మగోరు.....ఏదో మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ బ్రతుకుతున్న వాడిని.....టాంక్ బండ్ అందాలు చూస్తూ మీరూ, అయ్యగారూ ....." అంటూ శ్రీచంద్ర వైపు, సత్తిపండు వైపు సందేహంగా చూసి, అన్నట్టు అమ్మగోరు .....ఈ యిద్దరిలో అయ్యగోరు ఎవరు? వంటి మీద చొక్కా లేని ఈయనా, మొహమంతా జోడ్డోడేలా వున్న ఈ చిన్నలాగూ అతనా?" అని అడిగాడు.
"నాన్నా....." గట్టిగా అరిచింది.
"నన్ను....నన్ను నాన్నా అన్నావా అమ్మా....." త్రిలోకం రెండు కన్నీటి బొట్లు రాల్చాడు.
"మావయ్యా.....మీ కూతురు మిమ్మల్ని కాకపోతే రోడ్డున పోయే దానయ్యను నాన్నా అంటుందా? సముదాయించబోయాడు శ్రీచంద్ర.
"బాబుగోరు.....మీరు నన్ను మావయ్యా....అన్నారా?" మళ్ళీ రెండు కన్నీటి బొట్లు రాల్చాడు త్రిలోకం.
"ఇదేంటి గురూ! డైలాగుకు రెండు కన్నీటి బొట్లు చొప్పున రాల్చేలా వున్నారియన? ఎందుకంటావ్....." ఉండబట్టలేక అడిగాడు సత్తిపండు.
"నా ఖర్మకాలి......" అని నుదురు కొట్టుకున్నాడు శ్రీచంద్ర.
సమీర తండ్రి దగ్గరికి వచ్చి "పద నాన్నా....మనింటికి వెళ్దాం......" అంది.
"వద్దమ్మాయ్ గోరు....ఈ మొక్కజొన్న పొత్తులు కాల్చుకునే వాడిని నాన్నా అని పిలిచావు....ఈ జన్మకిది చాలమ్మా.....ఈ జన్మకిది చాలు....."
"అలా రెండుసార్లు ఎండుకంతున్నావు మామయ్యా?" అడిగాడు సత్తిపండు అర్ధం గాక.
"బాబుగారు....పోట్టిలాగు బాబుగారూ.....మీరు కూడా నన్ను మామయ్యా అని పిలిచారా?" మళ్ళీ రెండు కన్నీటి బొట్లు రాల్చి , "చాలు బాబూ! చాలు....." అన్నాడు ఆనందబాష్పాలతో!
శ్రీచంద్ర ఎదురుగా వున్న రెయిలింగ్ కేసి తల బాదుకున్నాడు.
"అమ్మగోరు! ఆ చొక్కాలేని బాబుగోరికి తలనొప్పిగా వున్నట్టుంది తల బడుకున్తున్నాడు కాసింత విక్స్, కాసింత అమృతాంజనంతో కలిపి వెరయిటిగా నుదురు మీద రాయమ్మా....." అన్నాడు రెయిలింగ్ కేసి కొట్టుకుంటున్న శ్రీచంద్ర వంక చూస్తూ.
ఇంకాసేపు ఇలాగే ఈ డ్రామా జరిగితే తనకు పిచ్చెక్కడం ఖాయమని అర్ధమైంది సమీరకు.
ఓ అటోని పిలిచి ఎక్కి అడ్రెస్ చెప్పింది.
"వదినా....." అంటూ సత్తిపండు పిలవబోయాడు.
"అదేంటి బాబూ....ఆమె అలా వెళ్ళిపోయింది? పోనీ నువ్వయినా ఈ పొత్తులు తిను బాబూ...."
"తినలేను బాబూ తినలేను....తింటే నా కలలోకి నువ్వొచ్చి....చంపేస్తావు బాబూ,....చంపేస్తావు....." అంటూ మెంటలేక్కినా వాడిలా మాట్లాడి శ్రీచంద్ర దగ్గరికి వెళ్లి......
"గురూ.....ఇంటికెళ్దాం పద" అన్నాడు.
శ్రీచంద్ర శున్యంలోకి చూస్తూ , పిచ్చివాడిలా సత్తిపండు చేయి పట్టుకుని ముందుకు కదిలాడు.
ఓ పడి అడుగులు వేసి, అప్పుడు వెనక్కి తిరిగి....."సత్తిపండు లగేత్తరో....." అంటూ పరుగందుకున్నాడు శ్రీచంద్ర.
వెనక నుంచి త్రిలోకం......
"ఇద్దరు బాబులూ .....అమ్మగోరిని అడిగానని చెప్పండి" అని అరుస్తున్నాడు.
* * *
బ్రహ్మదేవుడు నరకలోకంలోకి అడుగుపెట్టాడు. వెంటనే అయన మీద పూల వర్షం కురిసింది. యమధర్మరాజు ఎదురేగి ఆహ్వానించాడు.
"కుశలమా సమవర్తి...." అడిగాడు బ్రహ్మదేవుడు.
"కుశలమే" అన్నట్టు తలాడించి ...."మీరు క్షేమమేగా....." అంటూ తనూ పరామర్శించాడు.
బ్రహ్మదేవుడు నరకలోకంలో వున్న యమభటులను, చిత్రగుప్తుడ్ని చూస్తున్నాడు.
"మీకోసం మీ వినోదార్ధం నృత్యప్రదర్శన ఏర్పాటు చేయమందురా?" అడిగాడు యమధర్మరాజు.
"ఏదో విహారమునకని వచ్చితిని. అటులనే మిమ్మల్ని పరామర్శించవలయునని కోరిక కలిగినది..... మీ ముచ్చటా....మీ వైభవం చూస్తుంటే ఓ పక్క అనందం, మరోపక్క విషాదం కలుగుచున్నది" అన్నాడు బ్రహ్మదేవుడు.
"అదేమీ బ్రహ్మదేవా?" ఆశ్చర్యంగా అడిగాడు యమధర్మరాజు.
"మికేందరు పరిచారకలు, మరెందరు సేవకులు.....చిట్టాలు రాయుటకు చిత్రగుప్తుడు, పాపులను శిక్షించుటకు యమభటులు, మందిమార్భలం.....నీకేమి ....నీ యోగం రాజయోగం.....నిభోగం ......అంగరంగవైభోగం.....కష్టం నాది....సుఖం నీది...." అన్నాడు బ్రహ్మదేవుడు రవంత అసూయగా.
"అదేమీ బ్రహ్మ.....అటులందువు......మేము మిక్కిలి శ్రమ పడుచుంటిమి.....మేము లేకున్నా మానవుల ప్రాణములు హరించు వారెవరు? మేము ఒక్క ఘడియకాలం మిన్నకుండిన, సృష్టి నిలిచిపోవును.....మేము లేకున్నా ఈ సృష్టి నివ్వేరపోవును....." మీసం మీద చేయెసి అన్నాడు గర్వంగా యమధర్మరాజు.
"అదేటుల......మేము సృష్టి చేయకున్నచో.....అసలీ సృష్టే ఉండదు కదా.....మానవుల తలరాతలు , ఆయుర్దాయం నేను నొసటిపై లిఖించనిచో, నీవేవి చేయుదువు.....శిల్పం వలె నిలుచుండుట తప్ప....." బ్రహ్మదేవుడు పౌరుషంగా అన్నాడు.
"ఏమేమి....మీరు లేకున్నచో.....మేము నిమిత్తమాత్రులమా......అసలు మేమే లేకున్నా, ఈ మ్,మనుష్యుల ప్రాణములు హరించు శక్తి ఎవరికున్నది. నా పాశం లేకున్నా, ఎవరి ప్రాణములు పోగలవు? నేను తలచుకున్న యెడల ఘడియల మీద ప్రాణాలను హరించివేయద......యముండను" అన్నాడు మిక్కిలి గర్వాతిశయంతో......
"సమవర్తి....ఈ సృష్టికర్త గొప్పతనమును విస్మరించుచుంటివి.......నువ్వేమి చేసినాను నా తల రాతను మార్చలేవు. నేను లిఖించిన రాతను నువ్వు చెరిపివేయలేవు. యది బ్రహ్మరాత.....నేను సృష్టికర్తను.....నా సృష్టిని నిర్వచించు.....ఒక భాగం మాత్రమే నీవు."
పెద్దపెట్టున నవ్వాడు యమధర్మరాజు . నరలోకం ఉలిక్కిపడింది.
బ్రహ్మదేవుడు కోపంగా యమధర్మరాజు వంక చూసి.
"పరిహాసమా?" అన్నాడు.
"కాదు...కాదు....అనందాతిశయము....లేకున్న ఏమి ప్రగల్భములు బ్రహ్మ.....ఎంత సృష్టికర్తవైనను.....యింత అతిశయం.....అతిశయోక్తి కూడదు.....నేను అన్నింటిలోను అధికుడను....నేను ఈ సృష్టిని నా పాశము చేత నియంత్రించగలను" యమధర్మరాజు మితండవాదం మొదలెట్టాడు.
"సమవర్తి....అహంతో హద్దులు మిరుచున్నావు.....నా గొప్పతనమును గుర్తించకున్నావు....." బ్రహ్మదేవుడు కోపంగా అన్నాడు.
