Previous Page Next Page 
అష్టపది పేజి 21


    
    అలా ఆలోచిస్తున్న శీతల్ కి నయనబాబు గుర్తు కొచ్చాడు.
    
    యస్, అలాగే జరిగివుంటుంది. ఇదే నిజమైతే చూస్తాను నా విషయంలో నయన్ ఏమి సాధిస్తాడో...
    
    మళ్ళీ తన ఆలోచనలు సవ్యంగా సాగడంలేదని శీతల్ గుర్తించింది.
    
    నయన్ పదిమందిలో తన మెడలో తాళి కడితే తను వాడికి లొంగినా, లొంగకపోయినా అధికారం తనపై చలాయించవచ్చు. పైగా అమెరికా వెళ్ళే ఛాన్సు, తన తండ్రి ద్వారా లక్షల పెట్టుబడి ఈ మంచి అవకాశాలన్నీ వదులుకుని నయన్ వెర్రిపనికి పూనుకుంటాడా? ఉహూ, ఇది కూడా సవ్యమైన ఆలోచన కాదు. తన ఊహకి అందంది ఏదో వుంది. తనని బంధించినవాళ్ళు వస్తారు. అప్పుడే తెలిసిపోతుంది అసలు విషయం తను మాత్రం చాలా ధైర్యంగా, చాకచక్యంగా మెలగాలి...
    
    రజియా విషయం బయటపడితే రంజిత్ విషయం బయటపడుతుంది. ఇప్పటికే తన తొందరపాటు చర్యవల్ల రంజిత్ ని ఈ వలయంలోకి లాగడం జరిగింది. గత్యంతరం లేక చాలా పెద్ద అబద్దం, తిరుగులేని మాట చెప్పడం జరిగింది రంజిత్ పేరుని ఆడ్డుగా పెట్టుకుంటే ఆపద తొలగిపోతుంది అనుకుంది. తన అంచనా తప్పయింది. అపాయంలో పడడం మాట డదేముడెరుగు రంజిత్ ఈ విషయంలో ఇరుక్కోకుండా వుంటే అంతే చాలు. రంజిత్ చాలా అమాయకుడు.
    
    కంటికి రెప్పలా తనని చూసుకునే తల్లీ, తండ్రి చెప్పేది వినిపించుకోకుండా ఈ పెళ్ళి తలపెట్టారు. చాలా తొందరపడి ఈ పని చేసింది తను. తప్పించుకోడానికి ఇలా చేయబోతే తలకొరివిలా చుట్టుకుంది తన ప్రాణానికి. కావాలని ఆ పని చేయలేదు తను. అనుకోకుండా అప్రయత్నంగా జరిగిపోయింది. ఆ తప్పుకి తను పూర్తిగా బాధ్యురాలు ఉరితాడు మెడకి తగలకూడదు, తగిలిం తరువాత ఉరి బిగుసుకోవడం ఎంతసేపు! అన్న సామెతలా తయారయి తన బ్రతుకు. ఒక తప్పుకి మరో తప్పులా అలా పెరిగి పెరిగి...
    
    నెమ్మదిగా తలుపు తెరుచుకోడం గమనించిన శీతల్ ఆలోచన చాలించి కళ్ళు మూసుకుని యధాతధంగా పడుకుంది.
    
    తలుపు తెరుచుకుని గదిలోకి ముగ్గురు మగవాళ్ళు వచ్చారు. వాళ్ళలో ఒకాయన బాగా డబ్బున్న వాడిగా వుంటే, మిగతా ఇరువురు బాస్ ప్రక్కన ఎస్ బాస్! మాటకు ముందు అనేవాళ్ళలాగా వున్నారు.
    
    శీతల్ కి తెలివిరాగానే మంచంమీద అలా వుండిపోయి ఆలోచించిందిగాని, మంచం దిగి రూమంతా కలియ దిరగడం, తలుపులు తట్టి బైటవాళ్ళని పిలిచే ప్రయత్నం చేయలేదు. దానివల్ల వాళ్ళు శీతల్ విషయంలో పడ్డారు. మెలకువ రాలేదనే అనుకున్నారు.
    
    "అమ్మాయికి ఇంకా తెలివి వచ్చినట్టు లేదు" వచ్చినాయన అన్నాడు. ఆయన పేరు లోకేశ్వరరావు.

 

    "అవును, వచ్చినట్టులేదు" పక్కనున్నవాడు అన్నాడు.

 

    "ముఖాన నీళ్ళు చల్లితే తెలివి వస్తుందండి" లోకేశ్వరరావుకి మరో పక్కన నుంచున్న వాడు అన్నాడు.
    
    "అక్కరలేదు తెలివి వచ్చి చాలాసేపు అయింది" అంటూ నెమ్మదిగా కళ్ళు విప్పి లేచి కూర్చుంది శీతల్.
    
    ఇది ఊహించని పరిణామం. లోకేశ్వరావు అంతటి వాడు ఒకక్సారిగా ఖంగుతిన్నాడు. శీతల్ గారాబంగా పెరిగిన ఒక లక్షాధికారి కూతురు. అందం విషయం వదిలేస్తే అన్నింటా మామూలు ఆడపిల్ల. తెలివిరాగానే భయపడుతుంది. అతి సామాన్యురాలిలా ఏడ్చి గోల పెడుతుంది. గాభరాతో గబుక్కున లేచి కూర్చుంటుంది. అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని అని వూహించుకుంటూ వచ్చాడు. ఊహకి విరుద్దంగా తాపీగా లేచి కూర్చోడమేకాక, మామూలుగా మాట్లాడుతున్నది. ఈ పిల్ల గురించి ఏమనుకోవాలి?
    
    "అదేమిటి అలా బొమ్మల్లా నిలబడ్డారు. నా ముఖాన కోతులు ఆడుతున్నాయా లేక జరగరానిదేమైనా జరిగిందా?" నవ్వుతూ అడిగింది శీతల్.
        
    "ఎబ్బెబ్బే-అదేం లేదు" కంగారు అణుచుకుంటూ అన్నాడు లోకేశ్వరరావు.
    
    క్షణకాలం లోకేశ్వరరావు, శీతల్ రాణి ఒకరినొకరు నఖశిఖ పర్యంతం ఒక్క చూపులో పరికించి చూసుకున్నారు.
    
    'వీడి చూపులు డేగ చూపులు బహుశా వాడి జిత్తులు నక్కవయి వుంటాయి. గద్ద ముక్కు, ఉడత పిల్లి గడ్డం తొండ గవదలు...' లోకేశ్వరరావు అనుకుంది శీతల్.
    
    'ఈ పిల్ల మొండి ధైర్యంతో కూడిన చాలా తెలివి గలదన్నా కావాలి లేక ఈ మాయా ప్రపంచం తెలియని అమాయకురాలన్నా కావాలి. అందంలోన పుత్తడిబొమ్మ అమాయకురాలయితే తన ఆటలు తేలికాగా సాగుతాయి. తెలివికలదయితే మాత్రం నయానా భయానా తన దారికి తెచ్చుకోవలసివస్తుంది'అనుకున్నాడు లోకేశ్వరరావు.
    
    "మీ రెవరు?" శీతల్ మంచంమీద కూర్చుని కిందకి వేలాడేసి, ఆ కాళ్ళని వూపుతూ మామూలుగా అడిగింది.
    
    లోకేశ్వరరావు మంచానికి పక్కగావున్న పక్కకు లాక్కుని కూర్చుని నెమ్మదిగా చెప్పాడు. అంకుల్ ని."  

 

    "మీరు నాకు అంకుల్ అవుతారా?" ఆశ్చర్యం ప్రదర్శిస్తూ అడిగింది శీతల్.
    
    "యస్!"
    
    "ఎలా అవుతారు?"
    
    మీ అమ్మకి వేలు విడిచిన తమ్ముడిని మీకు మాకు రాకపోకలు లేవు. అందువల్ల ఈ బంధుత్వం నీకు తెలియదు" లోకేశ్వరరావు అప్పటికప్పుడు బంధుత్వం కలిపేస్తూ ఓ కట్టు కథ చెప్పాడు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS