Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 20

 

    కంగారు పడిపోయింది మంగ. ఆయనకు తెలిస్తే జరిగే అనర్ధం ఆమె ఉహించలేనిది కాదు.


    "వద్దమ్మాయిగారూ! పెద్దయ్యకు తెలిస్తే ప్రమాదం!"


    "తెలియాలి మంగా, నేను చెప్పితీరాలి!"


    డాబాపైకి వెళ్ళబోయిన కిన్నేరకు అడ్డం నిలబడింది మంగ. "నా మాట వినండమ్మా! అతడు తప్పే చేసి వుంటే అన్నయ్యగారికి చెప్పి మందలించమనండి తప్ప, అంతకుమించి ఆ కుటుంబానికి అన్యాయం చేయకండి."


    "పక్కకు జరుగు!" మంగను నెట్టి గది దాటి వెళ్ళబోయింది కిన్నెర అప్పుడు చూసింది ఉదయ్ ను.

    
    "ఏంటమ్మా?'" దీని కంతటికీ తను మూలకారకుడైనందుకేమో , ఉదయ్ ఇక జోక్యం చేసుకోక తప్పదన్నట్టు ముందుకొచ్చాడు. "ఆ రాఘవ విషయమేగా? డాడీ దాకా ఎందుకు? వాడి సంగతి నేను చూస్తాగా!"


    మంగ తెల్లమొహం వేసుకుని చూస్తుంటే, "నువ్వెళ్ళు మంగా!" అన్నాడు.


    మంగ వెళ్ళిపోయింది.


    "కవితలు రాశాడా, ప్రేమలేఖలు అందించాడా?"


    "కవితల్ని ప్రేమలేఖలుగా రాసి పంపాడు."


    "ఎవరి చేత?"


    "లైబ్రరీ పుస్తకాల్లో ఉంచాడు."


    "నువ్వు చూశావా?"


    తొట్రు పడింది కిన్నెర.


    "అవును కిన్నెరా! వాడు పుస్తకాల్లో వుంచడం నువ్వు చూశావా?"


    "లేదు"

    
    "మరి వాడినే ఎందుకనుమనిస్తున్నావ్?" క్షణం ఆగి అన్నాడు_ "వాడి చేతి వ్రాత అని తెలియబట్టి. అది నీకెలా తెలిసింది? వాడు అంగికరించబట్టి. అలా నిజాయితీగా అంగికరించినవాడు ఒక దురుద్దేశంతో నీ కోసం ప్రత్యేకించి పుస్తకాల్లో వుంచాడని ఎలా అనుమానించగలవు? అసలు చదివి ప[పారేయాల్సిన కవితలకు నువ్వెందుకంతగా స్పందించావ్?  ఏ రోజు ఏ మగాడిపైనా ఉత్సాహం చూపించని నువ్వు వాడిని పనిగట్టుకుని ఎందుకు కలవాలని ప్రయత్నించావ్? అసలు మన అంతస్తేమిటి? ఘోషా స్త్రీ లా బ్రతికే నువ్వు ఓ మాములు మగాడిని ఒంటరిగా కలవడమేమిటి? నీలో ఏ ఆలోచన అతడిని ఓ అసుర సంధ్యా సమయాన నిర్మానుష్యంగా వున్న చోట కలవాలని ప్రేరేపించింది? అలా చూడకు. ఈ ప్రశ్నలు నేను కాదు, రేపు ప్రపంచం అడిగేవి కాకపోయినా, అనుకునేవి."


    షాక్ తిన్నట్టుగా నిలబడిపోయింది కిన్నెర.


    "నీ తోడబుట్టినవాడుగా, నీ కంటే వయసులో పెద్దవాడుగా మొత్తం విశ్లేషించి చూస్తే నాకు అర్ధమవుతున్నది ఒక్కటే - మరోలా అనుకోకు, నీ వయసు కాదు గాని, నీ మనసు ఓ మానసికమైన సాహచర్యాన్ని కోరుకుంటుంది. అదిగో.....అలా కళ్ళెర్రజేసి చూస్తే నాకు నచ్చదు, అవునమ్మా, నువ్వెంత స్వాతిశయంగా బ్రతికినా, ఎలాంటి భేషజంతో నీ మనసును జోకొడుతున్న ఆడపిల్లవేగా! కాబట్టే ఆ కవితల్లో చిత్రమైన ఓదార్పును పొందగాలిగావు ఇంతకాలం నువ్వు పోగొట్టుకున్నదేమిటో తెలుసుకుని ఓ 'కంపెని' కోసం ఉత్సాహపడ్డావు."


    "నాన్సెన్స్!"


    అన్నయ్య చెప్పే ప్రతి మాట మనసు పుటల్ని చదివి చెబుతున్నట్టుగా అనిపిస్తుంటే తట్టుకోలేకపోయింది. "నేనంత బలహినురాల్ని కాను?"


    "నేను చెప్పింది వెంటనే అంగీకరిస్తే నువ్వు రావుబహుద్దూర్ రామ్మోహనరావుగారి మనవరాలి వెలా అవుతావ్.....? నా చెల్లెలివయ్యేదానివి"


    ఏమిటన్నయ్యా, అతన్ని వెనకేసుకోస్తున్నావ్?"


    "రాఘవ ఏమిటో నాకు తెలుసు కాబట్టి."


    అవాక్కయిపోయింది కిన్నెర.


    "అవును కిన్నెరా! రాఘవ నాకు పోస్టు గ్రాడ్యుయేషన్ లో క్లాస్ మేట్. తెలివైన వాడు. అందగాడు మాత్రమే కాదు, సరదాగా అందర్నీ నవ్విస్తూ, అందరితోను మంచిగా పోవాలనుకునే మనస్తత్వం కలవాడు. యూనివర్సిటీ కాంపస్ లో ఎంతమంది అమ్మాయిలు రాఘవ కోసం తపించిపోయింది చూసిన వాడిని.  అయినా తన చదువూ , తన కవితలూ తప్ప ఏ అమ్మాయిని పట్టించుకోలేదు. అలాంటివాడు నీ కోసం వెంపర్లాడాడు అంటే నన్నెలా నమ్మమంటావ్?"


    ఇంత ఉపన్యాసం తర్వాతనే, సరిగ్గా యిక్కడికి నుంచే ఆమెను మానసికంగా స్పందింపజేయాలని తర్కాన్ని మరో అందమైన దారిలోకి మళ్ళించాడు ఉదయ్_ "ఓ.కే.! కవితలు రాశాడు, నీ కోసం ప్రత్యేకించి నీ పుస్తకాల్లో ఉంచాడనే అనుకుందాం, నిజానికి సాంఘికంగా అది నేరమే కావచ్చు. కాని అసాధారణమైన ఓ అందాన్ని చూసి స్పందించడం తప్పు కాదుగా? నీకు అతడి మీద ఇష్టం లేకుండా అతడు అలా తన యిష్టాన్ని ప్రదర్శించడము తప్పే! కాదనను, అసలు కవి అంటే ఎవరు? కవుల మనసులెంత సున్నితంగా ఉండేది మనం ఆలోచించాలిగా? పెరట్లోని ఓ గడ్డిపువ్వులో మనకు అందం కనిపించకపోవచ్చు, కాని స్పందించే హృదయమున్న కవి ఓ కావ్యం రాస్తాడు.


    "సాయంకాలపు నీరెండ మనకు మాములుగా కనిపించవచ్చు, కాగా రాఘవ లాంటి సౌదర్యభావన కల వ్యక్తికీ చుట్టుముట్టబోయే నిశిధి సముద్రం గురించి తెలియని ఓ ముగ్ధ కలల చిత్రపటంలో అస్పష్టంని అద్దుకునే చిలకాకు పచ్చదనంలా గోచరించవచ్చు. అలాంటి రాఘవ ఎప్పుడో నిన్ను లైబ్రరీలో చూసి ఉండవచ్చు. తనకు తెలిసిన భాషను మౌనఘోషగా మార్చి, మనసు రెక్కలు తెగిన సీతాకోకచిలుకలా గిల గిల్లాడుతుంటే ప్రేమ ప్రమిదలో కొన్ని భావాల చమురు నింపి తన బాధను నీకు వ్యక్తం చేసి ఉండొచ్చు!"


    ట్రాన్స్ లోకి జారిపోయింది కిన్నెర.


    ఘనీభవించిన ఏ కన్నె కలల  తేనె తుట్టెను భావుకంగా కుదిపి కదపాలని రాఘవ చేత ఇన్ని కవితలు రాయించాడో, ఆ ఆశయం నెరవేరిన సంతృప్తితో యింకా కవితా ధోరణిలో చెప్పుకుపోయాడు ఉదయ్.


    "తప్పేనమ్మా! ఎంత స్పందించినా గాని నీ స్థాయి, నీ మనసేమిటో తెలియకుండా ఎంత అర్హుడైతే మాత్రం రాఘవ అలా తొందరపడటం నేరమే! కాని నిన్ను ఆరాధించటం తప్పనను. ఎందుకంటే నీరెండను చూసి స్పదించే కవి, దాన్ని గురించి కవిత్వం రాయాలీ, అంటే నీరెండ అనుమతి అవసరం లేదు. కాబట్టి......కవితా సముద్ర స్నానంతో తడవాలనుకునే కవి సముద్రం పర్మిషన్ తిసుకునక్కర్లేదు కాబట్టి."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS