అలా ఒక్క బిడ్డతోనే ఆమె పుల్ స్టాప్ పెట్టేసింది.
అతను ఖంగుతిన్నాడు. పెళ్ళాన్ని అదుపులో వుంచుకోవడానికి వేసుకున్న మొదటి ప్లాన్ అలా బెడిసికొట్టింది.
'ఇద్దరు-ముగ్గుర్ని కనిపారేస్తే- వాళ్ళ సంరక్షణతోనే దానికి పది పదిహేనేళ్ళు గడిచిపోయేవి'" అని తనలో తానే చాలాసార్లు అనుకున్నాడు. గానీ ఆచరణలో పెట్టలేకపోయాడు. అతడు నలభై ఏళ్ళుదాటాడు. చిన్నప్పట్నుంచీ పెద్దగా కష్టపడిన శరీరంకాదు, కాబట్టి పటుత్వం బాగా తగ్గింది. కొద్దిసేపు కష్టపడ్డా శరీరం అలసిపోయేది. నీరసం కమ్మేది. భార్య పడుచుపిల్లన్న విషయం జీర్ణించుకుపోవడంవల్ల ఆమె అంటేనే తెలయని భయం పట్టుకుంది. అనుమానం కూడా మొదలయింది.
దాంతో కొత్త ఎత్తుగడ వేశాడు. దేవుళ్ళకు మొక్కుకున్నాను అని చెప్పి తనతోపాటే ఆమెకీ శిరోముండనం చేయించాలి అనుకున్నాడు. వెంట్రుకలు బాగా పెరిగి తిరిగి అంత అందం చేకూరేటప్పటికి ఎలా లేదన్నా సంవత్సరం పడుతుంది- ఈలోగా ఆ పిల్లకి చెడుబుద్ధి పుట్టదు. చూసేవాళ్ళకూ చెడుబుద్ధి పుట్టదనుకున్నాడు. అయితే ఇదీ కార్యరూపం దాల్చలేదు.
"నువ్వు మొక్కుకుంటే నువ్వు మొక్కుకో. శిరోముండనం అయినా చేయించుకో- ఏకంగా శిరసే అర్పించుకో అది నాకు సంబంధం లేని విషయం" అని తేల్చి చెప్పేసింది.
బలవంతం చేసినా వినదు కాబట్టి మరిక మాట్లాడలేకపోయాడు. అదీగాక ఈ మధ్యన కాంచన ఏకవచనంలోకి దిగిందని కనిపెట్టాడు.
ఇక మిగిలిన దారి ఆమెను డబ్బుతో కట్టిపడెయ్యడమే. తనకు కావాల్సింది. కొనివ్వడం, డబ్బు చేర్చిపెట్టడం, ఇలాంటి మత్తులో పడెయ్యడము- డబ్బుకు మించిన మత్తు మరొకటి లేదు ఆడదానికి అనుకున్నాడు. దాంతో సోమరితనాన్నంతా పోగొట్టుకున్నాడు. తనకు తెలిసిన పనులన్నీ చేయడం ప్రారంభించాడు.
పల్లెటూరికన్నా టౌన్ లో డబ్బు సంపాదించేందుకు చాలా మార్గాలుంటాయని తెలుసు కాబట్టి టౌన్ కు రావడం ప్రారంభించాడు. అప్పుడే టౌన్ పెరుగుతూ వుందని, ఇళ్ళ నిర్మాణం పుంజుకుంటూ వుందని గ్రహించాడు. దాంతో మొదట ఓ ట్రాక్టర్ కొన్నాడు.
ట్రాక్టర్ తో ఇసుక, గుల్లతోలడం ప్రారంభించాడు.
మెల్లగా పెయింట్స్ వ్యాపారం ప్రారంభించాడు.
వచ్చినడబ్బు వచ్చినట్టు పెళ్ళాం చేతుల్లో పెడతాడు. దానిమీద పూర్తిహక్కులు కూడా ఆమెకే ఇచ్చాడు.
ఆ విధంగా ఆమెను కంట్రోల్లో వుంచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. డబ్బు మత్తులో పెట్టడానికి పని చేస్తున్నాడు. కానీ అప్పుడప్పుడు ఆమె ప్రకటించే అసంతృప్తి, వాడే మాటలు, చూసే చూపులు భయాన్నీ, ఆందోళననీ కలిగిస్తుంటాయి. అలాంటి సమయాల్లో అతను గిలగిల్లాడిపోతాడు.
ఈ మధ్య తరచూ ఆమె పిలిచేమాట అతని గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. అదేమిటంటే 'ఏమయ్యా ముసలాయనా!' అనే ఆ సంభోదన విచ్చుకత్తుల కెరటంలా గుండెను చీల్చిపారేస్తోంది.
'నేను ముసలాడ్నా?' మొదట్లో ఆమె అన్నప్పుడు రెట్టించాడు గానీ ఆమె ఏమీ తొణక్కుండా బెణక్కుండా సమాధానం చెప్పింది.
"మరి నీవు ముసలాడివి కాకుండా పసివాడివా- నాకు పాతిక్కి అటూ ఇటూ- నీకేమో నలభైకి అటూ ఇటూ- అప్పట్లో చిన్నపిల్లను కావడంతో- పెళ్ళిచేసే స్థోమత మా వాళ్ళకి లేకపోవడం- వచ్చిన ప్రతి మగాడూ కట్న, కానుకల కోసం వెంపర్లాడడం- వీటిని చూసి మొత్తం మగజాతి మీద కసి పుట్టుకొచ్చి నిన్ను చేసుకున్నానుగానీ లేకుంటేనా...." అంటూ ఓ దులుపు దులిపేసింది.
తను ఆమె ఎలాంటి తప్పుచేయకుండా రకరకాల ట్రిక్కులు ప్లే చేసేవన్నీ చేస్తున్నానని అపరాధ భావం వుండడంవల్ల. అతను ఏమీ అనలేక పోతున్నాడు. అలా సాగుతోంది ఆ ఇద్దరి కాపురం.
పదిగంటల ప్రాంతాన గోపాలరావు ఇంటికొచ్చాడు. వస్తూనే అతని కళ్ళు భార్యకోసం వెదికాయి.
కొంచెంసేపు భార్య కనిపించకపోతే అతనికి వచ్చే మొదటి అనుమానం అదే. తామిద్దరి మధ్యనున్న వయసు తారతమ్యం ఒకటైతే గతంలో తను పరాయి ఆడవాళ్ళని ఎలా లొంగదీసుకున్నాడో అలానే ఇప్పుడు మరో మగాడు తన భార్యని లొంగదీసుకుంటాడేమోనన్న భయం రెండో కారణం.
"మాలా! మాలా!" గట్టిగా పిలిచాడు.
ఈ అరుపులకి మానస ఉలిక్కిపడి లేచింది. సురేష్ వర్మ ఊహల్లో ఉంటున్నప్పుడు మధ్య మధ్యలో రేడియోలో రెండో స్టేషన్ తగిలినట్టు ఆ రోజు బాబు స్పర్శ రేపిన మాధుర్యం దూరుతోంది. ఆమె దానిని బయటికి తరుముతూ వుంటే అది అంతే బలంగా చుట్టుకుంటోంది. ఆ ఆలోచనల్ని విదుల్చుకుని హాల్లోకి వచ్చింది.
"ఏమిటన్నయ్యా! వదినా! గదిలో వుందనుకుంటా" అని ఆ గదికేసి వెళ్ళింది.
"అన్నయ్య వచ్చాడొదినా" అన్నది మానస.
"ఊఁ వస్తున్నా" చీర కుచ్చిళ్ళను సరిచేసుకుంటూ కాంచనమాల హాల్లోకి వచ్చింది.
అతను బట్టలు మార్చుకుని వచ్చి భార్యను పిలిచాడు. ఆమె రాగానే చొక్కా జేబులోంచి డబ్బులు తీసిచ్చాడు. "ఈ రోజు వచ్చిన రెండువేలు."
ఆమె లెక్కకూడా పెట్టలేదు. మౌనంగా తీసుకుని బీరువాలో పెట్టింది. స్త్రీలకు డబ్బుకూడా ఆనందాన్ని ఇవ్వదేమోనన్న అనుమానం బయల్దేరుతోంది. ఈ మధ్య కాంచన ప్రవర్తన అలా వుంటుంది మరి. ఈ బాణం కూడా పనిచేయకపోతే ఏం చేయాలో తెలీడం లేదు.
అతను మరోమాట మాట్లాడకుండా భోజనం బల్లదగ్గరికి నడిచాడు. "అన్నీ గిన్నెల్లో వున్నాయి. తిని రండి. నడుం పెరికేస్తోంది. పడుకుని వుంటాను." అని ఆమె తన బెడ్ రూమ్ లోకి వచ్చేసింది.
అతను రకరకాలయిన ఆలోచనలు చేస్తూ భోజనం ముగించాడు. భార్య దగ్గరికి వచ్చాడు.
బెడ్ మీద కాంచనమాల అటు తిరిగి పడుకుని వుంది.
గోపాలరావుకేమో భార్యతో ప్రేమగా మాట్లాడాలని వుంది. అలా మాట్లాడితే అది మరింత సాన్నిహిత్యానికి దారి తీయచ్చు. బెడ్ రూమ్ లో అతనికి ఎలాంటి సమస్యలు లేవుగానీ సందేహాలున్నాయి.
తాము ఇద్దరూ దాంపత్య సుఖం పొందాక ఆమె రియాక్షన్ ఏమిటన్నది అతను మరింత డీప్ గా పరిశీలిస్తాడు. ఆ సుఖానికి ఆమె పొంగిపోయి తనమీద అభిమానం కురిపిస్తుందని, ఆనందంలో ముంచి తేల్చినట్టు ఆమె ముఖం వెలిగిపోతుందని ఆశిస్తాడు.
అలాంటివి లేకపోయినా కనీసం వాటి తాలూకు భావాలేమైనా వున్నాయా అని అబ్జర్వ్ చేస్తాడు.
మొట్టమొదట్లో ఏదో ఫరవాలేదు గానీ ఇప్పుడు అలాంటివేమీ ఉండడంలేదు.
ఆమె నిశ్శబ్దంగా అటు తిరిగి పడుకుంటుంది. అలాంటప్పుడు అతని బాధ వర్ణనాతీతం. పెళ్ళాన్నో లెంపకాయకొట్టి, "సంతృప్తో, అసంతృప్తో ఏదో ఒకటి ప్రకటించు" అని బాదాలనిపిస్తుంది. లేదూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది.
