"కానీ....దాని తల తిరుగుడూ కాలి తిరుగుడూ నీకు తెలీదు" అన్నాడు ఆనంద్.
ఆ మాట నా గుండెల్లో ఆరిపోతున్న నెగడుని ఎగదోసినట్లు అనిపించింది! నేనే తిరుగబోతునైతే ప్రదీప్ తో స్నేహం ఎందుకు వదులుకుంటానూ?
మొత్తానికి నేను గురుమూర్తిగారి కంపెనీలో ఉద్యోగం చెయ్యడానికి ఏర్పాటు జరిగింది.
ఇది ఓ రకంగా నా విజయమే.
రాత్రి మాధవికి ఫోన్ చేశాను.
"కంగ్రాట్స్! నీ కాళ్ళమీద నువ్వు నిలబడితే ఇంకా సంతోషించేదాన్ని అదే మీ మామయ్య చూసిన ఉద్యోగం కాకుండా వుంటే బావుండేది" అంది.
"అసలు గాలీ, వెలుతురూ అనుభవించగలుగుతున్నాను. అందుకు సంతోషించు. కాదంటే ఏం చెయ్యగలం?" అన్నాను.
"ఆనంద్ ఏమైనా మారాడా?" అడిగింది.
"ఆ....పొద్దుపోయి రావడంలేదు. వారానికి ఒకసారి వచ్చి మొహం చూపించి పోతున్నాడు. అది మార్పేగా!" అని నవ్వాను.
"ఇంకా అతనితో కలిసే వుండాలనుకుంటున్నావా...?" అడిగింది మాధవి.
అది మొహం ఎలాపెట్టి ఆ ప్రశ్న వేసివుంటుందో నేను వూహించగలను. చిన్నప్పుడు వుండలు చుట్టుకుని పడుకున్న రోకలిబండ పురుగుల్ని వానాకాలం పెరట్లో చూసి నేనూ అలాగే అసహ్యించుకునేదాన్ని! కానీ విధి వైపరీత్యం వానాకాలం వాటి పుట్టుకని ఎవరూ నివారించలేరు. చైత్రం కోసం ఎదురుచూడటం తప్ప!
"ఉంటాను" అన్నాను.
"ఎందుకలా వెన్నెముకలేని జీవితాన్ని కోరుకుంటావూ?" అంది.
"నేను విడిపోతే అతనికి ఇంకోత్తిని కట్టబెడతారు. సుమతులకి కొదవలేదీ భారతంలో" అన్నాను.
"ఎక్కడిదాకానే ఈ ఒంటరి ప్రయాణం?" దాని గొంతు బాధతో ఒణికింది.
"ప్రస్తుతానికి శలవు బై!" పెట్టేసాను.
* * *
ఆ అమ్మాయి చాలా అందంగా వుంది. అందం అంతా ఆమె నవ్వులోనే వుంది.
"రండి....మీ సీటు చూపిస్తాను" అని నన్ను కేబిన్ లోకి తీసుకెళ్ళింది.
ఆమె నడుస్తుంటే పొడవాటి వాలు జడ లయగా వూగుతోంది.
"కూర్చోండి మేడమ్" అని చైర్ చూపించింది.
"నా పేరు సుమతి"
"నా పేరు అనసూయ" అంది.
ఆమె నవ్వుతున్నప్పుడు అందంగా వున్నా కళ్ళల్లో ఏదో నైరాశ్యం కనిపించింది. బహుశా నావి పచ్చకామెర్ల కళ్ళేమో!
"ఏదైనా డౌట్ వస్తే పిలవండి. లంచ్ లో కలుసుకుందాం" అని వెళ్ళిపోయింది.
ఆమె మెడలో నల్లపూసలూ, పాపిట్లో ఎవరికో రెడ్ కార్పెట్ పరిచినట్లు సింధూరం, జడలో జారుగా మల్లెపూల దండా...ఆమె వివాహితని తెలియజేసాయి. ఎవరో ఆ అదృష్టవంతుడు? కాసేపు ఆమె గురించే నా ఆలోచనలు తిరిగాయి.
ఇంటికెళ్ళి అలిసి చిరుచెమట పట్టిన మొహాన్ని చన్నీళ్ళతో కడుక్కుని వస్తూవుంటే వేడి వేడి టీ, బిస్కెట్స్ వున్న ట్రేతో ఎదురొస్తూ -
"డార్లింగ్...టీ!" అని అందిస్తాడేమో.
ఆమె గులాబీ రంగు పెదవులు టీ గుటక వెయ్యగానే ఆ పెదవుల తడిని ఆత్రంగా దోచుకోడానికి ముందుకి వంగి ఆమెని తనలో పొదుపుకుంటాడేమో.
ఆమె విదలించుకున్నట్లు నటిస్తూ....ఇంకా ఇంకా అతనిలో ఒదిగిపోతూ ఆ సామీప్యాన్ని తనవితీరా అనుభవిస్తుంటే...
ట్రింగ్....ట్రింగ్...ఫోన్ మ్రోగి నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చింది.
గురుమూర్తి లోపలికి వెళ్ళాను.
నేను లోపలికి వెళ్ళాను.
ఆయనకి మావయ్య వయసే వుంటుంది. బట్టతలతో ఒకింత భారీగానే వుంటాడు. అతని ఎదురుగా అనసూయ కూర్చుని వుంది.
"ఎలా వుంది ఉద్యోగం?" అడిగాడు.
"ఇంకా పనేం తెలియలేదు సార్!" అన్నాను.
"అనసూయా... పని చెప్పలేదా?" అని ఆమెకేసి చూసాడు.
"ప్రత్యేకించి ఏం లేదు" అంది.
నాకు చాలా నిరుత్సాహంగా అనిపించింది. "నాకు పని కావాలి అందుకే ఉద్యోగంలో చేరాను" అన్నాను.
"నాకు తెలుసు పరంధామ్ కోడలు డబ్బు కోసం చేరాల్సిన అవసరంలేదు మరి!" అన్నాడాయన.
అనసూయ నాతో "రిసెప్షన్ లో ఫోన్స్ ఎటెండ్ అవండి. ఇన్ స్ట్రక్టర్ల ఎటెండెన్స్ చూడండి" అంది.
ఇంకేమైనా చెప్తాడేమోనని నేను ఆయన వైపు చూసాను.
ఆయన ఇంక వెళ్ళచ్చు అన్నట్లు తలవూపాడు.
నేను బైటికి వస్తుంటే స్వింగ్ డోర్ ధడాల్న మూసుకుపోయింది.
అనసూయ మాత్రం చాలా బిజీగా కనిపించింది. లంచ్ లో నాతో కలిసి తింటుందనుకున్నాను కానీ గురుమూర్తి ఎక్కడికో వెళ్ళాలంటూ తీసుకెళ్ళిపోయాడు.
స్టూడెంట్స్ ఆ రోజు నావైపు కుతూహలంగా చూసారు. అంతమంది అబ్బాయిలనీ అమ్మాయిలనీ ఒక దగ్గర చూస్తుంటే యవ్వనం అంతా అక్కడే కుప్పపోసినట్లుగా అనిపించింది. ఇంత అందమైన వయసుని దాటి ఎంత వేగంగా నిర్వికార గృహ్యకం వైపు పయనిస్తారీ ఆడపిల్లలూ? అనుకుని, అందరి అదృష్టాలూ నాలాగే ఎందుకుంటాయిలే అని నాకు నేనే చెప్పుకున్నాను.
"మీవారు చాలా అదృష్టవంతులు" మర్నాడు అనసూయకి ఈ కాంప్లిమెంట్ ఇవ్వకుండా వుండలేకపోయాను.
ఆమె అదే అందమైన నవ్వుతో "ఎందుకూ?" అంది.
"మీ ముఖం చూస్తుంటే ఇంకే పనీ చెయ్యబుద్దికాదు" అన్నాను.
"ఆయనకి కూడా!" అని నవ్వింది.
న యూహ తప్పుకాదు. చాలా రొమేంటిక్ అయివుంటాడు. ఆ రోజు గులాబీ రంగు షిఫాన్ చీరలో జుట్టుని బంధించకుండా అలాగే వదిలేసిన ఆమె హుసేన్ కుంచె నుండి జారిపడ్డట్లు వుంది. ఆమె కదులుతుంటే ఎవడికయినా గుండెల్లో జాకీర్ హుసేన్ తబలా వినబడాల్సిందే! రవి శంకర్ సితార్ మెట్ల గమకాలు ఆమె మాట్లాడే విరుపుల్లో వున్నాయి. చౌరాసియా వేణునాదం ఆమె నిశ్వాసంలోంచి మధురనాదం పుట్టిస్తోంది. ఆమె ముచ్చటగా మూతి ముడిచి కళ్ళు చిన్నవి చేసి నవ్వుతోంటే....ఎంత ముద్దూ అన్న బాల మురళీ గానమాధుర్యం గుర్తొస్తుంది.
"మీ పేరేమిటి మేడం?" ఓ స్టూడెంట్ సాయంత్రం వచ్చేస్తుండగా అడిగింది.
"సుమతీ" అన్నాను.
"అనసూయా మేడంకి ఇంక అటెండెన్స్ చూసే పని కూడా వుండదన్నమాట! ఎంతైనా లక్కీ!" అంది.
