"నువ్వింకో క్షణంలో నాతో రాకపోతే సంకెళ్ళు వేసి తీసుకు వెళ్ళాల్సి వుంటుంది."
మళ్ళీ అదే చూపు. వీరదాసు ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఫోన్ దగ్గరికి నడచి డయల్ చేశాడు. రెండు నిముషాల్లో కనెక్షన్ వచ్చింది.
"హల్లో! కామినిగారా - మినిష్టర్ గారున్నారా? ఏం లేదు చిన్న ట్రాన్స్ ఫర్ కావాలి. ఇప్పుడే క్షణాలమీద ఆహా- అలా బెదిరిస్తే చాలు. ఎవరో కుర్ర ఇన్ స్పెక్టర్.... అరెస్ట్ చేస్తానని అర్ధరాత్రి వచ్చి కూర్చున్నాడు. అనుభవం తక్కువ. మీరు మాట్లాడతారా? సరే."
ఫోన్ అందించాడు వీరదాసు. రాణా అందుకున్నాడు.
"ఏమిటి రాణా- మళ్ళీ ఏదో గొడవ చేస్తున్నట్టున్నావ్?"
"ఈ అర్ధరాత్రి పూట నేనేం చూస్తున్నానో మీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. మీరేదైనా చెప్పదల్చుకుంటే చెప్పొచ్చు."
"నేనెప్పుడు చెప్పినా ఒకటే ఈ రాజకీయ వలయంలో చిక్కుకోకు. చాలా కష్టాల్లో పడతావు."
"మీరు చెప్పేది ఇంకేమైనా వుందా?"
"రాష్ట్రంలో అధికార పార్టీకి వీరదాసు అవసరం చాలా వుంది."
"ఇంకా ఏమైనా వుందా?"
"తొందరలో ఎలక్షన్ లొస్తున్నాయి."
"తెలుసు. ఇంకా ఏమైనా?"
అవతల ఫోన్ దగ్గరికి ఎవరో వచ్చిన అలికిడి.
కామిని భర్తకి అంతా చెప్పినట్టుంది. హోం మినిష్టర్ లైన్ లోకి వచ్చాడు.
"నీ పేరు?"
"రాణా సర్ స్టూవర్ట్ పురం ఇన్ స్పెక్టర్ని."
"ఆ కేసు చూసీ చూడనట్టు వదిలెయ్యి."
"సార్....చనిపోయిన వ్యక్తి డెత్ స్టేట్ మెంట్ లో క్లియర్ గా చెప్పాడు వీరదాసే తనని కాల్చేసేడని."
"నీ డెత్ స్టేట్ మెంట్ ని తగలెట్టు, F.I.R ఇంకొకటి వ్రాసుకో."
"కానీ సర్!"
"వెంటనే ఫోన్ పెట్టేసి నేను చెప్పినట్టు చేస్తావా? ఇప్పటికిప్పుడు ట్రాన్స్ ఫర్ చేయమంటావా?"
రాణా ఫోన్ పెట్టేశాడు.
వీరదాసు నవ్వాడు.
రాణా పిడికిలి బిగించి అతడి దవడ మీద బలంగా కొట్టాడు. ఫోన్ తో సహా వీరదాసు క్రిందపడ్డాడు. అతడు లేచే లోపులో చేతులకి సంకెళ్ళు వేసి భుజం పట్టుకు లేపాడు.
"పోలీస్ స్టేషన్ కి పద" అన్నాడు కామ్ గా.
* * *
రాత్రి మూడింటికి-
వీరదాసుని అరెస్ట్ చేసి రాణా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే సమయానికి- అక్కడంతా సందడిగా వుంది. ఎమ్మెల్యే నాయుడు, డియస్పీ, పోలీసులు, జనం, యస్సై అందరూ వున్నారు. అంతా పొక్కిపోయింది. అర్ధరాత్రిపూట అంత హడావుడి ఆ పోలీస్ స్టేషన్ చరిత్రలో అదే ప్రధమం.
"ఎంత ధైర్యం నీకు? హోం మినిష్టర్ చెప్పాక కూడా అరెస్ట్ చేస్తావా?" అన్నాడు నాయుడు.
"ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చేవరకూ నేనిక్కడ ఇన్ స్పెక్టర్నే" అన్నాడు రాణా.
డియస్పీ సీట్లోంచి లేచాడు. ఎందుకో తెలీదుగానీ అతడి మొహం విచారంగా వుంది.
"ఐయాం సారీ రాణా నిన్ను వెంటనే ట్రాన్స్ ఫర్ చెయ్యమని ఆర్డరు....వీరదాసుని వదిలిపెట్టని పక్షంలో" అన్నాడు అతని మాటల్లో నిస్సహాయత గోచరిస్తూంది.
రాణా ముగ్గురివైపూ చూశాడు. వీరదాసు తల వంచుకుని కూర్చుని చేతి బేడీలవైపు చూసుకుంటున్నాడు. వంచిన తల క్రింద పెదవులు నవ్వుకుంటున్నాయి.
ఫోన్ ఎత్తి ఎక్స్చేంజికి చెప్పాడు. "ఢిల్లీ కనెక్షన్ ఇవ్వు. 2426921 లైటినింగ్ కాల్."
ముగ్గురూ ఆశ్చర్యంగా చూస్తూ వుండగా రాణా ఫోన్ లో మాట్లాడాడు. "సారీ అర్ధరాత్రి డిస్టర్బ్ చేసినందుకు. మీరు అన్నంతా అయింది. ఇక్కడ రాష్ట్ర హోం మినిష్టర్ గారు అడ్డు పడుతున్నారు..... అవును.....వీరదాస్ అరెస్ట్ విషయంలోనే ఏమిటీ? కేసు సి.బి.ఐ.కి ట్రాన్స్ ఫర్ చేస్తారా- ఒక్క నిమిషం మా డియస్పీగారితో మాట్లాడుదురు గానీ" అంటూ ఫోన్ డియస్పీకి అందించబోయాడు. ఆయనింకా షాక్ నుంచి తేరుకోలేదు.
"ఎవరు అటువైపు?" అని అడిగాడు.
"ప్రైమ్ మినిష్టర్ ప్రైవేట్ సెక్రటరీ సర్...." అన్నాడు రాణా ఒక్కసారిగా ఆ గదిలో కలకలంరేగింది. రాణా తనే ఫోన్ లో తిరిగి మాట్లాడుతూ "సరే సార్- మళ్ళీ ఏదైనా అవసరంవస్తే మాట్లాడతాను" అని ఫోన్ పెట్టేశాడు.
వీరదాసుని లాకప్ లో వేసి, తాళం చేతులు డియస్పీ ముందు పడేసి "నేను చెయ్యవలసిన పని చేశాను సర్. ఇక మీ ఇష్టం నన్ను ఎక్కడికి ట్రాన్స్ ఫర్ చేస్తే అక్కడికి ఈ క్షణమే రిలీవ్ అయిపోతాను." అన్నాడు.
నాయుడివైపు డియస్పీ 'ఏం చెయ్యమంటారో చెప్పండి' అన్నట్టు చూశాడు. నాయుడు వీరదాసు వైపు సెల్ లోకి చూశాడు. అక్కడంతా చీకటిగా వుంది. ఏమీ కనపడలేదు. అంతా అయోమయంగా వుంది. నాయుడికి కథ ఈ విధంగా తిరుగుతుందని అతడు వూహించలేదు. హోం మినిష్టర్ తోగానీ, కామినితో గానీ మాట్లాడాలి.
"రేప్రొద్దున్న కలుద్దాం" అంటూ హడావుడిగా అక్కన్నుంచి వెళ్ళిపోయాడు.
పోలీస్ స్టేషన్ నిండా శ్మశాన నిశ్శబ్దం పరుచుకుంది. ముగ్గురు అధికారులూ బయటకొచ్చారు. తెల్లవారడానికి ఇంకా రెండు గంటలు టైముంది. చల్లగాలి రివ్వున వీస్తోంది. పెళ్ళో- అంత్యక్రియలో లాంటిది జరిగి, అంతా పూర్తి అయిపోయిన తరువాత రిలీఫ్....
"నాకు ఆశ్చర్యంగా వుంది రాణా నీకు....నీకు ప్రాధాన్ మంత్రి దగ్గర అంత పలుకుబడి వున్నదా?" డియస్పీ అడిగాడు.
రాణా నవ్వాడు. "వాడు అయిదు నంబర్లు తిప్పి- హైదరాబాదు- హోం మినిష్టరుతో మాట్లాడు అన్నాడు సార్. నేను ఏడు నంబర్లు తిప్పి ఢిల్లీ - ప్రైం మినిష్టర్ అన్నాను. నేనెవడితో మాట్లాడానో నాకే తెలీదు. ఏదో నోటికొచ్చిన నెంబర్ చెప్పానంతే...."
ఇద్దరూ నోరు తెరుచుకు వింటున్నారు.
రాణా అన్నాడు- "ఉపాధ్యాయ కాలనీ వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఒకటే సలహా ఇచ్చాను సార్. 'మీ తరపు నుంచి మీరేదైనా చెయ్యండి' అని అసెంబ్లీ వుంది. ప్రతిపక్షం వుంది. అన్నిటికీ మించి ప్రెస్ వుంది."
రాణా కొనసాగించాడు. "రేప్రొద్దున్న వరకూ వీరదాస్ ని సెల్ లో వుంచగలిగితే చాలు ప్రెస్ లో ఈ వార్త వచ్చేస్తుంది. నాదేముంది సార్. ఇంకో వూరునుంచి ఈ వూరు వచ్చాను. ఈ వూరునుంచి ఇంకో వూరు వెళ్తాను. అందుకే నాయుడికి ప్రధానమంత్రి పేరు చెప్పి భయపెట్టాను" అంటూ తిరిగి నవ్వాడు. ఇద్దరూ అప్రతిభులై విన్నారు. డియస్పీ అటెన్షన్ లోకి వచ్చాడు. "ఒకప్పుడు నేనెలా వుండాలనుకునేవాడినో, ఇప్పుడు నువ్వలా వున్నావ్ రాణా ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్ మెంట్" అని హాట్ తీసి చేత్తో పట్టుకుని రాణాకి సెల్యూట్ చేశాడు? రాణా నిరుత్తరుడై వారించే లోపులో అతనన్నాడు-"....నేను వయసులో వున్నపుడు ఇంత ధైర్యం చెయ్యలేక, తెలివితేటలు లేక- తాగుబోతునీ, లంచగొండినీ అయిపోయాను. ఎస్కేపిజాన్ని ఎన్నుకున్నాను.....ఇప్పుడు....ఇప్పుడు నిన్ను చూసి నేను నిజంగా గర్వపడుతున్నాను" అతడి కళ్ళలో తడి కదలాడింది.
ఆ ముగ్గురు ఆఫీసర్లమీదా తూర్పునుంచి వెలుగురేఖలు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి.
* * *
వాళ్ళు అనుకున్నట్టు వీరదాస్ ఆ మరుసటిరోజు లాకప్ నుంచి రిలీజు కాలేదు.
రాణాకి ట్రాన్స్ ఫర్ రాలేదు.
ఈవెనింగ్ ఎడిషన్ పేపరులో మాత్రం ఈ మాత్రం ప్రముఖంగా వచ్చింది.
దాంతో సంచలనం చెలరేగింది.
అసలు ఆ రోజు ప్రొద్దున్నకే ఈ వార్త ఊరంతా పొక్కిపోయింది. ఎం.పి.పులిరాజుకి, తను కొట్టేసినవి గిల్టునగలని- రెండురోజుల మున్హే తెలిసింది. తేలుకుట్టిన దొంగలా వుండిపోయాడు. ఇప్పుడు వీరదాస్ అరెస్టుతో అసలు విషయం బయటపడింది నగలు దొరకలేదన్న విచారం కన్నా- వీరదాస్ అరెస్టు, నాయుడు దొంగతనం బయటపడటం అతడికి సంతోషం కలగచేశాయి.
అంతలో రాణాని ట్రాన్స్ ఫర్ చేసి, డెత్ స్టేట్ మెంట్ మాయంచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్త తెలిసింది. ఢిల్లీ ఫోన్ చేశాడు. ప్రధానమంత్రి స్వయంగా ఈ కేసు విన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కేంద్రానికి ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్టు వుంది. కేంద్రంలో వున్న పార్టీకి రాష్ట్రంలో వున్న పార్టీ ఒక తలనొప్పిగా తయారైంది.
ఇప్పుడిది ఒక మంచి అవకాశంగా ప్రధానమంత్రి భావించాడు, గుడి దొంగతనంలో ఎమ్మెల్యే పాత్ర ఒక రౌడీని అరెస్టు చేయబోతే హోం మినిష్టర్ ఇన్ స్పెక్టర్ ని బదిలీ చేయడం.... ఈ రెండూ చాలు- ఎలక్షన్ల ముందు రాష్ట్ర అధికార పార్టీమీద దుమ్ము జల్లడానికి-
క్షణాల్లో సూచనలు వెళ్ళాయి. కేంద్ర అధికార పార్టీ ప్రముఖుడు ఆ వూరు వచ్చాడు.
రాష్ట్ర హోం మినిష్టర్ భార్యకి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ముందు కేంద్రం టెంట్ వేసింది.
ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ ని సాకుగా పెట్టుకుని సెంటర్ Vs స్టేట్ యుద్ధం ప్రారంభమైంది.
ప్రత్యర్ధుల్ని ఫూల్స్ ని చేయడానికి రాణా ఫోన్ లో సరదాగా ఏం నాటకం ఆడాడో అదే నిజమైంది.
"నువ్వు దొంగ" అంటే "నువ్వు దొంగ" అని తేల్చుకోవడం కోసం ఇరు రాజకీయ పక్షాలు దొంగల వూరయిన స్టూవర్ట్ పురంలో బలాలు సమీకరించారు.
11
"రేపు మన వూళ్ళో బంద్ నిర్వహించాలి. రెండ్రోజుల తరువాత మొత్తం ఆంద్రప్రదేశ్ బంద్ కి మన పార్టీ పిలుపునిస్తుంది. అదీ ప్రస్తుత ప్రోగ్రామ్" అన్నాడు హోం మినిష్టర్.
నాయుడు తలూపాడు.
"వీరదాసు గతంలో చేసిన మంచి పనులేమైనా వుంటే వెలికి తీయండి".
నాయుడు కాస్త ఆలోచించి "అతడు ఒక్క మంచి పని చేసినట్టు కూడా గుర్తులేదు" అన్నాడు.
"ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టించడం నుంచి - వరద బాధితులకి చందాలు వసూలు చేయడం వరకూ ఏదో ఒకటి వుండకపోదు".
నాయుడు ఏదో స్ఫురించినట్టు "గుర్తొచ్చింది. గత సంవత్సరం చీరాలలో జరిగిన అగ్ని ప్రమాద సందర్భంలో ఈ జిల్లాలో చందాలు వసూలు చేశాం" అన్నాడు. క్రితం సంవత్సరం వంద పాకలు తగలబడి ఆస్తి నష్టం జరిగింది. ఆ సమయంలో వీరదాసు స్వయంగా "కార్యకర్తల్ని" పంపి ఆ జిల్లాలో చందాలు వసూలు చేయించాడు. కొంచెం పేరున్న వ్యాపారాలెవరైనా పదివేలకు తక్కువ ఇస్తే ఈ "కార్యకర్తలు" ఆ చందా "స్వీకరించటానికి" వప్పుకోలేదు. మొత్తం పది లక్షలు వసూలైనట్టు భోగట్టా అయితే అది అగ్నిప్రమాద బాధితులకు చేరనేలేదు. అదంతా వేరే సంగతి.
