Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 22

    "అవునేఁ ఎగ్జాట్లీ! నాకు తెలుసు!" స్ఫూర్తి తొందరగా ఒప్పేసుకుంది.
    "అవును కదా!" ఈష్ స్ఫూర్తి వైపు డిసప్పాయింట్ గా చూశాడు.
    "మాకేననుకున్నా....నీకు తెలుసా ఈ విషయం!" రేవతి అతితెలివిగా అడిగింది.
    "అవును రేవూ... మనకూ తెలిసిది!" ఆనంద్ సపోర్ట్ చేశాడు.
    అప్పుడు కామిని మళ్లీ అడిగింది- "మీ అందరికీ ఎలా తెలుసు?" అని  లాజిక్ గా!
    క్రాంత్ అటుతిరిగి నవ్వాడు- రేవంత్ కూ, ఈష్ కూ, ఆనంద్ కూ కన్నుకొట్టి.
    "ఎలా  తెలుసంటే.... ఎలా తెలుసంటే... తెలుసంతే!" తడబడ్డారమ్మాయిలు! అబ్బాయిలు ఆకాశం వైపూ, కొండల వైపూ చూడసాగారు.... ఆ టాపిక్ విననట్టు!
    "తెలిసిపోయింది. మీరందరూ ఒక్కసారన్నా కళ్ళు మూసుకున్నారు.... అవునా? ఒప్పుకొవాలీ!" దొంగల్ని పట్టుకున్న ఇన్ స్పెక్టర్ లా అడిగింది.
    "అవునూఁ... నీకెలా తెలుసే?!" జ్ఞాపిక లా పాయింట్ తీసింది.
    క్రాంత్ ఇటువైపు తిరిగి కామినిని చూసి నవ్వాడు- టీజింగ్ గా చూస్తూ కామిని వైపు, 'దొరికిపోయావులే....' అన్నట్టు.
    "ఎలా తెలుసంటే.... ఎక్కడో.... ఎక్కడో....చదివానన్నమాట!" తడబడింది.
    క్రాంత్ మళ్లీ నవ్వాడు. అంతే...! ముగ్గురమ్మాయిలూ చుట్టుముట్టారు.
    "ఎక్కడో చదివావు....అవునా?" దబాయించారు. "నిజం చెప్పు... నిజం చెప్పు!" అని చక్కిలిగింతలు పెట్టేసరికి- "చెప్తా! చెప్తా!" అని.., "మీరు మూసుకున్నట్టే నేనూ ఓసారి మూసుకున్నాను. ఒకేసారి సుమా! నిజం!!" అని నమ్మిస్తూ.
    "అలా రా దారికి! అందరం దొంగలం కాబట్టి పార్టీ ఖర్చు అందరిదీ!" అని రాజీకొచ్చేశారు.
                                           16
    హాస్టల్ వైపు నడుస్తున్నారు రేవంత్, జ్ఞాపిక!
    చల్లని నీడలలో రాలిన ఆకులూ, పూవులూ ప్రేమజంటకు పూలబాట పరిచినట్టుగా వున్నాయి!
    వాటిమీద అడుగు పడకుండా జాగ్రత్తగా నడుస్తోంది జ్ఞాపిక.
    "నీ కోసమే వసంతాన్నడిగి పూలబాట వేయించా! నువ్వలా తప్పుకుని నడిస్తే వసంతం చిన్నబుచ్చుకోదూ?!" చిలిపిగా అడిగాడు.
    "నీకూ నా మీద ప్రేమ, వసంతానికి నీ మీద గౌరవం- కఠినంగా మార్చి పూలను నా  కాళ్ల కింద నలగమని ఆదేశించినా....వీటి గుండెల్ని తొక్కేసేంత కాఠిన్యం నాకు లేదు" నెమ్మదిగా చెప్పి, పువ్వుపై వెయబోయే కాలును తప్పించబోతూ తూలింది!
    గభాల్న పట్టుకుని నిలబెట్టి-
    "సరే....మేమంటే కఠినులం! తెలీక పరిచేశాం! నలక్కుండా నువ్వు నడవాలంటే కింద పడిపోవడం తప్పదు! పూలు తొక్కకుండా ఆ చివరికి నువ్వు చేరే తేలికమార్గం చెప్పనీ!" అడిగాడు.
    "ఏంటది?" కుతూహలంగా అడిగింది.
    "సింపుల్....!" అని రెండుచేతుల్తో జ్ఞాపికను ఎత్తిపట్టుకుని పసిపిల్లలా మోస్తూనడవసాగాడు.
    "సింపుల్ లేదూ, డింపుల్ లేదూ... దించు నన్ను! లేపోతే అరుస్తా! కిడ్నాపింగ్ అనుకుని అందరూ కలిసి మాలిష్ చేస్తారు నిన్ను!"
    "ఏదీ అరువు! నీ ఓవర్ కాన్ఫిడెన్సేంటో బయటపడుతుంది!"
    "చూడు మరి!" బెదిరించింది.
    "అరువూఁ...." నింపాదిగానే రెచ్చగొట్టాడు.
    దూరంగాఉన్నతని వైపు చూస్తూ- "హెల్ప్.... హెల్ప్ ప్లీజ్... హెల్ప్!" అంది. అతను దగ్గరికొచ్చాడు.
    "చూడండీ! నన్ను బలవంతాన ఎత్తుకెళ్తున్నాడు!" కంప్లయింట్ చెప్పింది ఏడుపు గొంతులో! రేవంత్ నవ్వుతూ చూస్తున్నాడు.
    ఆ వ్యక్తి నిమ్మళంగా- "నిన్ను బలవంతాన ఎత్తుకెళ్తుంటే అతని మెడచుట్టూ చేతులేసి మరీ మోయించుకుంటున్నా వెందుకమ్మా?" అడిగాడు.
    అప్పుడు  చూసుకుంది- తను అనుకోకుండా రేవంత్ మెడచుట్టూ చేతులేసింది. నాలుక కొరుక్కుని చటుక్కున తీసేసింది.
    అప్పటికే నలుగురైదుగురు పోగయ్యారు. అప్పటికీ రేవంత్ నవ్వుతూనే ఉన్నాడు. వాళ్ళు ఏవయిందని అడిగారు.
    "చూడండీ....ఇతను నన్ను బలవంతాన ఎత్తుకుపోతున్నాడు!" కంప్లయింట్ చెప్పింది మళ్లీ ఏడుపుగొంతుతో.
    "అతను ఆగి పదినిముషాలయింది. ఇకనైనా నువ్వు దిగొచ్చు కదమ్మా! మోయించుకుంది కాక, నిన్నేత్తుకు పోతున్నాడనే బూటకవు ఏడుపెందుకు? ఈ కాలం  అమ్మాయిలు అతితెలివి ప్రదర్శించాలనుకుంటారు!" గొణుక్కుంటూ వెళ్లసాగారు.
    "అదేవింటండీ! ఇతను నన్నెత్తుకు పోతున్నాడని మొత్తుకుంటున్నా ఎవరూ నమ్మరేం! అదే మీ చెల్లెల్నయితే  ఊరుకుంటారా" దబాయించింది గట్టిగా!
    అందులోంచి ఒక శ్రేయోభిలాషి దగ్గరికొచ్చి, "ముందు కిందకు దిగమ్మా! అతనాగి ఎంతోసేపయింది.... మేము నిన్నెత్తుకు  పోతున్నాడనిపించేలా లేదు సీను! ఏ కుంటిపిల్లనో నడవలేకపోతే మోసుకెళ్తున్నాడు పాపం.... అనిపించేలా ఉంది" అన్నాడు.
    ఎగిరి కిందకు దూకింది.
    "ఏయ్ఁ! ఇదుగో చూడూ.... నేనేం కుంటిపిల్లను కాదు! రెండుకాళ్లూ ఎంత బావున్నాయో!" అని అటూఇటూ నడిచి చూపించింది.
    "మరి ఎందుకమ్మా- అతని మెడచుట్టూ చేతులేసి నువ్వూ, నీతోపాటు కిలోవెయిటున్న హైహీల్సూ, రెండు కిలోల బరువున్న హ్యండ్ బ్యాగూ కూడా అతనితో మోయించుకుంటున్నావ్? కాళ్లు రెండూ బావుంటే నడిచెళ్లోచ్చుగా! వెట్టిచాకిరీకి బాగా అలవాటు పడ్డట్టున్నావే!" ఎదురు తిట్టి వెళ్లిపోతూ-
    "భలే పిల్లను మోశాను కదయ్యా! ఇప్పటిదాకా మోయించుకుంది కాక, అల్లరి చెయ్యాలని చూస్తోంది. ఏ ముసలమ్మనో మోసి ఉంటే కనీసం ఆశీర్వాదం అన్నా ఇచ్చుండేది కదా!" రేవంత్ వైపు జాలిగా చూశాడు. తిక్కరేగింది గ్నపికకు.
    "వెధవ మనుషులు నిజంగా ఎత్తుకుపోతే కూడా పట్టించుకునేట్టు లేరు!" తిట్టింది.
    "నీలంటాళ్ళను ఎత్తుకుపోయే ధైర్యం, ఎత్తుకుపోయి పోషించే దమ్మూ ఎవరికుంటుందమ్మా.... వాళ్ళనే నమిలి మింగేసేలా ఉన్నావు!" ఎగాదిగా చూస్తూ అన్నాడు.
    "ఏయ్ఁ పోవయ్యా! నువ్వేం నాకు హెల్ప్ చేయొద్దు. ఆడపిల్ల అనే జాలి లేకుండా ఎదురు ఉపన్యాసం ఇస్తున్నావే?!ఇంకెవర్నయినా వెతుక్కుంటా హెల్ప్ కు- నువ్వు పో!" కసిరి కొట్టింది.
    రేవంత్ వైపు చూస్తూ 'మెంటలా..?' అని సైగ చేశాడతను.
   'కొంచెం..!' అని రేవంత్ సైగ చేశాడు.  
    "హైహీల్ మడిమ ఎత్తి రేవంత్ కాలు తొక్కింది బలంగా.
    "అమ్మా...!" అని అరిచాడు రేవంత్.
    "జాగ్రత్త బాబూ! తొందరగా ఇంటికెళ్లు!" అని జ్ఞాపికను చూస్తూ వెనక్కి నడిచాడు.
    "నిన్నూ..." అంటూ అతని వైపు వెళ్లబోయింది! పరుగులంకించుకున్నాడు అతను రేవంత్ చేతులు కట్టుకుని నవ్వసాగాడు అదేపనిగా!
    "నన్ను టీజ్ చెయ్యాలనా నీ వేషాలూ! తిక్క కుదిరిందా? అందరూ నీకు పిచ్చనుకుంటున్నారు!" రెచ్చగొట్టి మరీ నవ్వసాగాడు.
    "అతను నవ్వుతుంటే ఇంకా రెచ్చిపోయి దగ్గరికెళ్లి కాలర్ పట్టుకుని మొహం వంచి నవ్వే రెండు పెదాలూ కలిపి మూసేసింది నడిరోడ్డు మీద!
    రేవంత్ కే సిగ్గేసి చటుక్కున వదిలించుకుని ఎంగిలి పెదాలు కర్చీఫ్ తో తుడుచుకుని చుట్టూ చూశాడు- ఎవరయినా చూశారేమోనని!
    దూరంగా ఒక గ్రూప్ వీళ్ళనే చూస్తూ నవ్వుతోంది!
    "పద వెళ్దాం!" తొందరచేశాడు.
    రేవంత్ తొందరకర్ధం తెలిసిపోయింది. అందుకే "నేన్రాను! ఓడిపోయానని ఒప్పుకో...వస్తా!" మొండితనం చూపింది.
    వాళ్ళు ఇటే చూస్తున్నారు. వెళ్లిపోకపోతే బావుండదు.
    అందుకే 'సరే! ఓడిపోయన్లే... వెళ్దాం రా!" అన్నాక, వెనక ఎక్కి కూర్చుని "బై..." అని వాళ్ళకేసి చెయ్యూపింది.
    వాళ్ళు కూడా "బై..." అని, "ఆల్ ది బెస్ట్...యంగ్ కపుల్!" అనరిచారు.
    "థాంక్యూ.... థాంక్యూ!" అనరిచింది.
    "ప్లీజ్.... షటప్ జ్ఞాపీ!" అన్నాడు.
    "నాతో పెట్టుకోకు మరి!" అంది చెవిలో.
    చక్కిలిలేసి సడన్ బ్రేకేసాడు. బలంగా రేవంత్ ను వెనకనుంచి తగిలింది జ్ఞాపిక శరీరం మొత్తం.... మెత్తగా!
    రేవంత్ లో మధురిమలు ఏవో మెల్లగా రేగసాగాయి. తననుతాను కంట్రోల్ చేసుకోవడానికి ఊపిరి బిగబట్టి-
    "జ్ఞాపీ.... అల్లరొద్దు! సీరియస్ గా ఉండు!" మెత్తగా చెప్పాడు.
    "నువ్వేగా సడన్ బ్రేక్ వేసి అల్లరి చేసింది! నన్నంటావేం...?" దబాయింపు.
    "నువ్వు చెవిలో గుసగుసలాడుతుంటే చక్కిలిగింతేసి బ్రేకేసా! నేనేం అల్లరి చేయాలని కాదు! అలా గుసగుసలు చెప్పకు! దూరంగా ఉండి చెప్పు!"
    "సరే అయితే!" అని దూరంగా ఉండి చెప్పు!"
    "రేవంత్..!" గట్టిగా అరిచింది.
    "వినిపిస్తుంది! కొంచెం మెల్లగా చెప్పు."
    "రేవంత్..!" అతిమెల్లగా పిలిచింది.
    "వినిపించడంలా... సౌండ్ కొంచెంపెంచు!"
    "గట్టిగా అంటే మెల్లగా, మెల్లగా అంటే గట్టిగా అంటావ్! నీకూ నాకూ పడదు బాబూ! నేను నడిచెళ్లిపోతా నువ్వెళ్లు! చీకట్లో నాకేవయినా నువ్వేం బాధపడకు! మన  ఫ్రెండ్సందర్నీ ఆఖరిసారి అడిగానని చెప్పు! అందర్నీ బాగా చదువుకుని గొప్పవాళ్ళను అవ్వమను. నువ్వు కూడా  మంచి అమ్మాయిని పెళ్ళిచేసుకో! నేను గుర్తొస్తే బీరూ, గీరూ తాగకు!" అప్పగింతలు పెట్టసాగింది.... అవే ఆఖరి నిముషాలన్నట్టు.
    "వద్దులే! నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు! భరించక తప్పుతుందా బ్లాక్ మెయిలింగ్ కు!" దారికొచ్చాడు.
    "అలా రా దారికి! ఇప్పుడు చెప్పు- మమ్మాకి పెళ్ళిచెయ్యాలన్న ఆలోచన నీకెప్పుడోచ్చింది?"
    "డిగ్రీ ఫస్టియర్లో!"
    "ఎందుకొచ్చింది...?"
    బైక్ ఆపాడు! అలాగే కూర్చుని  మొదలెట్టాడు.
    వెన్నెల గుమ్మడిపూవు పూసినట్టు, గుమ్మపాలు ఒలికినట్టూ అలుముకుంది ఇద్దరి మీద! తడుస్తున్న తమకంలో నేపథ్యంలోకి జ్ఞాపికను చిటికెనవేలు పట్టుకుని తీస్కెళ్లాడు.
    "నా చిన్నపుడు అమ్మకు అప్పుడప్పుడు గుండెల్లో నొప్పాచేది. ఏవో టాబ్లెట్స్ వేసుకునేది! మళ్లీ వస్తుండేది, మళ్లీ వేసుకునేది! నెపోచ్చినపుడు ఏదో సాయం చేసేవాడిని, టాబ్లెట్స్ తెచ్చేవాడిని. వంటలో సాయం చేసేవాడ్ని! ఎవరికయినా చెబుదామంటే చెప్పనిచ్చేది కాదు! 'ఏవంత పెద్దరోగం కాదు నాన్నా! నీ గురించీ, నీ చదువు గురించీ ఆలోచిస్తే వస్తుందంతే!" అనేది. నేను నమ్మేవాడ్ని. అమ్మకోసం ఎప్పుడూ చదూకుంటూ ఉండేవాడ్ని! మంచి మార్కులు వచ్చినా అమ్మకు అప్పుడప్పుడూ గుండెల్లో నొప్పొచ్చేది! మళ్లీ అడిగితే  'నువ్వు కాలేజ్ ఫస్టు రాలేదని!' అని నవ్వేది. పంతానికి  కాలేజ్  ఫస్టు తెచ్చుకున్నా మళ్లీ అమ్మకు గుండెల్లో నెపోచ్చేది! నాకెందుకో అమ్మ నా దగ్గరేదో దాస్తున్నట్టు, అమ్మకేదో తగ్గని గుండెజబ్బు వస్తుందన్నట్టు, అమ్మ నన్ను విడిచి నాన్నలాగే వెళ్లిపోతుందేమో... నన్నట్టు భయమేసేది! డిగ్రీ ఫస్టియర్లో డాక్టర్ తాతయ్య దగ్గరికెళ్లా! ఆయన్ని అమ్మ 'అంకుల్ ...' అని పిలిచేది, నేను 'తాతయ్య ' అనేవాడిని! వాళ్ళిద్దరికే తెలుసా విషయం! అమ్మ నాచేత ఒట్టేయించుకుంది.... ఎవరికీ చెప్పోద్దనీ!"
    "ఎందుకని! ఏదైనా సీరియస్సా...?" కంగారుపడింది.
    మెత్తగా నవ్వి,  "నేనూ అనుకున్నా! కానీ కాదు! అది మమ్మకు నావల్ల జరిగిన అన్యాయం వల్ల  వచ్చింది!"
    "ఏం చేశావ్! ఏదయినా పోరపాటా?"
    "అవును! మమ్మాకి పెళ్ళి చెయ్యకపోవడం!"
    "దానికీ, గుండెనెప్పికీ సంబంధం ఏవిటీ?"
    "చాలా ఉంది!"
    "నేను డాక్టరు తాతయ్యను కలిసి కంగారుపడ్డప్పుడు, చెప్పకపోతే నామీద ఒట్టేసినపుడు- 'ఇన్నాళ్లూ నీ కర్ధంచేసుకునే వయసు లేదు కనుక చెబుతున్నాను...' అని 'మీ మమ్మాకి చిన్నవయసులో పెళ్ళయింది.  అంటే.... పదో తరగతి  సెలవుల్లో ఇంచుమించు పద్దెనిమిదేళ్ల  వయసు వెంటనే గర్భం వచ్చింది. నిన్ను  మూడు నెలల గర్భిణిగా ఉన్నపుడు మీ డాడ్ యాక్సిడెంట్ లో పోయారు. అప్పుడు మీ మమ్మాకు పందోమ్మిదేళ్లు! మూడోనెల అబార్షన్ చేయించి ఇంకో పెళ్ళి చేస్తామని తలిదండ్రులూ, అన్నయ్యలూ పట్టుబట్టారు. మీ మమ్మా నిన్ను చంపుకోలకపోయింది. వాళ్ళతో గొడవపడి బయటికొచ్చింది. ఇటు పార్ట్ టైమ్ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తూ చదూకుంది. డిగ్రీ కాగానే టీచర్ పోస్ట్ , పి.జి. కాగానే లెక్చరర్ అయింది. పి.హెచ్.డి చేసింది. నిన్ను పెంచుకుంటూనే తనను పెంచుకుంది.
    అయితే.... ఇందులో నువ్వర్థంచేసుకునే సూక్ష్మ విషయం ఒకటుంది. నీమీద ప్రేమతో మళ్లీ తనకు  పెళ్ళి ఆలోచనా, పరపుషుడి ఆలోచనా మెదడుకు రానివ్వకపోయినా శరీరానికి ప్రకృతి ధర్మమయిన కొన్ని ఎంజైములు ఉంటాయి. అలాగే సెక్స్ కు సంబందించిన ఎంజైములు తనలో తనకు తెలీకుండానే ప్రకృతిధర్మంగా ఉత్తేజితమవుతాయి ఆ ఉత్తేజం ఆమెను శారీరకంగా బాధపెడుతుంది. అందులోని కొన్ని బాధలలో ఒక బాధ- ఈ  గుండెకు సంబంధించిన 'మజిల్ పెయిన్' మీ  మమ్మా  దానితోనే బాధపడేది.
    నువ్వు పసికందుగా ఉన్నపుడు ఇవన్నీ ఆలోచించి తనను ఇష్టపడి నీతో సహా స్వీకరిస్తానని వచ్చిన వ్యక్తిని పెళ్ళిచేసుకొమ్మని మేమందరం ఎంత బలవంతపెట్టినా చేసుకోలేదు. మీ మమ్మాను ఎంతో  ఇష్టపడ్డ ఆ వ్యక్తీ నిరాశగా వెళ్లిపోయాడు. నువ్వే లక్ష్యంగా బ్రతుకుతున్న మీ మమ్మా ప్రకృతిధర్మం ఇలా గుండెనొప్పి  తెచ్చినా అదేమంత ప్రాణాంతకమయింది కాదు. వేరే  డైవర్షన్ వల్లనో, తాత్కాలిక ఉపశమనపు మందుల వల్లనో  దాన్ని  తగ్గించొచ్చు' అని ఆయన చెప్పాక మమ్మా గుండెనొప్పి వచ్చినప్పుడల్లా మమ్మాకి తెలీకుండా నేనెంతో  గిల్టీగా ఫీలయ్యేవాడిని.  నాకోసం మమ్మా  వదులుకున్న జీవితాన్ని తలుచుకుని ఎలాగైనా  తనకది సాధించి పెట్టాలనిపించేది. నేనెప్పుడు 'పెళ్ళి చేసుకోమ్మా!' అన్నా   పసిపిల్లాడ్ని చూసినట్టు చూసి నవ్వేది తప్పితే- ఏ  సమాధానం ఉండేది కాదు! తను  నవ్వినపుడల్లా నాలో వంతం పెరిగేది. అయినా ఏం చెయ్యలేకపోయేవాడ్ని.... అలగడం, అన్నం తినకపోవడం మినహా!" ఆగాడు.
    జ్ఞాపిక కళ్ళలో నీళ్లు..!
    "అదేంటి....నువ్వేడుస్తున్నావ్?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS