Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 21

    "పెళ్ళంటే.... సెక్స్ కు లైసెన్స్, పిల్లలు కనడానికి పర్మిషన్ కాదా?" కామిని అడ్డుపుల్ల వేసింది.
    "అది భారతీయ నిర్వచనంలోని భాగం! ప్రపంచ నిర్వచనం కాదు. మనమేది తీసుకున్నా యూనివర్సల్ సిద్దాంతాలు తీసుకోవాలిగానీ ఒక దేశానికి, ఒక దేశానికి, ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమైన సిద్దాంతాలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే అది పరిపూర్ణం కాదు. ఏకపక్షం అవుతుంది!" జ్ఞాపిక ఆన్సరిచ్చింది.
    "మరి- సెక్స్ లేకుండా, పిల్లల్ని కనకుండా కలిసి జీవించినా... అది పెళ్ళవుతుందా?" రేవతికి అనుమానం వచ్చింది.
    "ఎందుక్కాదూ...?! ఫారిన్ లో అరవై ఏళ్ల తరువాత పెళ్ళి చేసుకున్న జంటలున్నాయి. మరి వాళ్ళు చేసుకొంది- సెక్స్ కోసం, పిల్లల కోసం కాదుగా! తోడు కోసం, స్నేహం కోసం! కలిసి జీవించడానికి గౌరవపరదమైన విధానమే పెళ్ళి.... అని ఇక్కడ తెలియడంలా?!" స్ఫూర్తి ఆన్సర్ చేసింది.
    "నిజానికి౦ సెక్సూ, పిల్లలే కణాలనుకుంటే పెళ్ళి చేసుకోనక్కర్లేదు. సెక్సుకూ డేటింగ్స్ ఉన్నాయి! పిల్లల్ని పెళ్ళి చేసుకోకుండానే కనీ, పెంచుకోవచ్చని ప్రాక్టికల్ ఉదాహరణగా 'నీనాగుప్తా' ఉంది! మరి - సెక్సుకూ, పిల్లలకూ పెళ్ళి అనే బంధం అక్కర్లేదు. 'పెళ్ళి' అనేః పదం ఈ రెండింటినీ దాటినా ఉన్నతమైన బంధం!" క్రాంత్ అన్నాడు.
    "అలాంటప్పుడు- కులం, వంశం, చదువు, సంపాదన మొదలైనవే కాకుండా వయసు తారతమ్యం కూడా పెళ్ళికి  అడ్డురాకూడదు కదా!" ఈష్ అన్నాడు.
    "నువ్వనేదాంట్లో భారతదేశంలో పురుషుడికంటే చిన్నదయిన స్త్రీనే చేసుకోవడం ఆచారం. అలాంటి తేడా అక్కర్లేదూ... స్త్రీ పెద్దదయినా, పురుషుడు చిన్నవాడయినా ఫర్వాలేదనా?" ఆనంద్ తర్కం పెంచాడు.
    "యగ్జాట్లీ! హిందువుల్లో తనకంటే పద్దెనిమిదేళ్లు పెద్దదీ, అందులోనూ విధవస్త్రీని పెళ్ళి చేసుకోలేడూ! పెళ్ళికి పురుషుడే పెద్దవాడయి ఉండాలనే నియమం ప్రకృతిలోనూ, సంస్కృతి పునాదుల్లోనూ లేదు. తరువాత తరువాత  పితృస్వామ్య వ్యవస్థ బలం కొరకు స్త్రీ చిన్నదయి ఉండాలన్న నియమం ఏర్పడింది. అసలు స్త్రీ పెద్దదయితేనే సంసారం సుఖవంతం, సమర్థవంతం అవుతాయని కొన్ని సర్వేలు బుజువుచేశాయి" క్రాంత్ అన్నాడు.
    "నేను కూడా ఒప్పుకుంటున్నా!" ఈష్ అన్నాడు.
    "అయితే క్రాంత్! కామిని నీకంటే ఐదేళ్లు పెద్దదయి ఉంటే పెళ్ళి చేసుకునేవాడివా? స్ఫూర్తి అడిగింది డైరెక్ట్ గా.
    "తప్పకుండా! ఇంకా గర్వంగా! నేను కామినిని ఇష్టపడ్డానే గానీ, కామిని వయసును కాదె..." స్థిరంగా చెప్పాడు క్రాంత్.
    "ఒకవేళ కామిని పిల్లల్ని కనకపోతే?!" జ్ఞాపిక రెచ్చగొట్టింది.
    "గుడ్ న్యూస్! భారతదేశపు నిరుపేదరికానికి మన వంతు పేదరికం ఆపిన వాళ్ళం! ఇప్పటికాలానికి మానవజాతికి తగిన వనరులు భూమ్మీద అందలేని స్థితిలో ఒక బిడ్డ పుట్టడం ఆగిపోతే అది గుడ్ న్యూస్!" ఈజీగా చెప్పాడు. కామిని చిన్నగా నవ్వింది.... ఆన్సర్ తెలుసన్నట్లు తనకు.
    "సరే.... పెళ్ళి, సెక్స్ మాత్రమే కాదు- సహజీవనం కోసం అయినపుడు- భార్య చనిపోయిన పురుషుడికి పిల్లలున్నా మరో అమ్మాయి చేసుకుంటుంది. భర్త చనిపోయిన స్త్రీకి పిల్లలుంటే ఇంకో పురుషుడు అంత తేలిగ్గా చేసుకోడు. ఎందుకని?" స్ఫూర్తి సవాలు విసిరింది అబ్బాయిలకు.
    "ఇది కూడా ప్రాపంచిక విషయం కాదు. కొన్ని దేశాలకు సంబందించిన విషయమే! ముఖ్యంగా.... ముస్లీమ్ దేశాలలో ఖురాన్ ప్రకారం పిల్లలు ఉండీ, వయసులో పెద్దదయి ఉన్న స్త్రీని మరిది వివాహం చేసుకోవచ్చు! చేసుకున్న ఆధారాలూ ఉన్నాయి. మన సంప్రదాయంలోనూ చాలా ఉదాహరణలున్నాయి. పిల్లలున్న విధవ స్త్రీని వివాహం చేసుకున్న ఎన్నో సందర్భాలు  మన సంస్కృతిలో ఉన్నాయి" కామిని అంది.
    "మరి- భార్య చనిపోయిన పురుషుడు భవిష్యత్తు ఏర్పరచుకున్నంత తేలిగ్గా భర్త చనిపోయిన స్త్రీ ఎందుకు ఏర్పరచుకోలేకపోతోంది?" రేవతి అడిగింది.
    "పిల్లలు! పిల్లల్ని చూసుకోవడానికి పురుషుడు మరో స్త్రీని పెళ్ళి చేసుకుంటాడు. అదే పిల్లలు అన్యాయమవుతారన్న భయానికి స్త్రీ పెళ్ళి చేసుకోలేదు! స్త్రీలో ఉన్న  మాతృత్వపు ఉన్నతత్వం ముందు ఆమె తన  జీవితాన్నే ఫణంగా పెడుతుంది!" ఈష్ మెత్తగా చెప్పాడు. అది వెళ్లి బలంగా రేవంత్ గుండెను చీల్చింది.
    "అంటే... పిల్లల మీద మమకారంతో 'సవతితల్లి సరిగా చూడదేమో...' అని వివాహం మానేసిన పురుషుల్లేరంటావా? ఇక్కడ పితృత్వం కాదంటావా?" స్ఫూర్తి అంది.
    "ఎందుక్కాదూ?! పిల్లల కోసం జీవితాన్ని ఒగ్గిన తండ్రులున్నారు. వీళ్ళకూ అవకాశం ఉండీ దాన్ని  వదులుకున్నారంటే ఇక్కడ మాతృత్వపు ఉన్నతిని పితుర్త్వపు ఉన్నతి ఓడించిందని చెప్పవచ్చు!" క్రాంతి క్లియరెన్స్ ఇచ్చాడు. ఇది వెళ్లి జ్ఞాపిక మెదడును  చిద్రం చేసింది.
    "మరి, ఇంతగా త్యాగం చేసిన తల్లిదండ్రులకు పిల్లలు న్యాయం చేస్తారంటావా?"  ఆనంద్ అడిగాడు.
    "ఆ పిల్లలేదో తమకు న్యాయం చెయ్యాలని తల్లిదండ్రులు ఆశించరు. తమవంతు కర్తవ్యమ్ తాము చేస్తారు. సమర్దులైతే పిల్లలు వారి వంతు కర్తవ్యం వారు కూడా చెయ్యాలి మరి! చెయ్యకపోయినా ఆ తల్లిదండ్రులు బాధపడరు. కానీ, తమ  తల్లిదండ్రులకు న్యాయం చేయని పిల్లలు మాత్రం సరైన జీవనకర్తలు కాలేరు" ఈష్ ముగించాడు.
    "న్యాయం చెయ్యడమంటే...?" రేవతికి  అనుమానం వచ్చింది.
    "ఏ జీవితాన్నయితే తమను  పెంచిపెద్దచెయ్యడనికని కోల్పోయారో- ఆ వైవాహిక జీవితాన్ని అందజేయడం!" ఈష్ అన్నాడు.
    "అంటే...మళ్లీపెళ్ళికి  వయసు మీరిందని వాళ్ళు ఒప్పుకోరేమో!" స్ఫూర్తి.
    "అదుగోఁ.... మళ్లీ! పెళ్ళికి వయసు పరిమితి లేదు! జీవన సాహచర్యంలో సహచారిగా ఒక వ్యక్తిని ఆహ్వానించడానికి వయసు పరిమితి లేదు! జీవన సాహచర్యంలో సహచారిగా ఒక వ్యక్తిని ఆహ్వనించడానికి వయసు పరిమితి ఎందుకు? అసలు పెద్దవయసు ఒంటరివాళ్ళకే తప్పనిసరిగా పెళ్ళి చెయ్యాలి! ఇన్నాళ్లూ పిల్లలమీదే తమ దృష్టి, ఆలోచనా, జీవితం కేంద్రీకరించిన వాళ్ళు- పిల్లలు తమ జీవితాలను నిర్మించుకుని వెళ్లిపోతే ఇక  వాళ్ళకు సాహచర్యం ఎవరు? ఎవరికోసం వాళ్ళు దినచర్య కొనసాగించాలి? వాళ్ళలో జీవితం పట్ల విరక్తి పెరగొచ్చు కూడా!" రేవంత్ వైపు చూశాడు క్రాంత్- 'అవునా?' అన్నట్టు.
    ఈ వాదనలో ఎక్కువగా మాట్లాడింది గ్నపికా, రేవంత్ లే! అయితే.... ఈ వాదన ఎక్కువ ప్రభావం చూపింది వీరిద్దరి మీదే!
    "రేవంత్ వాళ్ళ మమ్మాకు  పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాడు.... తను స్టేట్స్ కు వెళ్లేముందు!" గంపిక అందరి ఫీలింగ్స్ చూస్తూ అంది.
    అందరి ముఖాల్లోనూ నవ్వు- ఆనందపు చాయగా వెలిగింది.
    "రియల్లీ! వెరీగుడ్.... అండ్ వెరీ మెచ్యూరిటీ థాట్!" క్రాంత్, ఈష్, ఆనంద్ చెప్పారు రేవంత్ కు! అమ్మాయిలు కూడా మెచ్చుకున్నారు.
    ;ఎవర్ని? ఎప్పుడు?" రేవతి అడిగింది- ఆలస్యం వద్దన్న ఆతృతతో.
    "నేను చెయ్యాలనుకుంటున్నా! కానీ, మమ్మా ఒప్పుకోవడంలా!" రేవంత్  నిరాశాగా అన్నాడు.
    "నేనొక ఐడియా చెప్పనా...?" రేవంతి అడిగింది.
    "ఏవిటీ? 'ఐస్ క్రీమ్ ఒక డ్రమ్ తీస్కెళ్లి ప్రజెంట్ చెయ్యి.... ఒప్పుకుంటుం'దనా?" స్ఫూర్తికి అనుమానం వచ్చింది.
    "నీ మొహంఁ.... ట్యూబ్ లైటూ! రేవంత్- వాళ్ళ మమ్మా పెళ్ళి చేసుకుంటేగానీ స్టేట్స్ కు వెళ్తాననీ, పెళ్ళి చేసుకుంటాననీ, లేపోతే ఇక్కడే ఉండి జీవితాంతం బాచిలర్ గా ఉండిపోతాననీ పట్టుబట్టాలి!"
    "అమ్మయ్యఁ.... ఇన్నాళ్లకు నీ బుర్రకు ఒక మంచి ఐడియా వచ్చిందే!" కామిని మెచ్చుకుంది. అందరూ రేవతివైపు మెచ్చుకోలుగా చూశారు. రేవతి ఆనంద్ వైపు స్టైల్ గా చూసింది. ఆనంద్ కళ్ళద్దాలు సవరించుకుని ఆనందపడిపోయాడు.
    "నిజంగా ఆ పని చెయ్యి రేవంత్!" జ్ఞాపిక కూడా అంది.
    "మమ్మా చిన్నపిల్ల కాదు..., ఇది చిన్న విషయమూ కాదు- 'నేను స్కూలు కెళ్లను' అంటే చాక్ లెట్ ఇచ్చి పంపినట్టు నేను స్టేట్స్ కెళ్లనంటే పెళ్ళి చేసుకోవడానికి! తనంతట తాను తోడునూ, ఇష్టాన్నీ పంచుకోవడానికి తానే నిర్ణయానికి వచ్చి ఒప్పుకోవాలే కానీ, బెదిరింపులకు అసలు రాజీపడదు!" రేవంత్ నింపాదిగా చెప్పాడు.
    అందరూ రేవతిని పైనుంచీ కిందకు ఎగతాళిగా చూశారు.... పనికిమాలిన ఐడియా ఇచ్చావని! రేవతి ఆనంద్ వైపు బాధగా చూసింది.... తన ఐడియా ప్లాప్ అయినందుకు! 'ఫర్లేదులే....' అన్నట్టు సైగ చేశాడు.
    "ఇంకో ఐడియా చెప్పనా?" రేవతి అంది.
    "వద్దు!" జ్ఞాపిక ఆపింది.
    "స్త్రీ పురుషులిద్దరికీ సెక్స్ ను సంబంధం లేకుండా ఇద్దరూ ఒకేవిధంగా చేసే, ఒకవిధంగా ఇష్టపడే 'కామన్ ఇష్టం' ఒకటుందీ సృష్టిలో!"
    "ఒక్కటే ఒక్కటి! ఏవిటది? ఒక్కముక్కలో చెప్పాలి.... యం సెట్ ఆన్సర్  లా !" ఫజిల్ ఇచ్చింది. అందరూ ఆలోచనలో పడగానే- ఏమాత్రం ఆలోచన లేకుండా ఠక్కున చెప్పింది రేవతి.... ఇంటలిజెంట్ బ్రెయిన్-
    "నాకు తెలుసు! కళ్ళద్దాలూ..!" అని దీర్ఘం తీసింది.
    "షటప్! సృష్టిలో నువ్వూ, ఆనందే స్త్రీ పురుషులూ...., మీకిద్దరికీ కామన్ ఇష్టం కళ్ళద్దాలూ... అని దాన్ని యూనివర్సల్ ఆన్సర్  చేయకు! నోర్మూసుకో!" తిట్టింది స్ఫూర్తి.
    "ఎందుకులేవూ? ఆఁ....ఒకరికొకరు లావుగా, బొద్దుగా కనబడటం కదా ఆనంద్?!" ఆనంద్ అడ్డంగా నిలువుగా తలూపాడు.
    "వాగావంటే తంతా! మీరిద్దరూ టుమ్ టుమ్ శాల్తీలని అందరికీ అదే ఇష్టం ఉంటుందా?" మళ్లీ తిట్టింది స్ఫూర్తి.
    "ఏంటే.... నేనెంత చక్కగా మాట్టాడుతుంటే నువ్వేవో అసహ్యంగా తిడ్తావ్? అసలు నన్ను తిట్టడానికే పుట్టావా? ఆనంద్ చూడూ- నన్నెంత చక్కగా ప్రేమిస్తున్నాడో! నువ్వూ చక్కగా  ప్రేమించొచ్చుగా....స్నేహితురాలిగా!"
    "నాకేం అంత ఖర్మ  పట్టాలా....ఒక తిండిపోతును ప్రేమించదానికి నా తిండి భరించేవాడ్ని చూసుకుని ఆల్ రెడీ ప్రేమించేసుకున్నా!" స్ఫూర్తి రెచ్చిపోయింది.
    చూశావా చూశావా ఈష్.... దీని మనసులో ఎంతో కుట్ర ఉందో! ఇది  నిన్ను తిండి భరిస్తావని ప్రేమించిందట. దీని ప్రేమ నిర్వచనం  వింటే లైలా- మజ్ను, రాధాకృష్ణులు, రోమియో- జూలియట్ ఎంత కుళ్ళికుళ్ళి ఏడుస్తారు... ప్రేమనిది అపవిత్రం చేసిందని!" ఈష్ ను డిస్టర్బ్  చేసింది రేవతి.
    స్ఫూర్తి మరింత గట్టిగా- "ఆహఁ... నీలా సోడాబుడ్డి కళ్ళద్దాలు చూసీ, కాడ్ బరీస్ ఇష్టవనీ, నీలాగా 'టుమ్ టుమ్, అనీ ప్రేమించడంకన్నా నా ప్రేమ చాలా విలువైంది!" వెక్కిరించింది స్ఫూర్తి.
    "చూడూ! నన్నంటే అన్నావ్ఁ ఆనంద్ నంటే ఒప్పుకోను" రేవతి తైయ్యంటూ లేచింది.
    "నన్నంటే ఫర్లేదు రేవూ! నిన్నేవీ అనొద్దను! నాకు బాధగా ఉంటుంది" ఆనంద్ రేవతిని రెచ్చగొట్టాడు.
    "చూశావేఁ....అదీ ప్రేమంటే! నువ్వూ, నీ బోడిప్రేమా మా ప్రేమ ముందు బలాదూర్! రేవతికి సపోర్ట్ దొరకబట్టి గట్టిగా అంది.
    "నేను తెమ్మంటే ఈష్ కొండమీద కోతినయినా తెస్తాడు... తెలుసా?" స్ఫూర్తి రెచ్చిపోయింది.
    "కోతులూ, కొండముచ్చులూ నువ్వే తెప్పిచ్చుకో- నీకే నూటవుతాయి. నాకేవీ అక్కర్లా! నేనడిగితే ఆనంద్ ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ ఐదునిముషాల్లో తెస్తారు తెలుసా? కదా.... ఆనంద్?!" డౌట్ క్లియర్ చేసుకుంది. ఆనంద్ తల అడ్డంగా , నిలువుగా ఊపాడు.
    కామినికి చిర్రెత్తింది. "మీరిద్దరూ నోర్లు మూస్తారా-  చున్నీ తీసి ఇద్దరి  నోళ్లూ మూసెయ్యాలా? అందరూ సీరియస్ గా ఆలోచిస్తుంటే- మీకెలాగూ ఆలోచించడం రాదు. వాళ్ళను ఆలోచించుకోనివ్వకుండా జోరీగల్లా చెవి పక్కన వెధవపోరు!" తిట్టింది.
    స్ఫూర్తీ, రేవతీ ఒకర్నొకరు  కోపంగా  చూసుకుని "ఛ.... ఇక్కడుంటే నన్నూ చెడగొడ్తుంది ఇది!" అని ఒకర్నొకరు ఒకేసారి గట్టిగా తిట్టుకుని దూరంగా చెరో దిక్కుకూ వెళ్లి పచార్లు చెయ్యసాగారు ఆన్సర్ కోసం!
    రేవతి పరిగెత్తుకుంటూ వచ్చి, "ఇంతకీ ప్రశ్న ఏవిటీ?" అనడిగింది కామినిని.
    "మరి, ఇప్పటిదాకా మీరిద్దరూ  తన్నుకున్నదెందుకే?" రేవతిని పైనుంచీ కిందకు చూస్తూ.
    "ప్రశ్న ఏవిటేఁ... అంటే నన్నలా డైవర్ట్ చేస్తావేంటి? ఆన్సర్ చెప్పి క్రెడిట్ కొట్టేస్తానని భయమా?" రెచ్చగొట్టింది కామినిని.
    "ప్రశ్నేగా...?" అడిగింది కామిని.
    "య్యాఁ..." స్టైల్ అంది రేవతి.
    "గాడిద గుడ్డుకూ, కోడిగుడ్డుకూ తేడా ఏవిటే? ఇదే ప్రశ్న!! అర్థమయిందా?'
    'సింపుల్! కోడిగుడ్డు పెట్టేపుడు "క్కొక్కొక్కొక్కొ..." అంటూ పెడుతుంది. గాడిద గుడ్డు పెటేప్పుడు గాండ్రిస్తూ పెడుతుంది. ఇదే  కోడిగుడ్డుకూ, గాడిద గుడ్డుకూ తేడా!"
    "ఆడ గాడిద- గుడ్డు పెడుతుందా?" తిక్కరేగింది కామినికి.
    "పెట్టాకపోతే నువ్వెందుకు అడుగుతావే? పెడుతుంది కాబట్టేగా అడిగావు! నువ్వడిగి నన్ను దబాయిస్తావేమిటే? ఎంచక్కా ఆన్సర్ చెప్పిందని మురిసిపోక!" విషయం ఆన్సలు అర్థంకాలా రేవతికి!
    కామిని తలను రెండుచేతుల్తో పట్టుకుంది.
    "నువ్వు అంతగా బాధపడకే... నేను చూళ్లేను. నేను ఆనంద్ ను  అడుగుతా! ఆనంద్.... అసలు  ప్రశ్న ఏవిటీ? ఇది కోడి, గాడిదా అంటుంది- ఆన్సర్ చెబితే తిడుతుంది. దీనికసలుమైండ్ కంట్రోల్ లో లేదు. నువ్వయినా చెప్పు!" ఆనంద్ చెయ్యి పట్టుకుంది.
    "నువ్విలా రా రేవూ! నేను చెబుతా!" అని దూరంగా తీస్కెళ్లి కళ్ళద్దాలు సరిచేసుకుంటూ ప్రశ్న చెప్పాడు.
    తనూ కళ్ళద్దాలు సరిచేసుకుని గడ్డం కింద చేతులు పెట్టుకుని కాసేపు, అటూఇటూ తిరుగుతూ కాసేపు, డౌట్సు వచ్చినపుడు ఆనంద్ ను అడుగుతూ కాసేపు సీరియస్ గా ఆలోచించసాగింది రేవతి కూడా!
    ఆరోజుకు ఎవరూ చెప్పలా~
    "రేపు చెబుతాం!" అని పోస్ట్ పోన్ చేసి, "బై"  "బై" లు చెప్పుకుని వెళ్లిపోబోయారు.
    "నథింగ్ డూయింగ్! ఎంసెట్ పేపర్ ఆన్సర్ కు ఎవరూ  టైమివ్వరూ! డైనమిక్ గా ఇప్పుడే, ఇక్కడే చెప్పేయాలి. లేపోతే ఓడిపోయామంటే నేనే చెప్పేస్తా! పార్టీ ఇవ్వాలి!" సవాల్ చేసింది.
    మళ్లీ ఒకర్నొకరు చూసుకుని తల అడ్డంగా ఊపుతూ-
    "ఊహూఁ.... మాకు తెలీదు! పార్టీకి రెడీ! చెప్పెయ్..." అన్నారు కోరస్ గా- క్రాంత్ తప్పు.
    "చెప్పేస్తున్నా! చెప్పేస్తున్నా! ఇది చెప్పాక మీరు జనరల్ నాలెడ్జ్ లో ఎంత పూరో తెలిసిపోతుంది!" అని ఊరిస్తూ ఊరిస్తూ-
    "స్త్రీ పురుషులిద్దరికీ సెక్స్ తో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తంమీదా ఉండే ఒకటే ఒక ఇష్టం- ముద్దుకు ముందు కళ్ళు మూసుకోవడం!" సింపుల్ గా చెప్పేసింది.
    "అయ్యో... నాకు తెలుసే!" స్ప్జ్హూర్తి తలకొట్టుకుంది.
    "ఒప్చ్ఁ....ఈజీ ఆన్సర్!" రేవంత్ నీరసపడ్డాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS