Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 20

   
    "నర్సమ్మగారు గనుక నిన్నుకోడలిగా చేసుకొంటానంటూందిగాని, లేకపోతే నిన్నెవరు చేసుకొంటారు? మీ అమ్మ విధవ! విధవకు పుట్టిన దానివి నువ్వు! ఈ సంగతి తెలిసిన వాళ్ళెవరు చేసుకొంటారు నిన్ను? అయినా నీకు సంబంధాలు వెదికి చేసేందుకెవరున్నారు? నర్సమ్మగారైనా తన కొడుకుని చేసుకోలేదన్న కోపంతో నీకసలు  సంబంధాలు చూడదు పెళ్లి పెటాకులు లేకుండా ఎన్నాళ్ళుంటావిలా? ఇప్పటికే ఇరవై మూడు, ఇరవైనాలుగేళ్ళు వచ్చాయి! నర్సమ్మగారు కూడా కోపంతో వెళ్ళగొట్టిందంటే నీ బ్రతుకేంకాను?"

    నిజమే! నర్సమ్మగారు కూడా తనని వెళ్ళగొడితే? పొలంమీద వచ్చే ఆదాయంతో తనపొట్టా, బట్టా గడిచిపోవచ్చుగాని వయసొచ్చిన తను ఒంటరిగా కాలక్షేపం చేయగలదా? గండుపిల్లుల మధ్య చిక్కిన పిచ్చుక పిల్లలా అయిపోదూ తన జీవితం?

    కాని, సింహాన్ని మెడకు కట్టుకోవడం ఎలా?

    కాస్త మనసుని రాయి చేసుకొని ఊఁ అనగలిగితే తను అనాధ జీవితం నుండి బయటపడుతుంది. తనకంటూ ఓ సంసారం ఏర్పడుతుంది. తనూ ఓ మనిషి అనిపించుకోగలుగుతుంది.

    తనకు ఇంతకంటే మంచి జీవితం దొరుకుతుందన్న ఆశ ఎంత మాత్రం లేనప్పుడు నర్సమ్మత్త కోరిక తీర్చడం మంచిదికదూ?

    తొందరపడి ఒప్పుకొంటున్నానా అన్న పీకులాట మరోవైపు!

    ఇంతకంటే మంచి వరుడు తనని వెదుకుతూ వస్తాడా? వస్తాడనుకోవడం కేవలం పగటికల అన్న నిస్పృహ ఓవైపు!

    సంఘర్షణలో కొన్ని రోజులు గడిచిపోతాయి.

    చివరికోరోజు మనసు రాయి చేసుకొని, నర్సమ్మగారికి తన అంగీకారం తెలిపింది సంధ్య.

    ఆవిడ ఉబికివస్తూన్న సంతోషాన్ని కప్పిపుచ్చుకొంటూ, గంభీరంగా అంది. "ఎవరో చెప్పారని ఏదో అన్నారని బలవంతానికి ఒప్పుకొంటున్నావా, ఏం? ఇలాంటి విషయంలో బలవంతం మంచిదికాదు. నీకు ఇష్టమైతేనే చేసుకో! పెళ్ళితో అయిపోదుకదా? వాడితో కలిసి కాపురం చేయాల్సిన దానివి."

    "ఇష్టమయ్యే చేసుకొంటానన్నానత్తమ్మా!" తల వంచుకొని, కాలి బొటనవ్రేలితో వృత్తాలు గీస్తూ అంది.

    కాని, నర్సమ్మగారికి ఆ పిల్ల ముఖంలో పెళ్ళి తాలూకు సంతోషం ఎక్కడా కనిపించలేదు. తన చితికి తానే నిప్పంటించుకొన్నట్టుగా, బీభత్సంగా ఉందా ముఖం. 'ఒప్పుకోవడమైతే ఒప్పుకొందిగా కాపురం చేయక ఎక్కడికి పోతుంది?' ___ అని సరిపుచ్చుకొంది.

    పెళ్ళికి పెద్ద ఖర్చు, ఆర్భాటం చేయదలుచుకోలేదు నర్సమ్మగారు. లగ్నపత్రిక వ్రాయించి, ఓ వంద పత్రికలు అతి సాదాగా కొట్టించి, దగ్గరి బంధువులకి, ఊళ్ళో కట్నాలు చదివిస్తారనుకొన్న రైతులకీ పంచింది.

    పెళ్ళి పెత్తనం, ఆజమాయిషీ అంతా ఆవిడ తమ్ముడిని పిలిపించి అతడికి అప్పగించింది.

                       *        *        *

    పసుపు చిట్లించి, పెళ్ళిపనులు మొదలుపెట్టడానికి ఇద్దరు ముత్తయిదువుల్ని పిలిచింది నర్సమ్మగారు. వాళ్ళచేతే సంధ్యకి తలంటి పోయించింది. వాళ్ళు సంధ్యకు బొట్టుపెట్టి, మంగళహారతి ఇచ్చి రాతిమీద లాంచనంగా పసుపు చిట్లించారు.

    నర్సమ్మగారు లోపల ఏదో పనిచూచుకొంటూంది.

    "ఒక్క తొండం లేదుగాని! అంతా వినాయకుడి అవతారం! తోక తక్కువగాని, అన్నీ కోతిచేష్టలు, వాడి కింత చక్కటి చందమామలాంటి పిల్ల! భగవంతుడి చిత్రం చూడు! ఎలాంటి వాళ్ళకు ఎలాంటి వాళ్ళను రాస్తాడో?" ఓ ముత్తయిదువు నిట్టూర్పు విడిచింది.

    "మా అక్కయ్య కూతురు ఈ సంధ్యలాగే ఎర్రగా, అందంగా ఉంటుంది. దాని మొగుడెలా ఉంటాడో తెలుసా? చింతపిక్కలా నల్ల నలుపు, నలుపున్నా అందంగా ఉండేవాళ్ళు ఎంతమంది లేరు? వాడి అందానికో మెల్లకన్ను! నవ్వితే ఆ పుచ్చుపళ్ళు అస్సలు చూడలేం! ఈ సంధ్యకు ఎవరూ దిక్కులేక, గతిలేక ఇతడిని కట్టుకొంటుందంటే, మరి మా అక్కయ్యవాళ్ళకు ఏమైంది? లక్షాధికార్లు! లక్షరూపాయలు కట్నమిచ్చి మరీ ఇచ్చారు ఆ మెల్లకంటి సుందరుడికి! ఏమంటే వాడికి చదువుంది! డాక్టరు చదివాడు! దీని కేమిటంటావు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS