కమీషనర్ లింగారావ్ మంగులు ఫోన్ గురుంచి చెప్పాడు.
"మన పాపని రక్షించిన రాంబాబు, చిన్నారావ్ లకే పాప సెక్యూరిటీ బాధ్యతని అప్పగించండి....లేకపోతే మీ కుడిచెయ్యో, ఎదమకాలో వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తానని మొక్కుకోవాల్సి వస్తుంది?" భర్తకి వార్నింగ్ యిచ్చింది శ్రీలక్ష్మి.
"నేను అదే అనుకుంటున్నా!" అన్నాడు కమీషనర్ లింగారావ్.
8
రాంబాబు, చిన్నారావ్ లు తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది.
"ఒరేయ్....చిన్నా....నేను చూస్తున్నదే నువ్వు కూడా చూస్తున్నావ్ కదా?" ఆవై పే చూస్తూ అడిగాడు రాంబాబు.
"అవును....మనం ఇద్దరం ఓకే దృశ్యాన్ని చూస్తున్నాం...." చెప్పాడు చిన్నారావ్ తను కూడా దృష్టిని మరల్చకుండా అటువైపే చూస్తూ.
"ఇద్దరు వ్యక్తులకి కామన్ గా ఓకే కల రాదు కదూ?" అటే చూస్తూ అడిగాడు.
"చచ్చినా రాదు!" అన్నాడు చిన్నారావ్ కూడా అటే చూస్తూ.
"అంటే ఇప్పుడు మనిద్దరం చూస్తున్నది కల కాదన్నమాట....!"
"ముమ్మాటికీ కాదు!"
"అయితే ఇప్పుడు చెప్పు....! నువ్వు ఎవర్ని చూస్తున్నావ్?"
"ఇద్దరు దేవతల్ని చూస్తున్నాను."
"ఆ దేవతలు కిరీటాలూ, నగలూ ధరించి, పట్టుచీరలు కట్టుకుని వున్నారా?" అడిగాడు రాంబాబు.
"కాదు....ఇద్దరూ సుబ్బరంగా నర్స్ ల గెటప్ లో వున్నారు."
"అయితే నువ్వూ నేనూ చూస్తున్న దృశ్యం ఒకటే....కలకాదు."
"ఆ విషయం ఇందాకే చెప్పాను."
రాంబాబు, చిన్నారావ్ లు యిద్దరూ సంతోషంగా మొహమోహాలు చూస్కుని మళ్ళీ ఆ వైపుకి చూశారు.
దూరంగా వస్తున్న యిద్దరు నర్సులు ఒక బెడ్ దగ్గర ఆగారు.
ధర్మామీటర్ తీసి వెర్రిమొహం వేస్కుని చూస్తున్న ఓ పేషంట్ నోట్లో పెట్టింది ఓ నర్స్....కొన్ని క్షణాలు ఆగి ధర్మామీటర్ తీసి చూసింది ఆమె. "ఓ మైగాడ్....నూట నాలుగు జ్వరం వుందే" అంది ఆ నర్స్.
ఆ పేషంట్ ప్రక్కనే వున్న అతని భార్య గుండెలు బాదుకుంటూ అంది "వామ్మోవ్....ఇందాక ఒళ్ళు చల్లగానే వుంది నర్సమ్మా....ఇప్పుడేంటి ఇంత హీటెక్కిపోయింది?"
ఆమె భర్త నర్సుల వంక చూస్తూ "హి హి హి" అని నవ్వాడు.
"మరేం కంగారు పడక్కర్లేదు....ఓ సూది పోటు పోడుస్తాంలే" అంది మొదటి నర్స్. రెండో నర్స్ సిరెంజిలో మందెక్కించి ఇచ్చింది. మొదటి నర్స్ అతని జబ్బలోకి కసుక్కున ఇంజక్షన్ సూది దించి ఇంజక్షన్ చేసింది. అప్పుడు కూడా అతను హి హి హి....అని నవ్వాడు.
వాళ్ళిద్దరూ అక్కడి నుండి ముందుకు కదిలారు.
వాళ్ళు తమ బెడ్స్ దగ్గరికి విజిట్స్ కి వస్తారని మిగతా పేషంట్స్ లో ఒకడు తలదువ్వుకోవడం....ఒకడు అద్దంలో మొహం చూస్కోడం....ఒకడు ఒంట్లో ఎంత బాధగా వున్నా కులాసా నవ్వొకటి మొహంమీదికి తెచ్చుకోడం ఇలాంటి పన్లన్నీ చేశారు.
ఆ నర్సులిద్దరూ అందరి దగ్గరా ఆగి ఒకరికి బి.పి. చూడ్డం, ఒకరికి జ్వరం చూడ్డం....ఒకరికి ఇంజక్షన్ చెయ్యడం....ఇలా అందర్నీ అటెండ్ అవుతూ చివరికి రాంబాబు, చిన్నారావ్ ల దగ్గరికి వచ్చారు.
వాళ్ళని చూడగానే సన్నగా, తెల్లగా, పొడుగ్గా వున్న నర్స్ కంగారుపడింది. "ఇదేంటీ....? వీళ్ళిద్దరూ యిలా కొయ్యబారిపోయారు? సీరియస్ కేసా....?" అంది ప్రక్కనే వున్న బొద్దుగా, తెల్లగా, కాస్త పొట్టిగావున్న నర్స్ తో.
"ఏమో....! చూడబోతే అలానే వుంది....డ్యూటీ డాక్టర్ ని పిలుచుకురానా?" కంగారుగా అడిగింది బొద్దుగా వున్న నర్స్.
"అక్కర్లేదు...." అన్నాడు రాంబాబు కళ్ళు రెపరెపలాడిస్తూ.
"మేమిద్దరం మిమ్మల్ని చూసే కొయ్యబారిపోయాం...." అన్నాడు చిన్నారావ్.
ఇద్దరు నర్సులూ ముసిముసిగా నవ్వారు "మేం మొన్న ఇక్కడ జాయిన్ అయ్యాం....ఈ రెండ్రోజులూ మీరు కనబడలేదేం?" అడిగాడు రాంబాబు.
"ఒక రోజు డ్యూటీ ఆఫ్....ఇంకో రోజు లీవ్ లో వున్నాం...." చెప్పింది బొద్దుగా వున్న నర్స్.
ఆ నర్సులిద్దరూ రాంబాబు, చిన్నారావ్ ల కేస్ షీట్ లను చూశారు.
"ఊ ....మీరింకా యిక్కడ వుండాల్సి వస్తుంది" అంది సన్నగా, పొడుగ్గా వుండే నర్స్.
"అవునా....?" ఆనందంగా అన్నాడు చిన్నారావ్.
"ఇంతకీ మీ పేర్లేంటో?" అడిగాడు రాంబాబు.
"ఎందుకూ....? మమ్మల్ని సిస్టర్ అని పిలిస్తే చాలు పలుకుతాం" అంది బొద్దుగా వున్న నర్స్.
రాంబాబు, చిన్నారావ్ లు బాధగా "ఆ...." అని అరిచారు.
"మీరు పేరు చెప్పకపోయినా పర్లేదు....మిమ్మల్ని నర్స్ అని పిలుస్తాం తప్ప సిస్టర్ అని పిలవలేం" బాధగా అన్నాడు రాంబాబు.
"ప్లీజ్....మీ పేర్లు చెప్పరూ?" ప్రాధేయపడుతూ అడిగాడు చిన్నారావ్.
"నా పేరు సరోజ!" చెప్పింది సన్నగా, పొడుగ్గా వున్న నర్స్.
"నా పేరు సునీత!" అంది బొద్దుగావున్న నర్స్.
రాంబాబు, చిన్నారావ్ ల మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి. థాంక్సండీ....మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేం" అన్నాడు రాంబాబు ఆనందభాష్పాలు రాలుస్తూ.
సరోజ, సునీతలు అక్కడినుండి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.
"యాహూ!" సంతోషంతో రాంబాబు, చిన్నారావ్ లు గట్టిగా అరిచారు. వాళ్ళ అరుపుకి వార్డులో బెడ్ మీద కూర్చుని బత్తాయి వల్చుకుంటున్న ఒక పేషంట్ చేతిలోంచి ఆ బత్తాయిపండు జారి క్రిందపడిపోయింది.
ఒక హార్ట్ పేషంట్ గుండెలమీద రెండుచేతులూ పెట్టుకుని చిన్నగా మూలిగాడు. అప్పుడే మందు తాగుతున్న ఓ పేషంట్ కి పొలమారింది. అందరూ ఇద్దరివంకా కోపంగా చూశారు.
