Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 21

    ఆడు చదువుకున్న సిన్నోడూ"
    "బియ్యే పాసయ్యడంటా
    మాయదారి పిల్లోడు"
    ఇది అతని చరణం.
    గోపి ఇంక ఉండబట్టలేక జుట్టు పీక్కుంటూ అరిచాడు.
    "అర్రె ... అపండెహె..."
    వాళ్ళంతా ఆటాపాటా ఆపేసి బిక్కమొహలేస్కుని నిలబడిపోయారు.
    "ఏంటిదంతా?" అడిగాడు గోపి.
    "నువ్వు బియ్యే పాసయ్యావని సంబరాలు సేస్కుంటున్నాం బాబూ" చెప్పాడు గుంపులో ఒకడు.
    "దానికి సమయం సందర్భం ఉండక్కర్లా? మా అన్నయ్యకూతురు దీపకు ఒంట్లో బాగోలేదు. మీరంతా గొడవ సెయ్యకుండా వెళ్ళండి."
    అందరూ మౌనంగా అక్కడినుండి వెళ్ళిపోయారు.
    "ఏంటన్నయ్యా దీపని మంచి డాక్టరు దగ్గరకు తీస్కెళ్ళకుండా నా దగ్గరకు తీసుకొచ్చారు" శంకరాన్ని అడిగాడు గోపి.    " ముందు డాక్టరుగారికే చూపించాంరా. ఆయన ఇది మనోవ్యాధి అనీ, పాప నీమీద బెంగ పెట్టుకుందని, నిన్ను చూస్తే మామూలు మనిషవుతుందనీ చెప్పాడు" శంకరం జవాబు ఇచ్చాడు.
    గోపి శంకరం చేతుల్లోంచి పాపని అందుకున్నాడు.
    "రండి" అన్నాడు ఇంట్లోకి అడుగుపెడ్తూ.
    అందరూ అతన్ని అనుసరించారు.
    గోపి దీపని మంచంమీద పడుకోబెట్టాడు.
    అందరూ కుతూహలంగా దీపవైపు గోపివైపు మార్చి మార్చి చూశారు.
    గోపి ఓసారి గొంతు సవరించుకుని "పా... పా... పా...." అని శృతి చూస్కుని తర్వాత మంద్రస్థాయిలో విషాదంగా పాట ఎత్తుకున్నాడు. దీపకి ఫేవరేట్ పాట, దీపముందు తను మాటిమాటికీ పాడే పాట.
    "లాలి పాపా...
    నా గోల పాపా..
    చిన్నారి పాపా..
    సిరిమల్లె దీపా..."
    పాడుకుంటూ పోతున్నాడు గోపి.
    దీపలో మెల్లిగా చలనం కలిగింది.
    అందరూ ఊపిరి బిగబట్టారు.
    దీప మెల్లిగా కళ్ళు తెరిచి గోపీవంక చూసింది.
    "బాబాయ్..." కాస్త నీరసంగా... మరికాస్త సంతోషంగా పిలిచింది దీప.
   అందరూ బిగబెట్టిన ఊపిరి ఒక్కసారిగా బుస్సున వదిలేశారు. ఆ తర్వాత -
     "హమ్మా దీపా!" అంటూ ఒకరితర్వాత ఒకరు ఎత్తుకుని దీపని నలిపెయ్యసాగారు.
    "ఇప్పుడే కళ్ళుతెరిచి కోలుకుంటుంది. మీరంతా దాన్నిలా నలిపేస్తే చచ్చూరుకుంటుంది. దాన్ని క్రిందకి దింపండి" అందర్నీ కసిరింది అన్నపూర్ణ.
    దీపను క్రిందికి దించేశారు. దీప క్రిందకు దిగగానే లేడిపిల్లలా చెంగుచెంగున గంతులేస్తూ ఆడుకోడం మొదలుపెట్టింది.
    కాస్సేపు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేస్కున్నాక దీపని ఎత్తుకుంది అన్నపూర్ణ.
    అన్నపూర్ణ, శంకరం కనీళ్ళతో గోపి, రాధ, సరస్వతులకు టాటా చెప్పారు.
    వీళ్ళూ కన్నీళ్ళతో వాళ్ళకి వీడ్కోలు చెప్పారు.

                                                                 18
     రాయుడు ఉయ్యాల మంచంమీద పడుకుని ఉన్నాడు. చిత్రాంగి అతని కాళ్ళుపడ్తూంది.
    "హూ..." భారంగా నిట్టూర్చింది చిత్రాంగి.
    "ఏంటే తెగ బాధపడిపోతున్నావ్? కొలిమితిత్తి కొట్టినట్టు ఆ నిట్టూర్పులేంటి?" అన్నాడు రాయుడు చిత్రాంగితో.
    "నిట్టూర్పులు కాక నా బ్రతుక్కింక ఏం మిగిలిందని?" నిష్ఠూరంగా అంది చిత్రాంగి.
    "అదేంటీ? నీ బతుక్కిప్పుడు ఏం తక్కువయిందనీ? నీకేం లేదంటావ్? కొండంత అండగా నేను లేనూ?" మీసాలు మెలేస్తూ గర్వంగా అన్నాడు రాయుడు.
    "ఆ.... ఉండి ఏం లాభం? ఒట్టి ఆకారమేగా?" మూతి విరిచింది చిత్రాంగి. "ఎప్పుడూ కాళ్ళునొప్పులో, నడ్డినొప్పులో ఏడుస్తుంటా మీకు"
    రాయుడికి చిర్రెత్తుకొచ్చింది.
    "తియ్ - ముందు నా కాళ్ళనుంచి నీ చెయ్ తియ్" అరిచాడు రాయుడు.
    చిత్రాంగి చేతులు తీసేసింది.
    "నేనేమయినా నిన్ను నా కాళ్ళు పట్టమన్నానా? నీఅంతట నువ్వే నా కాళ్ళు పడుతూ నేనేదో కాళ్ళునొప్పులూ కీళ్లనొప్పులూ అనీతో ఏడ్చినట్టు అంటావేం? ఇది ఏం శేరీరం అనుకున్నావే? ఇది రాతిశరీరమే, రాతి శరీరం"
    "ఆ చెప్పర్లే బోడి గొప్పలు! ఎలాగయినా మీ పస తగ్గిపోయింది లెద్దూ-" అంది చిత్రాంగి ఉడికిస్తూ.
    "చిత్రాంగీ.... నన్ను రెచ్చగొట్టకు... నన్ను రెచ్చగొట్టావంటే ఇప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు" ఇరిటేట్ అయిపోతూ అన్నాడు రాయుడు.
    "అంతేలెండి. మీరేం చేస్తారు?ఏది ఎలా చెయ్యాలో మీకేనాడైనా తెలిసి ఛస్తేకదా?"
    కిలకిలా నవ్వింది చిత్రాంగి.
    "హబ్బా చిత్రాంగి-" బాధగా జుట్టు పీక్కున్నాడు రాయుడు.
    అంతలో అక్కడికి సంతానం ఉరుకులు పరుగులమీద వచ్చాడు.
    "ఏవండోయ్ రాయుడుగారూ - మీరిక్కడ ఉన్నారా?" వగరుస్తూ అన్నాడు సంతానం.
    "అబ్బా సంతానం-బ్రాంచాఫీసుకాడికి రావద్దని హెడ్డాఫీసు దగ్గరే తగలడమని నీకు చెప్పానా లేదా? మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావ్?" మండిపడుతూ అన్నాడు రాయుడు.
    "పాపం! మీరిక్కడ ఉన్నారని అతనికి తెలియదులెద్దూ. మీరు లేరేమోననుకుని వచ్చాడు..." చిత్రాంగి నవ్వుతూ అంది.
    "నేను లేననుకుని వచ్చాడా? ఎందుకు?" అయోమయంగా అడిగాడు రాయుడు.
    "ఎందుకేమిటి? మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు?" అడిగింది చిత్రాంగి అతన్ని కవ్విస్తూ.
    "ఏమిట్రా సంతానం - ఒళ్లేమైనా చిమచిమలాడుతుందా? మన రౌడీలకు చెప్పనా? ఒళ్లంతా మర్దనా చేస్తే తిమ్మిరి తగ్గుతుంది" అన్నాడు రాయుడు సంతానంకేసి కొరకొరా చూస్తూ.
    "హయ్యబాబోయ్ రాయుడుగారూ! నాకేం తెలీదండీ బాబూ-" చెంపలేస్కుని గడగడా వణికిపోతూ అన్నాడు సంతానం.
    "మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావ్?"
    "మీకోసమే వచ్చానండీ బాబూ... గంగని మనవాళ్ళు తాళ్ళతో కట్టేశారు..... మీరు అర్జంటుగానూ, త్వరగానూ రావాలి" అన్నాడు సంతానం హడావుడి పడిపోతూ.
    "ఆ....? గంగని కట్టేశారా?" ఆనందంగా అన్నాడు రాయుడు.
    "గంగా? అదెవర్తి?ఇంట్లో ఉన్నవాళ్లని సుఖపెట్టడం చేతకాదుగానీ గంగలూ, యమునలూ కావలసొచ్చారా? అసలే గంగని అంటున్నాడు, అదెవర్తో మిమ్మల్ని గంగలో ముంచేస్తుండిలెండి. అందరూ నాలాగ అమాయకంగా వుంటారా...." కోపంగా అంది చిత్రాంగి.
    "హెడ్డాఫీసులో అమ్మగారుకూడా సేమ్ - అచ్చు ఇదే డైలాగు అంటుంటారు కదండీ."
    "అబ్బా.... నువ్వు కాస్సేపు నోర్మూస్కోవయ్యా బాబూ!" అన్నాడు రాయుడు తర్వాత చిత్రాంగివైపు తిరిగి అన్నాడు.
    "అసలు గంగ అంటే ఎవరనుకున్నావ్? గంగేం ఆడకూతురు కాదు. అది ఒక ఆవు. కదరా సంతానం?"
    "అవునండీ... గంగ అక్షరాలా ఆవండి - దానికి రెండు కొమ్ములూ, ఒక తోకా ఉన్నాయండి" అన్నాడు సంతానం.
    "ఏంటీ? మీకు బొత్తిగా బుద్దీజ్ఞానం లేకుండా పోయిందే? ఆడపిల్లలు సరిపోలేదా? చివరికి ఆడ జంతువుల్ని కూడా వదిలిపెట్టడంలేదన్నమాట!?" అంది చిత్రాంగి మిర్రి మిర్రి చూస్తూ.
    చిత్రాంగి అన్న మాటల్ని విన్న రాయుడు నోటిమీద లబలబా కొట్టుకున్నాడు.
    సంతానం నోటిమీద చేతులుపెట్టుకుని కిసుక్కున నవ్వాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS