Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 20

    "లాభం లేదు డాక్టర్ గారూ... వాడికి అభిమానం ఎక్కువ.... వాడు రాడు..." అన్నాడు పరంధామయ్య గంభీరంగా.

    "అలాగయితే పాప ప్రాణానికే ముప్పు...." అన్నాడు డాక్టర్ అంతకంటే గంభీరంగా.
    "పాపా..." గట్టిగా అరిచింది అన్నపూర్ణ.
    డాక్టర్ ఆమె అరుపుకి ఉలిక్కిపడ్డాడు.
    "తుళ్ళిపడి చచ్చాను కదమ్మా. అంతచేటున అరిచావ్... పోనీ ఆయన రాకపోతే పాపనే ఆయన దగ్గరకు తీస్కెళ్ళండి..." అన్నాడు డాక్టర్.
    డాక్టర్ సలహా వాళ్లందరికీ నచ్చింది.
                                                                17
    "హేవండీ!..."
    రాధ గొంతు ఘొల్లుమంది.
    గోపి కంగారుగా మంచంమీది నుండి లేచాడు. అంతలోనే రాధ గుండెలు బాదుకుంటూ గదిలోకి వచ్చింది.
    "హేవండీ... అంతా అయిపోయిందండీ. అంతా అయిపోయింది... ఘోరమైన అన్యాయం జరిగిపోయిందండీ.... బేర్" అంది రాధ.
    గోపి మొహంలో ఆందోళన, కంగారు, బాధ.... అన్ని భావాలూ కలగాపులగంగా డ్యాన్స్ చేశాయ్.
    "ఏమైంది రాధా?.... ఎందుకంత గగ్గోలు పెడ్తూ గోలగోలగా కేర్ బేర్ అంటున్నావ్... కొంపదీసి నీగ్గాని ఎబార్షన్ అయిపోయిందా? హా! ఎంతపనైది రాధా!నువ్వుతిన్న మామిడికాయలూ, చింతకాయలూ, చింతపండూ, రేగుపళ్ళూ... అన్నీ వేస్టేనా" కాలరు దగ్గర చొక్కా నలిపేస్కుంటూ తల పైకెత్తి బాధగా అన్నారు.
    "అది కాదండీ...." రాధ ఏదో చెప్పబోయిందిగానీ గోపి ఆమెను మాట్లాడనివ్వలేదు.
    ఈసారి మరో యాంగిల్ లో తిరిగి బాధగా మళ్లీ అన్నాడు.
    "నీకోసం ఇందాకే వీసెడు చింతపండు కొన్నానే. అదంతా ఏం చెయ్యాలి రాధా.... ఏం చెయ్యాలి?"
    "చింతపండుంటే ఎక్కడికి పోతుంది. అదేం పాడయ్యేది కాదుగా. బేర్ ర్.... చారులకీ, పులుసులకీ పనికివస్తుంది.... క్యార్ ర్... కానీ నేను చెప్పేదేమంటే ..... వా..." గోపి ఆమె మాటలు వినే ప్రయత్నం చెయ్యలేదు.
    "అంతే రాధా - అంతే - నేను నీకోసం ఎంతో ప్రేమగా తెచ్చిన చింతపండుని నువ్వు చార్లకీ, పులుసులకీ ఉపయోగిస్తున్నావన్నమాట!!" చొక్కా ఎత్తి నోట్లో దోపుకుంటూ అన్నాడు గోపి.
    "అబ్బ - ఆ చింతపండు మొత్తం నేనే రెండురోజుల్లో సఫాచేసి పారేస్తాగానీ - నేను చెప్పేది కాస్త వినండి - బేర్ ర్ ర్-" రాధ గుండెలు బాదుకుంది.
    "ఇంక ఆ ఘోరాతిఘోరమైన మాటలు నేను వినలేను రాధా, నేను వినలేను...... అసలు నీకెందుకింత నిర్లక్ష్యం రాధా - చేల గట్లమ్మట ఛెంగుఛెంగున దూకుతూ వెళ్ళి చెర్లో ధబీమని దూకి కాసేపు జలకాలాడిన తర్వాత బిందెతో నీళ్ళు తెచ్చివుంటావ్. అందుకే నీకు ఎబార్షన్ అయిపోయింది" గోపి గొంతులో జీర!
    "మనకి పండంటి కొడుకు పుడ్తాడనీ - వాడికి మూడేళ్ళ వయసొచ్చాక మూడు  చక్రాల సైకిల్ కొనిపెట్టి అది అలవాటయిన తర్వాత - వాడు మరికాస్త ఎదిగాక రిక్షా కొనిపెట్టి, ఇప్పుటినుండే ట్రైనింగ్ ఇచ్చి ప్రయోజకుడిగా తీర్చిదిద్ది ఈ పేట మొత్తానికీ రిక్షారాజుగా రూపొందించుదామని ఎన్ని కలలు కన్నానో... హి భగవాన్.... ఏమిటి నాకీ శిక్ష !" భారంగా పలికాడు గోపి.
    "హేవండీ కాస్త నా మాటవింటారా..." రాధ బాధగా అంది "నాకు ఎబార్షన్ కాలేదండీ"
    "ఆ! కాలేదా! మరి ఎందుకింత గోలెడ్తున్నావ్?" ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు గోపి.
    "దీపండి. మనదీప ఉహు ఉహు..." కుమిలిపోతూ నోట్లో చీరచెంగు దోపుకుంది రాధ.
    "ఆ!ఏమైంది? దీపకి ఏమైంది?" కంగారుగా అడిగాడు గోపి.
    రాధ సమాధానం చెప్పేలోగా బయటినుండి "గోపి" అంటూ అన్నపూర్ణ గొంతు ఘొల్లుమంటూ వినిపించింది.
    "వదినా!" గోపి బర్రెలా అరిచి బయటికి పరిగెత్తాడు. రాధ అతడ్ని అనుసరించింది.
    బయట.....
    అన్నపూర్ణ గుండెలు బాదుకుంటూ రోదిస్తూంది. ఆమె ప్రక్కన భర్త శంకరం నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో దీప... కాళ్ళూ చేతులూ వేళ్ళాడేసి....
    దీపమీద తెల్లని బట్ట కప్పబడి వుంది. సరస్వతి అక్కడే కన్నీరు కారుస్తూ వుంది.
    ".... మ్మా పాపా... నా బంగారుదీపా... అంతా... అయిపోయిందా తల్లీ.... మా అందర్నీ వదిలి దూరతీరాలకు వెళ్ళిపోయావా అమ్మా!..." గోపి గుండెలు బాదుకుంటూ విలపించాడు.
    "నాయనా గోపి. నేను చెప్పేది కాస్తవిను బాబూ..." అంది అన్నపూర్ణ.
    "ఇంకా వినడానికేముంది వదినా... ఘోరమైన వార్తతప్ప... హమ్మా దీపా... వా హాహాహాహా..."
    "ఆయనీమధ్య అంతే అక్కా. మనమేమైనా చెప్దామనుకుంటే అస్సలు వినిపించుకోనే వినిపించుకోరు. ఆయన సోది ఆయనది తప్ప" అంది రాధ.
    "నాయనా గోపి!" గట్టిగా అరిచింది అన్నపూర్ణ.
    ఆ అరుపుకి గోపి డంగైపోయి ఏడుపాపి వదినవంక చూశాడు.
    "ఏంటి వదినా అట్టాగ అరిచావ్?" అన్నాడు రెండు క్షణాలతర్వాత.
    "లేకపోతే చెప్పేది వినిపించికోకుండా నీగోల నీదేనేంటి? పాప మరణించలేదు బాబూ"
    "మరైతే దీపమీద ఎందుకట్టా తెల్లగుడ్డ కప్పారు?" కోరస్ గా అడిగారు రాధ, సరస్వతులు.
    "అదా?.... బాగా ఎండగావుంది కదా... అందుకని ఎండ తగలకుండా ఉండడానికి కప్పాంలే..." పకపక నవ్వుతూ చెప్పింది అన్నపూర్ణ.
    "పాపకి ప్రస్తుతం నూటైదు డిగ్రీల జ్వరం ఉందిరా తమ్ముడూ" అన్నాడు శంకరం దీనంగా.
    "ఆం? అలాగా! అయితే ఉండు దీపని నా రిక్షాలో వేస్కుని డాక్టరు దగ్గరకు తీస్కెళ్తా" కంగారుగా అన్నాడు గోపి.
    "వద్దురా తమ్ముడూ. దానిజ్వరం నీవల్లనే తగ్గుతుంది. అందుకే నీ దగ్గరకు తీసుకొచ్చాం"
    గోపి శంకరం వైపు ఆశ్చర్యంగా చూశాడు.
    "దాని జ్వరం నావల్ల ఎలా తగ్గుతుంది? నేను బి.యే పాసయ్యా గానీ యం.బి,బి,యస్ పాసవలేదుగా..." అన్నాడు.
    అప్పటికే వీళ్ళ ఏడుపులూ, పెడబొబ్బలూ విని అక్కడ కొంతమంది జనం పోగయ్యారు. వాళ్ళు గోపి అన్నమాటలు విని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.
    "ఒరేయ్ ఈరన్నా! మనగోపి బియ్యే  సదివాడంట్రా"
    "సదవడం ఏంట్రా యదవా మన గోపి బియ్యే పాసయ్యాడ్రా"
    "ఒరేయ్ పుల్లన్నా గోపి మన గూడేనికే గర్వకారణంరా"
    "గోపీకీ..."
    "జై..."
    "గోపీకీ..."
    "జై..."
    ఇంతలో ఎక్కడినుంచి వచ్చారో ఏమో కచ్చలుపోస్కుని చీర కట్టుకున్న పడుచులు డజనుమంది అక్కడికి గునగునా వచ్చారు. మరో డజనుమంది మగాళ్ళూ పంచలూ వాటిమీద గళ్ళచొక్కాలూ, తలకిపాగాలూ ధరించి అక్కడికి వచ్చారు. అందరూ నడుముకి బట్ట కట్టుకున్నారు. అందరిచేతుల్లో డప్పులున్నాయ్.
    గోపిబృందం నోళ్ళు వెళ్ళబెట్టి జరుగుతున్న తంతంగం అంతా చూస్తున్నారు.
    ఆ పడుచులూ, పడుచుకుర్రాళ్ళూ రెండు వరుసలుగా అటూఇటూ ఎదురెదురుగా నిల్చున్నారు.
    ఇంతలో మరో జంట వాళ్ళలాగే అయినా వాళ్ళకంటే కాస్త మెరుగ్గా తయారై వాళ్ళమధ్య నుండి గెంతుకుంటూ వచ్చారు.
    ఆ జంటలోని ఆమె "హోయ్" అంది చెవికాడ చెయ్యెట్టుకుని.
    అతగాడేమో తనుకూడా "ఓహోయ్" అని డప్పుమీద ఢమఢమా వాయించాడు.
    ఆ తర్వాత ఆ అమ్మాయి ఒక్కసారిగా పాత అందుకుంది.
    "మా గోపి సక్కనోడూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS