Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 20


    '.............................'
    'అదేమిటి శాంతా ఏమాలోచిస్తున్నావు?'
    'ఏం లేదు...' నసుగుతూ అని అతని వెంట వెళ్ళడానికి సందేహించసాగింది.
    'వో ..... అర్ధమైంది. పోనీ యిదిగో టిక్కెట్టు. నీవెళ్ళు...' టిక్కెట్టు యివ్వబోతూ అన్నాడు సుందరం.
    'అబ్బే...! పద.....ఇద్దరమూ వెడదాం!'
    సుందరాన్ని అనుసరించింది శాంత. ఎంతో కష్టంమీద వారిద్దరికీ సీటు దొరికింది. సుందరం ప్రక్కగా కూర్చోవాలంటే ఏదో ఎబ్బెట్టుగా తోచింది శాంతకు. అయినా తప్పలేదు. న్యూస్ రీలు బోరు కొట్టడంవల్ల ఏదో ఆలోచనలో పడింది. 'అవును.....అందుకే శారదకు సినిమాలంటే యిష్టముండదు. అనుకోకుండా చిక్కుల్లో పడవలసి వస్తుంది. ఇలా మేమిద్దరం ఒకరిప్రక్కన మరొకరం కూర్చుని ఉండడం, తెలిసిన స్నేహితులెవరైనా చూస్తే.....లేనిపోని గొడవలు తెచ్చి పెడతారు. పైగా శారదకు సమాధానం చెప్పలేక తలప్రాణం తోకకు వస్తుంది. ఒంటరిగా సినిమాకు రావడం ఎంత పొరపాటైంది? శారద రానప్పుడు యింకెవరినైనా తోడుగా తీసుకువస్తే బాగుండేది. ఇప్పుడిక ఏమనుకొని ఏం లాభం? పరిస్థితి చేయిజారిపోయింది.' పైవిధంగా ఆలోచిస్తున్న శాంతకు న్యూస్ రీలు పూర్తవడం, సినిమా ప్రారంభమవడం తెలియలేదు. సినిమాలో కనుపించిన జోక్ కు అంతా నవ్వారు. ఆ నవ్వుతో బాహ్యస్మృతికలిగి పరిసరాలను గుర్తించగలిగింది శాంత.
    సినిమా ఎంతో బాగా ఉన్నప్పటికీ పరధ్యానంతో ఉన్న శాంత సినిమా చూస్తున్న ఆనందాన్ని అనుభవించలేకపోయింది. శాంత ఎంత వద్దని వారిస్తున్నా, వినకుండా యింటర్వెల్ లో సుందరం రెండు కూల్ డ్రింక్సు తెప్పించాడు. అతనిని ఏమీ అనలేక, ఆ పరిస్థితికి మానసికంగా ఎంతో బాధ పడింది. వెనుకకు పోతే గొయ్యి, ముందుకు పోతే నుయ్యి సామెతలా తయారైంది ఆమె పరిస్థితి.
    'సుందరం! నాకు అకస్మాత్తుగా తల నొప్పివేస్తూ ఉంది. బాధ భరించలేకపోతున్నాను. నేను హాస్టలుకు వెళ్ళిపోతాను.' అని లేచి అవతలికి వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది శాంత.
    'ఆగు శాంతా! నీకంత తల నొప్పిగా ఉంటే నిన్ను ఒంటరిగా వెళ్ళనిస్తానా? పద! నేనుకూడా వస్తాను. ముందుగా మా రూముకు వెడదాం. నీకు తగిన మందిస్తాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హాస్టలుకు వెడుదువుగాని' అని శాంతకు మాట్లాడే అవకాశము యివ్వకుండా ఆమె వెంట పడ్డాడు. ఇద్దరూ హాలు బయటికి వచ్చారు.
    'ఇదెక్కడి తద్దినంరా బాబూ! ఈ పీడ ఒదిలేలా లేదే! తప్పించుకొని వెళ్ళిపోదామంటే వెంటపడ్డాడు. తానొకటి తలుస్తే దైవ మొకటి తలచినట్లయింది నా పని' అని మనసులో అనుకుంటూ 'సుందరం నాకోసం నీవు పిక్చరు చూడడమెందుకు మానుకోవాలి? హాస్టలుకు వెళ్ళేసరికి అదే తగ్గి పోతుంది.' అని తప్పించుకో చూచింది శాంత.
    'అదేమీ కుదరదు.....నీతో సినిమాకు వచ్చి, నీకు తలనొప్పివేస్తే నిన్ను ఒదిలి నేను సినిమా చూడడమా? నెవర్! నెవర్! పద....నా రూముకు వెడదాం....'
    శాంతకు తప్పలేదు. హాలు కాంపౌండు దాటారు యిద్దరూ అప్పుడే అటువైపుగా వస్తూన్న టాక్సీని కేకవేశాడు సుందరం. వారిద్దరూ టాక్సీలో కూర్చున్న తర్వాత అది బయలుదేరింది.
    సుందరం రూము ఎంతో ఆకర్షణీయంగా, పరిశుభ్రంగా ఉంది. వేటి స్థానంలో అవి పొందికగా, ఒద్దికగా అమర్చబడి ఉన్నాయి. గది నేటి నాగరికతకు నిదర్శనంగా ఉంది. ఇటువంటి వాణ్ణి పట్టుకొని అక్కడికి రమ్మంటూన్న రామం శాంత మనసులో మెదిలాడు. రామం గుర్తుకు రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడింది శాంత. 'ఏమిటిది? నా ఈ పనికి అర్ధమేమిటి? ఒంటరిగా ఉన్న ఒక పరాయిపురుషుడి గదికి నేను.....ఒంటరిగా....అదీ ఈ సమయంలో రావడం-వోహ్! .... నామతి పోతూ ఉంది. ఎప్పటి కప్పుడు సుందరాన్ని తప్పించుకోవాలనుకుంటున్నాను. కానీ అతని మాటను గట్టిగా త్రోసిపుచ్చలేక పోతున్నాను. ఈ రోజు నాలో యింత బలహీనత ఏర్పడిందేమిటి?' అని ఆలోచిస్తూ ఆ ఆలోచన లకు బుర్ర వేడెక్కి 'అబ్బా' అని తల పట్టుకుంది శాంత.
    'ఏమిటి శాంతా? తలనొప్పి అంత ఎక్కువగా ఉందా?' అని సుందరం శాంత దగ్గరగా వచ్చి ఆమెచేతి నందుకొని నాడి చూశాడు. స్టెతస్కోపు హార్టు బీటింగ్సు పరీక్షించాడు. ఇవన్నీ చేస్తున్న సుందరాన్ని వారించలేక పోయింది శాంత. ఏమని వారిస్తుంది? వెనుక ముందులు ఆలోచించకుండా తలనొప్పి వేస్తుందని అన్న ఒక్కమాట యింతకు దారితీస్తుందని ఊహించలేక పోయింది.
    సుందరం తనచేతి నందుకొని నాడి పరీక్షిస్తున్న సమయంలో ఏదో విద్యుత్తు తనలో ప్రవహించినట్లు తోచింది ఆమెకు. ఆచేతిని అలాగే పట్టుకొని ఇంకొద్ది సేపు పరీక్షచేస్తే బాగుంటుందనే ఊహ ఒక్కక్షణం కలిగిమాయమైంది. అవును....చిన్నప్పటినుండి అలవాటు పడిన తనబావ స్పర్శ తప్ప వేరొక పురుషుని స్పర్శ ఎరుగని శాంతకు అటువంటి ఊహ కలగడం సహజమే నేమో? సుందరం అందగాడు. నాగరికుడు పైగా డాక్టరు. మానసికంగా ఆ దృష్టి లేకున్నా...అవకాశం ఆ దృష్టిని కలిగించింది. ఆ తర్వాత పశ్చాత్తాపపడింది శాంత.
    సుందరం యిచ్చిన మాత్రలు మింగి అతనివద్ద ప్లాస్కులో ఉన్న వేడి వేడి కాఫీ త్రాగి 'ఇక నే వెళ్ళొస్తాసుందరం...' అని అతనివైపు నిశితంగా చూస్తూ అంది శాంత.
    'అప్పుడే వెడతావా? ఇప్పుడేగా మందు వేసుకొని కాఫీత్రాగావు. పదిహేను నిమిషాలు కూర్చుని వెళ్ళు' శాంత కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ చిరునవ్వుతో అన్నాడు సుందరం.
    ఆ చూపులకు తట్టుకోలేక తల ఒంచుకొని 'లేదు సుందరం' అని లేచి గది బయటకు నడిచింది శాంత.
    ఆమెను బస్ స్టాండ్ వరకు సాగనంపి తిరిగి వెళ్ళిపోయాడు సుందరం. అప్పుడే జరిగిన సంఘటనను గురించి దీఘంగా ఆలోచిస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తూ, బస్సుకోసం నిరీక్షిస్తూ రాణిగంజ్ బస్సు స్టాండులో నిల్చుంది శాంత. ఆమెమనసు గడియారం పెండ్యులంలా అటూ, యిటూ వూగుతూ ఆమెను ఆందోళన పరచింది.
    
                              *    *    *

    కాశీ మన భారతదేశంలోగల ప్రముఖ పుణ్య స్థలాలలో ఒకటి. అది అతి ప్రాచీనమైన క్షేత్రం. ఆ క్షేత్రానికిగల మహత్తు ఎంతో గొప్పది. పరమ పావనియైన భాగీరధి ఆ పుణ్యక్షేత్రానికి ప్రక్కగా ప్రవహించడం వల్ల ఆ క్షేత్రానికి ఎంతో ప్రశస్తి కలిగింది.
    పెక్కుమంది యాత్రికులు విశ్వేశ్వరుని సందర్శించడం కోసం వస్తూ ఆ గంగామ తల్లి చల్లనివడిలో తమ సర్వ పాపాలను క్షాళనం చేసుకొని ఆ కపాలధారి దర్శనం చేసి తరిస్తూ ఉంటాను. ప్రజల స్నాన సౌకర్యార్ధం ఎన్నో ఘాట్ లు నిర్మించబడి ఉన్నాయి. వానిలో మణికర్ణిఘాట్, కేదారేశ్వరఘాట్ ల ముఖ్యమైనవి.
    కాశీలో మరణం సంభవిస్తే పుణ్యరోజులకు చేరుతారనే శాస్త్ర ప్రమాణముంది. హరిశ్చంద్రఘాట్ అనే శ్మశానవాటిక ఎంతో పేరుగాంచి నటువంటిది. అలనాటి ఆ హరిశ్చంద్ర మహారాజుయొక్క సత్య వ్రతాన్ని గుర్తుకు తెస్తుంది ఆ శ్మశానవాటిక.
    శివుని శిరస్సు నలంకరించిన ఆ పవిత్రవాహిని హిమాలయాలలోని సర్వ వోషధుల మీదుగా ప్రవహిస్తూ, పవిత్రతకు తోడు రోగ నివారణా శక్తిని కలిగిఉండి, మానవుల పాపాలను రోగాలను నివారిస్తూంది. గంగా బలం స్ఫటికంలా ఎంతో స్వచ్చమైనది. ఎంతకాలం నిలువచేసినా చెడిపోనటువంటిది. పాశ్చాత్యులుకూడా మన పవిత్ర గంగాజలాలను పరీక్షించి దాని మహత్తును వేనోళ్ళ కొనియాడారు. సర్వపాప నివృత్తి, సర్వరోగ నివారిణి అయిన గంగాస్నాన మహత్తును మన శాస్త్రాలలో ఎంతో గొప్పగా వర్ణించారు.
    కాశి అనాదినుండి మన భారతదేశానికి ముఖ్య విద్యాక్షేత్రము. మనపూర్వులు కాశీలో చదివిన పండితునికి అఖండ గౌరవాన్నిస్తూ, ఆదరిస్తూండేవారు. కాశీలో పండిత పరిషత్తు ఉండేదట! ఆ పరిషత్తు మెప్పును పొందిన పండితునికీ దేశము మొత్తముమీద ఘన సన్మానాలు ఆ రోజులలో జరిగేవట!
    కాశీలో మరొక ముఖ్యవిశేష మొకటుంది. ఎంతమంది యాత్రికులకైనా నిత్యాన్న ధనము జరుగుతుంది. కాశీ అన్నపూర్ణా దేవి పేరు అన్నదానానికి ప్రసిద్ధి. అందువల్ల యాచకులు భిక్షపెట్టే తల్లులను కాశీ అన్నపూర్ణతో పోలుస్తూ ఉంటారు.
    అటువంటి పవిత్రస్థలంలో తన విద్య కొనసాగిస్తున్నాడు ప్రభాకరం. ప్రధమంలో అక్కడి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సభ్యత, సంస్కృతీ ప్రభాకరానికి ఎంతోవింత కలిగించాయి. మెల్లిగా వాటికి అలవాటుపడ్డాడు. చదువుమీద శ్రద్ధ కలిగింది కాని ఇతర దురభ్యాసాలు అతనిని వదలడం లేదు. ప్రభాకరానికి యిక్కడ కూడా చెడు స్నేహాలు అలవడ్డాయి. అయినా శ్రద్దతో మాత్రం చదువుకుంటున్నాడు.
    ప్రతిరోజు ఉదయం చన్నీటి స్నానం చేయడం ప్రభాకరానికి మొదటి నుండీ అలవాటు. బెనారసు వచ్చినప్పటినుండి రోజూ ఉదయం గంగస్నానం చేస్తూ ఉండేవాడు. అతనుమంచి ఈతగాడు. హైదరాబాదులో ఉన్నప్పుడు సరదాగా స్విమ్మింగ్ పూల్సులో ఈతగొట్టే ప్రభాకరం కాశీలో దాన్ని ఒక సాధనగా పెట్టుకొని ప్రతిరోజు కొద్ది కొద్దిగా సాధన పెంచుతూ ప్రస్తుతం గంగలో సగభాగానికి ఈది తిరిగి రాగలుగుతున్నాడు.
    వ్యాయామాలన్నింటిలోనూ ఈత ఒక ముఖ్యమైన వ్యాయామం. సర్వావయాలలోనూ చలనం కలిగించి, చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రభాకరం మంచి స్పోర్ట్సుమన్. హైదరాబాద్ లో రోజా వ్యామోహంలోపడి తనకాలాన్నంతా వృధాగా ఆమెతో గడిపాడు. ఆ వ్యామోహం రోజా దుష్ప్రవర్తనతో ఒదిలిపోయింది. కాని మదిరాపానము, ధూమపానము, వృధాఖర్చులు స్నేహితులతో వృధా కాలక్షేపాలు చేయడం కాశీకి వచ్చిన తర్వాత కూడా అతన్ని ఒదిలి పెట్టలేదు. ఏదో అజ్ఞాతశక్తి అతని మనసుతో పోరాడుతున్నా కొన్ని సంవత్సరాలుగా జీర్ణించుకుపోయిన ఆ అలవాట్లు అతనిని ఒదిలిపోనంటున్నాయి.
    కాశీలో గొప్ప స్పోర్ట్సు మన్ గా చదువులో కూడా యావరేజు స్టూడెంటుగా పేరు తెచ్చుకున్నాడు. కాని అతను తన దురుసు స్వభావంతో, జాగ్రత్త చూపవలసిన ప్రతి సందర్భంలోనూ నిర్లక్ష్యాన్ని చూపడంతో ఒక చెడ్డ పేరు వచ్చింది. అయినప్పటికీ యిది వరకటి కన్న చాలామార్పు రాసాగింది.
    రోజులు ప్రశాంతంగా, గంగా ప్రవాహంలా సాఫీగా గడిచిపోతున్నాయి. ఒకరోజు మామూలుగా స్నానానికి వెళ్ళాడు ప్రభాకరం. స్నానం చేయడానికి గుడ్డలు విప్పి నీళ్ళ ల్లోకి దిగబోతున్నాడు. ఇంతలో అతనికి పది పదిహేనుగజాల దూరంనుండి కేకలు, ఏడుపు వినిపించాయి. అదేమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అటువైపు వెళ్ళాడు. ఒక పదిసంవత్సరాల అమ్మాయి కాలుజారి గంగా ప్రవాహంలో పడిపోయింది. అంతకు ముందే ఎవరో యువకుడు ఆ అమ్మాయిని రక్షించడానికి పూనుకున్నాడు. నీళ్ళల్లో దూకాడు. కాని ఆ అమ్మాయిని ఒడ్డుకు తీసుకురాలేక మధ్యలో ఆ యిద్దరూ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆదృశ్యాన్ని కళ్ళారా చూసిన ప్రభాకరం అకస్మాత్తుగా నీళ్ళల్లోకి దూకాడు. స్నానాల ఘాట్ కు పాతిక, ముఫ్ఫైగజాల దూరంలో ఆ అమ్మాయి, ఆ యువకుడు మునుగుతూ, తేలుతూ ఉక్కిరి బిక్కిరౌతున్నారు. ఆసరా చిక్కిందన్న ధైర్యంతో ఆ అమ్మాయి ఆ యువకున్ని గట్టిగా వూపిరి సలుపకుండా పట్టుకుంటూ ఉంది. ఆ యువకుడు బలశాలి కానందువల్ల గుడ్డలతో తడిసిఉన్న ఆ అమ్మాయి భారాన్ని భరించలేక ఉక్కిరి బిక్కిరౌతున్నాడు.
    రెప్పపాటులో వేగంగా ఈదుకుంటూ వెళ్ళిన ప్రభాకరం ఆ అమ్మాయిని తన భుజాన వేసుకొని ఆయువకుడికి కూడా యధాశక్తి ఆసరాయిస్తూ అతి ప్రయాసతో ఆ యిద్దరినీ గట్టుకు చేర్చాడు. ఆ అమ్మాయిని ఆమె తల్లికి ఒప్పజెప్పి ఆయాసంతో రొప్పసాగాడు. ఆ అమ్మాయి స్పృహ తప్పలేదు కాని నీరు త్రాగినందువల్ల ఆయాసపడుతూ ఉంది. తనకు తెలిసిన ప్రధమ చికిత్సను అక్కడ గుమికూడిన వాళ్ళతో చేయించి ఆ అమ్మాయి త్రాగిన నీటిని క్రక్కించాడు ప్రభాకరం.
    మొదట ఆ అమ్మాయిని రక్షించాలని పూనుకున్న ఆ యువకుడు పది నిముషాలలో కోలుకున్నాడు.మరొక పదినిముషాలలో అమ్మాయి కూడా తేరుకొని మాట్లాడడం ప్రారంభించింది.
    అక్కడున్న వారందరి దృష్టీ ప్రభాకరం మీద పడింది-
    'మెనీ, మెనీ థ్యాంక్యు! సమయానికి మీరు వచ్చి రక్షించకపోతే మేమిద్దరమూ గంగ పాలయ్యేవాళ్ళం' ఆ బక్క పల్చని యువకుని నోట తెలుగుమాటలు విని ఆశ్చర్యపోయాడు ప్రభాకరం.
    'మీరు తెలుగువారా? మిమ్ములను రోజూ చూస్తూనే ఉన్నాను. మీరు కూడా ప్రతి రోజూ స్నానానికి వస్తున్నారు కదూ?' అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు ప్రభాకరం.
    'అవునండీ ..... మీరుంటున్న హాస్టలులోనే ఉంటున్నాను. మీరు తెలుగువారని ఊహించాను. మీతో పరిచయం కలిగించుకోవాలని ఎంతోకాలంగా అనుకుంటున్నాను. కానీ ఆ అవకాశం ఈ విధంగా కలిగింది.
    వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు వారి దగ్గరకు వచ్చారు. మధ్య వయసులో ఉన్న ఆ అమ్మాయి తండ్రి ప్రభాకరాన్ని కృతజ్ఞత నిండిన చూపులతో చూస్తూ 'ఆన్ హమారే బచ్చీకాజావ్ బచాయే! ఆప్ కా యహా సాన్ హామ్ జిందగీభర్ నహీఁ భూలేంగే!' అని హిందీలో అన్నాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS