Previous Page Next Page 
లోకం పోకడ పేజి 20


                                                               15

 

                
    రోజూ ఉదయం తొమ్మిదిన్నర కల్లా కంపేనీ కి వెళ్ళుతాడు రమేష్. మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకే రావటం. మధ్యాహ్నానికి కాఫీ, టిఫిన్ చేసి ఇస్తుంది వసుంధర. రమేష్ ఆఫీసుకు వెళ్ళిన తరువాత, తను భోజనం చేసి ఇల్లు సర్దుకున్నాక సాయంత్రం వరకూ ఏమీ తోచేది కాదు వసుంధర కు. నవలలూ, పత్రికలూ ఎంత దాకా చదువుతుంది? పొరుగింటి ఆడవాళ్ళతో కబుర్లు చెప్పటానికి వాళ్ళంతా తనకన్నా ఎంతో పెద్దవాళ్ళు. కొత్తగా కాపురానికి వచ్చిన తను వాళ్ళతో ఏమి కబుర్లు చెపుతుంది? తనూ స్కూలు ఫైనల్ పాసయింది. చదువుకున్న విద్యనూ సార్ధకం చేసుకోవాలి. ఇంత మహానగరం లో ఎవరి గొడవలు వాళ్ళవి. ఎవరి ఇబ్బందులు వాళ్ళవి. ఎవరి ఆచార వ్యవహారాలూ వాళ్ళవి. ఎంతకూ పొద్దుపోని వసుంధర కు తనూ ఏదయినా ఉద్యోగం చేయాలనే బుద్ది పుట్టింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ప్రయత్నిస్తే ఏదయినా ఉద్యోగం దొరక్క పోదు. ఈ ఆలోచన కలగగానే తనూ ఉద్యోగం చేయాలనే ఉబలాటం ఎక్కువయింది.
    రాత్రి భోజనాలయాక వసుంధర రమేష్ తో అన్నది. "ఉద్యోగాలూ మగవాళ్ళే చెయ్యాలనే నియమం లేదు కదూ!"
    "ఏమిటో కొత్తగా మాట్లాడుతున్నావ్, వసూ?"
    "ఇదివరకు పూర్వకాలం లో ఉద్యోగం పురుష లక్షణం . ఇప్పుడు స్త్రీ లక్షణం కూడా . స్త్రీలూ తమకు అర్హత గల ఉద్యోగాలు చెయ్యవచ్చు."
    "ఇంకా రానీ. నీ మనస్సులోని భావాలు ఒక్కొక్కటే బయటపడనీ."
    "నాకూ ఉద్యోగం చేయాలని ఉంది."
    "హతోస్మీ!"
    "ఏం అట్లా అన్నారు? నేను ఉద్యోగం చేయలేనా? నాకు ఉద్యోగం ప్రయత్నిస్తే దొరకదా?" వసుంధర ఆత్రంగా అడిగింది.
    "నేను నిన్ను పోషించలేననే అపనమ్మకం కలిగిందా?"
    "అంతమాట నేనెప్పుడూ అనను. నన్ను మీరు అంతవరకే అర్ధం చేసుకున్నారన్న మాట." అన్నది వసుంధర, ఆ మాటకు మనస్సులో బాధపడుతూ . ఆమె అభిమానం దెబ్బతిన్నట్లయింది.
    "మరి?"    
    "మొదటి విషయం, మీరు ఆఫీసు కు వెళ్లి వచ్చేటంత వరకూ నాకేం తోచదు. ఎండాకా చదువు కుంటూ కూచోను? రెండోది , ఉద్యోగం చేయాలనే కోరికా ఉంది. మూడోది , ఇంకో నాలుగు డబ్బులూ సంపాయించు కోవచ్చు" అన్నది వసుంధర.
    "ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దారనేర్పించినన్ అన్నట్లు నువ్వు చక్కగా ఉద్యోగం చెయ్యగలవు. మరి వంట చేసి నాకు భోజనం పెట్టి, నువ్వు తిని, ఇల్లు సర్దుకుని, ఆఫీసుకు వెళ్లి ఉద్యోగం చేసి, సాయంత్రం వచ్చి వంట చేసి....ఆ తరువాత భోజనం చేసి ...ఆ తరవాత........" అంటూ వసుందర ను దగ్గరకు తీసుకున్నాడు.
    "మీదంతా చోద్యం!"
    "మరి ఓపిగ్గా ఇన్ని పనులు చెయ్యగలవా?" అన్నాడు రమేష్ , వసుంధర బుగ్గ మీద చిటికే వేసి.
    "అన్నీ చక్కగా మీకు ఏ కోరతా లేకుండా చేసే బాధ్యత నాది. చూద్దురు గాని? పోనీ ఎప్పుడు చెయ్యలేక పొతే అప్పుడే మానేసేది. మరి మీరు ఇష్ట పడ్డట్లేనా?" అన్నది వసుంధర, రమేష్ గుండెల మీద తలపెట్టి గోముగా.
    "రోజూ ఈ బస్సు ల్లో, క్యూలో నిలబడి వెళ్ళగలవా?"
    "ఆహా చక్కగా వెళ్ళగలను. నేనేం తెలివి తక్కువదాన్ని కాదు దారి తప్పి వెళ్ళటానికి."
    "సరే, మరి ఉద్యోగం దొరకాలిగా? ఎక్కడ? ఏ ఆఫీసులో?"
    "ఎక్కడ దొరికితే అక్కడ. రేపే ఎంప్లాయి మెంట్ ఎక్స్ చేంజ్ లో పేరు రిజిస్టరు చేయించు కుంటాను. అన్ని అఫీసులకూ దరఖాస్తులు పెడతాను. సరేనా?"
    "పధకం ముందే వేసి ఉంచావన్నమాట. సరే నీ ఇష్టం. మరి ఉద్యోగం ధ్యాసలో పడి నన్ను మరచిపోవు కద!"    
    "ఆదర్శ భావాలు గల ఆలుమగలు ఎప్పుడూ కలిసి మెలిసే ఉంటారు. మీ హృదయమనే పూల సజ్జను నా మనస్సనే పుష్పం తో ఎప్పుడయితే నింపు కున్నారో, అప్పుడే ప్రేమ స్వరూపులైన మీ బాహు బంధాల్లో ఇమిడి పోయాను" అన్నది వసుంధర , తృప్తిగా రమేష్ కళ్ళలోకి చూస్తూ. వసుంధర రమేష్ కౌగిట్లో కరిగిపోయింది.
    మరో నెలరోజుల్లోనే వసుంధర కు సెక్రటేరియట్ లో లోవర్ డివిజన్ గుమస్తా ఉద్యోగం దొరికింది. ఆర్డరు వచ్చిన రోజున వసుంధర ఆనందానికి హద్దులు లేవు. గవర్నమెంటు ఉద్యోగం దొరకటం మాటలా అనుకుంది.
    మర్నాడే ఆఫీసులో చేరినది. ఆరోజున రమేష్ కూడా సెక్రటేరియట్ కు వెళ్ళాడు.
    వసుంధర ఆఫీసులో కుర్చీలో కూర్చోగానే ఎంతో సిగ్గు పడ్డది. అంతమంది మగవాళ్ళ మధ్య కూర్చొని ఉద్యోగం చెయ్యాలి. అదృష్ట వ శాత్తు ఆ సెక్షన్ లోనే శారద అనే ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అప్పర్ డివిజన్ క్లర్కు. బి.ఎ. ప్యాసయింది. ఆ అమ్మాయితో పరిచయం చేసుకుంది వసుంధర. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు.
    ఆ రోజు సాయంత్రం ఇంటికి రాగానే అడిగాడు రమేష్.
    "ఎట్లా ఉంది ఉద్యోగం? బావుందా?"
    "బాగానే ఉంది. నా జీవితంలో ఇది రెండో సంతోషకరమైన ఘట్టం మొదటిది మన వివాహం. రెండోది, నేను ఉద్యోగంలో చేరటం. రెండూ కూడా నేను కోరుకున్నట్లుగానే ప్రసాదించాడు భగవంతుడు. వచ్చే శనివారం మూడో శనివారం అయింది. ఆఫీసుకు సెలవు. ఆరోజున వెంకటేశ్వర స్వామికి పూజ చేయిద్దాం" అన్నది వసుంధర.
    "అప్పుడే ఆఫీసుకు ఏ రోజున సెలవో, ఏ రోజున ఎగ్గొట్టవచ్చో తెలుసుకున్నారన్న మాట. భేషుగ్గా ఉంది." అన్నాడు రమేష్.
    అనుకున్నట్లుగానే వెంకటేశ్వరస్వామి గుళ్ళో పూజలు చేయించారు. ఆరోజు నుంచీ వసుంధర లో కొంచెం మార్పు కనిపించింది. జీవితంలో ఆన్ని కోరికలూ అందరికీ సిద్దించవు. అనుకున్న కోరికలన్నీ సిద్దిస్తే జీవిత మార్గంలో మరో మెట్టు ఎక్కినట్లుగానే భావిస్తారు. ఆ మరో మెట్టు ఎక్కగానే , అంతస్తు పెరిగి సామాన్య ప్రజానీకం క్రింద ఉన్నట్లుగానే కనిపిస్తారు. అప్పుడే రకరకాలయిన తరతమ బేధాలు కనిపిస్తాయి. అప్పుడే మనిషిలో ఒక విధమైన నిండుతనం కనిపిస్తుంది. ఆ నిండుతనమే కొంతమంది దృష్టి లో గర్వంగా కనబడుతుంది. అర్ధం చేసుకున్న వారి దృష్టి లో అణకువ గా కనబడుతుంది. ఆ నిండుతనమే లేకపోతె ఒక్కొక్కప్పుడు లేకితనంగా నూ కనిపించవచ్చు.
    ఉదయం అయిదున్నర కల్లా నిద్రలేచేది వసుంధర.పనిమనిషి ఇంటి పనులన్నీ చేసేది. కాఫీ పని పూర్తీ కాగానే వంట చేసేది తొమ్మిది గంటల కల్లా ఇద్దరూ ఒక్కసారే భోజనానికి కూర్చునే వాళ్ళు. తొమ్మిదిన్నర కు ఇంటికి తాళం పడేది. బస్సు స్టాప్ కు వచ్చి కోటీకి పోయే బస్సు ఎక్కేవాళ్ళు. సెక్రటేరియట్ వద్ద వసుంధరా దిగేది. రమేష్ లక్  డీ కాపూల్ లో దిగి తన కంపెనీ కి వెళ్ళేవాడు. సాయంత్రం పూట కూడా అట్లాగే ఇద్దరూ ఇంటికి చేరేవాళ్ళు. అప్పుడు వంట చేసేది వసుంధర.
    మరో రెండు నెలలు గడిచినాయి. వసుంధర కు ఆఫీసు పని బాగా అర్ధమైంది. అంతా వసుంధర అంటే అభిమానం గానే ఉండేవాళ్ళు. ముఖ్యంగా శారద తో బాగా పరిచయ మైంది. శారద కు వసుంధర అంటే ఎంతో అభిమానమూ , గౌరవమూ ఏర్పడినాయి.
    ఒకసారి ఆదివారం నాడు శారద బలవంతం చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది వసుంధర.
    శారద కు ఇరవై అయిదేళ్ళు. చాలా అనాకారి. నల్లగా, పొడుగ్గా ఉంటుంది. అందులో స్పోటకం మచ్చలు. మనిషిలో ఆకర్షణ గాని, అందం గాని లేదు. నేరేడు పండు రంగు. ఎవ్వరూ శారద తో మాట్లాడటానికి తాపత్రయపడరు. కాని శారదా దేవి మాత్రం, శారద ను ఎంతో అభిమానించింది. విద్య గరిపింది. క్షమాగుణం , దయా గుణం , అణకువ, మర్యాద, నెమ్మదిగా చక్కగా తేనే లోలుకువ, మర్యాద , నెమ్మదిగా చక్కగా తేనే లోలుకుతూ మాట్లాడటం శారద లో ఉన్న విశిష్టత. అనే శారద జీవితాన్ని, అంత ఆహాకారిగా ఉన్నా తీర్చి దిద్దుతున్నాయి, కాపాడుతున్నాయి.
    శారద కు తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు. తల్లి మాత్రం ఉన్నది. తల్లితో ఉంటున్నది శారద. చింతల్ బస్తీ లో రెండు గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు తల్లీ కూతుళ్ళు.
    ఎంతో ఆదరణ గా మాట్లాడింది శారద తల్లి. వసుంధర ను ఎంతో మెచ్చుకుంది, చిన్నతనం లోనే గృహిణి అయినా ఉద్యోగం కూడా చేస్తున్నందుకు. కూతురుకూ, వసుంధర కూ అప్పటి కప్పుడు పూరీలు చేసి పెట్టి, కాఫీ ఇచ్చింది. వసుంధర ను చూసేసరికి ఆవిడ మనస్సు ఉప్పొంగి పోయింది. కాని ఆ వృద్దురాలి మనస్సు లో శాశ్వతంగా జీర్ణించుకు పోయిన మనోవేదన ఎవ్వరూ తీర్చలేరు. ఆ కలక ఆమె నెప్పుడూ బాధపెడుతూనే ఉంది.
    ఫలహారమయిన తరువాత శారద, వసుంధర ను డాబా మీదికి తీసుకు వెళ్ళింది. "వసుంధరా, నేను ఉద్యోగం లో చేరి, అయిదారేళ్ళయింది. ఆఫీసులో మన శాఖ లో అయిదారుగురు మనబోటి అడ గుమాస్తా లు ఉన్నారు. నాతొ ఏదో ముభావంగా ఆఫీసు విషయాలు మాట్లాడతారు గాని ఇంతవరకూ ఎవ్వరూ ఇంటికి రాలేదు. పిల్చినా రారు." అంది ఎంతో బాధపడుతూ శారద.
    "కారణం?' అన్నది వసుంధర.
    "చెప్పమంటావా?"
    "ఏదో చెప్పరాని విషయమేమో ననుకుంది వసుంధర. ఆమె మనస్సు పరిపరివిధాల పోయింది.
    "చెప్పు. నేను వినరాని విషయాలు కాదు కదా!"
    "అంత వినరాని విషయాలేం కావులే. నా ముఖం చూస్తె నీకు డోకు రావడం లేదూ? నా అంత అనాకారి ని నువ్వు ఎక్కడయినా చూశావా?' నవ్వుతూ అన్నది శారద. ఆ నల్లటి పెదవుల మధ్య తెల్లని పలువరుస కాంతి వంతంగా కనుపించింది.
    "చంపావుపో. ఇంకా ఏమిటో అనుకున్నాను. మనిషికి రూపం కన్నా గుణమే ప్రధానం. రూపమూ, గుణమూ రెండూ ఉంటె ఇంక చెప్పనక్కర లేదు. అయినా భగవంతుడు నీకింత వరకే రూపం ఇచ్చాడు. అందుకు ఇతర్లు అసహ్యించు కోవటంలో అర్ధం లేదు" అన్నది వసుంధర.
    "ఈ మాట నువ్వొక్కదానివే అంటున్నావు. అంతా తమ గౌరవం పోయినట్లుగా భావిస్తారు . నాతొ మాట్లాడటానికి అందరికీ అంతనామోషి. వాళ్ళ మర్యాదకు భంగం. ఇంక మగవాళ్ళ యితే వాళ్ళ మర్యాదకు భంగం. ఇంక మగవాళ్ళయితే నేను ఆఫీసు కు వస్తుంటే "అదుగో, నీగ్రోరాణి వస్తున్నది' అంటారు. కొంతమంది 'అల్లో నేరేడు పండు వస్తున్నది' అంటారు. నువ్వే మంటావు వసుంధరా?' అన్నది శారద. వసుంధర మనస్సు బాధపడ్డది. శారద మనస్సు తేలిక పడ్డది.
    ఒక్కొక్కరి మనః ప్రవృత్తి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. కొంతమంది ఈ సంఘం లో తామొక్కరే ఎంతో బాధపడిపోతూ ఉంటున్నామనీ, తమ కున్న బాధలు మరెవ్వరికీ లేవనీ వెష్ట పడతారు. ఎదుటివారు అంతకన్నా నిజంగా, ఎక్కువగా కష్టపడుతున్నా, వారి కష్టాలు వినను కూడా వినరు. అలా చెప్పుకున్నందువల్ల తమ బాధ కొంత వరకూ తీరినట్లుగానే భావిస్తారు. వినేవారు అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నా తమ కష్టాన్ని గురించి చెప్పుకోరు. ఎందుకంటె అవతల మనిషి తమ కష్టాన్ని గురించి పట్టించుకోరని తెలుసు గనుక.   ఇంకో రకం మనస్తత్వం కలవారు ఇంకా ఘనులు. చెప్పేవారి కష్టాలను శ్రద్దగా వింటారు. వారి మంచి చెడ్డలన్నీ తెలుసుకుంటారు. ఈ మాటలన్నీ నోట్లో వూరుతూ ఉంటె, కాలికి బలపం కట్టుకుని ఇంటింటి కీ వెళ్లి "ఫలాని వారి పరిస్థితి ఇది. పేరు గొప్పా ఊరు దిబ్బ!' అని చెపుతారు. ఇంకో రకం వారు ఎదుటి వారి కష్ట సుఖాలను ఆకళింపు చేసుకుని తెలిసిన సలహాలు ఇవ్వటమో, ఒదార్చ టమో చేస్తారు. ఇలాంటి వారు చాలా అరుదు. వసుంధర ఇలాంటి మనస్తత్వం కలది.
    "ఎవళ్ళు వెక్కిరిస్తే వాళ్ళ పళ్ళే బయట పడతాయి శారద. వాళ్ళని మనం తిరిగి అనకుండా ఉండటమే మన సద్భుద్ది ని చాటుతుంది. ఒక చెయ్యి చరిస్తే చప్పట్లు వినిపించవు" అన్నది వసుంధర.
    శారద మనస్సు లో దుఃఖం పొంగి పొర్లుకు వచ్చింది. ఆమె మనస్సులోని భావాలు , దుఖాలు గడ్డ కట్టుకు పోయినాయి. ఆ భావాలు, దుఃఖాలు వసుంధర రాకతో కరిగి, కట్టలు తెంచుకుని వసుంధర హృదయాన్ని తాకినాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS