జయమ్మ పీటేసుకుని స్టౌ ముందు కూర్చుంది. వంటింటి గుమ్మం దగ్గర గోడ కానుకుని కూర్చుంది జానకమ్మ. కళ గదిలో కూర్చుని ఏదో సినిమా పత్రిక తిరగేస్తుంది. చిత్ర స్కెచ్ లు వేసుకోవటానికి బైటి కెళ్ళింది. శారద జయమ్మకు సాయం చెయ్యటానికి వంటింట్లోకి వచ్చింది.
"కళకు ఇంటి పనులు చేతగావా వదినా?' అనడిగింది జయమ్మ వదిన కేసి తిరిగి.
జానకమ్మ గతుక్కు మన్నది.
"రాకేం వదినా? అది నేర్చుకున్న చదువే ఆదట! ఇంట్లో రోజూ అదే చేస్తుంది...." అంది కళను సమర్ధిస్తూ. పైగా కళను కేకేసింది. కళ పుస్తకం మడిచి పట్టుకుని జానకమ్మ దగ్గర కొచ్చింది.
"ఎందుకే?' అంటూ.
'అత్తయ్య కు సాయం చెయ్యకుండా ఆ పుస్తకం ఏమిటే? నేను పొయ్యి దగ్గరకు వెళ్తే మీ అత్తయ్య వప్పుకోదు. మీరు కూడా సాయం చెయ్యకపోతే ఎలా? వదిన నీకేం పనులు రావను కుంటున్నదిలే--"
కళ మాట్లాడకుండా పుస్తకం అలమారా లో పడేసి జయమ్మ దగ్గర కెళ్ళి నించుంది.
"శారద ఉన్నదిగా అత్తా? ఏం కావాలి?" అంది.
"అది ఉంటె ఉన్నదిలే.... ఇలా వచ్చి కూర్చో!" అంది జయమ్మ కళను ఆప్యాయంగా అజ్ఞాపిస్తూ. కళ మనస్సులో విసుక్కుంటూ జయమ్మ కు దగ్గరగా వచ్చి కూర్చున్నది.
శేఖర్ చదువు పూర్తయింది. కళ చదువు కూడా అయిపొయింది. వాళ్ళిద్దరికీ ఈ ఏడాది పెళ్ళి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుంది అనుకుంది జయమ్మ. అన్నిటికీ తనకు కోడలు ఆసరాగా ఉంటుంది. మరో ఏడాది కి తను చక్కగా మనవడిని ఎత్తుకో వచ్చును. చంటి పిల్లల్ని ఎత్తుకోవాలంటే తనకెంతో సరదా. శేఖర్ పుట్టిన కొన్నాళ్ళ కు వాళ్ళ నాన్న కాస్త పోయాడు. అయితే అయన సుఖంగా జీవించటానికి చాలినంత ఆస్తి వదిలి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒకరి పంచన లేకుండా తన బ్రతుకు తాను బ్రతగ్గలిగింది. పిల్లాడిని, పెంచి, పెద్దవాడిని చేసి, ప్రయోజకుడిని చేయగల్గింది. శేఖర్ ఈ ఏడే బి.ఏ. (ఆనర్స్) పరీక్షలు వ్రాసోచ్చాడు.... ఇప్పుడింక వాడికి పెళ్ళి కూడా అయిపోతే తనకెలాంటి దిగులూ ఉండదు.
అన్నయ్య కు తనంటే ఎంతో ప్రేమ, అభిమానం. అన్నయ్య ను కాదని మరో కోడల్ని తెచ్చుకోవటానికి అన్నయ్య ఏం అపకారం చేశాడు? పోనీ కళే మైనా అనాకారిదా అంటే అది కాదు -- చిదిపి దీపం పెట్తోచ్చును. పైగా చదువుకున్నది. వాడికి ఈడూ జోడూగా ఉంటుంది. ముచ్చటగా ఇద్దరూ తన కళ్ళ ముందు చిలకా గోరింకల్లా తిరుగుతూ ఉంటె తనకింకేం లోటు? అయినా జానకమ్మ ఆ మాట కదిపేవరకు తనామాట ఎత్తకూడదనుకుంది జయమ్మ....
శారద అగ్గి పెట్టె తెచ్చి స్టౌ వెలిగించ బోయింది.
'అత్తకి అక్క సాయం చేస్తుంది లేవే... నువ్వు కాస్త నాకు నడుం పట్టు --" అంటూ జానకమ్మ లేచింది మెల్లిగా నడుం పట్టుకుని లేస్తూ.
శారద జానకమ్మ వెనకాతలే వెళ్ళింది. జానకమ్మ గదిలో మంచం మీద పడుకుని పక్కగా వత్తిగిల్లింది. శారద యూకలిప్టస్ ఆయిల్ తెచ్చి మర్దనా చేసింది.
శారదను చూసి 'పిచ్చి పిల్ల! ఏం తెలీదు! లోకంలో ఎలా బతుక్కోస్తుందిదో!" అనుకుంది జానకమ్మ జాలిగా కళ్ళు మూసుకుంటూ.....
వంటింట్లో స్టౌ నీలి రంగు మంటతో వెలుగుతున్నది.
"ఏదే కళా! పెనం ఇలా పడెయ్యి!" అంది జయమ్మ మంట అనవసరంగా మండుతున్నందుకు కంగారు పడుతూ. కళ పెనం నీళ్ళతో తోలిపి పట్టుకొచ్చింది.
స్టౌ మీద పెనం పెట్టి జయమ్మ "అట్లు పోసే పిండిలా తీసుకు రావే!" అంది.
పెనం మీది నీళ్ళు జరజరా మధ్యకు జారుతూ, చురచుర లాడుతూ నిమిషం లో ఆవిరై పోయాయి. కళ పిండి పోసి ఉంచిన రాచిప్ప , దానితో పాటు అట్లపుల్ల కూడా తీసుకొచ్చింది.
"నా మతి మండిపోను! నూనె సంగతి మార్చే పోయాను! ఆ అలమారా లో ఉంది కాని నూనె సీసా ఇలా అందియ్యవే!....' అంటూ అలమరా కేసి చెయ్యి చూపించింది జయమ్మ.
నూనె సీసా అందుకున్నాక ఉప్పు సంగతి జ్ఞాపకం వచ్చింది జయమ్మ కు.
కళకు పీక దాకా కోపం వచ్చింది. 'అట్లు పోసే అమ్మకు అరవై యారోత్తులు ' అని వూరికే అనరు అనుకుంది లోలోన మండి పడుతూ. అయినా పైకి కోపం లేనట్టు నటిస్తూ ఉప్పు , ఉప్పు తర్వాత పిండి కలపటానికి నీళ్ళు, పిండి మరీగట్టిగా ఉందని మళ్ళా మరో గ్లాసెడు నీళ్ళు -- ఇలా వరసగా ఒక్కొక్కటీ అందిస్తూ కూర్చున్నది.
అట్లు పోస్తూ జయమ్మ మొదలు పెట్టింది.
"మీ బావకు మినపట్లంటే మహా ఇష్టమే! శనివారం నాడు రాత్రి పూట వాడు అన్నం తినడు.... ఈరోజుల్లో చదువుకున్న వాళ్ళకి దేవుడంటే భయమూ భక్తీ లేదు. కాని మీ బావ కి ఎంత భక్తీననుకున్నావ్?...." అంటూ మధ్యలో "ఏదీ! ఒకపళ్ళెం ఇలా పట్రా!" అంది అట్ల పుల్లతో అట్టు తిరగేస్తూ.
పళ్ళెం అందుకుని మళ్ళా మొదలు పెట్టింది.
"చదువులో మీ బావను మించిన వాడు లేడే! వాడి గదిలో బీరువా చూశావూ కదూ? అందులో వన్నీ వాడి కొచ్చిన [పుస్తకాలే!...."
"వూ!"
"చంటి పిల్లలంటే వాడి కెంత ముద్దను కున్నావ్? పక్కింటి శేషమ్మ గారి మనవడ్ని నిమిషం సేపు పట్టుకుని వదిలే వాడు కాదు.... ఈ మధ్య ఆవిడ కూతురు అత్తగారింటికి వెళ్ళి పోయిందిలే. ఈరోజుల్లో కాలేజీ కుర్రాళ్ళు రౌడీల్లా ఆడాళ్ళ తో వికవిక లాడుతూ పకపక లాడుతూ ఉంటారా వీడు అలాక్కాదే ఆడవాళ్ళ ను చూస్తె చాలు తల దించుకుని పోతాడు...."
"వూ!"
"ఆ పెద్ద పటకారి లా తేవే!"
పటకారందుకుని జయమ్మ పెనం ఒకసారి క్రిందికి దించింది.
"బావ బైటికి వెళ్తాడు కాబోలు -- ఇప్పుడో రెండట్లు తిని వెళ్తాడెమో అడిగి రావే!"అంటూ జయమ్మ వెనక్కి తిరిగి గతుక్కుమంది. ఆశ్చర్య పోయింది.
"నువ్వటే శారదా! కళనుకున్నాను... అదేదీ?' అంది.
"వంట్లో బాగోలేదు కాబోలు వెళ్ళి పడుకుంది. అమ్మ నిద్రపోతున్నది. నువ్వు ఒక్కర్తివే చేసుకుంటున్నావని వచ్చాను...." అని జవాబు చెప్పింది.
శేఖర్ బూట్లు టకటక లాడిస్తూ వంటింటి ముందుకు వచ్చి ఆగిపోయాడు.
'అమ్మా! నేను సినిమా కెళ్తున్నానే?" అన్నాడు జయమ్మ తో.
జయమ్మ 'అట్లు తిని వెళ్ళరా!... అదేమిటి నువ్వొక్కడివె వెళ్తావా? మీ మరదళ్ల ని కూడా తీసుకెళ్ళు...." అంది.
శేఖర్ నసిగాడు--
"లేదు లేవే అమ్మా! నేను మా స్నేహితులతో కలిసి వెళ్తున్నాను..."
"స్నేహితులతో ఇంకో రోజు కలిసి వెళ్ళొచ్చులే" అంటూ జయమ్మ వంట కట్టి పెట్టి కళ పడుకున్న చోటుకి వెళ్ళింది. కళ క్రింది చాప మీద పడుకుని దూలం కేసి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నది.
"ఏమే కళా! పడుకున్నావెం? వంట్లో బాగాలేదా?" అంటూ వచ్చి వంటి మీద చెయ్యేసింది జయమ్మ.
కళ కంగారుగా "బాగానే ఉందత్త! తల నొప్పిగా ఉంటె "అంది కణతలు నొక్కు కుంటూ.
"సినిమా కెళ్తే అదే పోతుంది లే లే? బావ తో సినిమా కేల్దువు గాని--" అంది.
పక్క గదిలో మంచం మీద పడుకున్న జానకమ్మ కళ్ళు విప్పింది.
"లేచి వెళ్ళవే కళా! అత్తయ్య చెప్తుంటే ఏమిటదీ?' అంది గట్టిగా మందలిస్తూ.
కళ చాప మీది నుంచి లేచింది. సబ్బు, తువ్వాలు పట్టుకుని బాత్ రూమ్ కేల్తూ "శారదా! నువ్వూ రావూ?' అంది.
"రమ్మంటే వస్తాను..." అంది శారద.
"బావతో నువ్వెళ్ళరాదూ?... నాకు ఇంట్లోనే ఉండాలని ఉంది."
శారద మాట్లాడలేదు.
గదిలో అడ్డం ముందు నిలబడి పౌడరు రాసుకుంటూ కళ జానకమ్మ తో అన్నది.
"శారద వెళ్ళు తుందటమ్మా. చిత్ర వస్తే అది కూడా వెళ్తుంది... నకేమిటో ఒకటే తలనొప్పిగా ఉంది--"
"శారద ఇంట్లోనే ఉంటుంది లే. బావ ముచ్చట గా పిలుస్తుంటే ఏమిటలా చిన్న పిల్లలా మొండి కేస్తావ్?' అని విసుక్కుంది జానకమ్మ.
కళ నిట్టూర్చింది. ఎవరూ తన వెంట రాకపోవటం కూడా ఒకందుకు మంచిదే.... బావ కు అంతా విప్పి చెప్పొచ్చు...
కళ ముస్తాబు పూర్తీ చేసుకుని శేఖర్ తో బయల్దేరింది.
"జాగ్రత్తగా వెళ్ళి రండి!" అంటూ జయమ్మ వాళ్ళని సాగనంపింది.
* * * *
