"మరి....... భద్రాచలం."
"అవన్నీ నేను చూసుకుంటాను. మీరీపూట మాత్రం మా యింటో చెయ్యి కడుక్కోవాలి మరి."
"అయితేనాకే అభ్యంతరమూ లేదు."
'చాలా థాంక్స్. మీరు చాలా బుద్ధిమంతులనీ, మంచి బాలురనీ అమ్మగారి అభిప్రాయం."
"ఇంకా ఏవైనా కబుర్లు చేపుదురూ."
"ఖబుర్లు చెప్పను. కథ చెప్తాను."
"కథే ...... అయితే చెప్పండి" అన్నాడు ఉత్సాహంగా.
"అనగనగా ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరు శంకరం. అతనికి ఒకరోజేమైందంటే....."
"నా కథే అయితే నే వినదలుచుకోలేదు." అన్నాడు శంకరం విసుగు ప్రదర్శిస్తూ.
శారద పకపకా నవ్వేసింది. శారద నవ్వు నిర్మలంగా, హాయిగా, తీయగా ఉంటుంది.
-మరుసటిరోజు సెలవు పెట్టాడు శంకరం. మిత్రులు విషయ మడిగారు. తన భద్రాచల ప్రయాణం గురించి చెప్పేడు శంకరం. శంకరం వెళ్ళిపోతుండగా,

"విష్ యూ ది బెస్టాఫ్ లక్" అన్నాడు ప్రసాదం. శంకరం నవ్వేశాడు.
ఆరోజు ఉదయం 11 గంటలకి శారదా వాళ్ళతో భద్రాచలం బస్సెక్కాడు శంకరం.
* * *
ప్రసాదం మృణాళిని గదిలోకి వెళ్ళేడు. తనొచ్చినట్టు చిన్న సకిలింపు ద్వారా తెలియజేశాడు. మృణాళిని ప్రసాదాన్ని చూచింది.
"ఏం బావా?"
ప్రసాదం కుర్చీ లాక్కుని కూర్చుంటూ.
"ఎంతసేపని యిలా వంటరిగా గదిలో కూర్చోడం."
"నీకు కష్టంగా ఉందా?"
"ఇలాటి సాయంత్రాలు వృధా చేయకూడదు చిట్టీ."
"వూఁ.....మరేం చెయ్యాలిట."
"అలా బేరేజీ వైపో, సీతానగరం రోడ్డుమీదో నడుచుకుంటూ చల్లగాలిని ఆస్వాదిస్తూ-"
"బాగానే ఉంది."
"గొప్పగా ఉంటుంది తెల్సా? అవునుగాని నీ హాబీ లేమి టసలు?"
"ఇవ్వాలేదో కొత్తగా ఉన్నావేమిటి?"
"నేను ప్రసాదరావునీ, నువ్వు మృణాళినివి- మనలో కొత్తగా ఎవరూ లేరు. ఇద్దరం పాత వాళ్ళమే.... పోతే, నా ప్రశ్నే, నీ హాబీ లేమిటి?
"ఎందుకో?"
"మరేం లేదు. మనిషై పుట్టిన తర్వాత ప్రతీ వాడూ కొన్ని హాబీలంటూ నిర్ణయించుకోవాలి. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలంటే, విసుగెత్తిన మనసు రిలాక్స్ కావాలన్నా యీ హాబీలు అవసరం. అంతేగాని, జీవితానికి ఓ దృక్పధమంటూ లేక, యీసురోమను మనుషులుంటే దేశ మేగతి బాగుపడునోయ్ వెధవాయా! అన్నాడు అప్పారావు."
"ఇప్పుడు నువ్వు చెప్పే హబీకీ, దేశానికీ సంబంధ మేమి టసలు?"
"అక్కడే ఉంది గొప్ప ట్రిక్కు. నీలాటి ఆడ పిల్లలకీ, అందునా యిరవై నాలుగ్గంటలూ నాలుగు గదుల మధ్య గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న దానికి యిలాటి గొప్ప విషయాలు ఒక పట్టాన అర్ధంకావు చిట్టీ!"
"నన్నా పేరుతో పిలవద్దని చాలాసార్లు చెప్పాను."
"మరెలా పిలవమంటావ్?"
"నా పేరుతో పిలువు, చక్కగా మృణాళినీ అంటూ!"
"హు.....నీకే నువ్వు బాగానే చెప్తావ్. ఆపేరు సరిగ్గా పలకలేక నా తాడు తెగుతోంది. నోటికీ, నాలిక్కీ పెద్ద ఎక్సర్ సైజ్ అవుతుంది. అయినా దేశంలో యింకా ఏ పేరూ దొరకనట్టు ఈ పేరే పెట్టాలా మావయ్య. చక్కగా వసంతా, మాధవీ, రాధా-ఎన్ని? ఎన్ని పేర్లు లేవు? అంత చక్కటి సరళమైన పేరు వొదిలి కంకర పోసిన రోడ్డు లాగా మృ......ణా......ళి.......నీ, ఏవిటి నా బొంద?"
"అంత కష్టమైతే అసలు పిలవకు అంతే." అంది మృణాళిని రుస రుస చూస్తో.
"తప్పుతుందా మరి. మానవుడి పుట్టిన తర్వాత ఎన్నో కష్టాల్ని ఎదుర్కొనవలసి వస్తుంది. అలాటిది....."
"బావా! నిజం చెప్పు. ఉదయం వరకూ నిక్షేపంలా ఉన్నవాడిని యిప్పుడిలా మారిపోయావే..
"అదేం ప్రశ్న?"
"లేకపోతే ఏవిటీ వరస? మానవుడు జీవితం, దృక్పథం, దేశం, అప్పారావుగారు-చాలా పెద్దమాట లుపయోగిస్తున్నావ్."
"నా గురించి నీకేం తెలీదసలు" అన్నాడు సీరియస్ గా.
ఈమాట విని పక పకా నవ్వేసింది మృణాళిని.
"ఎందుకలా పగలబడి నవ్వుతావ్?" విసుక్కున్నాడు ప్రసాదం.
"నిన్ను చూస్తూంటే నవ్వాలనిపిస్తుంటుంది బావా!" "ఈ మాట డెబ్బై మూడోసారి అంటున్నావ్ చిట్టీ, కాదు మ్రునా౧ నువ్వు కాబట్టి విని సహిస్తున్నాగాని-లేకపోతే ఏమిటి నీ ఉద్దేశ్యం-నా మోహంలో ఏవైనా కోతులాడుతున్నాయా నువ్వు నవ్వటానికి?
"అవి వేరే ఎందుకులే బావా?"
"వాట్ ....... నేను కోతినా?"
"అని ఎవరన్నారూ?"
"మృణా ...... నువ్వొక్కదానివే తెలివైనదానివని మురిసిపోకు. ఇవతలవాళ్ళ గొప్పతనాన్ని గౌరవించడం నేర్చుకో."
అంతలో వంటగదిలోంచి మృణాళినిని పిలిచింది వాళ్ళమ్మ.
"అమ్మ పిలుస్తోంది. వస్తా" అన్నది మృణాళిని.
"కూర్చో ...... ఆవి డెప్పుడూ యింతే. గొప్ప పనేదో అవతల తగలబడిపోతున్నట్టు గావుకేకలు. మనకి తెలియంది కాదుగదా."
"అసలు సంగతేమిటో కనుక్కువస్తాగా" అన్నది మృణాళిని.
"ఊఁ ..... అయితే వెళ్ళు. మళ్ళా వెంటనే రావాలి సుమా. మనం యివ్వాళ అలా బారేజీవైపు వెళ్ళాలి." అన్నాడు ప్రసాదం.
మృణాళిని నవ్వుకుంటూ వంట గదిలోకి వెళ్ళింది.
ప్రసాదం ఆలోచనల్లో మునిగిపోయేడు. మృణాళినికీ వేళ తన గొప్పతనం ఏమిటో చాటి చెప్పాలి. ఈ దెబ్బతో బావా! నువ్వింతటి వాడివా' అని ఆశ్చర్యపోవాలి. హు ........ ఏవిటనుకుంటుందో మరి.
తను చదివిన త్వమేవాహమ్ లోని నాలుగు ముక్కలూ మృణాళినికి ఎలా చెపుతే, ఆపిల్ల ఎలా రియాక్ట్ అవుతుందీ ఊహిస్తున్నాడు. అందుకు అవసరమైన రిహార్సలూ మనసులో చేసుకుంటున్నాడు.
కాసేపటికి మృణాళిని కాఫీ తీసుకొచ్చింది.
"ఇదిగో ముందీ కాఫీ తాగు ..... నీ మాటలన్నీ మా అమ్మ విన్నదట, 'గొప్ప కష్టపడిపోయాడూ, పాపం-యీ కాఫీ యిచ్చిరావే పిల్లా!' అని నన్ను పంపింది." అన్నది.
"ఏమిటీ! అత్తయ్యా, నా మాటలన్నీ విన్నదా? అయినా ఆవిడ కదేం బుద్ధి? మనం పిల్లలం కాబట్టి, అదీగాక ......"
"ఊఁ ...... అదీగాక."
ఇలా నిగ్గదీసి అడుగుతే తనేం చెప్పగలడు?
"పోదూ, ఏం తెలీనట్టు నటన-కాబట్టి మనం మనం అనేక విషయాలు మాటాడుకుంటాం అంతమాత్రంచేత ఆవిడ గోడచాటు నుండి వినలేం? నాన్సెన్స్. ఈ పద్ధతేం బాలేదు. అత్తయ్యకి ఎటికసీ తెలీదు. చదువుకోలేదు కాబట్టి అవతలి వాళ్ళనెలా......."
"ఆపు బావా! గుర్రాన్ని కట్టేయ్ నీ మాటలు గోడచాటున నిలబడి వినాల్సిన ఖర్మ మా అమ్మకేం పట్టిందని? తమరిక్కడ మాటాడుతూంటే, అది సలక్షణంగా గవర్నర్ పేట సెంటర్ కి వినిపించగలదు. ముందు కాఫీ తాగు, చల్లారిపోతుందవతల."
"మరి మన ప్రోగ్రాం మాటేంజేశావ్?"
"కాఫీ తగిన తర్వాత ఆలోచిద్దాం."
"నో ఆలోచించే బిజినెస్. ఎస్ ఆర్ నొ. ఏదో ఒకటి చెప్పు."
"వూ......అలాగే."
"అంటే."
"ఎస్."
"గుడ్. థాంక్స్" అని గబగబా కాఫీ తాగేసి లేచి.
"కమాన్" అన్నాడు.
"అమ్మతో చెప్పి వస్తా నుండు."
"నో అమ్మా నో నాన్నా! మనకు స్వేచ్చా స్వాతంత్ర్య మున్నదన్న మాట మరిచిపోవద్దు కమాన్....."
"పోదూ నీ బడాయి! ఉండు అమ్మతో ఒక మాట చెప్పొస్తా."
"ఏంమాట" అన్నాడు ఉలిక్కిపడి.
"అదే మన ప్రోగ్రాం."
మృణాళిని ఈమాట అంటూండగానే, అత్తయ్య గారు గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఆమెను చూచిన వెంటనే తల వంచుకున్నాడు ప్రసాదం. అతనికి భయంగా ఉన్నమాట నిజం.
"వెళ్లిరా తల్లీ ....... పాపం...... సరదాపడుతున్నా డాయే. ఇప్పుడు కాదు అల్లుడూ యీ సరదాలు, నలుగురు పిల్లలు పుట్టిం తర్వాతా ఉండాలి. మరి" అన్నదావిడ నవ్వుతూ.
గతుక్కుమన్నాడు ప్రసాదం. మృణాళిని తోపాటు, బయట కొచ్చేడు. చాలాదూరం నడిచా రిద్దరూ. అతనికిప్పుడు పంజరం నుంచి బయటపడినంత సరదాగా ఉంది.
"మా అమ్మ అన్నమాటకి సిగ్గుపడ్డావా బావా" అని అడిగింది మృణాళిని దారి మధ్యలో.
"గొప్పమాటన్నావ్. నాకు సిగ్గెందుకు? ఆవిడన్న మాటలో తప్పేముంది గనుకా? అవును మరి-ప్రేమా, పెళ్ళీ అనేది అంత పవిత్రంగా చూచుకోవాలి. ఇది శాశ్వతమైన బంధం నలుగు రోజుల ముచ్చట కాదు, ఈనాడు జరిగే వివాహాలు, సాగే ప్రేమ కలాపాలూ-"
"హెవీ డైలాగ్సు........ఫుల్ స్టాప్."
ప్రసాదం విసుక్కున్నాడు.
"ఎప్పట్నుంచో చూస్తున్నాను, నీ వరస. ఏం బాగోలేదు సుమా! ఒకళ్ళ అభిప్రాయాలూ మరొకళ్ళు తెలుసుకోవలసిన అవసరం యిప్పుడు ఎంతైనా ఉంది. మరి అలాంటిది నీకు బొత్తిగా సరిపడటంలేదంటే నాకేం నచ్చలేదు."
"క్షమించు. నువ్వు మాటాడే విషయానికి ఇక నేను అడ్డు చెప్పను. సరేనా?"
"అంత కోపమైతే ఎలా మృణా ...... నన్నూ అర్ధం చేసుకో."
ఇద్దరూ బేరేజీ దగ్గర కొచ్చారు. ఒకచోటనే కూర్చున్నారు.
"చక్కటి సాయంత్రమన్నా, అందమైన సాహిహ్యమన్నా నాకు చాలా యిష్టం" అన్నాడు ప్రసాదం.
"మంచిదేగా."
"నేను కాలేజీలో చదువుతూండగా, సాహిత్య సభలకి హాజరవుతూండేవాడిని. ఒకసారి శ్రీ శ్రీ మా కాలేజీకి వచ్చారు. ఉపన్యాసం యిచ్చారు. సభ ముగిసిన తర్వాత నేనాయన్ను అడిగేను. 'శ్రీ శ్రీ గారూ! ఈనాడు వొచ్చే రచనలమీద మీ ఖచ్చితమైన అభిప్రాయ మేమిటండీ?' అని అప్పుడాయన నా భుజం తట్టి, కాళ్ళ జోడు చేతిలో ఉంచుకొని ;నాయనా ప్రసాదం! రత్నాలూ, రాళ్ళూ మ్నుపూ ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి!' అని చెప్పేరు. అలాగే ఒకసారి ఆరుద్ర గారితో మాట్లాడటం జరిగింది. 'గేయ కవిత పట్ల మీ అమూల్యాభిప్రాయం ఏమిటని' అడిగెను. ఆయన నావైపు తీక్షణంగా చూస్తో సిగరెట్టు పొగ నా తలమీంచి వదులుతో 'మహాప్రస్థానం, త్వమేవాహమ్ చదివావా ప్రసాదం!' అని అడిగేరు.
