Previous Page Next Page 
మనం మిగిలేం పేజి 20


    "వీళ్ళంతా ఇంతే!" కాస్త గట్టిగానే అనుకున్నాడు.
    "ఎవరు, నాయనా?" అన్నాడు ప్రక్కగా కూర్చున్న వయోవృద్దుడు. అప్పటివరకూ స్థలాల కోసం జరిగిన సంఘర్షణ పర్యవేక్షణలో, మాట అతికినట్లుంటే-
    "ఏంలేదు" అన్నాడు కమ్ముకుంటూ.
    "ఎక్కడికి వెళ్తున్నావు?"
    "తిరుపతి." అప్రయత్నంగా అనేసేడు.
    "మ్రొక్కు కాబోలు." ఆయన లోకాభిరామాయణం. "మేంకూడా అక్కడికే. ఎన్నాళ్ళ నుండో అనుకుంటున్నాం వెళ్ళాలని. పడలేదు. ఈనాటికి ఆయన తీసుకువెళ్తున్నాడు." కిటికీ లోంచి దూరాల్ని చూస్తూనే అన్నాడు.
    తళుక్కుమంది తనలో. వెంకన్నదేవుడు ఈయన్ను తీసుకువెళ్ళడం ఏమిటో?
    "ఏమండీ? దేవుడు అలా చేస్తాడా?"
    "ఎందుకు చెయ్యడు, నాయనా? ఆయన ఎప్పుడూ మన చుట్టూ వుంటూనే వున్నాడు. ఉన్నట్లు మనకు తెలియదు. ఎందుచేతనంటే ఆయనలో మనం ఉన్నాం కనుక."
    "ఈ నమ్మకంతో ప్రతివ్యక్తీ ఎందుకు వుండలేడు?"
    "అది అజ్ఞానం. అయినా వ్యక్తిగతమైన నమ్మకం బలంమీద ఉంటుంది అది."
    "చూడందే ఉన్నాడనుకోవడం, నమ్మడం ఎల్లా?"
    "సత్యాన్ని ఒప్పుకున్నావు. ఎవరబ్బాయివి నువ్వు, నాయనా?"
    చెప్పేడు.
    "మాది సత్యవరం. అనకాపల్లి దగ్గర వుంది. నాపేరు శంకరయ్య. ఆపస్తంభీకులం. ఆవిడ ఆ ఆవిడే." పరిచయం చేసేడు.
    "నమస్కారం. అమ్మా!"
    ఆవిడ ఆ వినయానికి మురిసిపోయింది. ఏం అనాలో తెలియక నవ్వేసింది; అదే ఆశీర్వాదం అన్నట్లుగా తేరిపారి చూచేడు. పసుపురాసుకున్న వన్నె. అర్ధణా అంత కుంకంబొట్టు. మెళ్ళో పుస్తెల తాడు. చేతికి రెండు జతల గాజులు. పూర్వీకం ఉట్టిపడుతూంది ముమ్మూర్తులా. పార్వతీదేవిలా ఉంది.
    "దానికి వెంకన్న ప్రభువంటే గాఢమై నమ్మకం" అనేసి పరిచయాన్ని ఆఖరుచేసేడు ఆయన.
    "మీకు లేనట్లు!" ఆవిడ అంది.
    నవ్వేడు. "ఇది మా సంసారం" అన్నాడు మధ్యలో.
    హృదయానికి రమ్యంగా కన్పడింది. ముచ్చట కలిగింది. "చెప్పేరుకారు" అన్నాడు రాజు.
    "ఓ అదా! ఏం చెప్పమన్నావు? అదంతా ఓ వెర్రిమొత్తుకోళ్ళులా వుంటుంది. భక్తి ఓ దారి. దానితో గురి కుదురుతుంది, ఏకలవ్యుడులా. ఇక మంత్రం రెండో పంథా. దానివల్ల శక్తిమయం అవుతుంది. ఈ రెండూ కూడా అతీతాన్ని అర్ధం చేసుకొనేందుకే యుగ యుగాల నుండీ వస్తున్నాయి మనలో." ఆగేడు.
    "ఎక్కడకు తీసుకు వెళ్తాయి ఇవి?"
    "మోక్షానికి,"
    "మృత్యువే ఈ శరీరానికి మోక్షం ఇస్తుంది. దానికి దైవసంకల్పసిద్ధి ఎందుకు?"
    "వెర్రినాయనా!" అంటూనే చిరునవ్వు నవ్వేడు. "మోక్షం అన్నదానికి నిర్వచనం, మృత్యువు లేకుండా ఉండడం. అంటే ఆ పరమాత్మలో, నీలో ఉన్న ఆత్మ ఐక్యతే పరమావధి. దానికి మోక్షం కాని నీ శరీరానికి కాదు."
    "అయితే ప్రతివ్యక్తిలోనూ ఈ ఆకాంక్ష ఉంటుందా? ఒక్కొక్కసారి విపరీతంగానే ఎవరో చెపుతున్నట్లు ప్రేరణ కలుగుతుంది. అదేమిటి?"
    "అది గతానుభవాల పునరుక్తి."
    అర్ధంకాలేదు. తాయిలం పెడతానన్న ఆశతో ఉన్న బాలుడే అయ్యేడు.
    "ఆ ప్రేరణలోని సత్యం ఎంతవరకూ? దాని బలంలో అర్ధం?"
    ఆయన ఆలోచనలో పడ్డాడు. ఏదో ఆవేదనతో ఇంటినుండి పారిపోయివచ్చినట్లు ద్యోతకమవుతూంది స్థితి. మనిషిలో ఊగులాట; ఇదమిత్ధం కాని సంఘర్షణ కన్పించాయి.
    "జన్మల అనుభవం చిలకపచ్చ" అనేసి ఊరుకున్నాడు.
    పూర్తిగా మౌనంతో పడ్డాడు రాజు. స్టేషన్లు దాటుతూనే ఉన్నాయి. మనుష్యులు ఎక్కుతున్నారు; దిగుతున్నారు. గూడూరు స్టేషన్లో దిగినప్పుడే చేయూతనిస్తూ "మీరు దాన్ని ఘట్టిగా నమ్ముతారా?" అన్నాడు.
    ఈసారి శంకరయ్యే బిగుసుకుపోయినట్లే అయ్యింది. బండి మారేరు. వాళ్ళను బస్సులో ఎక్కించి తను మెట్లు ఎక్కేడు. ఆవిడా చెప్పింది తమతో రమ్మని.
    "గుడిదగ్గర కలుస్తాకా?"
    "మోకాళ్ళ పర్వతం ఎక్కలేవు."
    "అది చూడాలనేకా" అనేసే గబగబా అడుగులు వేసేడు. పలచ పలచగా తోడి యాత్రికులు, వాళ్ళ మాటలు. చుట్టూరా క్రమ్మిన విరజిమ్మిన చెట్లు.
      ఒక్కొక్క పర్వతమే దాటేడు. ఎందుకో, ఎవరో తనలోంచి మళ్ళీ రేగుతున్నారు. ఏవో అక్షరాలే వస్తున్నాయి. అవి ప్రతిధ్వనిస్తూ న్నాయి. తను ఎప్పుడో ఆ వడుగు రోజున చెప్పి, చదివించినట్లే జ్ఞాపకం రవులుకుంది. అవి చదివినట్లు. చాలా ఉన్మత్తంగానే రేగేయి. మార్మ్రోగిపోయినాయి.
    'ఓం భూః ... ఓం భువః.......... ఓగ్ం సత్యం.' ఏమిటి ఈ సంపుటి? ఆ లోకాలన్నీ దాటినట్లే ఆరు ప్రహరీల్లా కొండల్ని పెట్టుకుని, ఏడో కొండమీద ఆయన కాపురం ఉన్నాడా? కాపలాగా ఉన్న వరాహ నరసింహ స్వామి వడ్డీ ఇచ్చుకుంటున్నాడా?
    ఏదో సాదృశ్యం అవుతూంది. మైకంలోనే నడిచేడు. "నిన్ను చూడ్డానికే వచ్చేను, తండ్రీ" అంటూనే ధ్వజస్తంభం దగ్గరనే నిలబడి పోయేడు. కళ్ళు మూసుకునే పరధ్యాన్నంలో పడ్డాడు.
    "నువ్వెప్పుడొచ్చేవురా?" అని ఎవరో జబ్బచరిచేవరకూ స్పృహే లేదు. వెనక్కు చూస్తే శాస్త్రి. తన సహాధ్యాయుడు.
    భుజం పట్టుకుని, దర్శనానికి తీసుకు వెళ్ళేడు.
    విగ్రహాన్ని మసగ్గా చూస్తూన్నప్పుడే హృదయంలో లింగాకృతి ఏర్పడింది. పుచ్చపువ్వులతో మెరిసిపోతున్న విగ్రహంలో తను విభూదితో పూజ చేస్తూన్నట్లు అంతః భావన. అంతే.
    వెనక్కు తిరిగినపుడే 'ఓం శివరూపిణ్యే నమః ఓం శివశక్తైనమః...' అని చెవుల్లో.
    గదికి వచ్చి "ఓరే, శాస్త్రీ, నన్ను నిద్రపోనివ్వరా" అంటూనే మంచంమీద వ్రాలిపోయేడు.
    
                                      14

            

    "చౌదరయ్యా, విన్నావు కదూ?" అనే అవధాని అడిగేడు. అందులో న్యూనత లేదు. మిత్రత్వంలో ఉన్నత స్థానపు వ్యక్తీకరణ ఉంది.
    "అమ్మ చెప్పింది."
    "ఊఁ."
    "అర్ధంకాలేదు. ఎంతగా బుర్ర పగల కొట్టుకున్నా తలా తోకా తెలియటంలేదు. పైగా అమ్మ మరీ బెంబేలు పడుతోంది - ఇదంతా ఎంతవరకూ వెళ్ళుతుంది, ఏమవుతుందని."
    "అది ఆ అమ్మ చెప్పాలి."
    "ఇన్ని శాస్త్రాలు చెపుతావు. చదువు తావు. జోతిషం అంటూ కూర్చుంటావు. ఇల్లాంటివి జరుగుతాయా, అవధానీ?"
    "ఇరుకున పడ్డాడు. గత యుగాల్లో యుగ ధర్మాలన్నట్లు ఎన్నో విపరీత సంఘటనలు జరిగేయి. అవి వ్రాయబడి ఉత్క్రుష్ణ పఠన గ్రంథాలయ్యేయి. కాని ఈ యుగంలో ఆ ఛాయలు కమ్ముకుంటాయన్నది హాస్యాస్పదం అనుకున్నా, సత్యం, ఎక్కడో నూటికో కోటికో ఉండవచ్చునన్న దారి కన్పిస్తూంది.
    "ఎటూ చెప్పలేకుండా ఉన్నా."
    "మరి దారి?"
    "జరిగేది జరిగింది. జరగబోయేదానికి ద్రష్టలవడంకన్న మనం చేసేదేమీ లేదేమో? ఏదో జ్ఞానం వచ్చినప్పటి నుండి ఆ రాజరాజేశ్వరమ్మ పాదాలు నమ్మేను. ఆవిడే నడిపించాలి."
    "పార్వతమ్మ ఏమంటుంది?"
    "కోడలు ఆ రూపంలో ఎదురుగా తిరగడంతో కడుపుకోత మరీ ఎక్కువైంది. దుఃఖం మ్రింగుకోలేకుండ ఉంది. పైకి వెళ్ళగ్రక్కలేదు. అల్లా కుళ్ళి మ్రగ్గిపోతోంది."
    "పోనీ, కొన్నాళ్ళు శాంతని పుట్టింటికి పంపితే?"
    "అదెల్లా సాధ్యం? పైగా మారిన రూపానికి అర్ధాలు ఏమిటంటే, తల వొంచుకో వలసింది నేనా, అతనా?"
    ఇరుకున పడ్డారు ఇద్దరూ ఆలోచన తెగ లేదు. ఎల్లా ఈ చిక్కును విడతీయాలన్న ఆరాటనే.
    "నే నొక్కటి చెపుతాను. చేస్తావా?"
    "చెప్పందే ఎల్లా జవాబు చెప్పగలను?"
    "నీకు కష్టం అవుతుంది."
    "ఫరవాలేదు."
    "ఎన్నాళ్ళనుండో వయస్సు మీదపడుతోంది; తీర్ధయాత్రలకు వెళ్ళాలని అనుకున్నావు. ఆ పని ఇప్పుడు శాంతతోసహా చేస్తేనో?"
    అవధానికి మెరుపులా తట్టింది ఆ సలహా. ప్రస్తుతంలో ఇంటి రహస్యం ఈ ఆప్తుల మధ్యనే ఇమిడి ఉంది. బయటకు పొక్కడానికి ఆస్కారం లేకుండానే కట్టుదిట్టమయ్యింది. కాని రేపు కాకపోతే ఎల్లుండి అయినా అది ఊళ్ళో పొక్కక మానదు. అప్పుడు తన కర్తవ్యం? ఇప్పటి వరకూ ఉన్న మనోనిబ్బరం కూడా సడలుతుంది. అది తథ్యం. అప్పుడు తన కర్తవ్యం ఏ వికటరూపంలో పడుతుందో అన్న పిరికితనం ప్రబలుతూంది.
    పైగా తను పీఠంవద్ద కూర్చున్నంత కాలంలోనూ ఈ భావనా, నిస్సహాయతా క్రమ్మవు. అవి వేరు లోకంలో ఉన్నట్లే ఉంటాయి. అప్పుడు శాంత, పార్వతమ్మ కూడా జ్ఞాపకం రారు. అవధాని లేడు.
    భౌతికం ఉన్నంతవరకూ కర్మానుభవం తప్పదు. ఆ నమ్మకంకూడా తన్ను నిలదొక్కుకో నివ్వటంలేదు. అల్లా అనుకుని కర్మ సిద్దాంతం నమ్మి, సర్వస్వం కర్మమీద తను వదిలిపెట్టి కూర్చోలేదు. మోక్షదాయిని అని తను నమ్మే, ఆవిడ ఆరాధనలో పడ్డాడు. అనుష్ఠానాలు చేసి, ప్రసన్నం చేసుకున్నాడు. కాని ఆవిడ అక్కడే ఉండిపోయింది.
    తను అడగగలడు. దేహీ అని కాళ్ళమీద తలపెట్టి 'త్వమేవ శరణం మమ' అనెయ్య గలడు. కాని మనస్సు ఒప్పటంలేదు. అది భౌతిక స్వార్ధం అన్న నమ్మకం; తన తండ్రి చెప్పిన కీలకం. యాదృచ్చికంగానే ఆ రోజు మాఘ శుద్ధ ఏకాదశి శుక్రవారం. తార కుదిరింది. నక్షత్రం బావుంది. వర్జ్యం లేదు అనే ఆయన ముహూర్తం పెట్టేరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS