Previous Page Next Page 
ఆరాధన పేజి 21


    తలుపు చప్పుడైంది. ఆమె పాపను మంజు కిచ్చింది మంజు ఉయ్యాలలో పరుండజేసింది. నక్షత్రాల్లాంటి కళ్ళను తెరచి ఈ మాయ ప్రపంచాన్ని తిలకిస్తోంది.
    "ఏమ్మా - మంజులా - ఎవరొచ్చారె చూద్దుగాని రా."
    మంజు గబగబ వెళ్ళింది. ఆ మాతృమూర్తి దుఃఖం కట్టలు త్రెంచుకుంది. మంజు ని అక్కున చేర్చుకుని విలపిస్తోంది. మంజు కన్నీరు కారుస్తోంది. ఆ దృశ్యాన్ని చూచిన అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.
    కొంతసేపటివరకు ఎవరు మాట్లాడలేదు. వారికివారు ఉపశమనమంది ఒకరినొకరు చూచుకున్నారు...అమ్మ మారిపోయింది-ఎంతో పెద్దదిగా అగుపిస్తోంది. ఈ నాల్గు సంవత్సరాలలో వృద్ధాప్యం త్వరగానే వచ్చేసింది. దానికి తనే కారణం- ఆమె హృదయం తెలియని బాధతో విలవిల్లాడి పోయింది.
    మంజు ముఖం జ్యోతిలా వెలిగిపోతోంది. ఈమె వైవాహిక జీవితం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతోంది-పోనీ -తల్లి హృదయాంతరాళంలో ఎనలేని తృప్తి కల్గింది.
    మంజు తల్లి కౌగిలి విడిపించుకుని పాపనెత్తుకుని వచ్చింది. స్నుస్థిగ్ధ లావణ్యంతో ముందు మూట గట్టిన చిన్నారి పసిపాపను ఆత్రంతో అందుకుంది. పాపవైపు తదేకంగా చూస్తోందామె పోలికలు తల్లివి రాలేదు. పాపను పరీక్షగా చూస్తోంది.
    "అమ్మా-బావ ఫోటో ఇదిగో" అంటూ ఫోటో అందించింది కల్యాణి. మెడ్రాస్ లో పెళ్ళయినప్పటి ఫోటో అది.
    ఆమె అందుకోలేదు. ఫోటోమీద చేయివేసి లిప్తమాత్రంగా దానివంక చూచింది. తర్వాత కళ్ళు పాపమీదికి మళ్ళించింది. మంజు పరితపించి ముఖం త్రిప్పేసుకుంది... తన భర్తను గౌరవించ లేనివారు- తనకోసం వచ్చినా తన కానందంలేదు.
    పన్నెండు దాటింది. "కుమార్ ఎప్పుడోస్తాడమ్మా- చూచివెళ్తాను" ఏకవచన ప్రయోగం చేస్తున్న అత్తయ్యకేసి బాధగా చూచింది. తన తల్లి చూడదన్నమాట.....తనతల్లికి అంత అవసరంలేదు.....ఔను-ఎందుకుంటుంది. అతన్ని అల్లుడుగా గౌరవించి ప్రేమించగల్గేటంత విశాలహృదయం-ఆవశ్యకతా- అనురాగం - ఎక్కడనించి వస్తాయి?
    'ఇవ్వాళ బుధవారం - మర్చిపోయారా? రెండుగంటలకుగాని రారు!" తల్లి. "హమ్మయ్య" అని తేలికగా విశ్వసించటం కనిన మంజు హృదయం ఖేదితమైంది.
    "ఔనమ్మా - మర్చిపోయాను.....కళ్యాణిని రేపు రాత్రికి తీసుకుని వెళ్తామంటున్నారు. ఓ నెలపాటు వుంచుకుని పంపుతామంటున్నారు. నువ్వు అక్కడికి రాకూడదా మంజులా - పాపతో మాకు సందడిగా వుంటుంది...." నాకేం ఫరవాలేదు....అంతా సక్రమంగా జరుగుతోంది- మూర్తి అన్నయ్య చేత ఏవేవో పంపుతూనే వున్నారు మీరు.....మీరంతా మా క్షేమాన్ని కాంక్షిస్తూ అండగా నిలుస్తుంటే మాకే సమస్యలు ఎదురవ్వటం లేదు. ఇక్కడ నాకు ఏ లోటు లేదు.....మరేం అనుకోకండి.
    ఆమె బలవంతం చెయ్యలేదు. అంతాలేచి నుంచున్నారు. "ఓమారు ఇంటికి రండమ్మా అబ్బాయినిచూచి నెలరోజులకు పైగా అయింది.
    మీ మామగారూ అదే మాటన్నారు. కాస్త చూపించుకోవాలట...
    "అదేం అబ్బాయున్నాడుగా!" తల్లి అంది.
    ఆమె స్వచ్చంగా నవ్వింది" మూర్తి మాటేనా? ఏమో -వాడంటే వారికి నమ్మకం లేదు ..... కుమార్ పై మంచి గురి -విశ్వాసం. ఓ మాటు ముగ్గురు రండి అక్కడే భోజనంచేసి వద్డురుగాని......వస్తాను తల్లీ" అని చిన్న పాపకు కూడా చెప్పి బయలుదేరింది.
    తల్లి మౌనంగా యిదంతా చూస్తోంది, తప్పు చేసిన దానిలా బాధపడ్తోంది ఐనా తనలో ఏముంది. తను భర్తచాటు మనిషి. ఆయన యిష్టానుసారంగా ప్రవర్తింపవలసిన వంతు తనది.... "ఐతే కుమార్ ను చూడకుండా ఎందుకెల్తున్నావు?" అంతరాత్మ ఘోషిస్తోంది.
    ఆఖరుసారిగా మంజును కౌగలించుకుని నెమ్మదిగా తల నిమురుతూ అంది.
    "మీ ఆయన్ని చూడకుండా వెళ్తున్నానని ఏమీ అనుకోకు తల్లీ ఇంత ఆలస్యమైందని-ఇంతసేపు ఏం మాట్లాడారని మీ నాన్నగారు పీడిస్తారు.
    "మరేం ఫరవాలేదమ్మా.....నువ్వేం దిగులు పడకు. సంవ్యక్తమైన నన్ను ఒంటరిగా అనాధగా ఎవ్వరు ఒదిలిపెట్టలేదు....నువ్వు నిశ్చింతగా వెళ్ళు..... నాన్నను చూడాలని వుంటుంది..... కానీ..." మంజు కంఠం రుద్ధమైంది. పాపవైపు దృష్టి సారించింది.
    "అన్నయ్యలకి నిన్ను చూడాలని చాలా ఆశగా వుందమ్మా....వస్తారు."
    "అన్నయ్యలు - అన్నయ్యలు" ఎన్నాళ్ళకి వింటోందా మాటలు. వారంతా వెళ్ళిపోయారు. మంజు పాపకు పాలిస్తూ పడుకుంది.
    "అన్నయ్యలు -ఎక్కడున్నా రింతకాలం? ఇల్లు విడిచి వస్తూ - రాసేస్తే తనను ఆదుకున్న వారుకారు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రెండు సంవత్సరాలు చదివించవలసి వస్తుంది. బాధ్యత వహించవలసి వస్తుందని మౌనం దాల్చారు. తన జాబులకు కనీసం జవాబివ్వగల హృదయత. సంస్కారం లేక పోయిందివారికి. అన్నా చెల్లెండ్ర పవిత్ర బంధాన్ని కర్కశంగా ఖండించారు. వారిపై ఎంతో ఆశలు పెంచుకుంది- పేకమేడల్లా ఆ ఆశలు కూలిపోయాయి. ఎందుకొస్తున్నట్లు- ఏదో కారణముంది. ఈ నాల్గు సంవత్సరాలుగా తను చచ్చిందీ. బ్రతికిందీకూడా చూడనివాళ్ళకి తనపై ఇంత అకస్మాత్తుగా ప్రేమ గల్గిందంటే ఏదో విశేషముంది! ఆమె మనస్సు మనస్సులో లేదు. తల్లిని చూచిన సంతోషం అంతర్ధానమై పోయింది. ఏదో వెలితి శూన్యత- అసంతృప్తి.
    కుమార్ వచ్చేసరికి మంజులో మార్పులేదు. భార్య ముఖారవిందాం తేజోవిహీనంగా వుండటం గ్రహించి, "అలావున్నావేం మంజూ" అంటూ అనునయంగా పలుకరించాడు.
    మంజు భర్తరాక గమనించలేదు. అతని కంఠాన్ని విని లేచికూచుంది. "మూర్తిగారి తల్లి కోడళ్ళిద్దరూ, మా అమ్మ వచ్చివెళ్ళారు"
    "మీ అమ్మగారు-వచ్చారా?..."
    మంజు కళ్ళు వాల్చేసుకుంది, "ఆ....వచ్చారు టైంలేదని పన్నెండు వారకుండి వెళ్ళిపోయారు"
    సంతోషించవలసిన దానికి మారుగా. మంజు పరితపించటం చూస్తూ ఆశ్చర్యపోయాడు. అదె మాట అడిగాడు. తడిగావున్న కళ్ళతో మంజు లేచి భర్తకు దగ్గరగా వచ్చింది- అతను స్నానం చెయ్యలేదు- ఆపరేషన్ థియేటర్ నించి సరాసరి వచ్చాడు. అలవాటుగా కొద్ది దూరంలో నుంచుంది. కుమార్ ఇవతలికి జరిగి ఆమెవైపు పరీక్షగా చూచాడు. మంజు కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. "వచ్చింది...మన ముగ్గుర్నీ చూడకుండా- మా యిద్ధర్నే చూచి వెళ్ళింది.....నాకేమాత్రం సంతోషంగా లేదు. ఆమె రాక నన్ను...." మంజు మారు మాట్లాడలేకపోయింది.
    కుమార్ నివ్వెరపోయాడు. గబగబ స్నానాల గదిలోకి వెళ్ళి స్నానంచేసి ఇవతలి కొచ్చాడు.
    హితమైన మాటలు చెబుతూ భోంచేశాడు వక్కపొడి నోట్లోవేసుకుని- "ప్రమీల రాసింది. ఉత్తరం చూడు మంజూ ఆదుర్దాగా అందుకుని చదివింది.
    ".....నువ్వు కాన్పుకు ఇక్కడికి రాలేదు. నా కసంతృప్తిగానే వుంది....చెల్లెలు పుష్ప వివాహం నిశ్చయమైంది. అతను ఇన్ కమ్ టాక్సు ఆఫీసరు, అమ్మకు నాన్నకు మా యిరువురి వివాహాలు ఒకేసారి జరపాలని శత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడే ఒక ప్రైవేటు డాక్టర్ వున్నారు. మనకన్నా ఐదారుసంవత్సరాలు సీనియర్, ఏ విషయం రేపటికి తేలిపోతుంది..."
    ప్రమీల వివాహం కాబోతోందన్న వార్త కన్నా పుష్పను గూర్చిన శుభవార్త మంజు కెంతో సంతోషాన్ని కల్గించింది. ఆమె భవిష్యత్తు కళ్యాణ ప్రదమౌతుంది. తను చేసిన పని తప్పుకాదు! ఎన్నటికీ కాదు. భగవంతుడు తప్పక క్షమించగలడు.
    "ఇదిగో- ఇది చూడు" చిన్న ఇన్ స్యూర్డ్ పార్శిల్ ఆమె చేతిలో పెట్టాడు. మంజు విస్తుపోతూ అందుకుంది.
    బంగారు మురుగుల జత మామిడి పిందెల నెక్లెస్. ఓ చిన్న ఉంగరం వుందందులో. చిన్న చీటీ అడుగున వుంది.
    "చిరంజీవి- లావణ్యకు- ఆశీస్సులతో అమ్మమ్మ తాతయ్య" మంజు కన్నీటిచుక్కలు ఆ చీటీ పై, బడి అక్షరాన్ని కరిగించి వేశాయి. ఆ యిరువురొకరినొకరు చూచుకున్నారు. మంజు కళ్ళు ఏకధారగా స్రవిస్తున్నాయి.
    దగ్గరగా వెళ్ళి భర్త హృదయం పై తల ఆన్చింది. ఆమె తలను మృదువుగా స్పృశిస్తూ "లావణ్య- లావణ్య" పేరుబాగా లేదూ! రోజూ ఏంపేరు పెడదామా - అని బుర్రబ్రద్దలు కొట్టుకున్నాము. "చాలా బావుంది....లావణ్య."

                             *    *    *

    సినీమాహాలు క్రిక్కిరిసివుంది. జనం కిటకిట లాడుతున్నారు. సుప్రసిద్ధ సినిమానటి వనజాక్షి నాటకంలో నటించబోతోంది. వెండితెరపై ఆమె అందచంద లావణ్య విలాసాలను చూచిన ప్రేక్షకులు ఆమెను ముఖంత చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
    వనజ మామూలుగానే - స్వతహా అందగత్తె. పైపై మెరుగులు తళుకులు లేకుండానే ఆమె అందం ప్రేక్షకులను మైమరపింప జేస్తుంది. నాటకంలో ఆమె పాత్రపోషణను గమనించే స్థితిలో లేరు. ఆమె కంఠస్వరాన్ని. ప్రతి కదలికను, ముఖాన్నిచూస్తూ తన్మయులౌతున్న సమయంలో ఒక్కసారి ఏం జరిగిందో! ఎవ్వరికి తెలియదు. ప్రేక్షకుల ముందు తెర- వైరింగ్ సరంజామా- పగిలిన బల్బులు- సెట్టింగ్ చిందర వందరగా పడివుంది, ఏమైంది? ఏమైంది?
    "మహాశయులారాప- పెద్ద ఆపద సంఘటిల్లింది. శ్రీమతి వనజాక్షి గారికి గాయాలు తగిలినవి. మీ డబ్బు మీకు వాపసు ఇవ్వబడును. దయతో అందరూ ఓపికతో వేచివుండ ప్రార్ధన. హాలులో హాహా రావములు మింటి కెగస్తున్నాయి!
    అక్కడవున్న ఐదుగురికి బాగా గాయాలు తగిలాయి. దగ్గరలో వున్న నెహ్రూ హాస్పిటల్ కు తీసికొని వెళ్ళారు.
    అందరికన్నా వనజాక్షికి గాయాలు ఎక్కువగా తగిలాయి. ఇనుపచువ్వ చెవినించి చెక్కిలి మీదుగా గడ్డం వరకు గీచుకుపోయింది. దానితో పెదిమకు దెబ్బ తగిలింది.
    పెదిమ దగ్గరమాత్రం తప్పక కుట్లుపడాలి.
    కుట్లువేసి కట్టుకట్టి ఇవతలి కొచ్చేసరికి పదకొండు గంటలు దాటింది.
    ప్రఖ్యాత నటికి సంభవించిన ఆపదకు అందరు తల్లడిల్లిపోయారు. ఈమె తిరిగి నటించ కలదా? ఈ ఆపద ఆమె నటన నెంత వరకు అరికడుతుంది?- ఎంతవరకు అంద విహీనత కలుగ జేస్తుంది?- ప్రజలు ఏ విధంగా ఆదరించి అభిమానం చూపుతారు? ఒకవేళ ఆమె భవిష్యత్తు కూలిపోయి నాశనమైతే ఆమె తట్టుకోగలదా!
    ప్రతి ఒక్కరినీ ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. మంజు. కుమార్ లు కూడ చాలసేపటివరకు ఆమెను గూర్చి మాట్లాడుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS