Previous Page Next Page 
ఆరాధన పేజి 22


    నాల్గు సంవత్సరాల క్రితం మంజు ఆమెను మద్రాసులో చూచింది. అందుకుని మరీ ఇదిగా బాధపడింది.
    తెల్లవారింది సృష్ట్యాదినించి జరుగుతున్న సత్యమే జరిగింది. సూర్యోదయమైంది. లోకం మేలుకొంది. ప్రజలు దైవిక జీవితంలో మునిగి పోయారు. నిన్నటికి - ఇవ్వాళ్టికి ఎంత భేదం! ఒక్క నిమిషంలో ఆమె జీవితం నాశనమైంది. వనజ స్తబ్ధతతో - మానసికా వేదనతో కదలకుండా పడుకుని వుంది.
    తను డాక్టర్ గార్ని చూడాలి. వారితో ముఖా ముఖిగా మాట్లాడాలి. తన రూపం - ఎంతవరకు దెబ్బతిన్నదో తెలిసికోవాలి. ఏదో తేల్చుకుని దానికి తగినట్లు వ్యవహరించాలి.
    డాక్టర్ గార్ని చూడాలి అని రాసింది- కాగితం మీద.
    కుమార్ వచ్చిన తక్షణం ఆ మాట చెప్పింది. అతడు వెళ్ళాడు. ముఖం నిండా కట్టుతో, ఎంత వరకు గాయాలు తగిలాయోకూడా చెప్పలేనట్లుగా కళ్ళు ముక్కు మాత్రం అగుపిస్తున్నాయి. ఆ విధంగా ఆమెను చూచినవారు నిరాశావాదులౌతారంటే అతిశయోక్తికాదు!
    "ఈ గాయాలు నా నటనా వ్యాసంగానికి ఎంతవరకు అడ్డు నిలుస్తాయి? ఏదీ దాచకుండా సర్వం నాకు తెలియజేయమనవి."
    కుమార్ ఆ కాగితాన్ని చదివాడు. ఆమె ఎడమ చేయి ప్లాస్టర్ లో వుంది. ఆమె కళ్ళల్లోకి చూచాడు. ఎందరినో ముగ్ధుల్ని జేసిన ఆ విశాల నేత్ర ద్వయంలో బాధా వీచికలు ప్రతి ఫలిస్తున్నాయి. ఆమె బరువుగా-బాధగా మూలిగింది.
    ఆడవాళ్ళు స్వాస్థ్య కోసం హాస్పిటల్ లో ఉన్నా పరీక్ష కోసం వచ్చినా నర్సు ఎప్పుడు డాక్టర్ల వెంట వుంటుంది మగ డాక్టరైతే దీన్ని ఎక్కువ పాటిస్తారు. నర్సు అక్కడే నుంచుని వుంది.
    కుమార్ కుర్చీని దగ్గరగా లాక్కుని కూచున్నాడు.
    "మీకు తగిలిన గాయాలు త్వరలో మానిపోతాయి. ఎడమ చేతి ప్లాస్టర్ ఓ పక్షం రోజుల్లో తీసేస్తాము. మీ ఆరోగ్యం త్వరలో కుదుటబడుతుంది.....ఆగండి....శ్రమ పడవద్దు- అంతా చెబుతాను.... మీ చెక్కిలి మీద చాల స్పష్టంగా అగుపిస్తుంది-కానీ చకురుడైన మేకప్ మాన్ దాన్ని కప్పిపుచ్చగలడు. కురూపులనే అందగత్తెలుగా మారుస్తాడు - ఈ చిన్నలోటు మీకేం నష్టం కల్గదు.....పెదవి దగ్గర మాత్రం కుట్లు బాగా అగుపిస్తాయి....చూడండి ముఖంమీద ఏ శస్త్రచికిత్స చేయవలసివచ్చినా ఎంతో జాగ్రత్తగా చేస్తాము. ముఖంలో స్వాభావిక ముడుతల్లో చారల్లో కలసిపోయేట్లు కుట్లువేస్తాము....నుదుటి మీద అడ్డంగా - చెక్కిలిమీద నిలువుగా-ఇదంతా అందాన్ని పాడుచేయరాదనే...పెదిమ విషయంలో కూడా చాల శ్రద్ధవహించాము ఎంతో సుకుమారంగా కుట్టాము కానీ- ఆ అతుకు తెలుస్తుంది - అదికూడా మీ కడ్డురాదు -మేకప్ లో కప్పిపోతుంది. ఒకటిమాత్రం చెప్పలెను మీకు కట్లు విప్పాక మీ పెదవి ఆకారంలో మార్పు- నవ్వితే ఎలాపంపు తిరుగుతాయో - చిరునవ్వులో ఏ విధంగా వుంటాయో చెప్పలేము. క్లోజప్ షాట్స్ లో తెలియవచ్చు. ఏ ఫోజులో మీ ముఖం నవ్వు ఆకర్షణీయంగా వుంటాయో ఆ ఫోజును కనిపెడ్తారు ఫోటోగ్రాఫర్లు. కాబట్టి మీరు బాధ పడటం మానండి. బాగా "రిలాక్స్ ఐతే మీ ముఖంలోని కండరాలు, చర్మం సరిగా సర్దుకోగలవు మనసులో ఈ బాధ కుములుతుంటే మీ ముఖం దాన్ని ప్రతిఫలింపజేసి మా శ్రమ ఫలితం దక్కదు- మీకు చివరికి దుఃఖమే మిగుల్తుంది....ఒక విషయం చెబుతాను. మీరు మీ ముఖం విషయం ఆరాటపడ్తున్నారు. నేను పట్నంలో చదివే రోజుల్లో కలెక్టర్ గారి భార్యకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఈవెనింగ్ గౌన్ వేసుకున్నపుడు చర్మపుచార - కుట్టిన గుర్తులు అగుపించరాదని ముందే చెప్పింది. మా సర్జన్ ఎంతో నిపుణతతో వీపుమీద గుర్తుంచుకుని ఆపరేట్ చేశాడు. వెనుక "వి" ఆకారంలో గౌను వేసుకుంటే ఈ కుట్లు-కోసిన చార అగుపించకుండా చేశారు.... ఇలాంటి వాటన్నిటిలో శ్రద్ధ వహిస్తాము.....కూలిన గోడను కట్టమంటే రాళ్ళు, ఇటికలు చక్కగా అందంగా క్రమబద్ధంగా పేరుస్తారు గానీ ఇష్టప్రకారం అవకతవకగా ఎగుడు దిగుడుగా పేర్చి కట్టరుకదా...మీరు నిశ్చింతగా వుండండి అప్పుడే మా చికిత్స ఫలిస్తుంది."
    ఆమె అంతా విన్నది. కుమార్ మాటలు వూరట కల్గించాయి. ఆమె చూపుల్లో వ్యక్తమైన ఆశారేఖల్ని చూచి-లేచినుంచున్నాడు. ఆమె నమస్కరిస్తున్నట్లు తల లీలా మాత్రంగా వంచింది. నర్సుకు చెప్పవలసినది చెప్పి కుమార్ వెళ్ళిపోయాడు.
    ఆ రోజంతా హాస్పటల్ లో ఒకటే సందడి. జనం త్రోసుకుని రాకుండా కట్టుదిట్టాలు చేయ బడినై. రిపోర్టర్లు వచ్చి నిరాశతో వెళ్తున్నారు. గంటల ప్రకారం ఆమె ఆరోగ్యాన్ని గూర్చి పదే పదే అడిగేవారికి బులిటన్స్ వున్నాయి. సినీ పరిశ్రమలో వున్న వారందరికీ చేతులు కాళ్ళు ఆడటం లేదు. ఆమె పూర్తి చేయవలసిన సినిమాలు ఎన్నో వున్నాయి. ఎవరి దిగులు వారిది....అన్నింటికీ అతీతంగా డాక్టర్లు తమ దిన చర్యలో మునిగిపోయారు.

                           *    *    *

    "నేను రఫీకాను చేసుకోబోతున్నాను" ఖాన్ తన అందమైన ముఖాన్ని చేతిరుమాలుతో తుడుచుకుంటూ మంజు వాళ్ళింటి వరండాలో కుర్చీపై కూర్చున్నాడు.
    ప్రతి ఆదివారం కుమార్ ఇంటిదగ్గర అందరు కలవటం మామూలై పోయింది. మంజు కేక్ ముక్కలు, బంగాళాదుంప బజ్జీలు కాఫీ తయారు చేయించింది. సర్జన్ మాదప్ప బహూకరించిన పెరాంబ్యులేటర్ లో పాప పడుకుని వుంది. మంజు అన్నీ బల్లమీద పెట్టి- ఖాన్ వైపు చూచింది.
    "ఎన్నాళ్ళకెన్నాళ్ళకు- చివరికి ఆమె గెల్చింది.
    'ఔను ఈలాంటి విషయాల్లో ఆడవాళ్ళ విజయం- వారి ప్రభావంలేకపోతే పురుషులంతా ఇంటిపట్టు నుండ గల్గుతారా - నీతి నియమాలు లేకుండా సంచరించరూ- ఓ విధంగా స్త్రీకి - ఈ శక్తి భగవంతుడిచ్చాడంటే అది పురుషుల అభివృద్దికోసమే - స్త్రీ అనే గిరి గీసి పెట్టాడేమో అనిపిస్తుంది..."
    ఖాన్ అంత ఉత్సాహంగా లేడు. అతని మాటలు నిర్జీవంగా వున్నాయి. రెండు బజ్జీలను తినటానికికూడా ఆ వేళ అతను ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. కుమార్ మంజులలు పరస్పరం అర్ధవంతంగా చూచుకున్నారు.
    "పాపకు రేపు- వచ్చే ఆదివారంనాడు గుడిలో పేరు పెడ్తున్నాము. ఈ సందర్భంలో మన స్టాఫ్ కు మాత్రం టీ పార్టీ ఏర్పాటు చెయ్యాలి...
    ఖాన్ పాపకేసి తొంగి చూచాడు. ముచ్చటైన శబ్దాలు చేస్తూ చేతులను కాళ్ళను కదిలిస్తూ ఆడుకుంటోంది..... మనుష్యులను గుర్తిస్తోంది. పలుకరించగానే బోసినోటి నవ్వులు ఒలకబోసింది.    
    "ఐతే పాపను నీ వైపుకు త్రిప్పుకుంటున్నా వన్నమాట" ఖాన్ కనుబొమలెగరేసి "ఘటికుడవే" అన్నట్లు చూచాడు.
    "ఔను మరి పాపకు నా యింటిపేరొస్తుంది....రేపు. తల్లిని మంజువాళ్ళ వాళ్ళు ఎవరూ చేసి కోరు. అందుకని ముందునించీ నా వైపే మొగ్గు చూసేలా తయారుచెయ్యాలి..."
    
                             *    *    *

                   

    చెప్పటానికి మూడు వాక్యాలతో అయిపోయింది గాని, క్రితం రాత్రి భార్యా భర్తలు చాలసేపు చర్చించుకున్నారు.
    "నీ మతంలో వుంటేనేం - భగవంతుడున్నాడన్న జ్ఞానం వుండి ఎదిగితే చాలదూ-"
    "ఔను మంజూ-కాదనను. ఒకటి గుర్తుంచుకో. మీవాళ్ళెవరు పాపను తీసుకోరు. అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలా మధ్యలో పెరిగితే పాప నమ్మకాలు - భక్తి అచంచలమైనవిగా ఎలా వుంటాయి.
    ఒక మతంలో -దాని తాలూకు కర్మకాండలో - భక్తిశ్రద్ధలను పెంపొందించుకుని గట్టి పునాదులు వేసికోవాలంటే చిన్నప్పటినుంచి కృషి చేయాలి. ఆ వాతావరణం కల్పించాలి - వారి అనుమానాలను తీర్చాలి. వారి ప్రశ్నలకు సూటిగా జవాబు లివ్వాలి.....విగ్రహారాధన పనికిరాదమ్మా-అని నేను చెప్పి-విగ్రహారాధన ఫరవాలేదు తల్లీ- అని నువ్వు చెబితే పాప మధ్యలో ఎటూ తేల్చుకోలేక సతమతమై చివరికి నిస్పృహ చెందగలదు.
    "మీ జూనియర్, నా సీనియర్ మనో-ఉండేది. గుర్తులేదూ, వాళ్ళనాన్న బౌద్ధుడు- అమ్మ క్రిస్టియన్. సలోన్ లో అలాంటివి తరచు తటస్థపడుతుంటాయట. తల్లి తండ్రి ఇద్దరు వాళ్ళు పెద్ద వాళ్ళయ్యే వరకు ఏదీ వివరించలేదుట అటుబౌద్ధ విహారాలకు. ఇటు చర్చికి వెళ్తుండేవారుట....కాస్త పెద్దయి ప్రాజ్ఞులైన తరువాత వాళ్ళే-అంటే పిల్లలే మతాన్ని నిర్ణయించుకున్నారట. మనో- మెడ్రాస్ లో తరచు చర్చికి వెళ్తుండేది."
    "అలాగే మనంకూడా ఆ వయసు వచ్చేదాక వదిలేద్దామంటావా మంజూ -బాగానే వుంది...వివిధ జాతులు. వివిధ మతాలు సమ్మిళితమై నాగరికత జీవనప్రమాణం హెచ్చినదేశాల్లో పెళ్ళిళ్ళు పెద్ద సమస్య కాని దేశాల్లో ఇది సరిపోతుందేమో. మనకో సామెత వుండనేవుంది. గంతకు తగ్గ బొంత. అని ఉన్నత కుటుంబాల్లో - పాశ్చాత్య నాగరికతకు పుణి- పుచ్చుకున్న కుటుంబాలల్లో పెళ్ళిళ్ళు పెద్దసమస్యకాదు. తల్లి తండ్రి. మతాలే కాక జాతులు వేరైనప్పుడు కూడ పిల్లలకు సలక్షణమైన సంబంధాలు రావటం చూస్తున్నాము. కానీ మన సంగతి వేరు. మరొకమాట .... ఆ మనోసంగతి నీకు పూర్తిగా తెలిసినట్లు లేదు మంజూ. క్రిస్టియన్ గా చలామణి అయింది కదూ? మీ అందరికీ ఆ పిల్లగుడికి వెళ్తుంటే ఇక క్రిస్టియన్ అనే అనుకున్నారు. కాని కొలంబోలో ఒక హిందూ డాక్టర్ ని పెళ్ళిచేసికొంది, అంటే ఆమె నమ్మకాలు, నియమాలు, భక్తి ఎంత చంచలమైనవో తెలుస్తోంది. హాలివుడ్ తారలు భర్తలను మార్చి నంత సులభంగా మతాలను మార్చింది నేను ఏ మతాన్ని కించపరచటం లేదు ఏది మంచి, ఏది చెడు అని చర్చించటంలేదు కాని పాప భవిష్యత్తును మనం యిప్పటినించీ ఒక మార్గంలో ప్రవేశపెట్టాలి. ఆ భవితవ్యం కళ్యాణ పదమైనదిగా వుండగలదు.... నీకు నచ్చకపోతే నీ ఇష్టమే కానియ్.... నా వైపుగా నేను చెప్పుకున్నాను."
    మంజు మౌనం దాల్చింది. దీర్ఘాలోచనలో మునిగిపోయింది. ఎంతైనా కుమార్ అన్వయం నచ్చిందామెకు. ఔను తన సంతానాన్ని కోరి ఏ బ్రాహ్మణుడు రాడు ముందు చూపు లేకుండా తను నెగ్గాలని పట్టుబట్టటం మూర్ఖత్వమే అవుతుంది ఆమె ఉఖంలో నీలినీడలు తొలగిపోయాయి.
    "మీరు చెప్పినది సబబుగా వుంది. అలాగే కానివ్వండి. ఈ ఆదివారమే పేరు పెట్టించేద్దాం."
    కుమార్ ఎగిరి గంతువెయ్యలేదు మంజువిశాల హృదయాని కెంతో ఆనందించాడు.
    "నాకు తెలుసు- మీ సంసారంలో సమస్య లంటూ పొడసూపవని - వచ్చినా అతినేర్పుగా పరిష్కరిస్తారని. దీనికారణం మీ నిష్కళంక ప్రేమ, నాకు చాలా సంతోషం' ఖాన్ వారిద్దరి వైపు చూస్తూ అంతులేని ఆనందాన్ననుభవించాడు.
    మంజు ముఖం అత్యతానందాతిశయంచే ఎర్రబడింది.
    "పెళ్ళి ఎప్పుడు?- అదే కుమార్ ప్రశ్నించాడు.
    "వచ్చే మాసంలో అనుకుంటున్నారు."
    ఇద్దర్నీ ఓ ప్రశ్న పీడిస్తోంది. మంజు సాహసించి అడిగింది. "మరి మీ పెద్దతండ్రి మాటే మిటి? అక్కడనే వుండిపోతారా- లేక రఫీ కాను ఇక్కడికి తీసుకొస్తారా?"
    ఖాన్ ముఖం వాడిపోయింది: క్షుఖిత హృదయంతో ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు. ఏది చెప్పలేక బజ్జీలు రెండు నోట్లో వేసుకున్నాడు. గేటు తెరచుకొని మూర్తి వస్తున్నాడు. అతని ముఖం ఆనందంతో అలలారుతోంది. హుషారుగా వస్తూ కుర్చీలో కూచోకముందు-పాప నొకమరు పలుకరించి కూచుని- తనవంతు సాసర్ తీసుకుని అప్పుడు "హల్లో" అన్నాడు.
    "డాక్టర్ మూర్తిగారు ఆనందతరంగాలపై....
    కుమార్ మాటల కడ్డువేశాడు మూర్తి కాదూ మరి- లక్ష్మిరేపు వస్తోంది."
    "ఏమిటి మీ భార్య లక్ష్మే" మంజు విస్తుపోయింది.
    "ఔను....పెద్దవాళ్ళ పట్టింపులతో నా ప్రమేయంలేదు. నేను వస్తున్నాను" - అని రాసింది.
    "అడిగితే నొచ్చుకుంటావని అడగలేదు గాని- మూర్తీ ఎందువల్ల ఇన్నేళ్ళు పంపలేదంటావ్! పెద్దాళ్ళ పట్టింపులని మీకు తెలుసు- ఆ పట్టింపు లేమిటో? ఖాన్ ఉత్కంటతో ప్రశ్నించాడు చెప్పు కుంటే సిగ్గు కూడా. వాళ్ళు బాగా డబ్బుగలవాళ్ళు. నాకు థర్డియర్ లో వుండగా కదా పెళ్ళయింది? అప్పటినించి వారే చదివించారు. ఆమె వాళ్ళకు ఒక్కగా నొక్కకూతురు నేను పాసయి రాగానే వేరే కాపురం పెట్టమన్నారు. వాళ్ళ పిల్లలందరికీ చాకిరీ చేయవలసి వస్తుందట. ముచ్చట్లే తీరవట - కాలుమీద కాలేసుకుని కూర్చోలేదట-జల్సా గా తిరగలేదట...... పైన రెండేళ్ళు చదివించాం. హౌస్ సర్జన్ అప్పుడు ఇంతఖర్చు చేశామని లెక్కలురాసి పంపారు. దాంతో అమ్మ నాన్నకు కోపం వచ్చింది; పనిలో చేరగానే వారికి ప్రతి నెల డబ్బు పంపటం ప్రారంభించాము. వారు దాదాపు ఎనిమిదినెలలు ఖర్చు చేశారు. అంతా తీరిపోయింది. ఈ డబ్బు గొడవ తీరాక అమ్మ రాసింది లక్ష్మికి. డబ్బు వడ్డీతో సహా తీర్చామని - వాళ్ళనాన్న ఇక ఏ ఆంక్ష విధించడానికి వీల్లేదని తన కిష్టమైతే తనభర్త దగ్గరకు రావటానికి అభిలషిస్తే అమ్మవాళ్ళు ఆమెను కోడలిగా స్వీకరించి గౌరవించగలమని......ఏదో రాశారు.
    ఏడు సంవత్సరాలౌతుంది. భర్తదగ్గర కెళ్ళటానికి ఏ స్త్రీకి మాత్రం ఇష్టముండదు? ఇవ్వాళ రాసింది .... పాపం!"
    మూర్తీ-కళ్యాణి చెప్పగా విన్నాను-మీ స్వంత మేనమామటగా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS