Previous Page Next Page 
ఆరాధన పేజి 20

 

    వచ్చిన ఆ నలుగురూ ముగ్ధులై పోయారా మృదుత్వానికి. చంద్రం అంటే ఆ క్షణం లో ఎంతో ఏవగింపు కలిగింది అందరికీ. అతడు తలవంచుకుని పేకముక్కల్ని కలుపుతూ తనకు కలిగిన అవమాన భారాన్ని అణుచుకుంటున్నాడు.
    వో అరగంట లో కబురు వచ్చింది! 'వంట అయింది! లేవండి!' అంటూ.
    ఆరాత్రి ఆ గృహాన సందడి విందు చేసింది నలుగురి హృదయాలు ఆనందంతో నిండెట్లు.

                                *    *    *    *
    చంద్రం అదూతున్న నాటకం గురించి అంతా వివరంగా తెలుసుకున్నది శారద. నౌకరు జోగులు ద్వారా . ఆనాడు తీరికజేసుకుని వచ్చి అనూరాధ తో మాట్లాడుతూ కూర్చుంది.
    'ఊ! అయితే! మంచి పధకం అల్లుతున్నాడన్నమాట. అనూ! కొంతమంది చాలా చిత్రంగా ప్రవర్తించుతారు ఎదుటి వాళ్లకు లొంగి పోయినట్లు నటించి లొంగదీసు కుంటారు. తరువాత తమ నిజస్వరూపాన్ని 'విశ్వరూపం' లా ప్రదర్శించుతారు. చంద్రం అచ్చు అలాంటి మనిషే!' అన్నది శారద.
    'నిజమే! ఈ అనూరాధ ను ఎంతో సులభంగా మోసగించగల ననుకుంటూన్నాడాతను. కానీ అదృష్టం యింకా కలిసి రాలేదని బాధపడుతున్నాడక్కా! నాచుట్టూరా పద్మవ్యూహాన్ని అల్లి విలవిలా తన్నుకుంటుంటే వినోదం చూడమని పంపించారు రామనాధం గారు. కొడుకు సర్వవిధాల ప్రయత్నించుతున్నాడు. హరికృష్ణ గారు రాకముందే ఈ యింటి నుంచి నన్ను వెళ్ళగోడితే గానీ వాళ్ళ పధకం నెరవేరదు. అందుకే విశ్వ ప్రయత్నం చేయబడుతోందిపుడు.'
    శారద లోలోన నిట్టూర్చింది, హరికృష్ణ యింకా వస్తాడన్న నమ్మకం అనూరాధకు వున్నందుకు.
    'అనూ! వోమాట అడుగుతాను! అపార్ధం చేసికోవద్దు! ఈఅక్కయ్య నీ సుఖం కోసం అహర్ణిశలూ అలమటించుతుందని నీకు మరోసారి చెప్పనవసరం లేదని నాకు తెలుసు. హరికృష్ణ బావ తిరిగి మన కళ్ళ ముందు నిల్చుంటాడా?అని నా సందేహం .' అనూరాధ కనులలోకి చూస్తూ అన్నదామె.
    'నీ భయం నాకు తెలుసు అక్కా! ఒక మాట గుర్తుంచుకో! అయన వస్తారనే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఈ జీవితం ఆశా కుసుమాలతో అల్లిన అందాల మాల. ఆ మాలలో కొన్ని కుసుమాలు వాడిపోవచ్చు. రాలేపోవచ్చు. కానీ ఆశ చావదు. ఎంత అంధకారం లోనైనా ఆశాదీపం వెలుగు విరజిమ్ముతూనే వుంటుంది. ఆదీపం దారి చూపుతుందనే నా ప్రగడ విశ్వాసం!' అన్నదామె గంబీరంగా .
    ఆ పైన శారద మాట్లాడలేక పోయింది.
    'నీ ఆశ ఫలించాలనే దీవించుతున్నాను అనూ! వస్తాను మరి! సతీశ్ వచ్చి వుంటారీపాటికి!' సెలవు దీసికున్నదామె.
    ఆనాడు చంద్రం ఎక్కడికీ బయలుదేరలేదు. మద్రాసు చూడాలని వచ్చిన వాడు శాశ్వతంగా అక్కడే వుండేవాడిలా ప్రవర్తించుతున్నాడు. మాట వరుసకైనా 'వెళ్తాను' అని అనడమే లేదు.
    అనూరాధ లో కించిత్ ఆశ్చర్యం జనించింది , అతడు యింటి పట్టున వుండడం చూసి ఏదో బృహత్పధకం అల్లుతున్నాడని గ్రహించింది.
    మధ్యాహ్నం కాగానే అతడు అనూరాధ గది ముందర నిలబడి అన్నాడు--
    'లోపలికి రావచ్చునా?' అని.
    హరికృష్ణ తలపులతో వూగిపోతున్న అనూరాధా కా పిలుపు ఏమాత్రమూ సంతోషాన్ని కలిగించ లేదు.
    'ఆజ్ఞాపించడం అందరి యెడలా మంచిది కాదు చంద్రం గారూ! మరోకటి! ఆజ్ఞాపించబడడం కూడా అన్ని వేళలా అందంగా వుండదు. కొన్నిసార్లు మనిషిని కించ పరుస్తుందా అలవాటు.' అంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నది అనూరాధ.
    కత్తికి రెండు వైపులా పదును వుండడం చూసి నోరు మెదపలేక పోయాడా యువకుడు వెంటనే.
    'మీ మాటలు వింటుంటే నాకు చదువుకోవాలని బుద్ది పుడుతోందండి! ఇంటరు పాసయి మానివేశాను. బి.ఏ కు కట్టమంటారా? ఏ వ్యాపకమూ లేక విసిగిపోతున్నాను.' ఎదురుగా వున్న సోఫాలో కూర్చున్నాడతడు.
    'మనిషికి వయస్సు కొంచెం పెరిగిన తరువాత ఎదుటి వారి నుంచి సలహాలు ఆశించినట్లయితే ఆత్మవిశ్వాసం, కుంటు పడుతుంది.'
    చంద్రం నివ్వెర పోయాడా మృదువైన వ్యంగ్యోక్తికి.
    'నిజమే! నాన్నగారూ యిలాగే అటుంటారు ఎపుడూ. తెలుగు మీకు ఎంతో బాగా వచ్చుననుకుంటాను. కాస్త తెలియనిదేమైనా వున్నప్పుడు చెప్పించుకోమని నాన్న నిన్ననే వ్రాశారు.' పధకం అమలులోకి రాబోతోంది.
    'మీకు జోస్యం కూడా తెలుసుననుకుంటానె! కానీ జోస్యం నూటికి నూరు పాళ్ళూ నిజం గాదు చంద్రం గారూ! తెలుగులో నాకసలు చెప్పదగిన ప్రావీణ్యతే లేదు. అదీగాక ఒకరికి చెప్పేంత అనుభవం లేదింకా నాలో.'
    'అల్ రైట్! దీనికంతగా బాధపడవద్దు లెండి! అపుడపుడు 'చదువుకో' మని మాత్రం ఈ బద్దకస్తుడ్నీ హెచ్చరించు తూండండి! ఆ మాత్రం చాలు' వోడిపోయినా వెనుదిరగడం ఆ వ్యక్తీ జీవితంలో లేనట్లుంది.
    అనూరాధ కు నవ్వొచ్చింది అతని పట్టుదల చూడగానే.
    'బావకోసం వెదికించు తున్నారాండి?'
    అనూరాధ కనులెత్తి చూసింది. అతనిలో ఏ ఉద్దేశ్యం పరువులు పెడుతుందా అని. ఆ ప్రశ్న అభిమానంతో వేసినది గాదని, ఏదో దాగి వుందని గ్రహించ గలిగింది.
    'మీరే మనుకుంటున్నారు?'
    ఆ ప్రశ్న వస్తుందని అతడు ఊహించనే లేదు. కానీ జవాబులు ఎంత అర్ధరహితమైనవైనా సరే ఎల్లప్పుడు సిద్దం గానే వుంటాయి అతని హృదయ కుహరాన.
    'వెదికించు తున్నారనే అనుకుంటున్నాను. కానీ మీ శ్రమకు ఫలితం వుండదన్పించుతోంది.' లౌక్యం వంపులు తిరుగుతోందని కంఠనా.
    'అని మీ కెవరు చెప్పారు!'
    'మీకు కోపం వచ్చిందను కుంటాను. నా మనస్తత్వం చాలా వింతగా వుంటుంది. మనస్సులో దేన్నీ దాచుకోలేను అందుకే నేనంటే చాలామంది విసుక్కుంటారు. 'బ్రతకడం చేతగాని బడుద్దాయినిరా!' అంటారు నాన్నగారు కూడా!'
    అందంగా నవ్వాలని ప్రయత్నించాడతడు. కానీ అ నవ్వులోని అందం చూడకుండానే అన్నదామె--
    'అబద్దాలు ఆడడం రాదు -- అని చెబుతూనే నులువెల్లా అసత్యం అన్న నిషా తో నింపుకుంటున్నారు కొందరిపుడు. చూడండి! ఎంత మోసమో!'
    చంద్రం నిర్ఘాంత పోయాడు. ఆ మాట తనను గురించే విసరబడిందని గ్రహించాడు. కానీ వెంటనే తమాయించుకుని అన్నాడు --
    'ఈ చంద్రం మాత్రం ఆ కోవకు చెందడండోయ్!' నవ్వబోయాడతడు.
    'అని నేనన్నానా యిపుడు?'
    'మీరనులేదనుకొండి! మీరంటే వున్న గౌరవం తో వున్నమాట అన్నాను.' మరో ప్రశంస విసరబడింది.
    ఏ మలుపులో ఎంత చాకచక్యంగా ప్రశంసోక్తుల్ని రువ్వాలో అతనికి బాగా తెలుసునని గ్రహించింది అనూరాధ.
    'ప్రశంస మూలాన నష్టాలే ఎక్కువ!' అన్నందందుకే . సంభాషణ ఆకస్మీకంగా మరో వైపుకు తిరగడంతో వో క్షణం సేపు ఆగిపోవలసి వచ్చింది అతని వుపన్యాసధార.
    'కరెక్ట్! నా అభిప్రాయం కూడా అదేనండీ!'
    'ఆ అభిప్రాయం వున్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడ;లేరని విన్నానే!' ఆపైన మరో అక్షరం కూడా పెదవి దాటి బయటికే రాలేదు. పనుందంటూ లేచి వెళ్లి పోయాడక్కడ నుంచి. ఆమె నోటి నుంచి మీరు మంచివారు, అన్న మాట రప్పించాలనీ, అతనెంత గానో ప్రయత్నించాడు. ఏదో విధంగా సంభాషణ లో దింపి తన అభిప్రాయాను గుణంగా ఆ త్యాగమయిని మలచాలని, తద్వారా తమ అడ్డును తొలగించాలని నిశ్చయించుకున్నాడతడు.
    కానీ అతని ఆ ఉద్దేశ్యం సమూలంగా పెకలించబడుతోంది కొన్నిసార్లు . అయినా నిరుత్సాహ పడగూడదనుకున్నడా యువకుడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS