18
బెంగుళూరు నించి సరాసరి బెజవాడ రాకుండా మద్రాసు లో డిగాను. సారధిని చూడాలని నా ప్రాణం కూడా కొట్టుకులాడి పోతుంది. దిగిన వెంటనే హెలెన్ ఇచ్చిన అడ్రసు వెతుక్కుంటూ వెళ్లి, తేలికగానే సారధి ఇల్లు కనుక్కున్నాను.
మాంబళం లో సాధారణంగా అద్దెకు ఇల్లు దొరకటం కష్టం. అలాటిది సారధి ఇంటి ముందు 'టులెట్ బోర్డు ఉంది. అదొక విశాలమైన డాబా. తాళం వేసి ఉంది గేటుకి. లోపల ఎక్కడా జన సంచారం ఉన్నట్లు లేదు. ఆ ఇంటి ముందే ఎంతో సేపు నిలబడ్డాను. చివరికి ధైర్యం చేసి, ఎదురుగుండా ఉన్న ఇంట్లోకి వెళ్లి అడిగాను, "ఆ ఇంట్లో సారధి అని ఓ తెలుగు కుర్రాడు ఉండేవాడు. మీకు తెలుసా?' అని.
"అతను మీకు ఎమౌతాడు?" అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ ఇంటి ఆసామీ. పొట్టిగా సన్నగా బట్ట తలతో రిటైరైన చిన్న తరగతి గెజిటెడ్ ఆఫీసరు లా ఉన్నాడతను.
"అతను మా స్నేహితుడు" అని చెప్పాను.
తరవాత ఆ పెద్ద మనిషి నన్ను కూర్చో బెట్టి, ఆ ఇంటిని గురించి , సారధి ని గురించి చాలా సంగతులు చెప్పాడు. రిటైరైన ముసలి వాళ్లకి కబుర్లు చెప్పటానికి విసుగుండదు. వినేవాళ్ళు దొరకాలే గాని.
"ఆ ఇల్లు ఆరేళ్ళు గా పాడుబడి ఉంది. డానికి కారణం ఆ ఇంట్లో దయ్యాలు ప్రవేశించటమే. మొదట ఒక మొదలియారు ఆ ఇంట్లో ఉండేవాడు. నిజమెంతో, అబద్ద మెంతో మనకు తెలియదు గాని, అందరు చెప్పుకునే కధ ఏమిటంటే, ఆ మొదిలియారు దూరపు బంధువైన ఒక విధవావిడ , ఉన్న ఒకే ఒక కొడుకుతో పోట్లాడి, కోర్టుల కెక్కి, ఆస్తి అంతా తెగనమ్మి ఎనభై వేలకు పైగా మూట కట్టుకొని, ఈ మొదలియారు నీడన చేరింది. కృష్ణా, రామా అనుకుంటూ జీవిత శేషాన్ని గడుపు కుందామని. ఆ మొదిలియారు ఆ ముసలావిడ్ని పీక పిసికి చంపి, ఆ డబ్బంతా కాజేశాడు. ముసలిదాని శవాన్ని పెట్రోలు పోసి తగుల బెట్టి , బూడిద పాతి పెట్టాడు. దాంతో ఆ ముదుసలి దయ్యమై మొదలియారు కుటుంబాన్ని పట్టుకొంది. నెల కోకరు చొప్పున అతని పిల్లలు అయిదుగురూ చచ్చి పోయారు రోగం లేకుండానే. రాత్రి సుఖంగా పడుకునేవారు. తెల్లవారేసరికి గుడ్లు బయట కొచ్చి, చచ్చి పడి ఉండేవారు. చివరకు మొదిలియారు భార్య కూడా చచ్చిపోయింది. అప్పటికి గాని ఆ ఇంటిని వదిలి పోవాలని మొదిలియార్ కు తోచలేదు. త్యాగరాయ నగర్ లో మరో ఇల్లు అద్దెకు తీసుకుని కాలక్షేపం చేస్తున్నాడు. ఈ ఇల్లు అద్దె కివ్వాలని చూశాడు. తెలియని వాళ్ళు నలుగురు ముగ్గురు ఆ ఇంట్లో దిగటం, రెండు మూడు రోజులుండి , ఇచ్చిన అడ్వాన్సు వదులుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవటం జరిగింది. అక్కడికి ఎవరన్నా ఈ ఇంటి కోసం వచ్చినట్లు అలికిడి అయితే, నేను వాళ్ళని పిలిచి, కొరివి తో తల గోక్కోవద్దని హెచ్చరిస్తూ ఉండే వాణ్ణి. ఒకనాడు మీ సారధి గారు వచ్చారయ్యా" అంటూ ఓ తులం పొడుం ఒకే ఒక రంధ్రం లోకి ఎగపీల్చి , మళ్ళీ మొదలు పెట్టాడు చెప్పటం ఆ పెద్ద మనిషి.
"ఎందుకు ...నాయనా?" అన్నాను.
"ఇల్లు అద్దెకు కావాలి."
"నీకు పెళ్లయిందా ?' అన్నాను.
"లేదు" అన్నాడు.
"బ్రతకాలని ఉందా?"
"ఉంది."
"అయితే మరో ఇల్లు చూసుకో , బాబూ" అని ఆ ఇంటి సంగతి అంతా పూసగుచ్చినట్లు చెప్పాను. "మీవాడు మహా మొండి లా ఉన్నాడే?' అని ప్రశ్నించాడు బట్టతల సర్దుకుంటూ.
"చెప్పండి" అన్నాను.
"అలా అయితే ఈ ఇల్లే నాక్కావాలి అంటూ కూర్చున్నాడు! 'నీకు జీవితం మీద ఇంత చిన్న వయసులో విరక్తి ఎందుకు కలిగింది , బాబూ ' అన్నాను. 'నీ తండ్రి లాంటి వాణ్ణి. ఇవి చేతులు కావు అనుకో. ఆ ఇంట్లో దిగకు -- ' అని బ్రతిమి లాడాను , వింటేనా? 'ఈ ఇంటికి అద్దె ఎంతండీ ?' అన్నాడు."
"నీకు ఇల్లంతా ఎందుకయ్యా బ్రహ్మచారివి ?' అన్నాను.
"ఒక గది కి అద్దె ఎంత?' అన్నాడు.
"ఎవరైనా ఉండి దీపం పెట్టుకుంటామనాలి గాని , కళ్ళ కద్దుకుని ఇస్తాడు మొదలియారు" అని ఇంటి యజమాని అడ్రసు ఇచ్చాను. ఆ ఇంట్లో కొన్నాళ్ళు సురక్షితంగా ఉండి, ఇది దయ్యాల కొంప కాదని రుజువు చేస్తే నూట పదహార్లిచ్చి బట్టలు పెడతానని ఈ గడుగ్గాయి కి తాళం చేతులిచ్చి పంపాడు మొదలియారు. వాడు కిరాతకుడనుకో . పెళ్ళాం పోయిందా? పిల్లలంతా కట్ట కట్టుకు పోయారా? మళ్ళీ ఈ వృద్దాప్యంలో మలబారు నుంచి ఓ పదహారేళ్ళ రంభని కొనుక్కొచ్చి పెళ్లి చేసుకొని, వ్యాపారం మాని, డానికి కాపలా కాస్తూ చస్తున్నాడు."
రెండో రంధ్రం లో మరో అరతులం పైన పొడుం దట్టించి , "బాబూ, పొడుం అయిపొయింది. నీ దగ్గిర పోడుముందా?' అన్నాడు.
'నేను పీల్చనండీ" అన్నాను.
ఇహ నశ్యము రకములు, ఉపయోగములు అంటూ చెబుతున్న కధ ఆపి "బాబూ, నశ్యం పీలిస్తే దోషం కాదు. మహా మంచిది. పూర్వం వేదవ్యాసుల వారు భారతం చెబుతూ, కధ వేగం తగ్గినప్పుడల్లా మాంచి అంబాళ్ నస్యం లాటిది ఓ రెండు తులాలు దట్టించే వాడట. మెదడు పాదరసం లా పని చేస్తుందిలే. భారతం లో కొన్ని కొన్ని పద్యాలు న్నాయి చూశావూ! అవి అంత పట్టులో నడవటానికి కారణ మేమను కున్నావు? పొడుం పీల్చిన వెంటనే చెప్పినవి ఆ పద్యాలు. సస్యం లో గల మరో విలక్షణ మేమంటే........."
సస్యం మీద శ్రద్ధ లేక, "ఏమండీ, నస్యం సంగతి నే చాలా విన్నాను,సారధి సంగతి చెప్పండి" అన్నాను.
పెద్దమనిషి కి కొంచెం కోపం వచ్చింది. పనిమనిషి ని కేక వేసి, ఓ అరకప్పు ఒవల్టీన్ తెమ్మన్నాడు. ఫ్లాస్కు లో వేడి పాలు సిద్దంగా ఉన్నాయి. పనిమనిషి కలిపి తెచ్చింది. కాఫీ కోసం అప్పటికే నా ప్రాణం గిలగిలలాడుతుంది. ఒవల్టీన్ కప్పులో నించి వస్తున్న పోగాల్ని చూసి నా కళ్ళు కృతజ్ఞత తో చెమ్మగిల్లాయి.
పెద్దమనిషి ఒవల్టీన్ తాగుతూ, "చూడు, బాబూ. నేను గుమస్తాగా జేరి, తాసిల్దారు గా రిటైరయ్యాను. నా ముప్పై రెండేళ్ళ సర్వీసు లో ఎవరికీ ఓ అర కప్పు కాఫీ ఇవ్వలేదు. ఒకరి దగ్గిర తాగలేదు. ఎందుకో తెలుసా. ఒకరి కొకరు ఋణపడటం ఏమాత్రం మంచిది కాదని నా సిద్దాంతం" అన్నాడు.
"ఇక్కడ దగ్గిర లో కాఫీ హోట లుందా?" అన్నాను, కాఫీ కావాలని అడగలేక. కాఫీకీ,మద్యాని కి చుట్టరికముంది. ఈ రెంటి కోసం తేలికగా మానాభిమానాల్ని అమ్ముకోవాలని పిస్తుంది.

"ఓ మైలు వెళ్ళాలి. వెళ్లి రండి. నేనిక్కడే ఉంటాను' అంటూ కళ్ళ జోడు పెట్టుకొని పేపరు లో లీనమై పోయాడు ఆ రిటైర్డు తాసీల్దారు.
అటో రిక్షా కి రూపాయిన్నర చెల్లించి, బెడార్ధణా కాఫీ తాగి, తిరిగి తాసీల్దారు గారింటి దగ్గిరికి వచ్చాను.
సాదరంగా ఆహ్వానించాడు. పనిపిల్ల ఇల్లూడుస్తుంది. "చూశావా బాబూ" అన్నాడు పనిమనిషి కేసి చెయ్యెత్తి.
పనిమనిషి ని చూశాను. పాతికేళ్ళు ఉంటాయి. కొంచెం గంబీరంగా ఉంది మనిషి. ఉక్కు శరీరం లా ఉంది. వీర ఝాన్సీ తాలుకూ మనిషి. నల్ల చెక్కతో చెక్కినట్లు న్నాయి అవయవాలు.
"నా భార్య పోయి ఎంత కాలమయిందో తెలుసా?"
తెలిలియదన్నట్టు తల ఊపాను.
"పదేళ్ళ యింది. ఆ మొదలియారు లా నేనూ ఓ మలబారు పిల్లను తెచ్చి పెళ్లి చేసుకోలేక పోయానా, చెప్పు? ఆ మాటకి వస్తే నాలో ఉన్న చేవ అతనిలో ఎప్పుడో పోయింది. ఈ పనిమనిషి మహా మంచిదిలే. నెలకు పది రూపాయలిస్తాను మా ఆవిడ లేని లోటు లేకుండా, నా కన్నీ అమర్చి పెడుతుంది. నాకో లక్ష రూపాయల ఆస్తి ఉంది. పిల్లల్లేరు కనక, ఎవర్నన్నా పెంచు కుందామానుకుంటున్నాను. కాని పెంచుకున్న బిడ్డలు మన బిడ్డ లౌతారా చెప్పు? వీడు ఎప్పుడు కన్ను మూస్తాడా, ఈ ఆస్తి ఎప్పుడు కాజేయ గలమా అని చూస్తుంటారు. అంచేత ఓ పిల్లని పెళ్లి చేసుకుందామనే ఆలోచన కలిగింది. ఇప్పుడు కాదులే, ఓ సంవత్సరం క్రితం. అప్పుడు చాలా బావుండే వాణ్ణి. అయిందా? ఒక బ్రోకరు ఒక పిల్లను తెచ్చాడు. పదహారేళ్ళు ఉంటాయి. బాగానే ఉంది. నాకు నచ్చింది. కాని ఒక షరతు పెట్టాను. "ఓ సంవత్సరం పిల్లను నా ఇంట్లో ఉంచు కుంటాను. ఈ ఏడాది కూడూ గుడ్డ లోటు లేకుండా సమస్త సౌకర్యాలు కల్పిస్తాను. ఈ సంవత్సరం లో ఆ పిల్ల మంచిదని నా కనిపిస్తే, దాని ప్రవర్తన సరిగ్గా ఉంటె, పెళ్లి చేసుకుంటాను' అని చెప్పాను. బ్రోకరు అప్పటికే నా దగ్గిర ఓ వెయ్యి రూపాయల దాకా తిని ఉండటం వల్ల ఒప్పుకున్నాడు. సరే, ఓ మంచి రోజున పిల్ల మా యింటికి వచ్చిందయ్యా . పిల్ల పేరు వైదేహి. తెలుగు పిల్లే. రాజమండ్రి దగ్గిర ఓ పల్లెటూరట. వాళ్ళ ఊరిలో టూరింగు సినిమాలు పెట్టారుట. సినిమా చూసి సినిమాలో జేరాలని నిశ్చయించు కొని, ఓ నాటు డాక్టర్ని వెంట బెట్టుకొని మద్రాసు వచ్చి వాలిందట. ఆడదాన్ని చూస్తె వదిలి ఊరుకునేదేవరు చెప్పండి. అలాటి ఆపద లోంచి మా బ్రోకరు ఆ వైదేహి ని రక్షించి మా ఇంట్లో పెట్టాడు. వెయ్యి పోతేనేం ? రసగుల్లా లాంటి పిల్ల నట్టింట తిరుగుతుంది గదా, రోజూ ఆ ముఖం చూసినా చాలు గదా అని సంతోషించాను. మనిషి మాంచి వయసులో ఉందేమో నవనవ లాడుతూ మహా నవళం గా ఉండేది లే. పాపం, చింకిరి జుట్టుతో, చినిగిన బట్టలతో వచ్చింది మా ఇంటికి. వారం రోజులు వరసగా తలంట్లు పోయించి, రెండు డజన్ల చీరలు కొని తెచ్చాను వైదేహి కి. రతీ దేవిలా తయారయింది. ఏమైనా పెళ్లి చేసుకోవాలను కున్నాను. ఈ ఇంటిని, నా ఆస్తిని డానికి అప్పజెప్పాలను కున్నాను. కాని...కాని...ఇంతలో ఏం జరిగిందనుకున్నావ్?" అంటూ సూటిగా ఘాటుగా ప్రశ్న వేశాడు రిటైరైన తాసీల్దారు గారు.
ఏం జరిగిందో నాకు తెలుసు. "ఏమయిందో చెప్పండీ" అన్నాను.
"ఆ చీరలు కట్టుకొని, ఆ నగలు పెట్టుకొని దివాణం లాంటి ఈ ఇంట్లో తిరగవచ్చా. ఎప్పుడూ వీధిలో నుంచోడం, దోవా పోయేవాళ్ళని చూసి ఇకిలించటం సకిలించటం మొదలు పెట్టింది. ఇంతలో మీవాడు జేరాడు ఎదురుగుండా ఆ మొదలియారు ఇంట్లో . ఎన్నాళ్ళ నించి కధ సాగు తున్నదో నాకు తెలియదు గాని, ఒకనాడు సారధి గదిలోంచి రావటం చూశాను. ఇంత కృత ఘ్నురాలితో జీవించటం మహా నేరమనుకున్నాను. కోపంతో నా ఒళ్ళు మండిపోయింది. ఇంటికి రాగానే బెల్టు పెట్టి ఒక్క టంటించాను. దీందుంప తెగ, అది ఆడది కాదయ్యా, బెల్టు నా చేతి లో నించి లాక్కొని, నోటికి వచ్చినట్లు తిట్టి, గొడ్డును బాదినట్లు బాదిందయ్యా నన్ను. 'ఛీ, నా ఇంట్లోంచి వెళ్ళిపో" అని అరిచాను. ఆ దెబ్బతో కాళ్ళ మీద పడు తుందనుకున్నాను. కాని, వెంటనే పెట్టె సర్దుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందనుకున్నావ్?"
"ఎక్కడికి వెళ్ళింది?"
"మీ సారధి గదికి. ఆ దయ్యాల కొంప లోకి. అసలదీ దయ్యమే కనక, డానికి భయమే ముందిలే?"
"ఆ తరవాత ఏమయింది?'
"ఏమౌతుంది? ఇద్దరూ కాపిరం పెట్టారు. తెల్లవార్లూ ఒకటే కిచకిచలు నవ్వులు-- నిద్రపోయే వాళ్ళు కాదనుకో. ఏం అలంకరించు కునేదీ! దీనమ్మా కడుపు బంగారం గానూ, దయ్య మైనా, ఏం దర్జా! ఏం ఠీవి! సినిమా స్టారు చాలదనుకో! మరెందుకో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు ఇచ్చారు గాని హీరోయిన్ని చేయలా. ఏమైతే నేం? నాకు దక్కకుండా పోయింది. మరో సంగతి. మా ఇంట్లో ఇన్నాళ్ళు ఉందా, శ్రీరామ చంద్ర ప్రభో యజ్ఞోపవీతం సాక్షిగా చెబుతున్నాను అంటుకోలేదనుకో ఎంత చచ్చినా నీతి గల వాళ్ళం కాదుటయ్యా? ఎప్పుడూ ఇంట్లో మూతి ముడుచుకు కూర్చొనేది. అయిదవ కుండా స్నానం చేసి, నేకొన్న నైలాన్ చీర కట్టుకొని, నే కొన్న నగలు పెట్టుకొని, నే కొన్న పౌడరు రాసుకొని నేకొన్న సెంటు పూసుకొని, ఎవరి కేసి చూసో నవ్వుతుండేది. నా సొమ్మంతా తిన్న మనిషి, నాకేసి చూసి నవ్వవలసిన బాధ్యత ఉందంటావా లేదా?" అని అడిగాడు బట్టతల రుద్దుకుంటూ.
"ఉందండీ."
"అబ్బా! ఆయాసంగా ఉంది. ఏమేవ్, కాస్త మజ్జిగ తే" అని పని మనిషి కై కేక పెట్టాడు. ఆ రిటైరైన తాసిల్దారు గారు.
