11
పగలంతా కాసిన ఎండ పడమటి దిక్కుకి వెళ్ళిపోయి అదృశ్యమై పోయింది. ఆవార్త చెవిన పడగానే చల్లటి గాలిని చంక పెట్టుకుని వచ్చింది సాయంత్రం. హైదరాబాద్ నగరం వాతావరణం లో వున్న సుగుణం కారే వొళ్ళు, మంట లేత్తించే వడగాల్పులు వియవు నడి వేసవి లోనైనా.
పరీక్షలు సంతృప్తిగా వ్రాసి వచ్చిన సుమిత్ర తీరికగా కూర్చుని కల్యాణి కి కుముదిని కీ, వారణాసి లో తనకి కలిగిన అనుభవాలు వివరిస్తున్నది. గదిలో లైటు వేసి వాళ్లకి షర్బత్ కలిపి తీసుకు వచ్చి తనూ కూర్చుంది సావిత్రి.
'నేను వెళ్ళిన తరువాత సావిత్రి కి కాస్త హుషారు వచ్చినట్లుంది. అంత నీరసంగా కనపడడం లేదు' అన్నది సుమిత్ర.
'అవును-- మా చెల్లాయిలు సావిత్రిని ఒక్క క్షణం వూరుకొనిచ్చారా! వెంట బెట్టుకుని ఊరంతా త్రిప్పారు. సినిమాలకి, తీసుకెళ్ళారు-- అంతేకాదు-- సికింద్రాబాద్ లో ఒక పెద్ద బట్టల షాపులో సేల్స్ గరల్ ఉద్యోగం సంపాదించింది మీ సావిత్రి!' అన్నది కుముదిని--
'సేల్స్ జాబ్ అంటే పగలంతా కాళ్ళు నెప్పులు పుట్టేటట్లు నిలబడాలి. నువ్వు చెయ్యలేవు సావిత్రి ఆ వుద్యోగం!' అన్నది సుమిత్ర.
'నాకు కొంచెం ఓపికగానే వుంది. అయినా ఇంకా పదిహేను రోజులు టైం వుంది చేరడానికి ఈలోపల టానిక్కులు త్రాగి బలుస్తాను -' నవ్వింది సావిత్రి.
'సంతోషం సగం బలం -' అన్నది కల్యాణి--
'విమలత్త వ్రాసిన ఉత్తరం చదివావు కాదు- ఎల్లుండి వస్తుందట!' అన్నది సావిత్రి.
'అవును-- అసలే నేను అప్పుల్లో వున్నాను-- అమ్మగారి జైత్ర యాత్రకి ఏం తట్టుకుంటానో!
'అందుకే ఇంగ్లీషు వాళ్ళ ల్లాగ నిర్మొహమాటంగా వ్రాసేయ్యాలి-- ఇప్పుడు నేను కొంచెం ఇబ్బందిలో వున్నాను తర్వాత రమ్మని --' అన్నది కుముదిని--
'ఇలాంటి విషయాల్లో మనవాళ్ళ కి అర్ధం చేసుకునే శక్తి వుండదు కుముదినీ-- వాళ్ళ యిష్ట మున్నప్పుడు రావడం వాళ్ళ జన్మ హక్కై నట్లు భావిస్తారు మన బంధువులు-- మనం ఎంత ఇబ్బందిలో వున్నా వాళ్లకి జరిపే మర్యాదలన్నీ జరిపి పంపాల్సిందే లేకపోతె నడి వీధిలోకి లాగుతారు మన పరువునీ-- మన మధ్యతరగతి కుటుంబాల ఆర్ధిక పతననైకు ముఖ్య కారణం ఇదే-' అన్నది కల్యాణి.
'బంధువులు రాకూడదని కాదు-- కానీ వాళ్ళ రాక మనమీద అనురాగం తో మనని చూడాలనే వాత్సల్యంతో అయితే ఫరవాలేదు-- మనమిక్కడ ఎంత సుఖ పడుతున్నామో చూసి ఓ నేల రోజులు మనకి టాక్స్ వేసి పోదామనుకునే మనస్తత్వం వున్న చుట్టాలంటే నాకు చాలా కోపం' అన్నది సుమిత్ర.
అలా అంటున్నప్పుడు తను రెండు రోజుల క్రితం చిన్నన్నయ్య కి వ్రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. వేసవి సెలవులకి రమ్మని అర్ధిస్తూ వ్రాసిన ఉత్తరం అది. వాళ్ళని రమ్మని వ్రాయడం, విమల వస్తుంటే విసుక్కోడం న్యాయమేనా? అని తనలో తనే ప్రశ్నించుకుంది సుమిత్ర. తను ఇందాక చెప్పిన మాట వాటికి సరైన జవాబు. కృష్ణుడి ని తను వాచీ కొనుక్కోనివ్వ నందుకు విమలక్క కి కోపం వచ్చి ఘాటుగా ఉత్తరం వ్రాసింది. సంవత్సరం తను వాడిని ఇంట్లో వుంచుకుని , కాలేజీ ఫీజులు కట్టి పుస్తకాలు కొనిచ్చినా, విమలక్క కి సంతోషం లేకపోయింది. అందరి దగ్గరా సహాయం పొందడం దాని జన్మ హక్కను కుంటుంది కాబోలు!
'రేపు జాయినవు తారా డ్యూటీ లో--' అనడిగింది కల్యాణి.
'కాక తప్పుతుందా!' అన్నది సుమిత్ర. ఆమె బెనారస్ నుంచీ వచ్చి నాలుగు రోజులైంది.
వచ్చిన రోజునే కుముదిని వచ్చింది . ఇవ్వాళ కల్యాణీ వచ్చింది.
కానీ బసవరాజు మాత్రం కన్పించలేదు--
'అతను ఆఫీసుకు వస్తే తను తిరిగి వచ్చిన సంగతి తెలియకుండా వుండదు. అతని సంగతి కల్యాణి ని అడగాలని పించలేదు --
ప్రక్క గదిలో స్టూడెంట్స్ సెలవులకి వెడుతున్నారు కాబోలు . వాకిట్లో రిక్షాలు ఆగాయి.
'వాళ్ళ దగ్గర తాళం చెవులు అడిగి తీసుకో చిన్నత్తా! బాబాయి వాళ్ళూ, విమలత్తా వస్తే ఈ ఒక్క గదీ చాలదుగా!' అన్నది సావిత్రి.
'అవునవును-- ' అంటూ లేచి వెళ్ళింది సుమిత్ర.
'పెళ్ళీ గిళ్ళీ లేదు గానీ అలివి మాలిన సంసారం ఈదుతోంది వెర్రిది!' అన్నది కుముదిని.
'నేనింక వెడతాను ఎనిమిది కావచ్చింది-' అని కల్యాణి లేచింది.
'నేనూ వస్తాను పడండి' అని హ్యాండ్ బ్యాగ్ లో నుంచి కవరోకటి తీసి డ్రాయర్ మీద పడేసి వెళ్ళిపోయింది కుముదిని. ఆమె వెళ్ళాక ఆ కవరు విప్పి చూసింది సావిత్రి.
అందులో కొన్ని పది రూపాయల కాగితాలూ, చిన్నచీటీ వున్నాయి. 'చుట్టాలోస్తూన్నారని తెలిసింది. ఈ డబ్బు నీ దగ్గర వుంచు-- వీలున్నప్పుడు తీర్చవచ్చు. తిప్పి పంపితే మన ఇద్దరికీ ఇక స్నేహం వుండదు' అని వుంది చీటిలో.
'ఇంతమంచి స్నేహితురాలు దొరకడం ఎంత అదృష్టం!' అనుకుంది సావిత్రి , ఆ కవరు సుమిత్ర చేతికిచ్చి.
'వీళ్ళందరి ఋణం ఎప్పటికి తీర్చుకుంటానో!' అనుకుంది సుమిత్ర.
భోజనానికి రమ్మని పిలిచింది సావిత్రి.
'నీకు ఆకలేస్తోందా!' అనడిగింది సుమిత్ర. బసవరాజు తనకోసం వచ్చే టైం యిదే. అతను ఇవ్వాళ అయినా రాకపోతాడా అనే ఆశ పీకుతున్నది మనస్సులో.
'ఆకలిగానే వుంది -- దా చిన్నత్తా ఇద్దరం తినేద్దాం --' అంటూనే కంచాలు పెట్టింది సావిత్రి.
'పది నిముషాలు చూడనివ్వు సావిత్రీ-- ఇవాళ బసవరాజు గారు వస్తారేమో!' అనేసింది సుమిత్ర.
సావిత్రీ ఇంకేమీ అనలేదు-- మ్యాగజైన్ ఏదో తీసుకుని చదువుకోడం మొదలు పెట్టింది.
ఎనిమిదిన్నర కి వచ్చాడు బసవరాజు . అతనిలో మునుపు వున్న ఉత్సాహం చాలా వరకు తగ్గింది. ఏదో తీవ్రమైన ఆలోచన చెలరేగు తున్నట్లు వుంది అతని ముఖం.
'మా కుటుంబంలో చాలా గొడవ లోచ్చాయి సుమిత్రా ! అందుకని రాలేకపోయాను-- మీరు ఆఫీసుకు వస్తారుగా -- తీరిగ్గా ఎప్పుడైనా మాట్లాడుకుందాం! అనేసి వెళ్ళిపోయాడు.

అతని కోసం తెచ్చిన రస గుల్లాల మామిడికాయ షేపులో వుండే ఇత్తడి యాష్ ట్రే , అతని కివ్వనే లేదు--
రెండు రోజుల కల్లా కొడుకునూ, పెద్ద కూతుర్నీ తీసుకుని రానే వచ్చింది విమల. తాటాకు బుట్టెడు మామిడి పళ్ళూ, కమ్మ సున్నీ, వడియాలు, అప్పదాలూ అవకాయా, చెల్లెలి కోసం తెచ్చింది.
'హైద్రాబాద్ చూడాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటాను. ఇప్పటికి పడింది' అని బోలెడు సంతోషం ప్రకటించింది. పిల్లలందర్నీ భర్త దగ్గర వదిలి, పెద్ద కూతుర్ని ఎందుకు తీసుకు వచ్చిందో అర్ధం కాలేదు సుమిత్ర కి.
చెల్లెల్ని ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసింది.
'ఇదింకా ఇక్కడే వున్నదేం! వచ్చిన పనైందిగా -- వెళ్ళమనక పోయావా?' అన్నది మేనకోడల్ని వుద్దేశించి.
'దాన్నేమీ అనకు-- అడసలె వెర్రి బాగుల్ది. మనస్సు కష్ట పెట్టుకుంటుంది - మనకందరికీ మల్లేనే అదీ నాకు బంధువే -- ' అన్నది సుమిత్ర.
'మంచికి చెబితే వినవు -- దీని మూలంగా నీ పరువు పోతుందని ఆలోచించవు-'
'ఇతరుల మూలంగా పోయే పరువు నా కక్కర్లేదు విమలక్కా-- పడ్డ వాళ్ళని వీలైతే లేవదీయాలి కానీ ప్రక్క నుంచీ పోతూ ఓ రాయి విసిరి నవ్వి వెళ్ళడం నాకసహ్యం.'
'చదువు కున్నదానివి! స్వతంత్రురాలివి! నిన్ననే ధైర్యం ఎవరి కుంది-- ఏదో పెద్దదాన్ని కనుక చెప్పబోయాను--' అని సర్దుకుంది విమల.
తల్లినీ, చెల్లెల్నీ దిగబెట్టి మర్నాడే వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి ఏదో పని వుందని.
మరో నాలుగయిదు రోజుల్లో రఘుపతీ, రాదా వస్తున్నారనీ విమలకి చెప్పలేదు సుమిత్ర. అనవసరం అనుకుంది. విమల వచ్చిన రెండు రోజుల వరకూ ఊపిరి సలపలేదు సుమిత్రకి.
'పెద్దదాన్ని పెద్దదాన్ని అని ఇన్నిసార్లు అంటావు గానీ, నేను పదిగంటల కల్లా ఆఫీసుకి వెళ్ళాలి కదా! కాస్త వంట చేసి పెట్ట కూడదూ-- ఇందు వదిన నన్ను కాఫీ కూడా కలపనిచ్చేది కాదు--' అని నెమ్మదిగా విమలని వంటలో యిరికించేసింది సుమిత్ర. అప్పటికి కొంచెం ఊపిరి వచ్చింది ఆమెకి.
రెండు మూడు రోజులనుంచీ ఆఫీసు నుంచీ చాలా త్వరగా ఇంటికి వస్తున్నది తను. ఇవ్వాళ అయినా బసవరాజుతో మాట్లాడాలి అనుకుంది ఆరోజు సుమిత్ర. మరునాడే చిన్నన్నయ్య వాళ్ళు వచ్చే రోజు. తరువాత అసలు తీరదు--
'ఎప్పుడు చూసినా బిజీగా వుంటారు-- కాస్సేపు అల్లా రాకూడదూ . పబ్లిక్ గార్డెన్స్ కి-- అన్నాడు బసవరాజు సాయంత్రం.
'నేనూ అదే అనుకుంటున్నాను-- పడండి ' అన్నది సుమిత్ర.
ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతున్నారు ఫైళ్ళు మూసివేసి. తను చూడవలసిన పని గబగబా పూర్తీ చేసేసి బయటపడింది సుమిత్ర.
'ఈ వేసవి లో నాకు పెళ్లి చేసి తీరాలని అమ్మ పట్టుబట్టింది--' అన్నాడు బసవరాజు లాన్ లో కూర్చుని సంభాషణ కి నాందిగా. వులిక్కిపడింది సుమిత్ర.
'అల్లాగే ...కంగ్రాచ్యు లేషన్స్ ' అన్నది తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో.
'అలా తేలిగ్గా కొట్టి పారేసే సమస్య కాదిది. నేను మీతో చాలా సీరియస్ గా మాట్లాడాలని వచ్చాను -- మీ వివేకం పట్ల, సంస్కారం మీదా అపారమైన గౌరవం కలవాణ్ణి నేను-'
'చెప్పండి బసవరాజు !' అన్నది సుమిత్ర తల వంచుకునిచిన్న చిన్న గడ్డిపరకలు పీకుతూ.
'నేను చెప్పే విషయం మీరు వూహించ లేరా! సరే! డైరెక్ట్ గానే అడుగుతాను-- నన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం మీకు లేదా!' అన్నాడు బసవరాజు. ఆ ఉద్దేశ్యం అమెకి లేకపోలేదు. కానీ అతనంత సూటిగా అడిగే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక పోయింది. ఎర్రబడి పోయిన ముఖాన్ని ఎత్తలేక అల్లాగే కూర్చుంది.
'చెప్పండి -- ' కొంచెం దగ్గరగా జరిగి ఆమె చెయ్యి పట్టుకున్నాడు బసవరాజు. సుమిత్ర ఏమీ అనలేదు. అతని చేతుల్లో నుంచీ తన చేయి వెనక్కి తీసుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఎప్పుడూ ఆ వెచ్చని చేతిలోనే తన చెయ్యి వుంటే ఎంత బావుండు నూ అని లోలోపల అనుకుంది.
రెండు నిముషాలు మౌనంగా దోర్లిపోయాక 'మా కుటుంబ పరిస్థితులు మీకు తెలియనివి కావు-- బాగా ఆలోచించుకొండి- పైగా మీ శాఖ వేరు-- మా శాఖ వేరు -- ఈ పట్టింపు లన్నీ మీ అమ్మగారికి వున్నాయని నాకు తెలుసు. ఇన్నాళ్ళు కష్టాలూ, సుఖాలూ, బాధలూ , సంతోషాలూ అన్నీ వొంటరిగా అనుభవించడం అలవాటయి పోయింది. ఇక మీద కూడా డానికి సిద్దంగానే వున్నాను-- నాకోసం మీరు త్యాగాలను కునేవేవీ చెయ్యకండి బసవరాజూ! దాంపత్య జీవనం కలతలతో ప్రారంభం కాకూడదు!' అన్నది సుమిత్ర అతని వంక సూటిగా చూసి.
