Previous Page
బ్రతుకు బాట పేజి 22


    'ఇదంతా నాకు తెలుసు సుమిత్రా! అమ్మకి నేనొక్కడ్నే కొడుకును కాను-- నా మీద కోపం వస్తే అన్నయ్యల దగ్గరుంటుంది. అసలు ఆవిడకి ఎక్కడా వుండాల్సిన పని లేదు. మా వూళ్ళో లంకంత ఇల్లు బంగారం పండే భూమీ వున్నాయి. వాటిల్లో నాకు భాగం రాదని నాన్న బెదిరిస్తారు-- రాకపోనివ్వండి. నాకీ ఉద్యోగం చాలు. కొంచెం కష్టపడి పరీక్షలకి చదువుకుంటే ఇంకా మెరుగైన ఉద్యోగం రావచ్చు-- ఆస్తులు లేని వాళ్ళెంత మంది బ్రతకడం లేదు? తన తమ్ముడు కూతురు రేణుకని పెళ్లి చేసుకోడం లేదని అమ్మకి కోపం! మా వసంత కి కూడా రేణు కంటేనే యిష్టం -- చాలా కట్నంతో వస్తుందని! అది మీ విషయం అప్పుడే రేణుకకి వ్రాసేసింది ! ఇదుగో రేణుక జవాబు చదవండి'
    ఉత్తరం విప్పింది సుమిత్ర.
    'బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోమని నిన్ను కోరను -- నీ యిష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకో రాజుబావా! నా కిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మంచి మార్కులొస్తే డాక్టర్ కోర్సు చదవాలనుంది. చెబితే వినరు అమ్మా నాన్నా-- నువ్వైనా వాళ్లకి చెప్పి చూడు.....'
    'బావుంది -- ఇంకేం ఈ ఉత్తరం చూపకపోయారా మీ వాళ్లకి!' అన్నది .
    'చూపాను -- నేనే రేణుకకి ఏదో నూరి పోశానని మా అమ్మ వాదన --
    అమ్మా, నాన్నగారూ పెద్దన్నయ్యా వసంత వీళ్ళంతా ఒక పక్షం -- నావైపు పలికేది చిన్నన్నయ్యా, పెద్ద వదినా ఇద్దరే  వాళ్ళ వాదనకి ఇంట్లో బలం లేదు--' అన్నాడు బసవరాజు.
    'ఉమ్మడి కుటుంబంలో యిలాంటి సమస్యల పరిష్కారం చాలా కష్టం -- ఇప్పుడు తెలియక పోయినా సావిత్రి సంగతి కానీ, మా చిన్నన్నయ్యా వర్ణాంతర వివాహం సంగతి కానీ మీ వాళ్లకి తెలియకుండా పోవు ఉత్తరోత్రా! అప్పుడు వాళ్ళు చేసే హేళన నీ, అనే మాటలనీ, భరించడం చాలా కష్టం- నేనేదైనా జవాబు చెపితే సహించే శక్తి మీకుండాలి!' అన్నది సుమిత్ర , ధైర్యంగా.
    'ఇది ఉమ్మడి కుటుంబం కాదు సుమిత్రా! అమ్మకి గాస్ట్రిక్ ట్రబుల్ వున్నది. అందుకని ఏడాది నుంచీ ఇక్కడ వుండి ట్రీట్ మెంటు తీసుకుంటున్నది. అమ్మ కోసం నాన్నగారు వచ్చి వుంటు వుంటారు-- వాళ్ళని బట్టి బంధువులూ వస్తుంటారు-- అమ్మ ఇంక వెళ్ళిపోతానంటున్నది-- నన్ను కూడా సెలవు పెట్టి వచ్చి పెళ్లి చేసుకు పొమ్మని బలవంతం చేస్తున్నది-- వాళ్ళు నిన్ను ఏమీ అనే పరిస్థితి నేను రానివ్వను-- మీకు జరిగే అవమానం నాకు మాత్రం అవమానం కాదా!'
    'మీ ఇష్టం బసవరజూ! కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్ను కునేటంత మూర్కురాలిని కాదు' అన్నది సుమిత్ర చివరికి.
    'మా వాళ్ళంతా అక్కడికి వెడుతున్నారు. అక్కడ మీటింగు లు పెట్టి , శుభలేఖలు కూడా అచ్చు వేయించగల సమర్ధులు. మనం ఈలోగానే పెళ్లి చేసుకుని వాళ్ళ కా చాన్స్ లేకుండా చెయ్యాలి.'
    'బావుందండీ! మీకంతా తొందరే. ఇంటి దగ్గర బంధువు లున్నారు. రేపు మా చిన్నయ్యోస్తున్నాడు. నేనిక వెడతాను' అని లేచింది సుమిత్ర.
    'ఐస్ క్రీం తిని వెళ్ళండి దేవీ!'
    ఆ పిలుపులో క్రొత్తదనానికి చలించింది సుమిత్ర.
    ఆ ప్రయత్నంగా తల వంచుకుని, 'పదండి' అన్నది.
    రిక్షా పిలిచి ఎక్కి కూర్చున్నాడతను. సుమిత్ర కూడా ఎక్కింది.
    రిక్షా ఆగింది. హోటల్ దగ్గర కాదు నగల షాపు దగ్గర.
    ముత్యం వేసిన ఉంగరం కొని, 'తీసుకో! సుమిత్రా! ఇంతకన్న నగలెం పెట్టలేను ప్రస్తుతానికి!' అన్నాడు బసవరాజు.
    హోటల్ లో ఐస్ క్రీం కి బిల్లు యిచ్చి
    'సారీ బసవరాజూ ఇదే నేనివ్వగల కట్నం ' అని పకపక నవ్వేసింది సుమిత్ర.

                          *    *    *    *
    'నాకన్నా వారం రోజులు ముందుగానే చేసుకుంటున్నావే పెళ్లి' అన్నది కుముదిని. సుమిత్ర బుగ్గ మీద కాటుక చుక్క పెట్టి, అక్కడున్న వాళ్ళంతా సుమిత్ర తరపు బంధువులే. బసవరాజు చిన్నన్నయ్యా, యింకేవరో స్నేహితులు వచ్చారు.
    'మా పెళ్లి ఇల్లాగే జరిగింది. అయన తరపున ఒక్క బంధువూ రాలేదు. నేను చాలా బాధపడ్డాను ఆరోజున!' అన్నది రాధ.
    'మీరంతా ఒకే రకం మనుష్యులు -- పెద్దలు నలుగురు చేరి తలా నాలుగక్షతలూ వేసి దీవిస్తే గాని పెళ్లి జయప్రదం కాదు . పెద్ద వాళ్ళ ఆచారాలు ఊరికే వచ్చాయా? నా మటుకు నాకు ఈ పెళ్లి ఏమీ నచ్చలేదు' అన్నది విమల.
    నిర్మొహమాటంగా ఆవిడ ఆమాట యిప్పటికి చాలాసార్లే అన్నది.
    'మీకు నచ్చడంతో ఏం పని లెండి-- రాసి పెట్టి వుంటే జరక్క మానుతుందా!' అని వెక్కిరించింది కల్యాణి.
    'ఆ అమ్మాయికి మనం పెళ్లి చెయ్యలేక పోయాం. తన జీవితాన్ని తనే తీర్చి దిద్దు కుంటున్నది. తనే పెళ్లి చేసుకుంటున్నది అందుకు మనం హర్షించాలి. అంతే కానీ వ్యాఖ్యానాలు చెయ్యకూడదు వదినా!' అన్నది ఇందుమతి.
    'హైస్కూల్ విడిచి పెట్టాక చదువుకి స్వస్తి చెప్పి, పెళ్లి సంబంధాలు కుదరక కట్నాలు యిచ్చుకోలేక ఎంతో మంది అడ పిల్లలు ఇంట్లో మగ్గి పోతున్నారు మన తెలుగు దేశంలో! ఆరోజు ధైర్యం చేసి సుమిత్ర కాలేజీ లో చేరకపోతే దాని పనీ అలాగే అయ్యేది. ఈనాటి కది వృద్ది లోకి వచ్చిందని నాకెంతో సంతోషంగా వుంది.' అన్నాడు మధవరావు- అక్కడున్న వాళ్ళంతా తలో రకంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
    "పెళ్ళయ్యాక కూడా ఆవిడ చేత ఉద్యోగం చేయిస్తారా?' అన్నాడొక స్నేహితుడు. బసవరాజు ప్రక్కన చేరి.
    'ఇప్పుడు నేను చేయిస్తున్నానా ?' అన్నాడు బసవరాజు పెద్దగా నవ్వి.
    స్నేహితుడు దెబ్బతిన్నట్లు చూసి, 'అది కాదు రాజుగారూ! పెళ్ళయ్యాక కూడా ఆవిడ ఉద్యోగం చేస్తారా?' అన్నాడు.
    'అది ఆవిడ యిష్టం -- ఆవిడనే అడగండి --'
    'మీ భార్యను గురించి మీకేమీ కోరికలు లేవా? ఆవిడ ఫలానా విధంగా వుండాలని!'
    'నేనేం అలాంటి ఆలోచనలు యింకా చెయ్యలేదు-- ఆవిడ ఫలానా విధంగా వుండాలని నాకెందు కుంటుంది! తను ఫలానా విధంగా వుండాలని ఆవిడ కుంటుంది గానీ!' పెంకిగా అన్నాడు బసవరాజు , కొంచెం దూరంలో కూర్చున్న కల్యాణీ. సావిత్రీ పమిటేల చాటు కుండా నవ్వుకున్నారు.
    పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. మాధవరావూ, ఇందుమతీ పీటల మీద కూర్చుని శాస్త్రోక్తంగా జరిపించారు.
    తలంబ్రాలూ చదివింపు లూ కూడా అయ్యేవరకూ బసవరాజు వైపు బంధువులేవరైనా వస్తారేమోనని ఎదురు చూసింది. వాళ్ళు రాలేదు కానీ బ్యాంకు ఏజెంటు గారూ అయన భార్యా వచ్చారు--
    'నా తరపు పెళ్లి పెద్దలు మీరే!  అంటూ వాళ్ళకి నమ్మస్కరించాడు బసవరాజు. అప్పటి వరకూ ఏదో లోటుగా అనిపించిందతనికి. వాళ్ళ రాకతో ఆ లోటు తీరినట్లు భావించాడు.
    సాయంత్రం వరకూ వుండి వెళ్లి పోయింది కుముదిని. కల్యాణీ, ఆమె భర్తా కూడా వెళ్ళారు.
    'అమ్మా వాళ్ళంతా వెళ్ళారు కదా! నా ఇల్లు కొంచెం పెద్దదే! ముందు అక్కడికి పోదాం-- గృహ ప్రవేశానికి' అని సజెస్ట్ చేశాడు బసవరాజు.
    పెళ్లి వారంతా బాలాజీ భవన్ ఖాళీ చేసి బసవరాజు ఇంటికి వెళ్ళారు.
    'మీ ఇల్లు కూడా మీ మనస్సు లాగే చక్కగా వుంచు కున్నారు బసవరాజూ! మీరు నాకు చాలా నచ్చారు. మా ఎత్తు ధనం పోసినా మీలాంటి వరుడిని మేము సుమిత్ర కి తేగలిగేవాళ్ళం కాదు-- మా అమ్మకి పుట్టిన వాళ్ళంతా చాలా అదృష్ట వంతులు. ఇందు వదిన అనుకూల వతియైన గృహిణి -- మా రాధ నా పాలిటి దేవత. ఇక మీరో మా చెల్లాయి చేసుకున్న పుణ్యానికి ప్రతిరూపం' అన్నాడు రఘుపతి.
    బసవరాజు ఇల్లు శుభ్రంగా చక్కగా సర్ది పెట్టి వున్నది. వంటగది, మరొక గది వరండా వున్నాయి.
    వరండా లో గార్డెన్ చైర్స్ వున్నాయి. లోపల గదిలో మంచాలు రెండూ, పుస్తకాల కోక బీరువా, బట్టల కోక బీరువా వున్నాయి. గోడలకి చక్కని పెయింటింగ్స్ , కిటికీల్లో, క్రోటన్ మొక్కల కుండీలు వున్నాయి.
    'బ్రహ్మచారి మరిది గారికి అన్నీ వున్నాయే!' అన్నది విమల.
    'అవును-- మొన్నటి దాకా అమ్మ వుండి వెళ్ళింది' అన్నాడు బసవరాజు.
    ఇందుమతీ, సావిత్రీ, వంట మనిషీ కలిసి విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. రాధ పిల్లలకీ ముస్తాబు చేసి సుమిత్ర ప్రక్కనే కూర్చున్నది. విమల అజ్ఞా ప్రకారం ఆమెకి వంట గదిలో ప్రవేశం లేదు. విమల కూడా అక్కడే కూర్చుని కూతురికి జడ వేస్తున్నది.
    'అవునే అమ్మాయీ, ఇక నువ్వు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినట్లేనా?' అన్నది వున్నట్లుండి.
    'ఎందుకివ్వాలి ?' అన్నది సుమిత్ర.
    'పెళ్లయింది కనుక! మొగుడికి మంచి ఉద్యోగమూ, ఆస్తీ వున్నాయి కనుక!' అన్నది విమల.
    'అందుకని రాజీనామా యివ్వాలని రూలేక్కడా లేదే!' అన్నది సుమిత్ర. రాధ నవ్వింది.
    'రూల్స్ గీల్సూ నాకేం తెలుసూ!' అని మూతి విరిచింది విమల.
    'ఇప్పట్లో ఉద్యోగం మానె ఆలోచన లేదక్కయ్యా! చదువు కూడా ఇంకో ఏడాది వుంది-- తరువాత ఇంకొంత మంచి ఉద్యోగం -- కొంచెం తీరిక దొరికే ఉద్యోగం వస్తుంది.' అన్నది సుమిత్ర.
    విమల మరేమీ అనలేదు.
    బసవరాజు, రఘుపతీ బజారు కి వెళ్ళారు.  మాధవరావు వరండాలో కూర్చుని పత్రిక చదువు కుంటున్నాడు.
    'అయితే మరి కృష్ణుడి ని నీ దగ్గరే వుంచు కుంటావా! దీన్ని కూడా నీ దగ్గర దించాలని తీసుకొచ్చాను-- రేపు నేను వెళ్ళాలి కదా!' అన్నది విమల , ఇక దాచి ప్రయోజనం లేదన్నట్లు.
    సుమిత్రతో పాటు రాధ కూడా ఆశ్చర్య పడింది.
    'కృష్ణుడి ని హాస్టల్ లో వుంచవచ్చు --  మీ పరిస్థితి ఇప్పుడు బాగానే వుందిగా ! అమ్మడు ఇక్కడెందుకు విమలక్కా? నీ దగ్గరే వుంచుకో! దాని కేటూ చదువు రాదు. పైగా నా దగ్గర సావిత్రి ఉంటుందాయే! దాన్ని చూసి యిది చెడి పోవచ్చు. ఈ బాదర బందీలన్నీ నాకెందుకు తగిలిస్తావ్! నేను ఇన్నాళ్ళ సుమిత్ర ను కాదు. ఇప్పుడు బసవరాజు గారి భార్యను. నాతొ పాటు వీళ్ళందర్నీ వుంచుకుంటానని అయన నాకేం ఎగ్రిమెంట్ వ్రాసివ్వలేదు.' అన్నది సుమిత్ర మొండీగా.
    తెల్లబోయింది విమల. తన కూతుర్ని ఎలాగో సుమిత్ర దగ్గర వుంచి మెట్రిక్ ప్యాస్ చేయించాలని కొండంత ఆశతో వచ్చింది.
    అయినా, సుమిత్ర కిలా పెళ్లవుతుందనీ, ఇంత సూటీగా మాట్టాడుతుందనీ తనకేం తెలుసు!
    'అమ్మడును నా దగ్గరుంచుకుంటాను పంపండి వదిన గారూ!' అన్నది రాధ ధైర్యం చేసి.
    ఆ ఆహ్వానికి విమల బదులు చెప్పలేదు. డానికి కారణం లేకపోలేదు. వీళ్ళంతా కాలానుగుణంగా నడిచి జీవితాలను సుఖప్రదం చేసుకుంటున్నాను. చొరవగా ముందుకు వెడుతున్నారు. తను మాత్రం తన ఆలోచనల్లా గానే వెనక బడిపోయింది. కులం వేరైతే మాత్రం రాధ వలన తనకేం నష్టం జరిగిందని ఆమె పైన ద్వేషం!
    'మాట్లాడవేం అక్కా! అమ్మడుని విశాఖపట్నం పంపు-- రాధ వదిన దీన్ని బాగా దారిలో పెట్టి మెట్రిక్ ప్యాస్ చేయిస్తుంది--' అన్నది సుమిత్ర. విమల ఆలోచనలో పడిపోయింది. రాధ మంచితనంలో ఆమెకి అనుమానం లేదు. తన భర్త యిందుకు వొప్పుకోడనే చింతా లేదు.
    అక్కడ విశ్వం వున్నాడు. వాడు పెద్ద చదువు చదువు తున్నాడు. మంచి ఉద్యోగం వస్తుంది. అమ్మడు అందంలో తీసి పోయినదెం కాదు. అమ్మడును చూసి విశ్వం యిష్టపడితే దాని అదృష్టం పండుతుంది. ఈ విషయంలో తను మాధవన్నయ్య ను అడిగే అవసరం తప్పుతుంది.
    'ఇదే బాగుందమ్మాయ్ రాధా! తీసుకు వెళ్ళు. మీరంతా నన్ను వెలివేయకండి-- నేనూ మీలో మనిషినే?' అనేసింది విమల.
    'మిమ్మల్ని మేం వెలివేసిందెప్పుడూ లేదు వదిన గారూ! మీకు మీరే వెలి వేసుకుని చుట్టూ గిరి గీసుకున్నారు. ఈ నాటికీ ఆ గిరి దాటి బయటికి రాగలిగారు. అదే సంతోషం. ఆలోచనల కీ, ఆప్యాయతలకీ అనురాగానికీ కూడా పరిధులు నిర్మించుకుని వాటిమేరకి కుంచింప జేసుకుంటే బ్రతుకు బాట అంతా కంటకావ్రతమే అవుతుంది-- హృదయాన్ని కాస్త విశాలం చేసుకుని మెదడు కి పదును పెట్టుకోగలిగితే పూల బాట అవుతుంది. అంతా మన చేతిలోనే వుంది--' అన్నది రాధ, చంటి పిల్ల తలలో పూలు తురిమి.

                            (అయిపొయింది)   


 Previous Page

WRITERS
PUBLICATIONS