'ఎల్లుండి సాయంత్రం వస్తారా స్టేషన్ కి!' అన్నది సుమిత్ర.
'రాకుండా వుంటానా! మళ్ళీ చాలా రోజుల దాకా కనిపించరు!'
'అన్నయ్య ఇవ్వాళ నాకు మంచి కాశ్మీర్ సిల్కు చీరే కొంటానని ప్రామిస్ చేశాడు. ఇప్పుడిలా హోటల్ కి లాక్కు వచ్చి చాలా టైం అయిందని ఇంటికి దారి తీస్తాడు-- వొట్టి మోసం --' అంది వసంత బుంగమూతి పెట్టి. వాళ్ళిద్దరి సంభాషణ ఆవిడకి నచ్చలేదు.
'పాపం! నా మూలంగా మీ అవకాశం పోయింది కాబోలు!' అన్నది సుమిత్ర. వసంత కళ్ళల్లో కి కవ్వింపుగా చూసి.
'అదేం కుదరదండోయ్! ఎవరి మూలంగా నూ నా అవకాశాలు నేను పోగొట్టు కొను-- ఇప్పుడు మిమ్మల్ని కూడా తీసుకు పోయి మీ చేత చీరే సెలక్ట్ చేయిస్తాను' అన్నది వసంత బెదరకుండా.
'నీ సంగతి ఆవిడ కింకా తెలీదులే!' అన్నాడు బసవరాజు.
'అవును ఆవిడ సంగతి మాత్రం నాకేం తెలుసూ!' అంటూ కాఫీ కప్పులో మరింత పంచదార వేసుకుంది వసంత.
ఆమె గడుసుదనాన్ని చూసి నవ్వుకుంది సుమిత్ర.
వెయిటర్ తెచ్చిన బిల్లు కాగితం మీద, తన పర్సు లో నుంచీ డబ్బు తీసి పెట్టింది . సుమిత్ర.
'ఇందాకేమో ఆప్టరాల్ గుమస్తా నన్నారు-- ఇప్పుడు మాకు బిల్లు చెల్లిస్తున్నారా?' అన్నది వసంత.
పుస్తకమంతా వెడల్పున్న తన హ్యాండ్ బ్యాగ్ ని పదిలంగా భుజానికి తగిలించుకుంటూ.
'అసలు కాఫీకి రమ్మని పిలిచింది నువ్వు. న్యాయంగా ఆ బిల్లు నువ్వు యివ్వాలి -- ' అన్నాడు బసవరాజు.
'బావుంది -- ఇది మీ వూరు -- ఇక్కడ బిల్లులు నేనివ్వడం మీకే అవమానం -- బొంబాయికి రండి -- అక్కడ నేనిస్తాను --' అంది వసంత బయటికి దారి తీస్తూ.
'ఇవ్వాళ ఆవిడ నా గెస్ట్ -- అన్నది సుమిత్ర.
'మరే! మీరు టిఫిను పెట్టించండి . అన్నయ్య చీరే కొనిస్తాడు. రేప్పొద్దున రైలేక్కుతాను--' అన్నది వసంత.
బయటికి వచ్చాక, 'ఇంక నేను వెడతాను బసవరాజు గారూ!' అన్నది సుమిత్ర.
'నాకు చీరే సెలెక్టు చేసి పెట్టరూ?' వసంత.
'సారీ! వసంతా! నేను ప్రొఫెసర్ యింటికి వెళ్ళాలి-- తరువాత ఇంటి దగ్గర బోలెడు పనుంది. చీరెలు నాకన్నా మీరే బాగా సెలెక్ట్ చేసుకోగలరు -- అదీకాక నేనెప్పుడూ కాశ్మీర్ సిల్కు చీరెలు కొని ఎరుగను --' అని, రిక్షా పిలిచింది సుమిత్ర.
'సరే వెళ్ళండి -- పాపం--' అన్నది వసంత.
తన పర్సనాలిటీ , ఏ మాత్రం ఆమె దృష్టికి అనలేదని తెలుసుకున్న సుమిత్ర నవ్వుకుంది! ఎంత చిత్రమైన మనుష్యులుంటారు లోకంలో! ఆలోచనల్లో, ప్రవర్తనలో మనిషికీ, మనిషికీ మధ్య వుండే వైరుద్యానికి కారణం ఏమిటో అర్ధం కాదు-- తమ వివాహ ప్రస్తావనంటూ ఒకటి ఆ యింట్లో తల ఎత్తితే అందుకు వ్యతిరేకంగా ఓటు చేసేది ముందు వసంతే ననుకుంది సుమిత్ర.
వివాహం అనేది తనకోక తియ్యని కల. ఏకాంతంగా, ప్రశాంతంగా , తీరికగా కూర్చునే అవకాశం అంటూ దొరికితే ఆ కలను కళ్ళ ముందు చూసుకుని మత్తుగా పది నిముషాలు దొర్లించి, గుప్తంగా ఎదలో దాచుకోడం తనకి అలవాటు. అక్కడ నుంచీ లేచాక మళ్ళీ ఆ కల గుర్తు రాదు.
వైవిధ్యం లేని తన యాంత్రిక జీవన మార్గంలో , ఏదైనా ఒక శుభదినాన అతనితో ఒక అరగంట మాట్లాడే అవకాశం దొరికితే , ఎంతో ఉత్సాహం వచ్చినట్లు వుంటుంది.
అతని మైత్రి తనకొక మధుర భావన. పూల పరిమళాన్ని మోసుకొచ్చే మలయ మారుత వీచిక.
ఈ మాధుర్యం తన జీవితం నుంచీ అదృశ్య మవుతుందనే వూహను తను భరించలేక పోతోంది.
దూరంగా వుందాలను కుంటూనే అతనికి మరింత చేరువై పోయింది తను! గుండెలో అలజడి రేగింది.
'అలా వున్నావేం సుమిత్రా!' అని ఆప్యాయంగా పలకరించి, ఫ్రిజ్ లో నుంచీ అరేంజ్ జ్యూస్ తీసిచ్చారు ప్రొఫెసర్ కరుణాకరం.
'ఇంతకూ ముందే కాఫీ తీసుకున్నాను-- అయినా అలసటగా వుంది. ఎగ్జామ్స్ ఎలా చేస్తానో నని చాలా బెంగగా వుంది సార్!' అన్నది సుమిత్ర తెచ్చి పెట్టుకున్న నవ్వుతో.
'మరేం ఫరవాలేదమ్మా-- ఇంకా పది రోజులు టైం వుందిగా-- అక్కడ నా ఫ్రెండ్ సుందర రాజన్ నీకు సహాయం చేస్తాడు. బాగా ప్రిపేర్ కావచ్చు ' అంటూ ఆయనకి ఉత్తరం వ్రాసిచ్చారు కరుణాకరం. అక్కడి నుంచీ బయటికి వస్తుంటే పుట్టెడు దుఃఖం వచ్చింది సుమిత్రకి. మనస్సులో నైరాశ్యం నిండింది.
బాస్కెట్ లోని వస్తువులూ, ప్రొఫెసర్ గారి సిఫార్సు లూ అన్నీ దూరంగా విసిరి పారేసి ఎక్కడికైనా పారిపోవాలని పించింది. మరుక్షణం తన వూహ కి తనకే నవ్వొచ్చింది సుమిత్రకి.
తన జీవితం అంతా గాలివాటుగానే సాగింది. ఇప్పుడూ అంతే! లేనిపోని ఆశల హర్మ్యాలు నిర్మించుకుని, అవ్వి కూలిపోయినప్పుడు శిధిలాలను చూసి విలపించడం వెర్రితనం కాకేమిటి!
'ఇప్పుడు ఎం.ఏ ప్యాసయి ఉద్యోగంలో మార్పు తెచ్చుకోడం ఒక్కటే తనకి ధ్యేయం !' అనుకుంటే బరువెక్కిన హృదయం మళ్ళీ తేలికైంది.
'చాలాసేపటికి వచ్చావు చిన్నత్తా! నీకోసం కుముదక్క వచ్చి వెళ్ళింది! ఈ నోట్సులు యివ్వమంది. బెనారస్ నుంచీ తెల్లపట్టు చీరే తెమ్మని డబ్బు కూడా యిచ్చింది. రేపు బెంగుళూరు నుంచీ వాళ్ళక్క వస్తుందట. ఆమెకోసం -- అంటూ చేతిలో బరువు అందుకుంది సావిత్రి.
అలసటగా కుర్చీకి చేరబడింది సుమిత్ర.
* * * *
'హల్లో' అంటూ లోపలికి వచ్చాడు బసవరాజు. అప్పుడు ఎనిమిది గంటలైంది.
'రండి -- కూర్చోండి ' అని నీరసంగా ఆహ్వానించింది సుమిత్ర.
'ఇంతసేపూ చీరెల బేరం తెగింది కాదు -- ఎవరికో ఒకరికి టాక్స్ వేయందే డానికి తోచదు -- ' ముఖం తుడుచుకుంటూ అన్నాడు అతను.
సుమిత్ర చిన్నగా నవ్వి వూరుకుంది.
'మీరు చాలా చిక్కిపోయారు. ఇవ్వాళ మరీ నీరసంగా కనపడుతున్నారు -- ఎక్కువ సేపు చదవడం వొంటికి మంచిది కాదు' స్నేహం కురిసే కంఠం అతనిది.
'నేను ప్యాసవడం మీకు బొత్తిగా యిష్టం లేనట్లుంది--'
'నాకన్న ఎక్కువ చదివే వాళ్ళంటే నాకు భయం !'
'భయం వుండడం మంచిదే కదూ?' కర్చీఫ్ అడ్డు పెట్టుకుని నవ్వింది సుమిత్ర.
'పేరుకి ఆస్తి పరుణ్ణి -- కానీ నా జీతం కూడా నాకు ఫ్రీగా ఖర్చు పెట్టుకునే చాన్స్ లేదు-- ఇది వుంచండి మీ దగ్గర -- నిన్న గోవిందస్వామి దగ్గర తెచ్చాను --' పర్సులో నుంచీ అయిదు వంద రూపాయల నోట్లు తీసి యివ్వబోయాడు బసవరాజు.
'నేను కల్యాణి దగ్గర తీసుకున్నాను-- నాకు కావలసింది అప్పు-- మీరు అప్పు యివ్వరని నాకు తెలుసు-- మీకు రుణపడడం నాకిష్టం లేదు-- అందుకే మీరేలాగా యివ్వబోతారని తెలిసి ముందే తీసుకున్నాను-- అపార్ధం చేసుకోకండి-- నా కోసం మీరు వడ్డీలకి తేవడం బాగుండలేదు' అంది సుమిత్ర.
నిజానికి అతను గోవిందస్వామి దగ్గర చాలా ఎక్కువ వడ్డీకి ఆ డబ్బు అప్పు తెచ్చాడు! సుమిత్ర కి ఒకనాడిచ్చిన మాట కోసం.
అది తీరే విధానమూ కష్టమే!
'మీకు కల్యాణే ఎక్కువ స్నేహితురాలు-- నా కన్నా--'
'ఈ లాజిక్ నాకు నచ్చదు-- ఆ డబ్బూ తీసుకు పోయి గోవిందస్వామి కిచ్చెయ్యండి- విసుగ్గా అన్నది సుమిత్ర.
'మా చెల్లెలు ఇంట్లో ఇవాళ పెద్ద దుమారం లేవదీసింది. ఒక్కొక్కసారి ప్రేమకీ, వాత్సల్యానికి కట్టుబడి వుండడం కూడా చేతగాని తనం క్రింద పరిగనించబడుతుంది. అల్లాంటి వాళ్ళని మరీ బంధించాలని చూస్తారు చుట్టూ వాళ్ళు-- ఎలాంటి వాళ్లకి అలాగే పాఠం చెప్పాలి. అన్నాడు బసవరాజు వెళ్ళబోతూ --
'అవును -- నాకు తెలుసు -- ' స్వగతం గా అనుకుంది సుమిత్ర.
