Previous Page Next Page 
ఇందుమతి పేజి 20

   
    "ఇంకా కార్యమైనా కాలేదు. భర్తతో ఇప్పుడు ఒంటరిగా వెళ్ళ కూడదే!' అన్నది అన్నపూర్ణమ్మ గారు.
    భర్తతోనే కదా వెళుతున్నది! ఇటువంటి చాదస్తాలు పెట్టుకో బోకు" అని సర్ది చెప్పింది భానుమతి.
    గుంటూరు చేరేసరికి సీతమ్మ గారి పరిస్థితి తీవ్రంగా ఉన్నది. వారం రోజుల నుండి నెత్తురు విరోచనాట. గుడ్లు లోపలికి పోయాయి. ఒంట్లో అణు ,మాత్రం శక్తి లేదు. ఇందుమతీ రాజషేఖరులను చూసి తృప్తిగా ఆమె ప్రాణం విడిచింది. ఇందుమతి కళ్ళలో నీరు నింపుకున్నది. వెంకటా చలపతి గారికి, రాజశేఖర మూర్తి కి ఇది మరొక అఘాతం. ఆమె బతికి నన్నాళ్ళూ స్వార్ధ రహితంగా బతికింది. ఆమె హృదయం ఎప్పుడూ వాత్సల్య పూరితం. ఆమెకు అన్యాయం చేశానని వెంకటా చలపతి గారు వెక్కి వెక్కి ఏడ్చారు. రాజశేఖర మూర్తి కళ్ళలో అశ్రు పారావారం కట్టలు తెగి ప్రవహించింది.
    పదో నాటికి అనంత కృష్ణ శర్మ గారు వచ్చి పదమూడో నాడు ఇందుమతి ని అనంతవరం తీసుకు వెళ్ళారు. దివాకరరావు గారి సలహా ప్రకారం ఇందుమతి కి సరి అయిన టానిక్కులు విడవకుండా ఇప్పించమని మామగారిని ప్రార్ధించాడు రాజశేఖర మూర్తి.
    జ్యేష్ట మాసం లో కాలేజీ లు తెరిచారు. రాజశేఖరమూర్తి కి ఇది బి.ఎ రెండో ఏడు. శ్రద్దగా చదివి మొదటి తరగతి తెచ్చుకోవాలని దీక్ష పట్టాడు. ఈ సంవత్సరకాలము మనస్సు ను ఇటు అటు పరుగెత్త నియ్యరాదు. అది ఇందుమతీ దేవి అన. సీతమ్మ గారి మరణ కారణంగా ఈ సంవత్సరం దసరా పండుగలు కూడా జరపలేదు. ఇందుమతి గుంటూరు రాలేదు. రాజశేఖర మూర్తి అనంతవరం పోలేదు. వెంకటా చలపతి గారికి, అనంత కృష్ణ శర్మ గారికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రం జరుగుతున్నాయి. అనంతవరం నుండి ఉత్తరం వచ్చినప్పుడల్లా ఇందుమతి రాజశేఖర మూర్తి హృదయంలో మెదులు తుండేది. ఆమెతో గడిపిన మధుర క్షణాలు తలుచుకుని సంతుష్టుడయ్యెవాడు. ప్రతి ఉత్తరం లో శర్మగారు ఇందుమతి క్షేమంగా ఉన్నదని వ్రాసేవారు. ఒకమారు ఏలూరు నుంచి ఉత్తరం వచ్చింది. దివాకరరావు గారు , భానుమతీ దేవి సంక్రాంతి పండుగకు అనంత వరం వెళ్ళారట. ఇందుమతి కులాసాగా ఉన్నదని అయన కూడా వ్రాశారు.
    చైత్ర మాసం లో బి.ఎ పరీక్షలు జరుగుతున్నవి. ప్రపంచ యుద్ద జ్వాలలు భారత దేశపు సరిహద్దులే ఆక్రమించాయి. పరీక్షలు సగం సగం జరుగుతుండగా జపాను వారు విశాఖపట్టణం మీద బాంబులు వేశారట. అ వార్త ఆంధ్రదేశం నలుమూలలా విద్యుత్తు లా వ్యాపించింది. మరుసటి వార్తా వాహిని లో మరొక వార్త. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు వెంటనే పరీక్షలు అపు చేసి విశాఖ పట్టణం ఖాళీ చెయ్యటానికి నిశ్చయించారు. మిగిలి పోయిన పరీక్షలు మరొక నెల రోజులలో ప్రారంభిస్తారని ప్రకటించారు.
    రాజశేఖర మూర్తి ఉసూరు మన్నాడు. వ్రాసినంత వరకు పరీక్షలన్నీ చక్కగా వ్రాశాడు. మరి నాలుగు రోజులలో పరీక్షలు పూర్తి చేసి హాయిగా గాలి పీల్చుకుందామను కుంటూ ఉంటె ఈ ఉపద్రవం ఏమిటి? ఆ జపాను వారికి విశాఖపట్టణ మే దొరికిందా బాంబులు వెయ్యటానికి? కలకత్తా లో వెయ్యరాదా, చెన్న పట్టణం లో వెయ్యరాదా?"
    "అమ్మయ్య , మరొక నెల రోజులు చదువుకోటానికి వ్యవధి దొరికింది" అని సంతోషించింది సహాధ్యాయిని సరస్వతి.
    "చదివింది చాలదా ఫస్టు మార్కులకు?" అన్నాడు రాజశేఖర మూర్తి.
    "మీకు ఉన్న ధైర్యం నాకు ఉండదు సుమండీ. ఎంత చదివినా ఎప్పటి కప్పుడు మనస్సు ఖాళీ గానే ఉన్నట్టు ఉంటుంది."    
    "పరీక్షలకు కూర్చుంటే మట్టుకు కలం పరిగెత్తు తుంది నిర్విరామంగా , వెనక్కి తిరిగి చూడకుండా."
    "అదే ఆశ్చర్యం."
    "కాదండీ . సరస్వతీ కటాక్షం."
    "మీకూ అలాగే ఉంటుందా?"
    "నాపై సరస్వతీ దేవికి కటాక్షం లేదుగా?' అన్నాడు చిలిపిగా నవ్వుతూ.
    "మీరు చిలిపిగా మాట్లాడితే మీ సంగతీ మీ ఆవిడతో చెప్పేస్తాను సుమండీ."
    "మా ఆవిడికి నా సంగతీ మీ సంగతీ కూడా బాగా తెలుసు. నాకు సరస్వతీ దేవి ఆరాధ్య దేవత అని నేనే చెప్పాను."
    "అయితే ఈ దేవత వరాలిచ్చే దేవత కాదని ఆవిడికి తెలిసి ఉండాలి."
    ఇద్దరూ నవ్వుకున్నారు.
    "క్షమించాలి , సరస్వతీ దేవీ, మీరిచ్చిన చనువు కొద్దీ ఏదో చిలిపిగా మాట్లాడు తుంటాను. మీరేమి అనుకోకండి.
    "ఏదో అనుకునేదాన్ని అయితే మీతో మాటే మాట్లాడను. మీరు సహృదయులు కనుకనే మీకింత చనువు ఇచ్చాను. పదండి, టైము పాడు చెయ్యక పోయి చదువుకోండి."
    "మీ అజ్ఞ, నమస్కారం."
    "నమస్కారం."
    జపాను వారు విశాఖ పట్టణం మీద బాంబులు వెయ్యటం కూడా రాజశేఖర మూర్తి మంచికే అయింది. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్టణం నుంచి నేరుగా గుంటూరు కే తరలించారు. మహమ్మదు మక్కాకు పోకపోతే, మక్కాయే మహమ్మదు దగ్గిరికి వచ్చి ఉండేదంటారు ఆర్ధిక నిస్సహాయత చేత ఆంధ్ర విశ్వవిదాలయం లో ఆనర్సు చదువుకు వెళ్ళ లేకపోయాడు రాజశేఖర మూర్తి. ఈనాడా విశ్వవిద్యాలయ మే తన కాళ్ళ దగ్గిరికి రావటం తనపై సరస్వతీ దేవికి ఉన్న కటాక్షం వల్లనే అనిపించింది రాజశేఖర మూర్తి కి. ఇక దిగులు లేదు. బి.ఎ. పాసయిన వెంటనే ఎమ్.ఎ. లో చేరవచ్చు. ఉన్న ఊరిలోనే చదువు కనక ఆర్ధికంగా ఇబ్బంది ఉండదు. తను ఎమ్.ఎ . అవాలనే ఆశ ఈ విధంగా ఫలింస్తుందని అతను కలలో కూడా ఎన్నడూ అనుకోలేదు.
    వైశాఖ శుద్ధం లో బి.ఎ. పరీక్షలు పూర్తీ అయ్యాయి. వైశాఖ బహుళం లో సీతమ్మ గారి సంవత్సరికాలు . జ్యేష్ట మాసం లో ఇందుమతి రాజశేఖరుల పునస్సందానానికి ముహూర్తం పెట్టించమని అనంత కృష్ణ శర్మ గారికి వ్రాశారు వెంకటా చలపతి గారు.
    రాజశేఖర మూర్తి మనస్సు ఆనందాతిరేకల తో ఉయ్యాల లూగుతున్నది. ఒక వంక పరీక్ష లలో పేపర్లన్నీ చక్కగా వ్రాశాడు. ఫస్టు క్లాసు తప్పదు. పట్టభద్రుడవుతాడు. దైవం దయ తలిస్తే ఎమ్.ఎ కూడా అవుతాడు. మరొక వంక రెండు సంవత్సరాలు గా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఇందుమతి సమాగమానికి కూడా తరుణం ఆసన్నం అయింది. 'శుభం ఎప్పుడూ ఒంటిగా జరగదంటారు. ఇదే కాబోలు' అనుకున్నాడు.
    రవి వేసవి సెలవులకు గుంటూరు వచ్చాడు. అతని ముఖం లో ఇంతకూ ముందెన్నడూ కనిపించని కొత్త ఆనంద రేఖలు కనిపించాయి రాజశేఖర మూర్తి కి. రవి స్వతహాగా బుద్ది మంతుడు. తన చదువేమో, తనేమో. వెంకట రత్నం గారి శిక్షణ లో క్రమబద్దంగా పెరిగాడు. గుంటూరు లో ఉన్నంత కాలమూ సినిమాలు గాని, నాటకాలు గాని ఎరగడు. రాజశేఖర మూర్తి కి నాటకాలన్నా, సినిమాలన్నా సరదా. రమ్మని బలవంతం చేసినా రవి వచ్చేవాడు కాదు. చెడు సాహసాలు చేస్తే చెడిపోతారని స్నేహితులతో కూడా తిరగానిచ్చే వారు కాదు వెంకట రత్నం గారు. అందుచేత రాజశేఖర మూర్తి ఒక్కడే అతనికి స్నేహితుడు. అతనితోటే అతడి చదువు. అతని తోటే అతడి అట. రెండు సంవత్సరాలుగా రవికీ, రాజశేఖర మూర్తికి మార్గాలు వేరయ్యాయి. మద్రాసు లో హాస్టలు లో ఉండి ఇంజనీరింగు చదువు కొంటున్నాడు రవి. వెంకట రత్నం గారి స్నేహితులు , మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ లో ఆచార్యులుగా పనిచేస్తున్న రత్న స్వామి నాయుడు గారు రవికి స్థానికంగా గార్దియను.
    సెలవులలో రవి, రాజశేఖర మూర్తి కలిసి ప్రతి రోజూ సాయంకాలం ఏదో ఒక వైపు షికారు వెళ్ళటం అలవాటు. ఒక రోజు రింగు రోడ్డు చుట్టూ తిరిగి వచ్చేవారు. మరొక రోజు అమరావతి రోడ్డు మీద రెండు మైళ్ళు నడిచి వెనక్కి తిరిగేవారు. ఇంకోరోజు రైలు కట్ట వెంబడి రెండు మైళ్ళు నడిచి వెనక్కి తిరిగేవారు. వేరొక నాడు ఊరి బయట చేలలోకి పోయి కాస్సేపు విశ్రమించి తిరిగి వచ్చేవారు. ఏదీ కాకపొతే గాంధీ పార్కు కు నడిచే వారు. ఒకనాడలా తిరుగుతున్న సమయం లో రవి రాజశేఖర మూర్తి తో తన మనస్సు లోని మాట వెళ్ళగక్కాడు.
    "బావా, నేనొక సమస్య లో చిక్కుకున్నాను సుమా."
    "నీకేమి సమస్యలు, బావా, అవి పేద వాళ్లకు గాని."
    "జీవితంలో సమస్యలన్నీ డబ్బుతోటివె అంటావా?"
    "చాలా మట్టుకు అంతేనని నా ఉద్దేశం."
    "నా సమస్య డబ్బుతో పరిష్కరించు కునేది కాదు."
    "ఏమిటి, బాబు, అది?"
    "రత్నస్వామి గారి కుమార్తె ప్రభావతీ, నేనూ  ప్రేమించు కున్నాం."
    'అదే, అలాంటి దేదో ఉండి ఉంటుందను కున్నాను నీ ముఖం లోని ఆనంద రేఖలు చూసి."
    "వారు నాయుళ్ళు."
    "మీరు బ్రహ్మ మతావలంబులు కదా? అభ్యంతరం ఏమున్నది?"
    "బోధనకీ, ఆచరణ కీ వ్యత్యాసం చాలా ఉంటుంది, బావా. ఇతరులకు ముందంజ వెయ్యమని చెప్పటమే కాని, తన దాకా వచ్చేసరికి ప్రతివాడూ వెనక్కి తగ్గుతాడు. అది సహజం."
    "ఏం చదువుతుంది ఆ అమ్మాయి?"
    "క్వీన్ మేరీస్ లో ఈ ఏడే ఇంటర్ పరీక్ష కు వెళ్ళింది. నేను మొదట మద్రాసు వెళ్ళినప్పుడు నాన్నగారిచ్చిన ఉత్తరం తీసుకుని ముందు  రత్న స్వామి గారి ఇంటికే వెళ్లాను. ఆ తరవాత హాస్టలు లో చేరి అక్కడ ఉంటూ వచ్చినా, రత్న స్వామి గారి కోరిక ప్రకారం వారాని కొకమాటు ఆదివారం నాడు వాళ్ళింటి కి వెళ్లి వస్తుండే వాణ్ణి. పట్నం లో చదువు కుంటున్న పిల్ల కదా, నాతొ చనువుగా మాట్లాడుతూ ఉండేది ప్రభావతి. మొదట్లో వారి భాష, పద్దతులు , ఆహారం కొంచెం ఎబ్బెట్టు గా అనిపించినా, రానురాను అలవాటయి పోయింది. పరిచయం ఎక్కువ కావటం తో ఇంటి దగ్గరే కాకుండా ఒంటరిగా బీచి లో కూడా కలుసుకుంటూ వచ్చాం. ఈ రెండు సంవత్సరాలలో మా మైత్రి ఎంత గాడమై పోయిదంటే, ఈ సెలవుల్లో అక్కడే ఉండి పోదామను కున్నాను. కాని, నాన్న డబ్బు పంపిస్తే గాని వీలు లేదు కదా ? రాక తప్పింది కాదు."
    "ఈ సంగతి రత్నస్వామి గారికి తెలుసా?"
    "చూచాయిగా తెలుసు అనుకుంటాను. అయన చూసీ చూడకుండా ఊరుకుంటారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS