Previous Page Next Page 
అర్పణ పేజి 20


    'నువ్వు చేసిందే అంతా!' అనేద్దామనుకుంది . కాని పార్వతి ని చూస్తూ చూస్తూ అటువంటి మాటలనడమూ చేతకాదు.
    "ఛీ! అల్లాంటి వాడా నా తండ్రి!" అన్నది ఎలాగో.
    పార్వతి ఉలికిపడి, అప్పుడు నాలుక కరుచుకుంది జారిన పొరపాటుకు.
    "అది కాదత్తయ్యా!" అని మాటను మలుపు తిప్పింది. "ఈ ఊళ్ళో నాకేం తోచదు, ఏదైనా ఉద్యోగం దొరికే దాకా. ఇన్నాళ్ళూ ఆ పని చేశానన్న మాటే గాని-- తలనొప్పి పుట్టింది. అట్లాంటి ఉద్యోగాలు చెయ్యలేను నేను."
    "ఫరవాలేదు . ఏదో ఒకటి సంపాదిస్తావు గానీ ముందు నా మాటొకటి వినవె, పార్వతి !" అర్ధించింది జానకమ్మ.
    "శ్రద్దగా ఆలకించి ఆలోచించు. రాజుకి తనెలా చెప్తే అలా నువ్వు చెయ్యాలనే ఉద్దేశమే ఉందను కుంటాను. నా మాట విని వాడికెలా సదుపాయాలూ జరగాలో కనిపెడుతూండమ్మా. నన్ను విడిచి ఉండడమే వాడికి కష్టం -- అందుకని చెప్తున్నా. నీకిష్టం లేనివి చేయ్యనక్కర లేదు; ఇందులో నువ్వు చిన్న బుచ్చు కోవలసిందీ లేదు. మీమీద మీకు అభిమానాలైనా కలుగుతాయేమో......."
    పార్వతి మౌనంగా విన్నది. అంతే!

                                   17
    "అవును. అత్తయ్య కోరికలో అత్యాశ లేదు. అది స్వార్ధం కాదు. అసమంజసం గా మాట్లాడలేదావిడ. ఆమె చెప్పినట్టుగా రాజు దగ్గర ప్రవర్తించినా తన వ్యక్తిత్వం దేబ్బతినదు. స్త్రీ కనుకనే తను లొంగి పోయినట్లుగా ఎవరూ అనుకోవడానికి ఆస్కారం లేదు. ఏదైనా స్వాతంత్రతే !" ఆరు నెలల అనంతరం అనుకుందోకనాడు పార్వతి.
    అప్పుడప్పుడే పరిసరాలు అలవాటు పడుతున్నాయి. నిజానికి రాఘవపూర్, చందన పూర్ జంటనగరాల్లాగా ఒక పోలికల్లో ఉంటాయి. కానైతే నగరాలు కావు. చిన్న సైజు పట్నాలనవచ్చు.
    ఆ ఊళ్ళో చాలా రోజులు పార్వతి కి ఎల్లాటి ఉద్యోగం దొరకలేదు. ఊరికే ఉండలేక లెక్చరర్ ట్రెయినింగ్ కు వెళ్ళింది. తర్వాత ఎంతో ప్రయత్నానంతరం -- గ్రాడ్యుయేట్ గనుక -- ఎవరో తెలిసిన పెద్ద వాళ్ళు రికమెండ్ చెయ్యగా వుమెన్స్ ఆర్ట్స్ కాలేజీ లో పని దొరికింది. ఒక సబ్జెక్టు కు ఇద్దరు లెక్చరర్లు కావాలసి వచ్చి , తాత్కాలికంగా పార్వతిని వేసుకున్నారు. ఆమె రెండు జూనియర్ క్లాసుల తాలూకు కొన్ని విభాగాల్లో పనిచెయ వలసి ఉంటుంది.
    సెలవు రోజు ఇంట్లో కూర్చున్న పార్వతి మెదడులో ఆలోచనలూ, సమస్యలూ అంతూ  పొంతూ లేకుండా పుట్టి తలోదారీ పడుతున్నాయి.
    కొసకు -- 'అవును! అలా చేస్తాను' అని కృత నిశ్చయంతో చెంగున లేచింది. మురిపాలు జాలు వారినట్టుగా ముస్తాబు చేసుకుంది.
    సెలవు రోజైతే మాత్రమేం? ఆరోజంతా రాజు మిద్దె మీదనుంచి ఇంచుమించు దిగకుండానే గడిపెయ్యడం పార్వతికి ఆశ్చర్యం కలిగించింది. అత్తయ్య మాటలు నెమరు వేసుకుంది.
    ఏం చెయ్యాలను కుందో-- వంటింట్లో కి సరాసరి వెళ్లి "బాబుగారికి కాఫీ ఇచ్చావా?' అనడిగింది వంట వాణ్ణి.
    "లేదండీ! అయన పొద్దున్న "నాకేం అక్కర్లా ఫో" అంటూ కసిరారండీ!" అన్నాడు వాడు నవ్వుతూ పార్వతి వైపు చూసి.
    "ఏడ్చావ్! వద్దంటే మాత్రం -- టైము ప్రకారం అన్నీ తీసుకెళ్ళి అయన కివ్వవూ? నౌఖరు కామాత్రం తెలియద్దూ?" కోపంగా అరిచింది.
    ముఖం మాడ్చుకుంటూ "నౌఖర్ల యితే మాత్రం -- మాకూ మానం, అవమానం అన్నీ ఉన్నాయండీ! ఆయనలా కసురుకుంటే మళ్లా ఎందు కెళ్లాలాట?"
    "నోర్మూసుకుని కాఫీ తయారు చేసి ఇలా ఇయ్యి."
    వంటవాడు గొణుక్కుంటూ చేసి పార్వతిచేతి కిచ్చాడు.
    పార్వతి మెల్లిగా మెట్లెక్కి రాజు గదిలోకి వెళ్ళింది.
    ఒకవైపు తిరిగి వాడిన మొగం తో నిద్ర పోతున్న రాజు ఆమె కళ్ళకు అందంగా కనిపించడమే కాకుండా -- అపరిమితమైన జాలిని పుట్టించింది ఆ దృశ్యం.
    పాపం -- అత్తయ్య ప్రాణ సమంగా చూసుకునేది ఇతన్ని. ఆమెను విడిచి ఇతనుండలేడు. అందుకే ఇలా ఆసౌఖ్యంగా ఉంటున్నాడు.
    సరోజను పెళ్లి చేసుకుంటే ఇలాంటి కష్టాలు పడేవాడు కాడా రాజు? తనే బాధల పాలు చేసిందా ? రాజు ఇలా ఉద్యోగం మార్పించు కోవడమేం?
    ఉలికి పాటుతో కళ్ళు తెరిచాడు రాజు. తన భుజాన్ని పట్టుకు కుదిపింది పార్వతి అని తెలీగానే క్షణం దిగ్బ్రాంతి చుట్టింది అతన్ని.
    తెలివి తెచ్చుకుని "ఎందుకు?" అన్నాడు తీవ్రంగానే.
    "ఒళ్ళు వెచ్చగా ఉన్నట్టుంది?" అన్నది పార్వతి అవనతంగా.
    రాజుకు ఆశ్చర్యం ఎక్కువైంది. లేచి కూర్చున్నాడు.
    "కొంచెం జ్వరం తగిలింది లే! నువ్వెందు కిక్కడికి?" చిత్రమైన పక్కీ లో అన్నాడు.
    "ఏం, రాకూడదా?" అనబోయేదల్లా తమాయించుకుని -- కాఫీ తీసుకుంటావేమో ?" అంది.
    "నిన్ను తెమ్మని ఎవరు చెప్పారు? వాడు తెలేడూ?"
    "నేతేస్తే ఏమయిందిప్పుడు?" అసహనం కొద్ది కొద్దిగా బయట పడుతున్నది.
    "అక్కర్లేదు, తీసికెళ్ళు."
    "వంటవాడు తెస్తే తీసుకుంటావా?"
    "అదంతా నీకనవసరం. ముందవతలికి వెళ్ళు."
    "నేనేమీ అంతరాన్ని డాన్ని కాను."
    "అంతకన్నా అన్యాయం. వాళ్ళ మొహాలు చూస్తె అసహ్యం కలగదు. నిన్ను చూసినా, నీతో మాట్లాడినా, నువ్వు తాకిన వస్తువులు తాకినా రకరకాల పాపాలు చుట్టూ కుంటాయి. వేషాలు వెయ్యక వెళ్ళు."
    "నేను వేషాలు వెయ్యడానికి రాలేదు ." రాజు వెంటనే అందుకున్నాడు : "మరెందుకో ఈ దయ చెయ్యడం? ఈ షోకుల ప్రదర్శనం?"
    "ఇష్టమొచ్చినట్లల్లా మాటాడకు , రాజూ! మీ అమ్మగారు నీ సౌకర్యాలు చూడమంటే అభిమానాన్ని కూడా చంపుకొని వచ్చాను. " పార్వతి మొహం ఎర్రబడింది.
    "ఆహాహా! ఇప్పుడనుభవిస్తున్న సౌఖ్యాలు చాలవూ? దయచేసి నన్ను తిన్నగా స్వర్గానికే తీసి కెళ్ళి పోకు. ఈ ఎత్తులు మానెయ్యి. నా ఆస్తి పాస్తులు చూసి అమ్మకీ, నాన్నకీ మందు పెట్టావు. ఇప్పుడు నాకేదో మత్తు ప్రయోగం చెయ్యాలని చూస్తున్నావ్! అంతేగా? అంత కోరికైతే అక్కడికే వెళ్లి ఆ డబ్బుతో కులుకు గానీ ఇంకెప్పుడూ నా దగ్గరికి రాకు. మర్యాద దక్కదు."
    "ఇప్పుడింత మర్యాద దక్కించావు -- ఛీ! నీ దగ్గరికి వచ్చినందుకు . ఇదే నా మొదటి పాపం!" పార్వతి కందిన మొహంతో విసవిస నడిచింది. మెట్ల దగ్గర పై గుడ్డ అడ్డు చేసుకు నవ్వుతున్న వంట వాణ్ణి చూసేసరికి కోపాగ్ని ద్విగుణీకృతమై జ్వలించింది ఆ అమ్మాయి లో.   
    
                                   18
    "వై ఆర్ యు లాఫింగ్? వాట్ హి పెన్ డ్?" పార్వతి గంబీరమైన ప్రశ్నతో క్లాసులో కలకలం గుసగుసలు సద్దు మణిగాయి.
    విద్యార్ధినులందరికీ పార్వతి తత్వం చిత్రంగా కనిపిస్తుంది. ఆమె కట్టుకునే నైలాన్ కలర్సూ, రాసుకునే లిప్ స్టిక్ ఖరీదులూ వాళ్లకు ముఖస్థం. ఇంత ఫాషనబుల్ లేడీ లెక్చరర్ ఎందుకంత ముభావంగా, గంబీరంగా ఉంటుంది? పోరపాటునైనా  నవ్వదెం ? సాధారణంగా యువ లెక్చరర్స్ ఎంత నవ్వుతూ, కేరుతూ రామచిలుకల్లా తిరుగుతుంటారు? ఈవిడ అలా కాకుండా తన పనేదో తనదిగా ఉంటుంది? అలా అని వైరాగ్యం ఉన్నట్టు తోచదు. ఈ సామస్యలె ఆ విద్యార్ధినులకు క్లాసులో పాఠాల కన్నా ఎక్కువగా మెదడు ను వేధిస్తున్నాయి. ఒకరిద్దమ్మాయి లు సాహసం చేసి పార్వతి తో మాట్లాడినా, ఆమె దగ్గర చనువును మాత్రం సంపాదించలేకపోయారు.
    అటెండెన్స్ వేసినాక క్లాసు తీసుకోకుండానే ఆఫీసు రూమ్ లో కి వెళ్లి ఏదో చెప్పి ఇంటికి వచ్చేసింది పార్వతి.
    ఇంట్లో అడుగు పెట్టేసరికి పదిన్నర చూపిస్తున్నది గడియారం. రాజు ఇంకా స్కూలు కు వెళ్లినట్టు లేదు.
    ఉత్తరం కాలికి తగలగానే తీసి చూసింది. సరోజ దగ్గరి నుంచి వచ్చిందది. యూనివర్శీటీ వెళ్ళవలసిన అవసరాలు, ఇంకేవో ఇబ్బందులు గురించి క్లుప్తంగా వ్రాసిన ఉత్తరం.
    చదివి పడేసి నిశ్శబ్దంగా తల పట్టుకు కుర్చీలో కూచుంది తన గదిలో. మెదడు పరిపరి విధాల పని చేస్తుంది.
    తనెందుకు ఇంకా చదవలేదు? అన్న ఆలోచన గడియ గడియ కూ ముందు కొస్తుంది.
    "ఇంకా చదువులో ఉంటె ఆపాటికి జ్ఞానోదయం కలిగి తర్కించుకొని రాజును వివాహం చేసుకొనటానికి అంగీకారం తెలిపేది తను--------' అనే చేజారిన దాని గూర్చి స్మరణ.
    తమ దిమ్ముగా ఉంది. కాఫీ చేయించు కోవాలి అనుకుంది.
    "కాఫీ తీసుకోండి!" ఎప్పుడు లోపలికి వచ్చాడో వంటవాడు కాఫీ ఇచ్చి దగ్గరే నిలబడ్డాడు. వాడి సానుభూతి చూపులు పార్వతి గమనించలేదు.
    "సమయానికి తెచ్చావు -- థాంక్స్ య్ !" అంది. పొంగిపోయాడు వాడు.
    "మీకోసమని ప్రత్యేకం -- స్ట్రాంగు గా చేశానండీ!" అన్నాడు.
    కాఫీ తాగి గ్లాసు అతని కివ్వబోయే లోగా తెల్లని పువ్వులు కనిపించాయి టేబిల్ పైన. పార్వతి ఆశ్చర్యంగా అతని మొహం చూసింది. మహా విశ్వాసంగా చూస్తున్నాడు.
    "ఇవేమిటి?" అన్నది ప్రశ్నార్ధకంగా.
    "పాత జమీందారు గారి తోటలో వండి! మీ కోసం తెచ్చాను" అన్నాడు తన మిడి మిడి జ్ఞానానికి తబ్బిబ్బవుతూ.
    "ఉద్దరించావ్!' అనుకోని-- "నాకు పువ్వులంటే డోకు, తీసుకుపో" అంది.
    వాడి మొహం చిన్నబోయింది. "అదేంటండీ! అలాగంటారు -- వీటిని లిల్లీ పువ్వులంటారు. ఎంతో కష్టపడి తెచ్చానండీ!" అన్నాడు.
    "ఏ పువ్వులైతే నేమిటోయ్! నా కిష్టం లేదని చెప్తున్నా, తీసుకుపోయి నీ పెళ్ళాని కిద్దువు గాని."
    "నా పెళ్ళాని కేంటండీ! మీలాంటో ళ్ళ జుత్తు లోనే ఈ పువ్వు లండంగా ఉంటయ్యండీ! పెట్టుకోండి" అన్నాడు కులుకుతూ.
    వదిలేటట్టు లేడు అనుకుంటూ రెండు పువ్వులు తీసి ఒక జడలో దోపుకోబోయే లోగా ఒక పువ్వు కింద పడింది. ఇద్దరూ ఒక్కసారే వంగారు అవియంత్రితంగా. తలలు రెండూ భేషుగ్గా డీ కొన్నాయి.
    వంటవాడు చిత్రమైన నవ్వొకటి నవ్వుతూ పార్వతి నుదురు తన చేత్తో నిమిరాడు. క్షణం లో జరిగిపోయిన డానికి పార్వతి ఒళ్ళు కంపరమేత్తి పోయింది.
    "జగ్గూ! ఇక్కన్నుంచి ఫో!" బలం కొద్ది కుర్చీ వెనక్కు తోసి నిలబడింది. ఆవిడ ఉగ్రరూపం చూచి స్థంభించిపోయాడు జగ్గు అనబడే వంటవాడు.
    "బ్రూట్! పొమ్మంటే గుడ్ల గూబలా చూస్తావేం?"
    ఈసారి తేరుకున్నాడు జగ్గు.
    "ఏంటండీ! అంత కోపగిస్తారు? తమరు -- తిట్టడానికి మేం పడున్నామా? మీరు గాకపోతే మీ తాతల్తోరుకుతారు!"
    "గాడిదా! మాటకి జవాబిస్తావా? ఇక్కన్నుంచి నడుస్తావా? బాబుగార్ని కేకేయ్యమన్నావా?" తీక్షణంగా చూసింది.
    "పిల్చుకోండి! నాకేం భయం లేదు. మీ సఖ్యం సంగతి నాకు తెలీదను కున్నారా? హే..హె...."
    "స్కౌంద్రల్ !" అని ఎర్రబడిన కనుగుడ్లతో ఇవతలి గదిలోకి వచ్చింది పార్వతి. అప్పుడే రాజు సైకిల్ తీసుకుని స్కూలుకు వెళ్తున్నాడు.
    "రాజూ! జగ్గు చూడు-- నెత్తి మీద కళ్ళు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. వాణ్ణిప్పుడే గెంటించేయ్యి. నా గదిలో ఉన్నాడు " అంది ఉద్రిక్త కోపంలో. రాజు పార్వతి వైపు విచిత్రంగా ఒకమారు చూసి ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు .
    అవమానంతో తలెత్త లేకపోయింది క్షణం పాటు పార్వతి.
    అక్కడికి వచ్చిన జగ్గు గర్వంగా చూస్తూ, "అయ్యగారు వెళ్ళమంటే వెళ్తాను. మీ పెత్తన మేవిటమ్మోయ్! అడ పెత్తన వంటారందుకే" అన్నాడు.
    "అలాగా! ఉండు , నీ పని చెప్తాను" అంటూ మరో గది కిటికీ దగ్గరకు గబగబా వెళ్లి, "పుల్లమ్మ గారూ! కమల గారూ! శారదా!" అని కేకలు పెట్టింది పార్వతి. అది విన్న జగ్గు భయపడి జారుకుంటూ ----
    "తదుపరి మా పాదాల కాడకే వస్తారండి" అని గట్టిగా అని పై గుడ్డ జాడించి వెళ్ళాడు.
    పార్వతి కి నిజమైన ధైర్యం వచ్చింది.
    'అందంగా నిండుగా ఉంటాడు ; విద్యావంతుడు, విజ్ఞాని అయి వుంటే ఎలా ఉండునో అని వీడి గురించి ఆలోచించాను. ఆఖరికి నీచపు బుద్ది చూపించాడు' అనుకుంది . తర్వాత సిగ్గుతో అవనతం అయింది. వాణ్ణి నీచుడు అంటుంది తను. మరి తమ ఇద్దరి నీచత్వం ఎలాటిది? వాడెంత సంకుచితంగా ప్రవర్తించినా అది అమాయకత్వం, అజ్ఞానం అనుకోనటానికి వీలుంది. మరి?
    "ఎమామ్మౌయ్ ! పిలిచావు కేకేట్టి?" అన్నారు పుల్లమ్మ గారు భుజాల మీద నుంచి పైట తీసి దోపుకుంటూ. ఆ వెనువెంటనే కమల గారూ, వచ్చింది. అంతవరకు ఒకరోకరి పేరు తెలుసుకున్నారే కాని పరిచయం లేదు. ఆ పోరుగిళ్ళ వాళ్ళు మాత్రం పార్వతి మీద దృష్టి దృడంగా వేసే ఉంచారు. అందుకే ఇదే ఆదనని పరుగెత్తి రావటం.
    పార్వతి సంకోచంతో నవ్వుతూ "ఏం లేదండీ! వంటవాడు పొగరుగా మాట్లాడితే భయపెట్టాలని మిమ్మల్ని పిలిచాను. పోయాడు" అంది. తర్వాత వెంటనే పుల్లమ్మ గారికి సారాంశాలు లాగడానికి అవకాశ మివ్వకుండా "వంకాయ కూర ఎలా చెయ్యాలో చెప్పి వెళ్ళండి, పుల్లమ్మ గారూ !" అంది పార్వతి వినయంగా.
    "దానికేం బంగారం! అయితే మీరు వంటలు అలవాటు లేదా? ఆడజనం ఎత్తాక వంటలు రాకుండా ఉండవు లెండి. హు -- మా రాధా ఇలాగే వంటలు రావేమోనని భయపడేది......"
    కమల, పిల్లలకు వడ్డన చేస్తూ వచ్చానని చెప్పి తొందరగా వెళ్ళిపోయింది.
    పుల్లమ్మ గారు ఒక గంట సేపు ఉండి వంటలూ, వాటి పద్దతులు , కొలత లు వివరంగా బోధించింది పార్వతి కి. "ఒకరిద్దర్నీ చంపితే కాని వైద్యుడు కాడమ్మోయ్!" అంది. సరోజ జ్ఞాపకం రాగానే నవ్వొచ్చింది పార్వతికి.
    వంటవాడు సగం తగలేసి వదిలిన వంకాయను పూర్తీ తయారులోకి తెచ్చి వెళ్ళుతూ "అమ్మాయ్! మేమంతా చుట్టూ పక్కల ఉన్నాం. అంతా తోడూ పడుతుంటాం. నువ్వు భయపడక్కరా. కానీ, ఒక రహస్యం!" అని వెనక్కు లాగింది పార్వతిని పుల్లమ్మ.
    పార్వతి ఆమె వైపు కొత్త చూపు చూసింది.
    "ఈ యింటికి కుడి వైపు చివర ఒక ఇల్లుంది చూశావ్? చూపుకి బంగళా లా ఉంటుంది. ఎప్పుడూ ఆ యింటికి మాత్రం వెళ్లకమ్మాయ్! ఆ యింటావిడ మంచిది కాదు. విపరీతం బుద్దులూను, మొగుడున్నాడా! వాడొక మొద్దె అనుకో, పిల్లా! ఆవిడ ఇష్టా రాజ్యం . రకరకాల మగవాళ్ళ నీ చేరుస్తుంది. మగాళ్ళ తో మగాడి లాగే మాట్లాడుతుంది! ఆవిడ తాలూకు కధే ఎల్లాటి దనుకున్నావమ్మో! అవన్నీ వింటే మీలాటి పిల్లలు చెడిపోతారు. కానీ -- అటేప్పుడూ వెళ్లకమ్మాయ్. అదే నే చెప్పేది ." అలా సుదీలోపన్యసాన్ని చదివి వెళ్ళింది పుల్లమ్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS