Previous Page Next Page 
రంగులవల పేజి 21


    "నీళ్ళైతే ఇవ్వండి" అంది తులసి.
    కంపించే చేతులతో నీళ్ళు తీసుకువెళ్ళాడు. తులసి లైటు వేసింది.
    "నాన్నా, నీళ్ళు" అన్నాడు. అలా అనటం అర్ధరహితం అని తనకు వెంటనే తెలిసింది.
    వేళ్ళతో పెదాలు విడదీసి, చెంచాతో కొంచెం కొంచెంగా నీళ్ళు పోశాడు. తండ్రి అవి మింగలేదు. నీళ్ళు కారిపోయాయి.
    "అసలు ఆయన అడిగారా నీళ్ళు?" అంది తులసి.
    ఔను. తనకూ అనుమానంగానే ఉంది ఆ విషయం. అతడేమన్నాడో తన కర్ధం కాలేదు కూడాను.
    కాని వెంటనే కోపంగా, "అనవసరంగా మాట్లాడకు. ఇది తీసికెళ్ళు" అంటూ విసుక్కున్నాడు, నీళ్ళగ్లాసు తులసి చేతికి ఇస్తూ.
    మిగతా రాత్రంతా అక్కడే కూర్చున్నారు.
    ఉషోదయాన-
    తెరిచిఉన్న కిటికీలగుండా ఆకాశం ఎర్రనై, చెట్లు నెమ్మదిగా స్పష్టమైనాయి. చల్లగా గాలి వీచింది. తులసికి ఆఫీసు ప్రశ్నే రాలేదు.
    కాని అతడికి ఈరోజు తప్పకుండా డబ్బిచ్చేయ్యాలి! లేకపోతే చాలా నీచంగా ఉంటుంది. ఇంట్లో ప్రస్తుతం డబ్బులేదు. భర్త నడగలేదు. ఎలా? ఇంక ఇప్పుడో, అప్పుడో బెజవాడనించి జనం దిగుతారు. ఎంతమంది! ఈ చావుకాదు గాని తన చావవుతుంది.
    పాలమనిషి వచ్చి వెళ్ళాడు.
    "మొహం కడుక్కురండి" అంది భర్తతో.
    రాత్రంతా జాగరణ వల్ల కాబోలు అతడి కళ్ళు లోపలికి పోయినాయి.
    పనిమనిషి వచ్చింది.
    కాఫీ కూడా ఐంది. ఎలా-డబ్బు?
    సీతాపతి తండ్రిపక్కనే కుర్చీలో కూర్చున్నాడు. వంట చెయ్యాలంటే మనస్కరించటం లేదు. దుఃఖం కన్నా నామోషీ ఎక్కువయింది. మరికొంచెం పొద్దెక్కింతరువాత బియ్యం కడిగింది. అన్నమంటూ ఉంటే పచ్చడైనా వేసుకు తినవచ్చు. ధైర్యం చేసి, సీతాపతి దగ్గిరకి వెళ్ళి అడిగింది.
    "ప్రస్తుతం మీ దగ్గిరేమైనా డబ్బుందా?"
    "ఊఁ. పదో, పదిహేనో ఉండాలి జేబులో" అన్నాడు సీతాపతి.
    "జేబులో కాదు, ఇంట్లో" అంది.
    "ఇంట్లోదే జేబులో కొచ్చింది. జేబులోంచి ఖర్చైంది" అన్నాడు సీతాపతి.
    "సేవింగ్సు బాంక్ లో-" అంది.
    "లేదు. ఎందుకు?" అన్నాడు.
    తులసికి భర్తమీద ఏవగింపు కలిగింది. అతను అనవచ్చు, 'నేను మా నాన్న కోసం ఏడుస్తుంటే, నువ్వు వెధవ డబ్బుకోసం ఏడుస్తున్నావా?' అని. కాని ఎలా? తను ఎలాగైనా ఇచ్చెయ్యాలి. ఎంత పెద్దకారణంకూడా తనను ఆ వేళ డబ్బు ఇచ్చెయ్యకుండా ఆపకూడదు.
    "లేదు. లేదన్నానుగా?" అన్నాడు సీతాపతి.
    తనకు తెలుసు. భర్త దగ్గిర ఓ రెండు వందలైనా ఉండిఉంటాయి. లేకపోతే అతనలా తీరిగ్గా, ధీమాగా విచారపడుతూ కూర్చోలేడు. ఐనా తన ప్రత్యేకమైన హోదా. 'తండ్రి చస్తుంటే' అనే నెపంతో బుకాయించాలని చూస్తున్నాడు. తను నిస్సహాయ. ఆ క్షణాన అతన్ని ఏమీ చెయ్యలేదు.
    వంటచేసిపెట్టేసి, "నేను కొద్ది సేపట్లో వస్తాను" అంటూ బయల్దేరింది తులసి.
    "ఎందుకు?" అన్నాడు సీతాపతి. అతనికి నిజంగా తెలియదా?
    "నిన్నటి షార్టు విషయంలో" అంది.
    "దాని కంత తొందరేం?" అన్నాడు.
    "ఇప్పుడు వెళ్ళకపోతే, ఇంకో మూడు నాలుగు రోజులదాకా వెళ్ళటం పడదేమో-తొందరగా వచ్చే స్తాను" అంది.
    భర్త గొంతు, అతని ముఖకవళికలు, ఆ మాటల ధోరణి-అతనిలో కొంత నిజమైన బాధ ఉందని ఆమెను నమ్మించకపోలేదు.
    తనకు తెలిసినవాళ్ళే తక్కువ. డబ్బు ఇవ్వగల స్తోమతు గలవాళ్ళెవ్వరూ లేరు. మొండిగా, కొంత అవమానాన్ని సహించయినాసరే, అడక్క తప్పదు. డబ్బు లేకుండా పోస్టాఫీసుకి వెళ్ళి, "మా మామగారు మరణశయ్యమీ దున్నాడు" అని చెప్పలేదు.
    నేరుగా శశిరేఖ దగ్గరికి వెళ్ళింది.
    "సారీ!" అంది శశిరేఖ.
    "ఎలాగోలాతీర్చెయ్యాలి, శశీ, వచ్చేనెల జీతంలో ఇచ్చేస్తాను. కావలిస్తే వడ్డీ తీసుకున్నాసరే. నీ కేవరైనా వడ్డీకిచ్చేవాళ్ళు తెలుసా?" అంది.
    "తెలియదండీ, కానీ మనం మా మేట్రస్ దగ్గిర ప్రయత్నిద్దాం. ఆవిడ చాలా మంచిది" నది శశిరేఖ.
    హాస్టల్ పేరు వినేసరికి తులసి గుండె గుభేలుమంది.
    "అమ్మో, నేను రాలేను" అంది.
    "ఫర్వాలేదు లెండి. ఇప్పుడు మీ చెల్లెలు హాస్టల్లో ఉండదు" అంది శశిరేఖ.
    "నే నా కాంపౌండ్ లో అడుగు పెట్టలేను" అంది తులసి.
    "మీకు డబ్బు కావాలా, వద్దా?" అంది శశిరేఖ.
    తులసి ఒప్పుకుంది. గుండె రాయిచేసుకుని శశిరేఖ వెనకే హాస్టల్లోకి నడిచింది.
    మేట్రస్ కొద్దిసేపు తటపటాయించి, మళ్ళీ ఫస్టుకు ఇచ్చే ఒప్పందంమీద, కొంత వడ్డీకి రెండు వందల రూపాయలు అప్పిచ్చింది.
    "చాలా థాంక్స్, శశీ. నన్ను ఆపదలో ఆదుకున్నావు" అంది తులసి.
    "థాంక్స్ ఎందుకుగాని, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. వింటారా?" అంది శశిరేఖ.
    "ఇప్పుడేమీ వినలేను, శశీ. అసలా గొడవలే వద్దు. నన్ను వెళ్ళనీ"అంది తులసి.
    "లేదండీ, మీరు వినక తప్పదు. ఇప్పుడు వద్దు లెండి. కాని తరవాత కలుస్తారు కదూ"అంది శశిరేఖ.
    "తప్పకుండా" అంటూ తులసి రిక్షా ఎక్కింది.

                           
    
                                 19

    అల్లంత దూరాన కనిపిస్తున్న ఇంట్లో పెద్ద మార్పు కనిపించింది. ఇంటిముందరా, మెట్లమీదా మనుషులు.
    'ఐపోయినట్టుంది' అనుకుంది తులసి.
    తను ఇల్లు చేరేసరికి - ఎన్నో కొత్త మొహాలు- ఎవరెవరో నిలబడి ఉన్నారు. ఎవరూ ఏమీ మాట్లాడటంలేదు. గుమ్మంలో గుమికూడిన మనుషులు తనకు దారి ఇచ్చారు. గుమ్మానికి ఎదురుగా - సరిగ్గా ఎదురుగా- శవం, మామగారి శవం. పక్కనే భర్త ఏడుస్తూ కూర్చున్నాడు. ఇదీ నిజం. భర్త ఏడుస్తున్నాడు. శవం నిండా ముసుగు. మరెవరో ముసలతను - ఎవరూ అతను? పక్కింటి యజమాని తండ్రి కాబోలు - "లే బాబూ, కూర్చుంటే ఎలా?" అంటున్నాడు.
    తనలోకూడా ఇంత విషాదం, దుఃఖం ఉంది. కాని ఏడుపు రావటం లేదేం? పాపం, చచ్చిపోయాడు. రోగంతో తీసుకు, తీసుకు అవస్థపడి, మంచం పట్టి, చచ్చిపోయాడు. ఏడవాలి. భర్త ఎలా కూర్చున్నాడో, పాపం. తను మరీ ఇలా రాయైపోయిందేం? చీటికీ మాటికీ ఏడ్చేసే తను-ఈ రోజు ఏడవలేక పోతూంది. చావు సహజం కదూ, అందుకు తాము చాలా డబ్బు ఖర్చుపెట్టేరు కదూ, అతడి మూలంగా తను భర్తచేత దెబ్బలు తింది కదూ, అతడి చావువల్ల తమకేమీ ఆస్తికూడా రావటం లేదు కదూ- చాలా సహజంగా ఓ వృద్ధుడు రోగం ప్రకోపించి చచ్చిపోయాడు. తనెందుకు ఏడవాలి? లోకం కోసమైనా ఏడవకూడదా! వెళ్ళి శవానికి మరో పక్క కూర్చుంది.
    "టెలిగ్రామిచ్చావా, బాబూ?" -ఎవరో.
    భర్త తల ఊపాడు. బెజవాడనించి జనం దిగబడతారింక - శవాన్ని చివరిసారిగా చూడటానికి.
    ఇంటినిండా తానెరగని జనం. కొందరు నెమ్మదిగా జారుకుంటున్నారు. మరికొందరు వచ్చి నించుంటున్నారు.
    తనకి ఆకలి వేస్తున్నది. పాపం, భర్తకు ఆకలి వెయ్యటం లేదూ, ఎంత బాధుంటే మాత్రం!
    దుఃఖంతో కాదు, ఆకలితోనే నీరసం వచ్చేసింది.
    "నేను కూర్చుంటాను. మీరు వెళ్ళి కొంచెం ఎంగిలిపడి రండి" అంది.
    భర్త లేవలేదు.
    ఆ మాటలు విన్న ముసలతను కాసేపు చూసి, "వెళ్ళు, బాబూ, వెళ్ళి ఇంత తిను. మీ వాళ్ళుకూడా వస్తారింక" అన్నాడు.
    సాయంత్రం వేళకు సీతాపతి ఆఫీసువాళ్ళు వచ్చారు. ఆ వచ్చినవాళ్ళలో సీతాపతి ఆఫీసరుకూడా ఉన్నాడు. సీతాపతి తండ్రి జబ్బును గురించి చెప్పాడు. వాళ్ళేవేవో సానునయవాక్యాలు పలికారు.
    చీకటైంది. లైట్లు వెలిగాయి. మరో లాంతరు వెలిగించి శవం తల దగ్గిర పెట్టారు. ఇద్దరు ముగ్గురు వయసు మళ్ళినవాళ్ళు తప్ప, వచ్చిన జనం అంతా వెళ్ళిపోయారు.
    తులసి, సీతాపతి అలిసి అక్కడే గోడకు వాలి కూర్చున్నారు. టెలిగ్రాం అందటం గురించి అనుమానాలు పడ్డారు. శవం చుట్టూ చీమలు వచ్చాయి. అందుకు గాను పసుపు, కర్పూరం కలిపిన నీళ్ళు చల్లారు. కొద్దిగా తెరుచుకుపోయిన నోరు మూతపడలేదు. అందులోంచి బయటకు పొడుచుకువచ్చిన పైవరస ఎదుటిపన్ను చీకట్లో మరింత వికృతంగా కనిపించింది. సీతాపతి కళ్ళు మూసుకున్నాడు.
    "నువ్వూ కాసేపు పడుకోవమ్మా" అన్న ఆ ముసలతడి పలుకులతో, అప్పటిదాకా కునుకు తీస్తున్న తులసి ఉలిక్కిపడి లేచింది. టైం చూసింది. పన్నెండు. సరిగ్గా పన్నెండు. భర్త మొహం చూస్తే ఉదయం నించీ ఆమెకు వేదన పెరిగిపోతున్నది. ఎన్ని జ్ఞాపకాలో! చీమలు రాకుండా మరికొన్ని నీళ్ళు చల్లింది. కాళ్ళ దగ్గరి గుడ్డ సరిచేసింది. చల్లగా తగిలింది ఒళ్ళు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS