Previous Page Next Page 
రంగులవల పేజి 20


    తన దగ్గిర ఎప్పుడూ పట్టుమని పది రూపాయలు ఉండవు, స్వేచ్చగా ఖర్చుపెట్టుకోవటానికి. వీళ్ళు ఇలా వందలూ, యాభైలూ ఎలా పంపిస్తారో!
    కౌంటర్ మూసేసరికి తను చాలా అలిసిపోయింది. మొదట డబ్బు లెక్కపెట్టి ట్రెజరీలో ఇచ్చేసి, విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళింది. మొహం కడుక్కుని, కాఫీ తాగివచ్చి మళ్ళీ పనితో నిమగ్నమైంది.
    మనియార్డర్ ఫారాలూ, షీట్లూ ముందేసుకుని కూడికలు ప్రారంభించింది. తల పగలకొట్టుకుని, కూడికలన్నీ పూర్తి చేసేటప్పటికి - తనకు ఆ క్షణం లోనే సగంలో పట్టలేని సంతోషం కలిగినా- వంద రూపాయలు వదులుకుని పోతాడు!  అదీ కష్టమే- నమ్మలేకపోయింది. వెంటనే యస్పీయంతో చెప్పింది.
    యస్పీయం నవ్వి, "సరిగ్గా చూడవమ్మా, ఏదైనా ఫారమ్ జర్నలైజ్ చెయ్యలేదేమో" అన్నాడు.
    తనకూ అదే అనుమానం ఉంది గనక, మళ్ళీ ఫారాలతో జర్నల్ సరిచూస్తూ కూర్చుంది. మళ్ళీ కూడికలు చేసింది.
    ఈలోగా సాయంత్రమై పోయింది.
    "చూశానండీ. సరిగ్గానే ఉంది" అంది.
    "ఏమిటి సరిగ్గానే ఉంది?" అన్నాడు యస్పీయం విసుగ్గా.
    "వంద రూపాయలు ఎక్సెస్" అంది.
    యస్పీయం చిరాకుపడుతూ, తన పని పూర్తి చేసుకుని, షీట్సు తను తీసుకుని, ఆమెను ఫారాలు చదవమన్నాడు.
    పది నిమిషాల్లో అతను కోపంగా తల ఎత్తాడు.
    "నాలుగు వందలకు మూడు వందలే రాశావేమి ఇక్కడ?" అన్నాడు.
    పక్కనే కూర్చున్న మరో ఇద్దరు క్లర్కులూ నవ్వారు. బలవంతంగా, వాళ్ళతోపాటు తనూ నవ్వుతూ, "ఇచ్చెయ్యండి" అంది.
    "ఊఁ. మొత్తం చదువు" అన్నాడు యస్పీయం.
    తులసి చదివింది.
    యస్పీయం కూడికలు చేశాడు. మరోసారి చెయ్యటం ప్రారంభించాడు. తులసికి గుండె గతుక్కుమంది.
    "ఏమైందండీ?" అంది.
    అతడు మాట్లాడకుండా, తన ప్రయత్నం కొనసాగించాడు.
    ఆమె మొహంలో చిరునవ్వు పోయింది.
    యస్పీయం తను ముగించి, ఎదుట కూర్చున్న క్లర్కుల కిచ్చాడా షీట్సు, "మీరూ చూడండయ్యా" అంటూ.
    "ఏమిటండీ?" అంది తులసి, గుండె చిక్కపట్టుకుని.
    "షార్టు" అన్నాడు యస్పీయం.
    "ఎంత?" అంది తులసి.
    "నూటఎనభై ఆరు రూపాయల నలభై మూడు పైసలు."
    తులసికి గుండె జారిపోయింది.
    "భయపడకు. నేను పొరపాటు చేసిఉండచ్చుగా. వాళ్ళుకూడా చూస్తున్నారు" అన్నాడు.
    "నూటఎనభై రూపాయలే?!" అంది.
    యస్పీయం మాట్లాడలేదు. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏడ్చేదే. కాని వాళ్ళముందా!
    ఇద్దరు క్లర్కులూ మరో రెండు సార్లు చేశారు.
    "అంతేనండీ, 186 రూపాయల 43 పైసలు షార్టు" అన్నారు.
    "ఎలాగండీ?" అంది తులసి.
    "ఎలాగేమిటి, నీ అదృష్టం బాగులే దివ్వాళ. షెల్ డౌన్" అన్నాడు యస్పీయం.
    "ఇప్పుడెలాగండీ, నా దగ్గిరిప్పుడేమీ డబ్బులేదు" అంది తులసి ఆమె గొంతు రుద్ధంగా ఉందని గమనించిన యస్పీయం, "కాని ఎలా మరి, ఇప్పుడే మేక్ గుడ్ చెయ్యాలి" అన్నాడు.
    తులసి మొహం చూస్తే అతనికి జాలివేసినట్టుంది "చూడమ్మా, నేను నా జేబులోంచి వేసేస్తాను. మరి రేపు ఉదయం నాకు తిరిగి ఇచ్చెయ్యాలి. అప్పుకింద మాత్రం పెట్టద్దు, ఏం?" అన్నాడు.
    "లేదండీ, రేపు తప్పకుండా ఇస్తాను. చాలా థాంక్స్" అంది తులసి.
     "సరే. వెళ్ళు మరి. రాత్రయింది" అన్నాడు యస్పీయం.
    ఆఫీసు మెట్లు దిగేసరికి తొమ్మిదింబావయింది. తులసి కాళ్ళలో బలం లేదు. పెదాలు బిగపట్టి, కాళ్ళీడ్చుకుంటూ బస్సుస్టాండుకు వచ్చింది. ఇంటికి చేరేటప్పటికి పదిన్నరయింది. ఇంట్లో అడుగు పెట్టగానే, "తులసీ, ఇంత ఆలస్యమేం?" అన్నాడు సీతాపతి.

                              18

    "నా ఖర్మ!" అంటూ ఏడ్చింది తులసి.
    "ఏమిటి, తులసీ, ఏమైంది?" అన్నాడు సీతాపతి, కుర్చీలోంచి లేస్తూ.
    "నా ఖర్మ, నా ఖర్మ!" అంది తులసి, ఏడుపు ఆపకుండా.
    "అలా ఏడుస్తావేం? మన బతుకంతా ఏడుపు లాగానే ఉంది. చెప్పు, ఏమైంది?" అన్నాడు సీతాపతి. అతని గొంతులో కట్టలు తెంచుకుంటున్న దుఃఖం తొంగిచూసింది.
    "షార్టు వచ్చింది నూటఎనభై రూపాయలు" అంది తులసి, వెక్కిళ్ళతో.
    "సరే. మన రోజులు బావుండలేదులే. కాని, తులసీ, నాన్నకు సీరియస్ గా ఉంది. బెజవాడకు టెలిగ్రాం ఇచ్చాను" అన్నాడు సీతాపతి, ఇంకా నిల్చోలేక, కుర్చీలో కూలబడుతూ.
    "అదేమిటి, డాక్టరు వచ్చాడా? ఏమైంది?" అంది లోపలికి నడుస్తూ ఆమె వెనకే సీతాపతీ నడిచాడు.
    గదిలో మంచంమీద మామగారు వెల్లకిలా పడుకున్నాడు. "బిగ్గరగా పిలిస్తే, పదిసార్ల కోసారి 'ఊఁ' అంటాడు. పక్కింటివాళ్ళ పిల్లవాణ్ణి అడిగితే డాక్టర్ను తీసుకొచ్చాడు. ఇంక హాస్పిటల్ కక్కర్లేదన్నా డాయన" అన్నాడు సీతాపతి.
    అతనికి గొంతు పెగలటం లేదు.
    మనిషిని చరమదశలో చూస్తూంటే, తులసి హృదయం విషాదంతో నిండిపోయింది.
    "మీరు అన్నం తినలేదు కదా!" అంది తులసి.
    సీతాపతి మాట్లాడలేదు.
    "రండి, తిందాం" అంది.
    కన్నీళ్ళతో సీతాపతి తల పంకిస్తూ వద్దన్నాడు.
    ఉదయం వండిన అన్నం అలాగే ఉంది. అందులో పాలు కలిపి ఓ గిన్నెలో తీసుకు వచ్చింది.
    సీతాపతి మొహంలో నైరాశ్యం ఉంది.
    తులసి తనకు షార్టు వచ్చిన బాధను, అంతకన్నా ఎన్నోరెట్లు ఎక్కువైన ఈ దుఃఖం ముందు క్షణం సేపు మరిచిపోయింది.
    "నువ్వు తిని కాసేపు పడుకో, తులసీ. అలిసి పోయావు" అన్నాడు సీతాపతి, అన్నంగిన్నె, గ్లాసు తులసికి అందిస్తూ.
    చచ్చిపొయ్యే మనుషుల నెప్పుడూ చూడలేదు తను. 'ఇవ్వాళ జాగరణ చెయ్యా' లనుకున్నాడు సీతాపతి. తులసి వెళ్ళి తినేసి పడుకుంది. అతనికి తన తరుగు పెరుగులు లేని జీవితం విసుగ్గా ఉంది. కాలేజీలో తను ఎంతమందినో చూశాడు. చాలామంది తనకన్నా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు; తనకన్నా సుఖంగా, హాయిగా బ్రతుకుతున్నారు. క్లాసులో అమ్మాయిలు కూడా ఎంతో చలాకీగా, లేళ్ళలాగా తిరుగుతూ కనిపిస్తారు. తనప్పుడే పెళ్ళి చేసుకోవటంవల్లే ఈ దుస్థితిలో ఉన్నాడు. గదిలోని పెద్ద లైటు వెలుతురు కళ్ళు జిగేల్మనిపిస్తున్నది. లేచి వెళ్ళి అది తీసేసి జీరో బల్బు వేశాడు. నిద్ర రాలేదు. తండ్రి కదలటం కూడా లేదు. బలవంతంగా వస్తున్న గురక తప్ప మరేమీ చప్పుడు లేదు. ఓసారి భయం వేసినా, కుతూహలం గానూ, కొత్తగానూ తోచి కూర్చున్నాడు.
    ఒక్కోసారి నోరు తెరిచి ఉఫ్ అంటూ గాలి విడుస్తున్నాడు తండ్రి. కళ్ళు ప్రశాంతంగా మూసుకున్నాయి. మొహంలో ఏమాత్రమూ బాధ లేదు. వాళ్ళకు టెలిగ్రాం ఎప్పుడు చేరుతుందో వచ్చేటప్పటికి కనీసం సాయంత్రమన్నా అవుతుంది. అప్పటికే... తులసికి షార్టుట. ఎంత నిజమో. ఇన్ని కష్టాలలో ఉన్న తనకు ఇదొకటా. సైకిల్ అడ్వాన్సు తీసుకున్న రెండు వందలూ అయిపోయాయి. తులసీ, తనూ తీసుకున్న ఫెస్టివల్ అడ్వాన్సులు కూడా ఎప్పుడో ఖర్చయ్యాయి. తాము ఆమధ్య కొంచెంగా పెంచిన బాంకు బాలెన్సు కూడా ఈ డాక్టర్లూ, మందులతో మట్టమైంది. తనకు మిగిలినవి నిష్టురాలు. తులసి చాలా కష్టపడుతూ ఉండాలి. తను గుడ్డలు కుట్టించు కోక సంవత్సరం గడిచింది. అవే మూడు పాత టెరిలీను చొక్కాలు... చచ్చిపొయ్యేవాళ్ళకు భగవద్గీత చదువుతారట. తనెన్నడూ భగవద్గీత చదవలేదు. అసలు ఊరికే మగతగా పడుకున్నాడేమో నాన్న! ఒంట్లో జ్వరం లేదు. చల్లగా ఉంది. ఇంత ఖర్చు తరవాత, ఇన్నిసార్లు హాస్పిటల్ కు తిరిగిన తరవాత, రెండు సార్లు 'సీరియస్' దాకా వచ్చి తగ్గిపోయింతరవాత, తన కిప్పుడు తండ్రి చరమావస్థలో ఉన్నాడని తెలిసినా, కళ్ళముందే చూస్తున్నా, ఎక్కువ విషాదం లేదు. కాకపోతే, ఇంత డబ్బూ ఖర్చుపెట్టింది. ఈ నాలుగు నెలలు ఎక్కువ బ్రతికించటానికా అని పశ్చాత్తాపంగా కూడా ఉంది. తన పరిస్థితుల్లో అకర్మణ్య మైన నాలుగు నెలల బ్రతుకు పొడిగించటంకన్న-అతడి బొందిలో ప్రాణం నిలబెట్టటంకన్న-తను ఖర్చుపెట్టిన తొమ్మిది వందల రూపాయలు చాలా విలువైనవి. మాటకూ అన్నయ్య ఒక్కడే నలుగురు పిల్లలతో సంసారం ఈదుతున్నాడంటుంది అమ్మ.
    తను వచ్చినప్పుడు ఎంతలేదన్నా నాలుగు వందలు ఖర్చైందని తెలియదూ? ఆ లెక్కన తనేం పెద్ద నౌకరీ చేస్తున్నాడని. తనూ, పెళ్ళాం నౌకరీ చేస్తున్నా రంటారు గాని, తాము ఎంత ఖర్చు పెట్టినా అది వాళ్ళకు కనిపించదు. తనకు తల్లితండ్రులంటే ప్రేమ లేదా? ఒక్కడే ఇంత ఖర్చు పెట్టవలసినంత ప్రేమ లేదేమో. తను స్వార్ధపరుడు.
    మంచం కిర్రుమంది. ఉలిక్కిపడి లేచాడు సీతాపతి. ఆ చీకట్లో తండ్రి కళ్ళు వింతగా చూస్తున్నాయి ఆ చూపులను చూస్తే భయమేసింది.
    "ఏం కావాలి, నాన్నా?" అన్నాడు.
    తండ్రి ఏదో శబ్దం చేశాడు. చెయ్యి కదపాలని ప్రయత్నించాడు.
    "ఏం కావాలి, నాన్నా?" అన్నాడు సీతాపతి మళ్ళీ.
    తండ్రి ఏమన్నాడో తెలియలేదు. కాని 'నీళ్ళు' వంటి మాట ఏదో వినవచ్చినట్టైంది. నీళ్ళు తాగితే వెంటనే చచ్చిపోతారట మనుషులు. టైం చూశాడు. రెండూ ముఫ్ఫై.
    తులసిని లేపి చెప్పాడు.
    "పోనీ, ఇద్దాం" అంది తులసి.
    "పక్కవాళ్ళను లేపుదామా?" అన్నాడు సీతాపతి.
    తులసి తల ఊపింది.
    తాము ఎప్పుడూ ఎక్కువగా పలకరించని పొరుగు వాళ్ళను ఆ వేళప్పుడు లేపటం అసహ్యంగా తోచింది. తన తండ్రికి ఇంత ఇదిగా ఉందని వాళ్ళకు ఎలా చెప్పటం? ఐనా, లేపితే వాళ్ళేం చేస్తారు? తను లేపడు. తెల్లవారనీ ఇలా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS